అతడు తనవైపే సూటిగా చూడడం గమనించి ఆమె మందహాసం చేసింది. చక్రవర్తి మౌనంగా నిలబడి వున్నాడు. ఆ గదిలో నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఆమె అడిగింది.
"కాష్మోరా ఎవరు?"
దార్కా భారంగా ఊపిరి వదిలి వెనక్కి జారపడ్డాడు. ఈ కాష్మోరా ఎందుకింత ఆసక్తికరంగా ఈ నాగరికులకు కనబడ్తున్నాడు?
"చెప్పు -కాష్మోరా ఎవరు?"
దార్కా ఆలోచిస్తున్నాడు. అంతకు ముందురోజే అతడు స్మశానంలో ఒకరిని ఎదుర్కోవలసి వచ్చింది. తను జాగ్రత్తగా మాట్లాడి వుంటే వచ్చిందెవరో తెలిసి వుండేది. కేవలం తన తొందరపాటు చర్యవల్ల అనవసరంగా దెబ్బలు తగిలాయి. ఈ సారి ఆ తప్పు చెయ్యకూడదు. ఇంకోరకంగా ప్రవర్తించాలి.
"కాష్మోరా....." అని సిద్దేశ్వరి ఏదో అనబోతుంటే మధ్యలో అతడు అందుకుని కాష్మోరా అనేది ప్రయోగం. చేతబడి కన్నా ఎనిమిది రెట్లు పెద్దది. క్షిత్ అనేది పదిహేనో అంకం. దాని తరువాతది కాష్మోరా" అన్నాడు.
"చేతబడులు అనేవి వున్నాయా?"
దార్కా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు గదిలో గాఢమైన నిశ్శబ్దం పేరుకుంది.
"నీ పేరు?"
"దార్కా"
"ఊరు?"
"బిస్తా"
సిద్దేశ్వరి నెమ్మదిగా తలెత్తింది. ఆమె పెదవుల మీద చిరునవ్వు వెలిసింది.
దార్కా మాట్లాడలేదు. అతని వద్దనుంచి జవాబు రాకపోవడంతో ఆమె అన్నది -"ఈ సిద్దేశ్వరికి 'భవిష్యత్' వర్తమానం, గతం' అన్నీతెలుసు. నాకు తెలియక కాదు నిన్నుఅడుగుతున్నది కేవలం నీ ద్వారా అన్నీ తెలుసుకుందామని.'
దార్కా నవ్వేడు. "మీకేం తెలుసు చెప్పండి, చూద్దాం"
ఆమె నవ్వలేదు. చిన్న గొంతుతో అంది. "ఉదాహరణకి కాష్మోరా ప్రయోగిస్తే ఆ మనిషి ఇరవై ఒక్క రోజులు బాధపడతాడన్నది నాకు తెలుసంటే......"
దార్కా ఉలిక్కిపడ్డాడు.
ఆమె నవ్వింది. "కాష్మోరాలో చివరి అంకం పీడం. దాన్నే కోమా అంటారు. ఇరవై ఒకటో రోజు రోగి కోమాలోకి వెళతాడని నాకు తెలుసంటే........"
దార్కా ఆమెవైపు సాలోచనగా చూసేడు. ఆమెకు నిజంగా మనోగ్రహణ శక్తి వుందా?
అతడి ఆలోచన్లని తెగ్గొడుతూ ఆమె అన్నది
"నువ్వు తులసి మీద కాష్మోరాని ప్రయోగింపదల్చుకున్నావ్ అని కూడా నాకు తెలుసు."
అదే ఆమె చేసిన తప్పు. దాంతో అతడికి అర్ధమైపోయింది. కుర్చీ వెనక్కి వాలి నవ్వేడు. "మీకు గతం తెలిసి వుంటే తెలిసి వుండవచ్చు కానీ భవిష్యత్ తెలియదు. తులసిని చంపడం నా ఆశయం కాదు. పేపర్లో నేనిచ్చిన ప్రకటన చూసి మీరు ఊహించిన కథ అది."
"కాష్మోరాలో ఇరవై ఒక్కరోజు......" అంటున్న ఆమె మాటల్ని మధ్యలో ఖండిస్తూ "దానికేముంది..........ఏ ప్రాచీన గ్రంధంలో చూసినా అది కనబడుతుంది" అన్నాడు.
ఆమె కొద్దిగా విసుగుతో........"సరే నా గురించి దేనికిలే....నీకేం శక్తులున్నాయి. అది చెప్పు" అన్నది.
అతడు లేచి తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఆలోచిస్తూ.........ఆ గది, అవతల ఇంకో గది, దానికి ఒక కిటికీ ఉన్నాయి. కిటికీలోంచి మైదానంలో తిరుగుతున్న కోళ్ళు కనబడుతున్నాయి.
"ఏం చెప్పమంటారు?"
"నీకున్న శక్తిలో ఏదయినా సరే."
అతడి వద్దనుంచి జవాబు రాలేదు. నిశ్చలంగా నిలబడి వున్నాడు. ఎంతసేపటికీ అతడు కదలకపోవడంతో చక్రవర్తి అతడి దగ్గిరగా వెళ్లాడు. దార్కా దృష్టి కిటికీలోంచి బయటకు వుండడం చూసి, అతనూ అటు చూసేడు.
ఆ దృశ్యం చూసి అతడు నిశ్చేష్టుడయ్యాడు. మైదానంలో కోళ్ళు శిలా విగ్రహాల్లా నిస్చలంగా నిలబడి వున్నాయి. ఒక్కసారిగా అన్ని కోళ్ళు అంత నిశ్చలతని సంతరించుకోవటంతో -ఆ చిత్రం -మనిషి వూహించలనిది.
"శభాష్" అంది సిద్దేశ్వరి" దార్కా, నువ్వు నిజంగా గొప్ప మంత్రగాడివి"
దార్కా మౌనంగా వున్నాడు. తను ప్రదర్శించింది తనకున్న విద్యలో కెల్లా అతి చిన్నది.
"దార్కా నీ కెన్ని గొప్ప శక్తులున్నాయో నాకు అన్ని శక్తులు వున్నాయి. కానీ నిశ్చయంగా నా కన్నా నువ్వే గొప్పవాడివి."