శివయ్య - ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడంలేదు. తను వద్దంటున్నదని రహస్యంగా ఏమీ చేయడంలేదు కదా. క్రిందకు వెళ్ళి హిమజను చూడాలని వుంది. హిమజకేమైనా జరిగితే లేవబోయింది పద్మజ.
"హిమజకేం జరగలేదు పద్మజా...." అన్నాడు తన భావం గ్రహించినట్లుగా "జరగవలసింది జరిగిపోయింది. మీరు పడుకోండి."
* * *
తెల్లవారుతోంది. శివయ్య మెల్లిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. నగరపు ఉత్తరదిశగా ఉండే చేతబడి మాంత్రికుడు స్వయంగా కోడి కోసి పూజచేసి ఇక ఆ ఆత్మ భయం ఉండదని చెప్పాడు.
"రామయ్యా" పిలిచాడు. హాల్లో రామయ్య కనిపించలేదు. 'అప్పుడే లేచాడా' అనుకుంటూ వంటింటివైపు నడిచాడు. వంటింటి తలుపు వేసివుంది. గట్టిగా తోశాడు. లోపల చీకటిగా వుంది.
"అరె! యిక్కడా లేనట్లుందే. ఎక్కడకు వెళ్ళాడు" లైట్ వేయబోయి ఆగిపోయాడు శివయ్య, వాసన ఘాటుగా రావటంతో.
"ఏమిటది?" ఆ క్షణంలో లైటు వేయకపోవడం అతని ప్రాణాలు కాపాడింది.
గ్యాస్ వాసన. లీక్ అవుతున్నట్లుంది. గబ గబా అన్ని తలుపులూ కిటికీలూ తెరిచాడు శివయ్య. ఆ వెలుతురులో చూశాడు రామయ్యను.
"ఇక్కడ పడుకున్నావా? రామయ్యా లే" తట్టి లేపాడు.
రామయ్య శరీరం చల్లగా తగిలింది....
....అరగంటలో యింటి నిండా పోలీసులు. గ్యాసు కంపెనీ వాళ్ళూ వచ్చారు. సిలిండరు వాల్వు తెరిచి వుంది. స్టవ్ నాబ్ సరిగా ఆఫ్ చేయలేదు.
ఇన్స్ పెక్టర్ అందరి దగ్గరా స్టేట్ మెంట్లు తీసుకున్నాడు. వాడిపోయిన ముఖంతో పద్మజ దిగులుగా కూర్చుంది. ఇన్స్ పెక్టర్ అడుగుతున్న ప్రశ్నలకు అన్యమనస్కంగా సమాధానమిస్తోంది. హిమజకు ఎవరిమీదో తెలియని కక్ష. తన గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది.
"మిష్టర్ గిరీ!" పిలిచాడు ఇన్స్ పెక్టర్.
గిరి నిద్రలో నటిస్తున్నవాడిలా మెట్లు దిగుతున్నాడు. ఇన్స్ పెక్టర్ కు ఆశ్చర్యంగా అనిపించింది.
"మిస్టర్ గిరీ - ఆర్ యు ఆల్ రైట్ ?" అడిగాడు.
గిరి సమాధానం చెప్పలేదు. మెట్లు దిగివచ్చి అందరి ఎదుటా నిలబడ్డాడు.
"ఈ ఇంట్లోనే కాదు. ఈ దేశంలోనే మారణ హోమాలు జరగబోతున్నాయి, ఆఫీసర్! మీరు అప్రమత్తంగా ఉండాలి" అన్నాడు.
"ఏమిటి - మీరంటున్నది ? కాస్త అర్ధమయ్యేట్లు చెప్పండి...." అన్నాడు ఇన్స్ పెక్టర్.
"గిరి దగ్గర మీరు స్టేట్ మెంట్ తీసుకోవడం జరిగిపోయింది ఆఫీసర్! నేను గిరిని కాదు. ఈ ఇంట్లో వాళ్ళేవర్నడిగినా చెప్తారు నేనెవర్నో. అయినా నేను ఎవరనికాదు మీరు విచారించాల్సింది. కొంతమంది స్వార్ధపరుల వల్ల ఈ దేశ భవిష్యత్తు విషమంగా తయారవబోతోంది. వెళ్ళి కాపాడుకోండి" అన్నాడు గిరి.
ఇన్స్ పెక్టర్ దిగ్బ్రమతో అతడివైపు చూడసాగేడు.
ఈ ప్రపంచంలో ఫ్యామిలీ ప్లానింగ్ లేనిది ఒక్కటే....రూమరు.
9
"ప్రేతాత్మలు దేశం వదిలి మరో దేశం వెళ్ళకూడదనే రూలుంటే బాగుండును. కనీసం పారిస్ లో ఇక్కడయినా 'నేను నేనుగా వారం రోజులు బ్రతకొచ్చు" నవ్వుతూనే అన్నా అతని స్వరంలో పద్మజకు విషాదం తొంగి చూస్తున్నట్లనిపించింది బరువుగా నిట్టూర్చింది.
అర్ధరాత్రవుతోంది. హోటల్ రూమ్ బాల్కనీలో నిలబడి పారిస్ అందాన్ని రంగు రంగుల దీపాల వెలుగులో తన్మయత్వంతో చూస్తోంది పద్మజ. ఈ డెలిగేషన్ లో తన పేరు కావాలనే వేయించుకుంది. ఎన్నాళ్ళగానో పారిస్ చూడాలని తన కోరిక. తండ్రితో రావాలంటే ఎప్పుడూ వీలుపడలేదు. ఈ రోజు ఇక్కడ నిలబడి చూస్తుంటే పారిస్ నగర చరిత్రంతా కళ్ళముందు తిరుగుతున్నట్లనిపిస్తూంది.
సినిమాల్లో, ఫోటోల్లో చూసిన ఈఫిల్ టవర్ ఇప్పుడు పాత పరిచయస్థురాలిమల్లే పలుకరిస్తోంది.
నాలుగేళ్ళు జర్మనుల హస్తగతంలో ఉన్న పారిస్ నగర వాసుల్లో ధైర్యం ఏమాత్రం సడలిపోలేదు. తినడానికి తిండి దొరకకపోయినా, కరెంటు, నీళ్ళు సప్లయ్ ఆగిపోయినా అంతిమ విజయం తమదేనన్న దృడ నమ్మకంతో చిరునవ్వుతో గడిపారు వాళ్ళు! "మా న్యూస్ పేపరునే కొనండి. పన్నెండు నిముషాల్లో ఒక లీటరు నీటిని కాచగలిగే ప్రపంచపు ఏకైక న్యూస్ పేపరు మాది" అనే ప్రకటనతో జీవితాన్ని ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా తీసుకున్న ప్రజలు వాళ్ళు!!!
ఎంతమందికి గుర్తుంది, ఐ సెన్ హోవర్ (రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్షుడు) పారిస్ ను జర్మనుల బారి నుండి రక్షించడానికి సైన్యాన్ని నడిపించుకు వచ్చాడని, పారిస్ నగరం మంటల్లో కాలిపోతుందనే వార్త వినడానికి హిట్లరు ప్రతి నిముషం ఎదురుచూసేవాడనీ, ఈఫిల్ టవర్ నూ, నోటర్ డామ్ నూ, కూల్చి వేయడానికి బాంబులు పెట్టినా చివరి నిముషంలో అవి కాపాడబడ్డాయని 'ఆర్మ్స్ అండ్ ది మాన్' లాంటి ప్రపంచ ప్రఖ్యాత రచనను చేసిన నోబెల్ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్ హెమింగ్వే ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ప్రెస్ తరపున వచ్చాడనీ __
పారిస్ ప్రజల మనో ధైర్యానికి ప్రతీకగా నిలుచుని వుంది ఆ ఈఫిల్ టవర్ !
పద్మజకు అర్దరాత్రి వెళ్ళి సీన్ నదిలో బోటు షికారు చెయ్యాలనిపించింది.
ఆ మాటే అంది గిరితో. మంచంమీద పడుకుని ఆమె వైపే చూస్తున్నాడతను.
"ఇప్పుడేం షికారు పద్మా! పారిస్ అంటే రొమాన్సుకు మారుపేరు. రాత్రిని వృధాచేయకురా. ఇదే మన హనీమూన్ అనుకుందాం" ఆహ్వానిస్తూ పిలిచాడు.