Previous Page Next Page 
మహిమ పేజి 28


    "ఏమిటి నీ వెర్రి? మనం చెప్పందే తెలీదనా అందరికి. అన్నీ తెలిసే ఆ టైము వచ్చేసరికి ఎవరి కారణాలతో వారు మెట్లమీద జారుతుంటారు" సీమ విరక్తిగా అంది.
    మహిమ మౌనం దాల్చింది. ఆమె ఏదో ఆలోచిస్తోందని అర్థమై "టేకిట్ ఈజీ మహీ..." అంది టిఫిన్ బాక్స్ మూతపెడుతూ.

                                       *  *  *  *

    ఆ రోజు రాఖీపూర్ణిమ. మహిమ క్రియేటివ్ సెక్షన్ లో ఉన్న అమ్మాయిలతో కలిసి వినోద్ రూమ్ లోకి వెళ్లింది. అంతమంది అమ్మాయిలు తన గదిలోకి రావడం చూసి ఆశ్చర్యంగా, కాస్త గాభరాగా వినోద్ తడబడుతూ, "ఎస్...!" అన్నాడు. మహిమ ముందుకు వచ్చింది. "సార్, ఈ రోజు రాఖీ పండగ కదా... మేమందరం మీకు రాఖీ కట్టాలని వచ్చాం. ఇఫ్ యూ పర్మిట్..." అంటూ హారతి పళ్లెం పట్టుకుంది. ఇంకో అమ్మాయి స్వీట్లు పట్టుకుని నిలబడింది. వినోద్ ముందు బిత్తరపోయాడు. తరువాత తేరుకుని రిలీఫ్ గా ఫీలయి, అతని మొహంలో ఆనందం తొంగిచూసింది. "ఈజిట్! యూ ఆర్ ఆల్ వెల్ కం! రండి లోపలికి. అఫ్ కోర్స్, నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా ఇంత ఆప్యాయంగా వచ్చి రాఖీ కడతానంటే వద్దంటానా..." అంటూ చేయిచాపాడు. స"సార్! ఇక్కడ పనిచేస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలు అంతా ఒక కుటుంబానికి చెందినవాళ్లం. 'జైన్స్ అండ్ సన్స్' కుటుంబం మనది. మా అందరికి సోదరులు మీరు. ఈ రోజు నుంచి మమ్మల్ని మీ స్వంతచెల్లెళ్లలా భావించమని కోరుతూ రాఖీ కడుతున్నాం" అంటూ అతనికి బొట్టు పెట్టి, హారతిచ్చి రాఖీ కట్టింది మహిమ అందరికంటే ముందుగా. నోట్లో చిన్న స్వీట్ ముక్క పెట్టింది. "థాంక్ యూ సార్" అన్న మహిమతో.  
    "రాఖీ కట్టి సార్ ఏమిటి?" వినోద్ నవ్వుతూ చలాకీగా అన్నాడు. "ఓకే భయ్యా" అంది మహిమ చనువుగా. వినోద్ చటుక్కున జేబులో చేయిపెట్టి చేతికందిన ఐదువందల రూపాయల నోటు మహిమ చేతిలో పెట్టాడు.
    "ఇది వద్దు సార్, మీ అభిమానం చాలు" మహిమ మొహమాటంగా అంది.
    "ఇది మా సంప్రదాయం. రాఖీ కట్టిన చెల్లెలికి బహుమతి ఇవ్వక తప్పదు" అన్నాడు వినోద్. "థాంక్ యూ సార్!" అంటూ మహిమ పక్కకు తప్పుకుని, "సీమ... వరసగా అందరూ కట్టండి" అంది. ముప్ఫైమంది అమ్మాయిలు ముందుకు వచ్చి వినోద్ కి రాఖీలు కట్టారు. జేబులో డబ్బు అయిపోతే 'జస్ట్ ఎ మినిట్' అంటూ ఫోన్ చేసి అకౌంట్స్ డిపార్ట్ మెంట్ నుంచి డబ్బు తెప్పించాడు. అందరికీ సమంగా ఇచ్చాడు. "థాంక్యూ! ఈ రోజు నాకు దేవుడు చాలా గొప్ప బహుమతి ఇచ్చాడు. ఇంతమంది చెల్లెళ్ళు దొరకడం నా అదృష్టం. ఇది ఎవరి ఆలోచనో గాని రియల్లీ ఐయామ్ గ్రేట్ ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ..." నిజాయితీగా అన్నాడు.
    "మహిమ! మహిమకు వచ్చిన ఆలోచనే ఇది!" అన్నారు అందరూ ముక్త కంఠంతో.
    వినోద్ "ఓ... మహిమ అంటే మీరేనా? హ్యాపీ టు మీట్ యూ. మీ గురించి విన్నాను" అన్నాడు మహిమని ప్రశంసాపూర్వకంగా చూసి.
    "ఇది మంచి ఆరంభం. ప్రతి డిపార్ట్ మెంట్ లో అమ్మాయిలూ, అబ్బాయిలకు రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని పెంచుదాం!" అన్నాడు వినోద్.
    "థాంక్యూ సార్!" సంబరంగా అన్నారు. "ఓకే సార్! గుడ్ డే..." అంటూ ఎవరి సీట్లవైపు వారు వెళ్లారు.

                                                           *  *  *  *

    "భలే ఐడియా తట్టింది నీకు. ఇన్నాళ్లు వినోద్ గారిని తప్పుకు తిరిగాం. అతని దృష్టిలో పడకూడదని. రాఖీ కట్టిన చేతిని పట్టుకునేటంత నీచానికి దిగజారడని ఆశిద్దాం" ఎవరో అమ్మాయి అంది.
    "పాపం వినోద్ సార్ ని చూస్తే నాకెందుకో జాలిగా అనిపించింది. మగాళ్లంతా ఎన్నో తప్పు పనులు చేసి హాయిగా ఎస్కేప్ అవుతారు గడుసుగా. ఇతని ఖర్మకాలి బతుకు బట్టబయలైంది. అందరిచేత ఛీ అనిపించుకున్నాడు. పాపం ఏడాదిగా అతను మొహం ఎత్తుకు తిరగడం మానేశాడు" సీమ సానుభూతిగా అంది.
    మహిమ తల ఊపి... "అతన్ని చూస్తే అంత నీచుడు అనిపించడు. అతనున్న పరిస్థితుల్లో కక్కుర్తో, ప్రేమకు మొహం వాచో, ఏదో చిక్కుకున్నాడు. దానికి పర్యవసానం ఇంత కఠినంగా ఉంటుందని ఊహించి ఉండడు. ఏమయినా మనం మరీ అతన్ని విలన్ గా చూడకూడదు" అంతా తలలు ఊపి పనిలో పడ్డారు.

                                                              *  *  *  *

    రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు వినోద్ "డాడీ, ఇవాళ నాకు ముప్ఫై మంది చెల్లెళ్లు దొరికారు తెలుసా!" అన్నాడు.
    "ఏమిటి?" విశాల్ ఆశ్చర్యంగా అడిగాడు.
    "అంతమంది చెల్లెళ్లు ఎక్కడనుంచి వచ్చారు? మీ అమ్మ ఈ మాట వింటే, 'నాకు తెలియకుండా ఇంతమందిని ఎందరితో కన్నావు?' అని నిలేసి, చెవులు మెలేస్తుంది" అవినాష్ జైన్ చిలిపిగా భార్యవంక చూస్తూ అన్నాడు. అనసూయ నవ్వుతూ "ఏమో బాబూ, ఏం చేసినా చేస్తారు తెరచాటున ఈ మగాళ్లు. నిజానిజాలు మీ డాడీకే తెలియాలి" అంది ఆవిడ హాస్యంగా. ఆ రోజు సుస్మిత అన్నగారికి రాఖీ కట్టడానికి పుట్టింటికి వెళ్లిన సందర్భంలో డైనింగ్ టేబుల్ దగ్గర మనసు విప్పి నవ్వుతూ మాట్లాడాడు వినోద్. చాలా రోజుల తర్వాత ఫ్రీగా అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. "చెప్పన్నయ్యా... ఎవరా చెల్లెళ్లు? నేనూ ఉన్నాగా ఒక అన్నయ్యని, నా దగ్గరికి ఎవరూ రాలేదే?" అన్నాడు విశాల్.

 Previous Page Next Page