Home » Yandamuri veerendranath » సంపూర్ణ ప్రేమాయణం


    "నువ్వు గెలిస్తే ఏం అడుగుతావ్?"

    "ఉహు_ చెప్పను...."

    "నువ్వు?"

    "నేనూ ఇప్పుడే చెప్పను."

    సముద్రం మీద చీకటి దట్టంగా పరుచుకుంది. వెన్నెల్లో కెరటాల మీద నురుగు ఒడ్డువైపు రావటానికి ప్రయత్నించి ఓడిపోయి వెనక్కి వెళుతుంది. కానీ అంతలోనే బలం పుంజుకుని తిరిగి వస్తూంది.

    దానికిక అంతులేదన్నట్టు సముద్రం అంచును రోడ్డు వదలటంలేదు.

    "కోడి వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకుందట_ తనకన్నా నెమలిని అందంగా ఎందుకు సృష్టించవలసి వచ్చిందని" అన్నాడు.

    అర్ధంలేని ఆ ప్రసక్తికి ఆమె విస్తుపోయి అతడివైపు చూసింది.

    "అప్పుడు బ్రహ్మ కోడిని ఓదార్చాడట. నెమలికన్నా అందమైనది స్త్రీ. మీ ఇద్దరికీ ఒక సామీప్యం వుంది. అందుకు గర్వపడు" అని.

    "ఎందులోనట ఆ సామీప్యం?"

    "మెదడు సైజులో."

    ఆమె మొహం ఎర్రబడింది.

    "ఎందుకు ఆడవాళ్ళ మెదడు సైజుమీద తమరికంత అమూల్యమైన అభిప్రాయం?"

    "టాంకులో పెట్రోలు అయిపోయేవరకూ మనం వెళ్ళలేం. సగం పెట్రోలు అయిపోగానే భయపడటం మొదలుపెట్టాలి. మళ్ళీ ఇంతదూరం వెనక్కి రావాలిగా?"

    "ఇంకో బంక్ వుండే వుంటుంది."

    అతడు నవ్వేడు.

    "ఎందుకు నవ్వుతున్నావ్?"

    "అరేబియా సముద్రంలో దొరికే నూనె నిక్షేపాల్తో ప్రభుత్వం సముద్రం పక్కనే పెట్రోలు బంకు స్థాపించిందట ఈ మధ్యనే."

    "నువ్వు నన్నేం భయపెట్టనక్కర్లేదు. నీ మాటలకి భయపడి కారు వెనక్కి తిప్పమంటాననుకుంటున్నావేమో...."

    "పందెం వదులుకొని కారు తిప్పేస్తే మంచిదని నా అభిప్రాయం."

    "ఇదిగో_ ఇప్పటినుంచీ ఇలా నన్ను బెదరగొడితే వూరుకోను. ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్టే."

    అతడు తలతిప్పి ఆమెవైపు చూసి, "నాకు 'గారెలు-మౌనవ్రత భంగం' కథ జ్ఞాపకం వస్తూంది" అన్నాడు.

    "ష్.... మాట్లాడితే ఓడిపోయినట్టే...."

    కారు మరింత ముందుకు సాగింది.

    అంతలో అకస్మాత్తుగా, ఎవరూ వూహించని విధంగా జరిగింది ఆ సంఘటన....

    రోడ్డు మధ్యగా నిలబడి ఒక వ్యక్తి చెయ్యి ఎత్తి కారు ఆపమన్నట్టు సైగచేశాడు. కేవలం కట్ డ్రాయరుతో హిప్పీలా వున్నాడు. న్యూడిస్ట్ కాంప్ (గోవా ప్రాంతపు దిగంబరులు) నుంచి దాటి తప్పినవాడిలా వున్నాడు.

    వేణు కారు స్లో చేశాడు.

    అతడి దగ్గరగా వెళ్ళి కారు ఆగగానే మరి ముగ్గురు వచ్చి చేరారు. అందులో ఒక స్త్రీ కూడా వుంది.

    "లిఫ్ట్...." అన్నాడు.

    "ఎటు?" అని అడిగాడు వేణు. ఈ లోపులో ఆ ముగ్గురిలో ఒకడు అవతలివైపు నుంచి వంగి, ప్రేమని తినేసేటట్టు చూడటం గమనించాడు.

    ఒక హిప్పీ చెయ్యి సాచి చూపిస్తూ "దట్ వే" అన్నాడు.

    "ఉహూ, అటుకాదు మేము వెళుతున్నది" అని వేణు అంటూ వుండగానే ఆ మాటలు వినిపించుకోకుండా ఒకడు ఫ్రంటు డోరు తీసి ప్రేమని పూర్తిగా ఆనుకుంటూ కూర్చున్నాడు.

    ఈ హఠాత్ సంఘటనకి ఆమె బెదిరిపోయి, వేణూ వైపుకి వచ్చింది.

    "హాయ్ బేబీ!" అన్నాడింకొకడు వెనుక కిటికీలోంచి తల లోపలికి పెడుతూ. వాళ్ళ దగ్గర్నుంచి గంజాయి వాసన గప్పున కొడుతూంది.

    ఆ ముగ్గురుతోపాటు వచ్చిన హిప్పీ యువతి నవ్వుతూంది.

    "స్తార్త్....స్తార్త్" అన్నాడు ప్రేమ పక్కగా కూర్చున్న యువకుడు. వాళ్ళ మాటలు చూస్తూంటే, లిఫ్ట్ కన్నా ఆట పట్టించాలన్న కోర్కె ఎక్కువ వున్నట్టు కనబడుతూంది. ఈ లోపులో రెండో వ్యక్తి కూడా వెనుక సీట్లో కూర్చొని, తలుపు తెరిచి పట్టుకుంటూ, "రా! డియర్" అంటూ ఆ యువతిని ఆహ్వానించాడు.

    వేణు చప్పున కారు దిగాడు.

    వెనుక ఇది జరుగుతూంటే ముందు కూర్చున్న యువకుడు మరింత చొరవగా ప్రేమ తొడమీద చెయ్యి వేసేడు. ఆమె కళ్ళనీళ్ళ పర్యంతమైంది.

    వేణూ అటు వెళ్ళి తలుపుతీసి, "దిగు" అన్నాడు కామ్ గా.

    ఆ యువకుడు తలెత్తి అతడివైపు చూసి నవ్వేడు. ఈ లోపులో, వెనుక కూర్చున్న యువకుడు వంగి, ప్రేమ బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కెవ్వున కేకవేసింది. సముద్రపు హోరులో ఆ కేక ఎక్కువ దూరం వినపడలేదు.

    వేణు, ముందున్న యువకుడి మెడచుట్టూ చేతులు వేసి, ఒక వస్తువుని బైటకి లాగినట్టు లాగి, అదే వేగంతో గాలిలోకి ఎత్తి దూరంగా విసిరేసేడు.

    బైట జరుగుతున్నదాన్ని పట్టించుకోకుండా, ఆ పాటికే వెనుక సీటులోకి చేరుకున్న యువతి, "భయపడకు డార్లింగ్! బావుంటుంది...." అంటూ ప్రేమ రెండు భుజాలూ నొక్కి పట్టుకుని తల పక్కకి వంచి పెదాల్ని గట్టిగా ముద్దు పెట్టుకోబోయింది.

    ఇంతలో పక్కనున్న యువకుడు వెనుకనుండి ఆమె నడుముమీద చేతులు వేసి పైకి ఎత్తటానికి ప్రయత్నించాడు.

    ప్రేమ నిస్సహాయంగా వాళ్ళ చేతుల మధ్య గింజుకోసాగింది.

    మొదటి దెబ్బ అతడిమీద పడింది. రెండోది ఆమె మీద! వేణు అరచేతిని అడ్డంగా పెట్టి కొట్టిన దెబ్బకి అతడి దవడ పక్కకి జరిగి, మళ్ళీ వెనక్కిరాలేదు. రెండు సీట్లకి మధ్య మోకాళ్ళమీద కూలిపోయాడు.

    హిప్పీ స్త్రీ చేతులు తీసెయ్యటంతో ప్రేమ ఒక్కగెంతులో కారులో నుంచి బయటకు వచ్చేసింది. ఆ కంగారులో తుప్పల్లోంచి అప్పుడే బయటకు వస్తున్న మొదటివాడిని చూసుకోలేదు.

    కారులో జరుగుతున్న ఘర్షణని ఆమె భయకంపితురాలయి చూస్తున్నప్పుడు, వెనుకనుంచి ఒక చెయ్యి నిశ్శబ్దంగా వచ్చి ఆమె నోటిని మూసి, అమాంతంగా తుప్పల్లోకి లాక్కుపోయింది. ఆమె ఎంత గింజుకున్నా లాభం లేకపోయింది.

    ఆ హిప్పీలు జర్మన్లు! బలంగా, ధృడంగా వున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే వెను కనీసం ఒకరికి కూడా సమవుజ్జీ కాడు. ఆ విషయం అతడికీ, ప్రేమకీ యిద్దరికీ తెలుసు. కానీ ఇద్దర్లో ఒకడు రెండు సీట్లమధ్యా ఇరుక్కుని ఉండటంతో వేణు పని సులువయింది. అతనికి పూర్తిగా స్పృహ తప్పిందని ధృవపరుచుకుని వేణు కారులోంచి బయటకి వచ్చాడు.

    కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి చుట్టూ అలుముకుని వుంది. దూరంగా సముద్రపు హోరు భయంకరంగా వినిపిస్తూంది.

    ప్రేమ లేదు.

    అతడు చీకట్లోకి చూస్తూ- "ప్రేమా" అని పిలిచాడు సందిగ్ధంగా. జవాబు లేదు.

    అతడి మనసు కీడుని శంకించింది.

    "ప్రేమా!...." అన్నాడు మరోసారి బిగ్గరగా.

    వెనకాల కారులోంచి హిప్పీ యువకుడిని క్రిందికి లాగుతూంది ఆ స్త్రీ. వేణు వాళ్ళని పట్టించుకోకుండా చీకట్లోకి నడిచాడు.

    సముద్రానికీ రోడ్డుకీ మధ్య తుప్పలు- చీకటిలో పొంచి ఉన్న శతృవుల్లా ఉన్నాయి. అటువైపు వెళ్ళటం ప్రమాదకరమని తెలిసినా, ఉమ్దబట్టలేకపోయాడు. ప్రేమ ప్రమాదంలో ఉందని మనసు చెబుతూంది.

    "ప్రేమా!" అని పిలిచాడు.

    కీచురాళ్ళ శబ్దం ఆగకుండా వినిపిస్తుంది. సముద్రంమీద నుంచి వస్తున్న గాలి "స్ స్స్" మన్న శబ్దం చేస్తుంది.

    ఎందుకో ఒక్కసారిగా వున్నట్టుండి అక్కడి వాతావరణం చల్లబడినట్టు అనిపించింది. కీచురాళ్ళ శబ్దం ఆగిపోయింది. అతడు కళ్ళు చిట్లించి చుట్టూ చీకటిలోకి చూశాడు.

    దూరంగా పొదలో ఏదో కదలిక!

    చప్పున రెండు అడుగులు అటు వేశాడు.

    అంతలో పక్క పొదనుంచి ఏదో వస్తువు గాలిలో సర్రున దూసుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. చప్పున దూరంగా తప్పుకోబోయాడు. కానీ క్షణం ఆలస్యం అయింది. కర్రలాటి వస్తువేదో బలంగా కాలికి తగిలింది. నరాలు పట్టిలాగినట్టు వళ్ళంతా బాధ జివ్వున వ్యాపించింది. అతి కష్టంమీద ఓర్చుకుంటూ, అవతలి వ్యక్తికి మరి అవకాశం ఇవ్వకుండా అటు గెంతాడు. వేణు వూహ నిజమయింది. పొదవెనుక- భయంతో ప్రేమ స్పృహ కోల్పోయి వుంది.

    ఆమెనించి దృష్టి మరల్చే లోపులో అతడు దగ్గరికి వచ్చాడు. అతడి ముందు వేణు ఏ విషయంలో సాటిరాడు. కానీ అతడు మళ్ళీ కర్ర ఎత్తబోతుంటే వేణు మెరుపులా వంగి భూమ్మీదనుంచి గుప్పెటతో ఇసుక తీసి అతడి మొహం మీదకు విసిరాడు. చీకట్లో అతడు దాన్ని గమనించలేదు. ఒక్కసారి రెండు కళ్ళలోనూ మట్టి వచ్చి పడటంతో వాడు చేతిలో ఆయుధం వదిలేసి మొహాన్ని చేతుల్తో కప్పుకున్నాడు. అనుకోకుండా అలా వేణుకి అవకాశం దొరికింది. తల వంచే బలంగా అతడి కడుపులో పొడిచాడు ఆ వూపుకి ఇద్దరూ వెనక్కిపడ్డారు.

    ఇంతలో దూరంగా వస్తూన్న మరో వాహనం తాలూకు లైట్ల వెలుతురు కన్పించింది.

    "రన్" అని అరిచింది కారు దగ్గిరున్న యువతి. ఆమె పక్కనున్న యువకుడు కూడా లేచాడు. ఈ లోపులో కళ్ళు తుడుచుకుంటూ, తుప్పల్లో అదృశ్యమయ్యాడు మరో హిప్పీ.

    వేణు ప్రేమ దగ్గిరగా వెళ్ళి చూసేడు.

    అప్పుడే ఆమె కళ్ళు విప్పింది. అతడు చెయ్యి అందిస్తూ "భయపడ్డావా!" అని అడిగాడు. ఆమె లేదన్నట్టు తలూపిందేకానీ అతడి చెయ్యి పట్టుకున్న తీరునుబట్టి ఆమె స్థితి తెలుస్తూంది.

    వెనుక నుంచి వస్తున్న కారు నిర్మానుష్యమైన రోడ్డుమీద ఆగివున్న కారుని చూసి, స్లో అయి, అంతలోనే వేగం పుంజుకుని సాగిపోయింది.

    ఇద్దరూ వచ్చి కారులో కూర్చున్నారు.

    ఆమె మూడ్ మార్చటానికి, "గారెలూ-మౌనవ్రత భంగం కథ మనపట్ల నిజమయింది చూసేవా?" అన్నాడు. ఆమె నవ్వింది. అయితే అందులో జీవంలేదు. ఇంకా భయం పూర్తిగా పోలేదు. అతడు ఆక్సిలేటర్ నొక్కబోయి, బాధగా మూలిగాడు.

    "ఏమైంది?" అంటూ కంగారుగా అతడివైపు చూసింది.

    అతడు కారులోపల లైటు వేస్తూ పాంటు కాస్త పైకిలాగాడు.

    అతడి మోకాలు__ హిప్పీ కొట్టిన చోట....మామూలుకన్నా రెండు రెట్లు వాచివుంది. జాయింటు దగ్గిర విరిగిన ఎముక తాలూకు బాధ అప్పుడే నెమ్మదిగా శరీరం అంతా పాకటం ప్రారంభించింది.


                        *    *    *   


    అది అతుక్కోవటానికి మూడు నెలలు పట్టింది.

    సరిగ్గా మోకాలు దగ్గిర తగిలిన దెబ్బ అవటంవల్ల అతడు కదలటానికి వీలులేకపోయింది.

    "మనమనుకున్న ప్లాను ఇలా దెబ్బతీస్తుందని కలలో కూడా అనుకోలేదు అబ్బాయ్!" అన్నాడు ప్రసాదరావు- "....నేను పెట్టిన గూండాలు రెండు మైళ్ళ అవతల సిద్ధంగా వున్నారు. మీరెంతసేపటికీ రాకపోయేసరికి ఏం చెయ్యాలో తోచలేదు. మరికొంతసేపు చూసి వాళ్ళని వెళ్ళిపొమ్మని చెప్పాను__"

    "కార్లో వెళ్తూ, అనుకున్నట్టే మాటమీద మాట పెంచి ఆమెతో పందెం వేసుకున్నాను. ఈ హిప్పీలను చూసి మనవాళ్ళే అనుకున్నాను. లేకపోతే అర్దరాత్రి అలా అసలు కారు ఆపేవాడినేకాను" అని ఆగి, "ఒక రకంగా ఇలా జరగటమే మంచిదయింది. కిరాయి గూండాల్తో దెబ్బలాడితే ఎంత నటించినా కృత్రిమంగానే కనబడుతుంది. పోతే కాలు విరగటం మాత్రమే నేను వూహించని మలుపు...." అన్నాడు వేణు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra