Home » Vasireddy seeta devi novels » Dr Vasireddy Seetha Devi Sahityam


    "అదేమిటో కొంచెం చెప్పండి బాబూ!" అన్నారు రాజావారే ప్రాధేయపడుతున్నట్లు.

 

    "మీరు ఇవ్వదలచుకున్నదేదో నాచేతి కివ్వండి. నేను అందచేస్తాను."

 

    "ఎంత ఇస్తే బాగుంటుందంటావు?" రాజావారు, ప్రశ్నించారు.

 

    "కనీసం ఇరవై వేలయినా ఇస్తేనే బాగుంటుంది."

 

    రాజాగారు కట్టతీసి, "ఇరవైవేలు" అంటూ నాగేంద్రరావు చేతిలో ఉంచాడు.

 

    అది తీసుకుని ఇంకా ఏదో అడగాలని సంకోచిస్తున్న నాగేంద్రంచేతిలో మరో చిన్న నోట్లకట్ట ఉంచుతూ, "ఈ వెయ్యీ నువ్వుంచు అన్నారు" రాజావారు.

 

    నాగేంద్రరావు ఓ నిముషం కంగారుపడి, ఆ కట్టను లాల్చీజేబులో దాచుకున్నాడు.

 

    "ఆమెగారికి నామీద కోపం వచ్చింది. మళ్ళీ రావటం బాగుంటుందా?" రాజావారు లోతు గొంతులో అన్నారు.

 

    "రేపు అమ్మగారే తమకు ఫోను చేయిస్తారు. మీరు చూస్తూ ఉండండి" అన్నాడు నాగేంద్రరావు ఉత్సాహంగా.

 

    "అవన్నీ నీకే వదిలేస్తున్నాను. నీ కష్టం ఉంచుకోనులే" అన్నారు రాజావారు, నాగేంద్రరావుకి మరికొంచెం ఆశను చూపిస్తూ.

 

    "అదంతా నేను చూసుకుంటానుగా? తమరు వెళ్ళిరండి సార్!" అంటూ వెళుతున్న నాగేంద్రరావును రాజావారు వెనక్కి పిలిచారు.

 

    "చిన్న సందేహం! డబ్బు అసలు ఇలా తీసుకోదా?"

 

    "అందరి దగ్గరా అలా తీసుకోదు, ముఖ్యంగా మీలాంటివారి దగ్గర తీసుకోనట్లే మరొకరి ద్వారా తీసుకొంటారు" అన్నాడు నాగేంద్రరావు.

 

    మేడమెట్లు ఉత్సాహంగా ఎక్కుతున్న నాగేంద్రరావుకు రాజాగారు కారు స్టార్టు చెయ్యడం వినిపించింది.

 

    నాగేంద్రరావు పైకి వెళ్ళేప్పటికి అరుంధతి రాజావారు ఇచ్చిన పాకెట్ విప్పిచూస్తూ వుంది. నాలుగు విలువైన జరీచీరలు, స్పెషల్ ఆర్డరు ఇచ్చి నేయించిన నేత చీరలు, అంత జరీ ముద్దలే. వాటి మెరుపు అరుంధతి కళ్ళల్లోనే వెలుగును ఆర్పేసింది. క్రమంగా ఇలాంటి చీరలు కట్టుకుంటే తను ఎలా ఉంటుందో! మహారాణిలా ఉండేదే! కాని తను వీటిని ధరించి ఎక్కడకు వెళుతుంది? తనకు పదిమందీ తెలిసినవాళ్ళు కలిసే సందర్భాల్లో వెళ్ళగల అవకాశం లేదు. ఏమి కట్టుకున్నా, ఎన్ని అలంకరణలు చేసుకున్నా ఈ నాలుగు గోడల మధ్యనే. బంగారు పంజరంలో బంగారు తొడుగు వేసుకొన్న చిలకలా బతకవలసిందే తను. ఏ సినిమాకో, ఏ తోటలోకో వెళ్ళి కూచోగలదు. అంతే.

 

    నాగేంద్రరావు ప్రవేశంతో అరుంధతి ఆలోచనలు చల్లగాలికి విచ్చిపోయే మేఘాలలా తేలిపోయాయి. అరుంధతి కళ్ళలో ఎన్నడూ చూడని దైన్యాన్ని చూసి విస్మయం చెందాడు నాగేంద్రరావు.

 

    "రాజా దుర్గాప్రసాద్ వచ్చాడు, ఫూల్ కు ఎట్లా ప్రవర్తించాలో తెలియదు. వెళ్ళిపొమ్మన్నాను" అంది అరుంధతి తెచ్చిపెట్టుకున్న హుందాతనంతో.

 

    "నాకు గేట్లో కనిపించాడు. బాధపడుతున్నాడు" అంటూ నోట్లకట్టను ఆమె ముందు ఉంచాడు.

 

    "మొత్తంమీద మీరు చాలా గట్టివారే," అంటూ నోట్లు లెక్కించుకొని సంతృప్తిపడింది. వెంటనే నాగేంద్రరావుకేసి చూసింది, ఏదో జ్ఞాపకం చేస్తూన్నట్లు.

 

    "మొదలియార్ దగ్గరనుంచే వస్తున్నాను."

 

    "ఏమంటాడు?"

 

    "ఐదుకంటే ఇచ్చుకోలేనన్నాడు. చివరకు ఏడువరకూ తేలాడు."

 

    "ఆ కుక్కటేశ్వర్రావు?"

 

    "వాడు రెండుకంటే ఇవ్వడట!"

 

    "ఇక వాణ్ణి వాకిట్లో అడుగు పెట్టనివ్వకు వాడే వస్తాడు కాళ్ళబేరానికి" అంది అరుంధతి.

 

    "ఆ చిన్నయ్య కనిపించాడు. ఒకటే గోల పెడుతున్నాడు, మీరు గేట్లో కాలుపెడితే గెంటించివేస్తానన్నారట."

 

    అరుంధతి తల పంకించింది. "వట్టి లేకి మనిషి" అంది.

 

    "వాడూ పాతికదాకా ఎక్కాడు" అన్నాడు నాగేంద్రం.

 

    "లాభంలేదు. అసలు ఆ స్కీమునే వదిలేసుకున్నారట, అందుకే వాణ్ణి వదిలించుకున్నాను."

 

    "వాడికి రావాల్సిన ఏడువేలూ ఇచ్చేయమంటున్నాడు."

 

    "హూఁ నువ్వేమన్నావు?" కంఠంలోని తీవ్రతకు ఓ నిముషం మౌనం వహించాడు నాగేంద్రరావు.

 

    "ఆ విషయం మర్చిపొమ్మన్నాను."

 

    అరుంధతికి ఆ విషయం చర్చించటం ఇష్టంలేదని గ్రహించిన నాగేంద్రరావు అంతలో ఆ సంభాషణ ఆపుచేశాడు.

 

    "ఆ ఇంజనీరుకు ప్రమోషన్ ఆర్డర్ చేతికి అందిందా?"

 

    "అందిందట. సాయంకాలం వచ్చి తను దర్శనం చేసుకొని వెళతానని చెప్పాడు."

 

    "బషీర్ గాడు ఎంతపని చేశాడో తెలుసా? పిల్లిలా ఉంటాడు చూట్టానికి."

 

    "ఏం చేశాడు?" ఆదుర్దా చూపిస్తూ అడిగాడు.

 

    "యాన్ టీ కరప్షన్ డిపార్టుమెంటు ద్వారా నన్ను ట్రాప్ చెయ్యాలని చూశాడు. రెండురోజులుగా మీరు లేరుగా? ఆ అవకాశాన్ని చూసుకున్నాడు. ఒక్కణ్ణి యాన్ టీ కరప్షన్ వాణ్ణే అసిస్టెంట్ సెక్రటరీ అంటూ తీసుకొచ్చాడు. వాడికి డిప్యూటీ సెక్రటరీ ఉద్యోగం ఇప్పించమని రికమండేషన్ తెచ్చాడు. నమ్మేశాను. తీరా డబ్బుకోసం చెయ్యి చాచినదాన్నే అనుమానం కలిగి వెనక్కు తీసుకున్నాను. వెంటనే వాళ్ళను ఇంటినుంచి వెళ్ళగొట్టాను."

 

    "ఎంతపనిచేశాడు దుర్మార్గుడు! పిల్లిలా అన్నీ గమనిస్తూ కూచునేవాడు. వాడికెందుకో మీమీద అంతకోపం?" నొచ్చుకుంటూ అన్నాడు నాగేంద్రరావు.

 

    "వాణ్ణి జాయింట్ సెక్రటరీ చెయ్యలేదని, ఐ.ఏ.ఎస్ ఇప్పించలేదని ఏడుస్తున్నాడు" అంది అరుంధతి.

 

    "అయితే మాత్రం దుర్మార్గుడు అంతపని చేస్తాడా!"

 

    "దానికి అనుభవిస్తాడులే! చార్జెస్ ఫ్రేమ్ చేశారు. త్వరలోనే అసిస్టెంట్ సెక్రటరీ పదివికి దిగుతాడు" అంది అరుంధతి.

 

    "ఇవ్వాళ ఏం కూర చెయ్యమంటారమ్మా?" విమలాదేవి అడిగింది.

 

    "ఏదో ఒకటి చెయ్యి, ముఖ్యమైన విషయాలు మాట్లాడుతుంటే మధ్య నీ గొడవేమిటి?" విసుక్కుంది అరుంధతి.

 

    విమలాదేవి కిక్కురుమనకుండా వెళ్ళిపోయింది.

 

    "ఈవిణ్ణికూడా త్వరలోనే వదిలించుకోవాలి. ఇలాంటి చెత్త ముండలకు సీట్లు ఇప్పిస్తే ఆయనకు పరువు ఏమయినా ఉంటుందా?"

 

    నాగేంద్రరావుకు ఆ మాటలు తేనెల సోనలా చెవులకు సోకాయి. అతనికి విమలాదేవి అంటే అకారణంగానే కోపం.

 

    "దాన్ని నేను వదిలిస్తాను. మీరట్లా చూస్తూండండి. ఒక విషయం తమరికి ఎప్పటినుంచో మనవి చేసుకోవాలనుకుంటున్నాను."

 

    "ఆవిడకు బదులుగా నీ పెళ్ళానికి ఇప్పించమంటావా ఆ సీటు?" ముఖం చిట్లించుకొని చురుగ్గా అంది.

 

    నాగేంద్రరావు చిన్నబుచ్చుకున్నాడు. అసలే చిన్నముఖం ఆ చిన్న పుచ్చుకున్నప్పుడు మరీ చిన్నదై అసహ్యంగా ఉంటుంది.

 

    "కాదమ్మా! తమరే ఎందుకు ప్రయత్నించకూడదూ అని?" అన్నాడు-అరుంధతి ముఖంలోని భావాల్ని చదవటానికి ప్రయత్నిస్తూ.

 

    అరుంధతి జవాబివ్వలేదు. అసలు ఆ మాటలు ఆమెకు వినిపించనట్లే నిర్వికారంగా ఉండిపోయి, ఓ నిముషం మౌనంగా ఉండిపోయింది.

 

    "ఆ వరండాకు గ్రిల్స్ పెట్టించాలనుకుంటున్నాను. సూపర్ వైజర్ సూర్యనారాయణ తండ్రికి గ్రిల్స్ వ్యాపారం ఉందటగా? ఒకసారి సూర్యనారాయణను పిల్చుకొనిరండి. గాస్ అయిపోయింది ఒకసారి కంపెనీకి వెళ్ళిరండి" అంది ప్రసంగం మారుస్తూ.

 

    "చిత్తం!" అంటూ నాగేంద్రరావు మేడ దిగాడు. రంగన్న గేట్లో ఎవరితోనో ఘర్షణపడటం కనిపించింది. నాగేంద్రరావు గేటు దగ్గరకు వచ్చాడు.

 

    "చూడండిబాబూ! ఈ కూలివాడు అరుంధతమ్మగారిని చూడందే వెళ్ళనంటున్నాడు" అన్నాడు రంగన్న.

 

    నాగేంద్రరావు ఆ వచ్చిన వాడిని ఎగాదిగా చూశాడు. మోకాళ్ళవరకూ పంచె, తలకు గుడ్డ, నీరుకావి మురికిదుస్తులు. సగం వార్లు తెగిపోయిన కిర్రు చెప్పులు. చేహ్తిలో ముల్లుకర్ర-పైన చొక్కాలేదు. కడుపు లోపలకు లాక్కుపోయింది. నల్లగావుండి, నరాలు కనిపిస్తున్న పుల్లల్లాంటి కాళ్ళూ, చేతులు. వృద్దాప్యంవల్ల వచ్చిన ముఖంమీద ముడతలు. అరవై సంవత్సరాలు దాటినవానిలాగే కనిపించాడు నాగేంద్రరావుకు.

 

    "చూడండి బాబూ! మా చిన్నమ్మగోరిని చూడాలంటే ఈడు ఈల్లేదంటున్నాడు" అన్నాడు ఆ వృద్ధుడు.

 

    "మీ చిన్నమ్మగారెవరు?" ఆశ్చర్యంగా అడిగాడు నాగేంద్రరావు.

 

    "అరుంధతమ్మగోరు!" అన్నాడు ముసలాడు సంతోషంగా.

 

    "ఇప్పుడు అమ్మగారు ఎవర్నీ చూడరు. అసలు మేడ దిగి కిందకు రారు, సాయంత్రం రా" అన్నాడు నాగేంద్రరావు.

 

    "మళ్ళీ సాయంత్రం రాలేను బాబూ! అమ్మాయిగోరితో నేను వచ్చానని చెప్పు బాబూ!"

 

    "ఏరోయ్! చాలా గొప్పవాడిలా మాట్లాడుతున్నావ్? నువ్వు వచ్చావని చెప్పాలా? పొ౧ పో!" కసురుకున్నాడు నాగేంద్రరావు.

 

    ఏమీ తోచక కారిడార్ లోకి వచ్చి నిల్చుంది అరుంధతి. గేటులో ఏదో గొడవ జరుగుతుందని గ్రహించి "ఏమిటి నాగేంద్రరావుగారూ?" అంటూ పెద్దగా అడిగింది.

 

    "ఎవరో వెంకన్నంటమ్మా!" అంటూండగానే వెంకన్న ముందుకొచ్చి "చిన్నమ్మగారూ! నేను వెంకన్నను" అన్నాడు- వృద్దాప్యంతోపాటు అరుంధతిని చూసిన సంతోషంతో వణుకుతున్న స్వరంతో.

 

    "ఎవరూ? వెంకన్నా! రారా! లోపలకు రా!" అంటూ గబగబా మెట్లు దిగివచ్చిన అరుంధతిని చూసి-రంగన్నా, నాగేంద్రరావూ కూడా అయోమయంగా చూశారు. నాగేంద్రరావు గబగబా తన పనిమీద వెళ్ళిపోయాడు.

 

    "వెంకన్నా! ఎంత కాలానికి వచ్చావు? రా లోపలకు" అంటూ వెంకన్నను లోపలకు తీసుకెళ్ళింది.

 

    వెంకన్నకు ఇల్లంతా చూపించింది. ఆ వైభవం చూస్తూ వున్న వెంకన్నకు మరో ప్రపంచంలోకి వచ్చిపడ్డట్టనిపించింది. అలాంటి భవనం, అంత ఖరీదైన సామాగ్రితో నిండివున్న ఇంటిని అంతకుముందు వెంకన్న ఏనాడూ చూడలేదు. మా అరుంధతమ్మ నిజంగా చాలా గొప్పదయిపోయింది అనుకున్నాడు.

 

    హాల్లోకి వచ్చారు. "కూచో వెంకన్నా!" అంది తానొక కుర్చీలో కూర్చుంటూ. అరుంధతి వారిస్తున్నా వినకుండా కర్ర పక్కన పెట్టుకొని వెంకన్న నేలమీద కూర్చున్నాడు.

 

    "బాగున్నావా తల్లీ?" అన్నాడు కళ్ళనిండా నీళ్ళు తిరుగుతుంటే.

 

    "చూస్తున్నావుగా?" అంది ఆలోచిస్తూ. ఇంతకాలం ఏ విషయాల తాలూకు స్మృతులను తలెత్తకుండా ఉంచడానికి సతమతమవుతూండేదో, అవన్నీ ఒకసారి కళ్ళముందుకొచ్చి నిల్చున్నాయి. మనస్సంతా కలవరంతో నిండిపోయింది.

 

    "అందరూ చెప్పారు ఏదో అనుకున్నాను. నిజంగానే ఎంత గొప్పవారయ్యారమ్మా!" అన్నాడు వెంకన్న కన్నీళ్ళు తుడుచుకుంటూ.

 

    "వెంకన్నా! నిజం చెప్పు. నీకు నేను గొప్పదానిగా కనిపిస్తున్నానా?" అంది రుద్ధకంఠంతో.

 

    వెంకన్న జవాబు ఇవ్వలేదు.

 

    "పెద్ద ఇంట్లో ఉండటం, ఖరీదైన దుస్తులు వేసుకోవటం, చాలా డబ్బు బాంకులో ఉండటం గొప్పతనమా? నిజం చెప్పు వెంకన్నా! నీకు నన్ను చూస్తూంటే జాలి వెయ్యటంలేదూ?" అరుంధతి గొంతులో మాటలు ఉండచుట్టుకుపోయాయి.

 

    వెంకన్న తలగుడ్డ కొసలతో కళ్ళు తుడుచుకున్నాడు. జవాబివ్వలేదు. ఏమనాలో అర్ధంకాలేదు.  

 

    "వెంకన్నా! పోనియ్. నువ్వొచ్చిన పని ఏదో చెప్పు. ఈ ఇంటికి వచ్చేవాళ్ళంతా పనులకోసమే వస్తారు. నన్ను ఒక వ్యక్తిగా గుర్తించి, ఆప్యాయంగా వచ్చి ఆదరణతో మాట్లాడినవారు ఈ పద్దానుగు సంవత్సరాలుగా ఒక్కరూ లేరు. నువ్వొచ్చిన పనేమిటో చెప్పు. పనులు చెయ్యటానికి నేను లంచాలు తీసుకుంటానని కూడా నువ్వు విని ఉంటావు. ఎంత తెచ్చావు?" అరుంధతి కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.

 

    "ఎంత మాటన్నావు తల్లీ! నేను నిన్ను చూట్టానికే వచ్చానమ్మా! ఈ వూరుకు వచ్చాను. నిన్ను చూడకుండా వెళ్ళలేకపోయాను" అన్నాడు వెంకన్న రుద్ధకంఠంతో.

 

    "ముసలాడ్ని! ఏ క్షణంలో గుటుక్కుమంటానో. మళ్ళీ చూడబోయి చూస్తానా అని వచ్చాను తల్లీ!" అన్నాడు మళ్ళీ.

 

    అరుంధతికి పట్టలేని సంతోషం కలిగింది. తనను చూడాలని ఆత్రపడే మనుష్యులు కూడా ఇంకా ఉన్నారు!

 

    "వెంకన్నా! ఎంత కాలమయింది ఈ వూరొచ్చి?" అంది అరుంధతి.

 

    "నాలుగు రోజులయింది."

 

    "నాలుగు రోజుల తరవాతా నన్ను చూట్టానికి వచ్చావు?"

 

    "వచ్చిన తెల్లారీ, సాయంత్రం వచ్చానమ్మా! ఇంటిముందు శానా కార్లు ఉన్నాయి. నన్ను ఎవరూ లోపలకు రానియ్యలేదు. ఎవరో గొప్పోళ్ళతో మాట్లాడుతున్నావని వెళ్ళిపోయాను" అన్నాడు వెంకన్న.

 

    "మనిషిగా వాళ్ళకంటే నువ్వే గొప్పోడివి" అనుకుంది అరుంధతి.

 

    "ఎక్కడున్నావు?"

 

    "నా కొడుకు ఇక్కడ ఉద్దేగం చేస్తున్నాడు. ఆడు రమ్మంటే వచ్చాను."

 

    "అలాగా! నాకు తెలియదే? వాడేనా ఆ వెంకటేశ్వర్లు?" అంది అరుంధతి.

 

    "అవునమ్మా!"

 

    "ఏం ఉద్యోగం చేస్తున్నాడు."

 

    "ఉద్దేగం పేరు తెలదమ్మా. బస్సులో టిక్కెట్లు ఇచ్చే ఉద్దేగం" అన్నాడు వెంకన్న.

 

    "ఏం పాసయాడు?"

 

    "మెట్టిక్కో ఏందో సరిగా తెలవదు."

 

    "అతను నా దగ్గరకొస్తే ఏదయినా మంచి ఉద్యోగం ఇచ్చేదాన్నిగా? నేను ఇక్కడ ఉన్నానని తెలిసి నీ కొడుకును నా దగ్గిరికి పంపించలేదేం?"

 

    "ఆడికి సిగ్గమ్మా!" అన్నాడు వెంకన్న.

 

    అరుంధతి ఆలోచిస్తూ ఉండిపోయింది. "సరే, రేపు ఒకసారి మీ అబ్బాయిని తీసుకురా. నేను అతనితో మాట్లాడాలి" అంది అరుంధతి.

 

    "అలాగే తల్లీ!" అన్నాడు వెంకన్న.

 

    "వెంకన్నా! ఏమయినా తింటావా?" వెంకన్న జవాబుకు ఎదురుచూడకుండానే విమలాదేవిని కేకవేసింది. విమలాదేవి వచ్చి నిల్చుంది. 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra