Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 29


    "రావు ఇంకెలాగూ ఏ పనీ చేయలేడు. ఇలాంటి హోటల్ పెడితే, నేనూ నా పేకాట మిత్రులూ ఒకేచోట వుండవచ్చు. అదీ ఆలోచన. పైగా జనారణ్యంలో వుండటం కన్నా ఇలా దూరంగా వుండటం బావుంటుందనిపించింది."

    "ఏది ఏమైనా మీ నాన్నే అందరికన్నా సంతోషిస్తున్నట్టు కనబడుతున్నారు. నువ్వా 'బుద్ధిలేనిపాలెం'లో మకాం పెట్టావని తెలిసి పెనంమీద గింజలా ఎగిరెగిరి పడ్డాడు. నిన్ను చూడటానికి వీల్లేదని మీ అమ్మనీ, చెల్లెనీ కూడా కట్టడిలో పెట్టాడు."

    "హనుమంతరావు విహాయం ఒకటే నాకు విచారంగా వుందిరా! ఏదో సరదాగా నోటికొచ్చిన అబద్ధం ఆడాం! లక్షలు సంపాదించుకున్నాం. అంతా దొంగల పాలయినా నేను మామూలు స్థితిలో బయటపడ్డాను. వాడు మాత్రం కాలు పోగొట్టుకున్నాడు. ఇహ పోతే.... ఇప్పుడు నాలో ఈ మార్పుని హేమంత సంధ్య ఎలా స్వీకరిస్తుందో చూడాలి."

    "అదేమిటీ?" శ్రీహర్ష విస్మయంగా చూసాడు.

    "అవును! తనేమో ఢిల్లీలో పెద్ద ఉద్యోగంలో వుంది. నేనేమో యిక్కడ ఊరిబయట చిన్న పంజాబీ ధాబా పెట్టాను...."

    అతడి మాటలు పూర్తిగాకముందే తండ్రి వచ్చి "ఇక మేము వెళ్ళొస్తాంరా" అన్నాడు.

    "నేను చేసిన మొట్టమొదటి చపాతీ తిని వెళ్ళండి" అన్నాడు రావు ప్లేట్లు సర్దుతూ.

    "నీ పని నువ్వు చెయ్యి చాలు. చపాతీలు చేయటానికి పంజాబీవాడు వున్నాడు. ప్రతిదాంట్లోనూ వేలు పెట్టకు. వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయడం నీ డ్యూటీ."

    తల్లీ, తండ్రీ, సమీర వెళ్ళిపోయాక శ్రీహర్షతో చెట్టుకింద మంచంమీద కూచున్నాడు బృహస్పతి.

    "మీరిద్దరూ ప్రమాదం అంచులవరకూ వెళ్ళి ప్రాణాలతో బయట పడటం నాకు ఎంతో సంతోషంగా వుందిరా!" శ్రీహర్ష మనస్పూర్తిగా అన్నాడు.

    "నా కెందుకు సంతోషంగా వుందో చెప్పనా? నా దృక్పథంలో మార్పు వచ్చింది. అందుకు ఆనందంగా వుంది. ఈ సమయంలో మాత్రం నివాళికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి" అన్నాడు బృహస్పతి.

    "ఇంకెప్పుడూ యిలాంటి ప్రమాదకరమైన ఆలోచనలు చేయకు".

    బృహస్పతి నవ్వి వూరుకున్నాడు.

    ప్రమాదం అయిపోలేదనీ, అప్పుడే ప్రారంభమయిందనీ వాళ్ళిద్దరికీ తెలీదు.


                                              *    *    *


    ధాబా ముందు అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ముగ్గురు బలిష్టమైన వ్యక్తులు దిగారు.

    "మొట్టమొదటి బోణీ బాగుంది గురూ! కనీసం వంద చపాతీలకి తక్కువ కాకుండా తినేట్టున్నారు" అన్నాడు బ్రహ్మానందం- వాళ్ళవేపు ఆశగా చూస్తూ.

    ముగ్గురిలోనూ నాయకుడిలా వున్న వ్యక్తి "బృహస్పతీ.... నిన్ను మంత్రిగారు తీసుకురమ్మని పంపారు. వెంటనే బయలుదేరు" అన్నాడు కటువుగా.

    బృహస్పతి చిరాగ్గా.... "ఎందుకు?" అన్నాడు.

    "నీ ప్రశ్నలకి జవాబు చెప్పటానికి రాలేదు మేమిక్కడికి. వెంటనే బయలుదేరకపోతే మేమే బలవంతంగా తీసుకెళ్ళాల్సి వస్తుంది" అతడి కంఠం కర్కశంగా పలికింది. స్నేహితులందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.

    హోటల్ ప్రారంభోత్సవం జరిగినరోజే అక్కడ గొడవ జరగటం ఇష్టంలేక "సరే పదండి" అన్నాడు బృహస్పతి.

    "నన్ను కూడా రమ్మంటావా?" బ్రహ్మానందం బయలు దేరడానికి ఉద్యుక్తుడయ్యాడు.

    "మంత్రిగారు ఈ మనిషి ఒక్కడినే తీసుకురమ్మన్నారు" మళ్ళీ కటువుగా ధ్వనించింది ఆ వ్యక్తి కంఠం. బృహస్పతి వాళ్ళతో కలిసి కారెక్కాడు. 

    ఆ కారు వెళ్ళిపోయిన రెండు నిముషాలకి మరో రెండు కార్లు అక్కడికి వచ్చి ఆగాయి. కొంచెం సేపటికి అక్కడ చిన్న చిన్న ఆర్తనాదాలు వినిపించాయి. రోడ్డుమీద వెళుతున్న లారీల వాళ్ళకీ, మిగతా వాహనాల వారికీ ధాబాలో ఏం జరుగుతుందో తెలీదు. అయిదు క్షణాల్లో అక్కడ నిశ్శబ్దం అలుముకుంది.

    ఒక వ్యాన్ వచ్చి ధాబా ముందు ఆగి, ఆ నీరవాన్ని భగ్నం చేసింది. అందులోంచి టీ.వి. కెమెరాలు పట్టుకుని షూటింగ్ తాలూకు మనుషులూ దిగారు. వారి మధ్యలో వుంది-

    హిమసమీర.


                    *    *    *


    "రా!" అంటూ సాదరంగా హిందీలో ఆహ్వానించాడు రాంభరత్. బయట చాలామంది విజిటర్సూ, జనం ఉన్నారు. కానీ అందరికన్నా ముందు అతడికి ప్రవేశం లభించింది. అతడు లోపలికి ప్రవేశించగానే తలుపు దానంతటదే మూసుకుపోయింది.

    "ఎందుకు నన్ను పిలిపించారు?"

    "నేనెవరో గుర్తుపట్టావా మంగళ్ సింగ్?"

    "ఒకప్పుడు జానకిరాం భరత్, ప్రస్తుతం రాంభరత్!"

    "కరెక్ట్! నేను నీ దగ్గరికి హరిస్వామిని పంపించాను. అతడ్ని కూడా గుర్తుపట్టే వుంటావు- ఇబ్రహీంఖాన్.... పోతే నాలుగోవాడు ఎవరో తెలుసా?"

    "ప్రస్తుతం కేంద్రమంత్రి సంకల్పనాథ్- పూర్వపు పేరు త్రిలోకనాథ్ యాదవ్!"

    "నీ జ్ఞాపకశక్తి చూస్తే ముచ్చటేస్తోంది. గతజన్మలో విషయాలు కూడా నీకు చాలా బాగా గుర్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తాను. నాకా ఫోటోలు, డైరీలూ కావాలి వెంటనే...." చివరి పదాన్ని వత్తి పలుకుతూ అన్నాడు.

    బృహస్పతి నవ్వాడు. "నాకు గతజన్మ అంటూ ఏమీ లేదు. నోటికొచ్చిన చిన్న అబద్ధం ఆడానంతే! ఇప్పుడు నాకు ఆ అబద్ధాన్ని డబ్బు చేసుకోవాలన్న కోరిక కూడా ఏమీలేదు. నా బతుకేదో నేను బతకాలని అనుకుంటున్నాను."

    "అద్భుతంగా నాటకం ఆడుతున్నావు మంగళ్ సింగ్! డైరీ సంగతి గుర్తుందంటే- ఆ నిధిలో కూడా మాకు వాటా ఇవ్వవలసి వస్తుందని నీ ఉద్దేశం కదూ. అందుకే గతజన్మ గురించి అబద్దమాడినట్లు కప్పిపుచ్చుకుంటున్నావు. ప్రపంచం అంతా ఈ విషయం మర్చిపోయిన తర్వాత దాన్ని తవ్వి తీసుకోవాలని నీ ఉద్దేశ్యం అవునా?"

    "నీ మూర్ఖత్వం చూస్తుంటే నాకు నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. గతజన్మ గుర్తురావడం అనేది ఒక బోగస్ వ్యవహారం. దాన్ని ఆధారం చేసుకుని మీరు ఇలా నన్ను పిలిపించి మాట్లాడడం మరింత హాస్యాస్పదం. కేంద్రమంత్రి స్థాయిలో ఉండి- నాలాటి ఆవారా, ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడితే దాన్ని నమ్మెయ్యడం మీ పదవికే అవమానకరం."

    రాంభరత్ ఒక్కక్షణం మౌనంగా ఊరుకుని, తర్వాత అన్నాడు. "నిధి పూర్తిగా నువ్వే తీసేసుకో బృహస్పతీ! ఆ ఫోటోలూ, డైరీలూ మాత్రం మాకివ్వు. నిధి గురించి నీ మీద ఒత్తిడి తీసుకురావద్దని సంకల్పనాథ్ కీ, హరిస్వామికీ నేను నచ్చచెబుతాను. ఈ డీల్ బావుందా?"

    "బాగా లేదు."

    "ఎందుకు?"

    "ఆ నిధి గురించి నేను భారతదేశం అంతా తవ్వుతూ కూర్చోను కాబట్టి!"

    రాంభరత్ మొహంలో కర్కశమైన ఒక భావం వీచికలా క్షణంసేపు మెదిలి అదృశ్యమైంది. రాజకీయ నాయకుడు కాబట్టి వెంటనే సర్దుకుని, నవ్వుతూ బృహస్పతి భుజంమీద చెయ్యి వేశాడు. "గతంలో మనిద్దరికీ మధ్య చిన్న గొడవ జరిగితే జరిగి వుండవచ్చు. బద్ధ శత్రువులు కూడా క్షణాల్లో మిత్రులవడం పాలిటిక్స్ లో పరిపాటే! జరిగిందంతా మర్చిపో. నిధి నువ్వు తీసుకో.... డైరీలు మాకివ్వు."

    బృహస్పతి ఏదో చెప్పబోతుండగా మరోవ్యక్తి లోపలికి ప్రవేశించాడు. అతడి వెనకే ఇద్దరు అనుచరులు ఉన్నారు. అతడిని ఎక్కడో చూసిన గుర్తుంది కానీ ఎవరో జ్ఞాపకం రాలేదు. అతనితోపాటు వచ్చిన అనుచరులు బృహస్పతికి చెరోవైపు నిలబడ్డారు.

    "నా పేరు శత్రుఘ్ను. రాంభరత్ అన్నయ్యని!" అబద్ధం చెబుతూ కరచాలనం కోసం చేయిసాచి అన్నాడు సంకల్పనాథ్.

    "మీకేం కావాలి?"

    ఆ వ్యక్తి రాంభరత్ వైపు చూసి బిగ్గరగా నవ్వుతూ, "చూసావా? ఇతడు నన్ను గుర్తుపట్టలేకపోయాడు. గతజన్మలు లేవంటే నువ్వు నమ్మలేదు కదా" అన్నాడు.

    బృహస్పతికి అప్పుడు గుర్తొచ్చింది అతడిని ఎక్కడ చూసాడో!

    అతడు సంకల్పనాథ్ రే.

    పేపర్లలో ఫోటో అస్పష్టంగా చూడడంవల్ల వెంటనే గుర్తు పట్టలేకపోయాడు. అయితే వెంటనే అతడికి చాలా రిలీఫ్ గా అనిపించింది. తను చెప్పేదానికి కనీసం ఒకరు వత్తాసు పలుకుతున్నారు. అతడు కృతజ్ఞతా పూర్వకంగా సంకల్పనాథ్ రే వైపు చూసాడు. "థాంక్స్! మీరైనా నేను చెప్పేది నమ్మారు. నేను డాకూ మంగళ్ సింగ్ ని కాను. మీ ముగ్గురూ గతంలో చంబల్ వాలీ దొంగలు అన్న విషయం నిరూపించడానికి నా దగ్గర ఏమీ ఆధారాలు లేవు. దయచేసి నా మానాన నన్ను వదిలిపెట్టండి."

    సంకల్పనాథ్ అదోలా నవ్వాడు. "గతజన్మలో నువ్వు మంగళ్ సింగ్ వి కాకపోవచ్చు. కానీ యా ఫోటోలూ, ఫైరీలూ నీ దగ్గరే వున్నాయి. ఆ విషయం మా హరిస్వామి దగ్గర నువ్వే ఒప్పుకున్నావ్! అవునా?"

    బృహస్పతి నవ్వాడు. "ఆ ముసలాడు నన్ను ప్రధాన మంత్రిని చేస్తానన్నాడు. ఆ డైరీలూ, ఫోటోలూ నా దగ్గర ఉన్నాయని చెప్తే- మీరిద్దరూ నా కాళ్ళ దగ్గర కుక్కల్లా పడి ఉంటారన్నాడు."

    "అలా అన్నందుకు అతడికి ఏ శిక్ష విధించాలో నాకు తెలుసు."

    "ఆ శిక్షేదో విధించేటప్పుడు నన్నుకూడా చూడనివ్వండి. సంతోషిస్తాను."

    "ఆ ఫోటోల సంగతి తొందరగా చెప్పకపోతే, నీకు విధించే శిక్షని ప్రత్యక్షంగా చూడొచ్చు."

    "నా శిక్ష నేను చూడడం ఏమిటీ?"

    "మరదే గమ్మత్తు."

    "రెడ్డొచ్చె .... మొదలాడె' అని మా తెలుగులో ఒక సామెత ఉంది. నేను మంగళ్ సింగ్ ని కానని తెలిసి కూడా మళ్ళీ ఇదంతా ఏమిటి సార్?"

    "నువ్వు మంగళ్ సింగ్ వి కాదని నాకు తెలుసు. అయినా ఆ ఫోటోలు నీ దగ్గరికి వచ్చి చేరాయన్న విషయం నాకు తెలుసు."

    "ఎలా తెలుసు?"

    "ఆ సత్యాన్ని రత్నాబాయి శవం చెప్పింది."

    బృహస్పతి అతడివైపు నిర్ఘాతపోయి చూశాడు. సరదాగా విప్పిన దారపు ఉండ-మెలికలు పడి, ముళ్లు బిగిసి - ఉరితాడై, మెడకి బిగుసుకుంటున్న భావం! సరదాగా ఆడిన చిన్న అబద్ధం ఇలా వికృతరూపం ధరించి కంటిముందు కరాళ నృత్యం చేస్తుందని ఊహించలేదు. అతడింకా ఆ అయోమయ చేతనావస్థలో ఉండగానే సంకల్పనాథ్ రే కొనసాగించాడు. ఇప్పుడతని మొహంలో నవ్వులేదు. ఒక పైశాచిక హేల తాండవిస్తోంది.

    "దాదాపు పాతిక సంవత్సరాల క్రితం డాకూ మంగళ్ సింగ్ చచ్చిపోయినప్పుడు మేమతని భార్య రత్నాబాయిని కలుసుకున్నాం. ఫోటోల గురించి మేము అంతగా పట్టించుకోలేదు. అప్పట్లో మేము బందిపోటు దొంగలం కాబట్టి మా దృష్టి అంతా కేవలం నిధి తాలూకు డబ్బుమీదే ఉండింది. ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆవిడ చెప్పలేదు. నిజానికి ఆవిడకి తెలీదు కూడా! చావు బ్రతుకుల మధ్య వున్న రత్నాబాయిని మేము అడవిలో వదిలేసి వెళ్లిపోయాం. అదే మేము చేసిన తప్పు. పోలీసు ఎన్ కౌంటర్ లో మరణించబోతూ మంగళ్ సింగ్ ఒక చిన్న అనుచరుడి ద్వారా ఆ నిధి దాచిన స్థలం తాలూకు ప్లాన్ ని తన భార్యకి పంపాడు. ఆ తరువాత ఆమెకి అందింది. ఆమెకి డబ్బుమీద అంత ఆసక్తి లేకపోవడంతో దాని గురించి అంతగా పట్టించుకోలేదు.

 Previous Page Next Page