Home » Yandamuri veerendranath » అతడే ఆమె సైన్యం


    "లేదు. మంత్రిగారితో వచ్చాను. ఆయనకి బాబు పుట్టాడు. మొక్కు తీర్చుకోవడానికి వచ్చాడు. ప్రస్తుతం దేవాదాయశాఖ ఆయనే చూస్తున్నాడులే. అందుకని మాకంతా వి.ఐ.పి. ట్రీట్ మెంటు. నువ్వెక్కడున్నావ్?"

    "ఎమ్.బి.టి. కాటేజ్ లో."

    "అరే! తెలుస్తే మాతోపాటు సుప్రభాత సేవకు తీసుకెళ్ళేవాడినే. టిక్కెట్లు మిగిలిపోయాయి కూడాను" అన్నాడు.

    "సుప్రభాతసేవా? అంటే?" అడిగాను.

    "అరే, అదికూడా తెలియదా?వందరూపాయల టిక్కెట్ కొంటే ఇద్దర్ని రానిస్తారు. రాత్రి రెండు గంటలకల్లా అక్కడుండాలి. మూడు గంటలకు స్వామికి సుప్రభాతం పాడి మేల్కొల్పడం, తోమాలసేవ అన్నీ వివరంగా దగ్గరుండి చూడవచ్చు. చాలా బావుంటుంది. ముఖ్యంగా మనసుకెంతో తృప్తిగా వుంటుంది. ఆ వైభోగం చూడటానికి రెండు కళ్ళూ చాలవనుకో" రామం కళ్ళు మూసుకుని తన్మయత్వంగా అన్నాడు.

    ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా, దేవుడిని దర్శించుకున్నా బహుశా ప్రతిసారీ అతడికా అనుభవం కొత్తదిగా, మైమరపు కలిగించేదిగానే వుండొచ్చు. 

    "ఏమిట్రా వస్తావా అంటే ఆలోచిస్తున్నావ్?" రామం అడుగుతున్నాడు.

    "సారీ! వినలేదు. ఎక్కడికి?" అడిగాను.

    "పదకొండు గంటలకు మంత్రిగారు కళ్యాణం చేయిస్తున్నారు. అప్పుడు వచ్చావంటే దర్శనం బాగా దొరుకుతుంది. అంతే కాదు. లోపల గదులన్నీ కూడా చూపిస్తారు. మామూలుగా అయితే ఎవర్నీ రానివ్వరు" అన్నాడు.

    "అలాగే వస్తాను"

    "పదిహేనో నెంబరు కాటేజీకి వచ్చెయ్. మా వాళ్లంతా అక్కడే వున్నారు." టిఫిన్, కాఫీ త్వరగా ముగించుకుని వాడు వెళ్ళిపోయాడు. నాకేమీ అర్జెంటు పనులు లేవు కాబట్టి తీరిగ్గా కూర్చున్నాను. పక్కటేబుళ్ళ దగ్గర సంభాషణ ఆసక్తికరంగా అనిపించింది.

    త్వరగా వెళ్ళి దైవదర్శనం ముగించుకుని వచ్చిన కుటుంబం అనుకుంటాను. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు.

    "ఇంతదూరం నడిపించుకొచ్చావ్. అక్కడే ఏదో ఒకటి తినేస్తే సరిపోయేది" విసుక్కుంటున్నాడు భర్త.

    "ఇక్కడే కాఫీ, టిఫిన్ కూడా బావుంటాయని అన్నయ్య చెప్పాడు. ఉండేది ఒక్కపూట. దానికింత విసుగు దేనికి?? దగ్గర్లో కాటేజీ వద్దని ధర్మశాలలో దింపితే వద్దనలేదు. కనీసం బయటకు వచ్చినప్పుడయినా మంచి హోటల్లో భోజనం చేయాలనుకోవడం తప్పా?"

    "తప్పుకాదే. కానీ మీ అన్నయ్యలా రెండు జీతాలు నాకు లేవు. ఇలా ఖరీదయిన హోటళ్ళకు తిప్పే తాహతు నాకు లేదు."

    "అనండనండి. ఉద్యోగం లేకపోతే మటుకు నేనూ నాలుగు ట్యూషన్లు చెప్పి సంపాదించటంలేదూ? పనిమనిషిని కూడా పెట్టుకోకుండా పనంతా నేనే చేసుకోవటంలేదా? పెళ్ళయ్యాక మొదటిసారి బయటకు రావడము, కాస్త సరదాగా వుండాలనుకోవడం తప్పా" ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

    "మాట్లాడితే అదొకటి. ఆ ఆడవాళ్ళకు తెలిసిందదే. సరే వచ్చాముగా కానియ్యి" విసురుగా టిఫిన్ ఆర్డర్ చేశాడతను.

    దర్శనం బాగా జరిగిందని సంతోషంతో వచ్చి కూర్చున్నవాళ్ళలో అంతలో ఇలాంటి ఐహిక సుఖాలమీదకు మనసెలా మళ్ళగలిగింది? ఒక్కసారి మృత్యువుని చూస్తేనే కొద్దిరోజులపాటు స్మశాన వైరాగ్యం కలుగుతుందే. 'జీవితం ఏమిటి' అనే ఆలోచన వస్తుందే... కాని అంతకంటే పవిత్రమైన భగవంతుడిని దర్శించుకున్నప్పుడు కొద్ది గంటలయినా మనసుని ఆధ్యాత్మికత వైపు మళ్ళించకపోవడం ఎంత చిత్రం! ఇది మనిషిలోని అపరిపక్వతకు చిహ్నమా?

    నా ఆలోచనకి నేనే సిగ్గుపడ్డాను. వాళ్ళ వయసులో వున్నప్పుడు నేను మాత్రం ఎలా ప్రవర్తించాను? నేను చాలా ఎదిగి పోయాననుకోవడం ఒక భ్రమ. మనిషి ఆలోచన చివరి నిమిషంవరకూ ఎదుగుతూనే వుంటుంది. మెచ్యూరిటీ పరాకాష్ట అనేది లేదు. ఒక మధ్య తరగతి కుటుంబం. అంతంత మాత్రపు జీతాలతో జీవితము వెళ్ళదీయడమే దుర్భరంగా అనిపిస్తూంది. ఎవరికి వాళ్ళు తమ పరిధిలో కుటుంబం కోసం కష్టపడుతుంటారు. వాళ్ళకు హనీమూన్లు లేవు. సెలవులలో ప్లెజర్ ట్రిప్పులు లేవు. ఏదో ఇలా కాస్త సరదాగా, హాయిగా గడపాలనుకోవడం తప్పుకాదు. ఆ అమ్మాయి అన్నట్లు మగవాడిగా, ఉద్యోగస్తుడిగా అతడు స్నేహితులతో హోటళ్ళకు వెళ్ళడం, సినిమాలు చూడటము జరుగుతూనే వుంటుంది. సంపాదన తనదయినప్పుడు అలాంటి వినోదం తనకుండాలని అతడనుకోడం కూడా తప్పుకాకపోవచ్చు. కాని కనీసం కొన్ని వినోదాల్లోనయినా తన భార్యాపిల్లలూ భాగం పంచుకుంటే బావుంటుందనే ఆలోచన అతడికి రాకపోవడం పొరపాటేనేమో.

    బిల్ పే చేసి కాటేజీ చేరుకున్నాను. ఎనిమిదవుతోంది. పదింటికి అలారం పెట్టుకుని పడుకున్నాను. అలసటగా వుందేమో వెంటనే నిద్ర పట్టేసింది. చాలారోజుల తర్వాత నా భార్య సుజాత కలలో కనిపించింది.

    ఆయాసంతో వగరుస్తూ కొండ ఎక్కుతోంది. ఆమెను అందుకోలేక వెనక పడిపోయాను. ఆమె సరాసరి గుడిలోకి వెళ్ళింది. నేను వెళ్ళే సరికి పెద్ద క్యూ. సుజాత ఎక్కడా కనిపించలేదు. క్యూ అంతా వెతుకుతున్నాను. 'మీ ఆవిడ డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళిపోయింది' చెప్పారెవరో. అందర్నీ తప్పించుకుంటూ లోపలకు వెళ్ళాను. భగవంతుడి పాదాలదగ్గిర పడిపోయివుంది సుజాత. పిలిస్తే ఎంతకూ లేవదు. పిలిస్తే పలకదు. నాకు దుఃఖం ముంచుకొస్తోంది 'పాపం ప్రాణం పోయినట్లుంది, అంటున్నారెవరో. 'ఎంత అదృష్టవంతురాలు, భగవంతుడి సమక్షంలో పోయింది. మోక్షం లభించింది' అంటూ వచ్చి ఆమె కాళ్ళకు నమస్కరిస్తున్నారు. అంతలో మెలకువ వచ్చింది.

    టైం చూస్తే తొమ్మిదిన్నర కూడా కాలేదు. లేచి వరండాలోకి వెళ్ళాను. పక్క కాటేజీ దగ్గర నవ్వులు వినిపిస్తున్నాయి. అటు తిరిగి చూశాను.

    నేను వచ్చినప్పటినుంచీ గమనిస్తున్నానా అమ్మాయిని. పదహారేళ్ళుంటాయేమో, పట్టుపరికిణీ, జాకెట్టు మీద ఓణీ వేసుకుని కుందనపు బొమ్మలా వుంటుంది. నడుస్తుంటే మువ్వలచప్పుడు వీనులవిందుగా వినిపిస్తుంది. నవ్వుతుంటే వీణాస్వరాలు పలుకుతున్నట్లనిపిస్తుంది. నా దీపికను ఎలా తీర్చిదిద్దాలనుకున్నానో అచ్చం అలాగే వుంటుందా అమ్మాయి. అందుకేనేమో రెండు రోజులుగా ఆమె కనిపించినప్పుడల్లా ఏమనుకుంటారోనని కూడా ఆలోచించకుండా తదేకంగా చూస్తున్నాను.

    ఆమె పక్కనున్న అబ్బాయి ఏమవుతాడోగాని ఆమెను ఎప్పుడూ నవ్విస్తుంటాడు. ఎందుకో ఆ దృశ్యం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలా చూస్తుండిపోయాను.

    పదిన్నరకు లేచి రామం చెప్పిన పదిహేనో నంబరు కాటేజీకి చేరుకున్నాను. చాలా సందడిగా వుంది. పేపరులో నేను తరచూ చూసే మొహాలు కనిపిస్తున్నాయి. రామం నన్ను చూసి చాలా ఆప్యాయంగా ఆహ్వానించాడు. తన చిన్ననాటి స్నేహితుడిగా అందరికీ పరిచయం చేశాడు. ఆ కాసేపట్లోనే అక్కడ రామానికి ఎంత పలుకుబడుందో అర్ధమయింది. అతడి స్నేహితుడిగా నాకు చాలా మర్యాదనిచ్చి మాట్లాడారు.

    పదకొండు గంటలకల్లా కార్లలో బయలుదేరి గుడి దగ్గరకు చేరుకున్నాం. మంత్రిగారి కుటుంబం ఇంకా రాలేదు. అరగంట ఆలస్యంగా వచ్చారు. ఆయన కుటుంబం రెండు కార్లలో, బంధువులు మరో రెండు కార్లలో దిగారు.

    మంగళవాయిద్యాలు వినిపించాయి. పూజార్లు పూర్ణకుంభంతో ఎదురు వచ్చి ఆహ్వానించారు. వాళ్ళతో పాటు మేమూ లోపలకు వెళ్ళాం. డైరెక్టుగా గర్భగుడిలోకి తీసుకెళ్ళారు. అరగంటసేపు క్యూ ఆపివేయబడింది.

    నేను గర్భగుడిలో అడుగుపెట్టి చాలా ఏళ్ళయింది. అప్పటికీ, ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనిపించింది. గుడి నీటుగా వుంది. అంతా ఎ.సి. వెలుతురు బాగా వుంది. స్వామి విగ్రహం రత్నభూషణాలతో అలంకరించబడివుంది. పెద్దపూజారి మాకన్నీ వివరంగా చూపించాడు. హారతి స్పెషల్ గా ఇచ్చారు. తీర్థం సేవించాం. మంత్రిగారు వాళ్ళు కళ్యాణం మొదలుపెట్టగానే రామం నన్నూ, మరికొందర్నీ తీసుకుని లోపలకు వెళ్ళాడు. పూజారి స్వయంగా మాకు గుడి అంతా తిప్పి చూపించాడు.

    నవరత్నాలు, ముత్యాల తొడుగులు, రత్న ఖచిత కిరీటాలు, ఆభరణాలు అన్నీ చూపించాడు. కోట్లు ఖరీదు చేసే నగలు ఏ యే సమయాల్లో ఏవి అలంకరిస్తారో వివరంగా చూశాం.

    హుండీలలో డబ్బు తీసి లెక్కించే గది కూడా చూశాం. క్లోజ్ డ్ సర్క్యూట్ టి.వి.లున్నాయి. గమ్మత్తుగా అనిపించింది.

    కళ్యాణం పూర్తికాగానే ప్రసాదం తీసుకుని రామానికి 'థాంక్స్' చెప్పి వచ్చేశాను. దగ్గరలో వున్న తోటలన్నీ తిరిగాను. రకరకాల పువ్వులు... మొక్కలు.... కంటికి ఆహ్లాదంగా కనిపించే వాతావరణం.... కాని ఆలోచనలు ఆక్రమించిన మనసు ఈ అందాన్ని ఆస్వాదించడానికి కూడా నిరాకరించింది. రకరకాల మనుష్యుల్ని చూస్తూ, వాళ్ళ సంభాషణ వింటూ చాలాసేపు తిరిగాను.

    అంతులేని ఆలోచనలు. జవాబు లేని ప్రశ్నలు. ఎవరితోనూ పంచుకోలేని అభిప్రాయాలు. రామం చిన్నప్పుడు గుడికి రమ్మన్నా వచ్చేవాడు కాడు. నమ్మకం లేకకాదు. వాడికా ఇంట్రస్టు లేదనేవాడు. పైగా నన్ను వెక్కిరించేవాడు. అప్పట్లో ప్రతి చిన్న విషయానికీ నేను దేవుడికి తలనీలాలు సమర్పిస్తుండేవాడిని. అలాంటి నేను ఈ రోజు ఇలా మారడానికి కారణం ఏమిటి? రామంలో అంతటి భక్తి తత్పరత ఎలా వచ్చింది? మనిషి కష్టాల్లో వుంటే దేవుడిని తలుచుకుంటాడు. అనుకోకుండా అంతులేని ఐశ్వర్యం వచ్చినప్పుడు కూడా భగవంతుడు జ్ఞప్తికి వస్తాడు కాబోలు. అందులో అది అన్యాయార్జితమైనప్పుడు మరీను....

    'చతుర్విధా భజంతే మాంజనే స్సుకృతి నోర్జున
    ఆర్తొజిజ్ఞానురర్ధార్దీ జ్ఞానీచ భరతర్షభ'

    నాలుగు విధాలయిన మనుష్యులు నన్నారాధిస్తారు. బాధలో వున్నవాడు, నన్ను తెలుసుకోవాలనుకున్నవాడు, లౌకిక ప్రయోజనం ఆపేక్షించిన వాడు, జ్ఞాని- అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. అందులో వీళ్ళేరకం?

    తిరిగి తిరిగి బాగా అలసిపోయాననిపించాక గది కెళ్ళాను. స్నానం చేసి తయారయి హోటల్ కెళ్ళి భోజనం చేసొచ్చాను.

    దిండుమీద తల పెట్టగానే నిద్ర పట్టేసింది. ఎవరో తలుపు మీద టక టకా కొడుతున్న శబ్దానికి మెలకువ వచ్చింది. నాకోసం ఎవరొస్తారు? నిద్రాభంగం కలిగినందుకు బాధేసింది. గడియారం చూస్తే పది అవుతోంది.

    'వెంకట్ గారూ, వెంకట్ గారూ' పిలుస్తున్నారెవరో. వెళ్ళి తలుపు తీశాను. బయటంతా చీకటిగా వుంది.

    "రామంగారు మిమ్మల్ని రమ్మంటున్నారండి" అన్నాడతను. వస్తానని పంపించాను. టైం పది దాటింది. ముఖం కడుక్కుని వెళ్ళాను. ఉదయంలా సందడి లేదు. నలుగురే వున్నారు. నన్ను లోపలకు రమ్మని వెంటనే తలుపులు వేసేశాడు రామం. ఈ రహస్యపు సమావేశం ఏమిటో అర్ధంకాలేదు. కాసేపట్లో తెలిసింది.

    బ్యాగ్ లోంచి రెండు షీవాస్ రీగల్ బాటిల్స్ తీశాడు రామం. ఇంకొకతను ప్యాకెట్లు విప్పి రకరకాల తినుబండారాలు ప్లేట్లలో సర్దాడు.

    "రామం. ఇక్కడ ఇవన్నీ ఏం బావుంటుంది?" అడిగాను ఆగలేక.

    "ఫర్వాలేదులేరా. ఎవరికీ తెలియదు. ఒక కాంట్రాక్టరు ఫ్రెండ్ పంపించాడు. తర్వాత శుభ్రం చేసేస్తాలే?" అన్నాడు తేలిగ్గా.

    డ్రింక్ చాలా బావుంది. పదార్థాలన్నీ కూడా చాలా బావున్నాయి. ఇలాంటివి టేస్ట్ చేయడం జీవితంలో ఇదే మొదటిసారి అని చెప్తే రామం చాలా సంతోషించాడు. కబుర్లతో పన్నెండు దాటడం కూడా తెలియలేదు. ఎవరో వచ్చి తలుపుకొట్టారు. రామం వెళ్లి తలుపు కొద్దిగా తెరిచి మాట్లాడుతున్నాడు. ఇంకేం అరేంజిమెంట్స్ చేశాడోనని భయం వేసింది.

    "సారీ ఫ్రెండ్స్! మినిష్టర్ గారు చిన్న మీటింగు కోసం వస్తున్నారు మళ్ళీ కలుద్దాం" అన్నీ గబగబా తీసి సర్దేస్తూ అన్నాడు రామం. 'థాంక్స్' చెప్పి బయటకు వచ్చేశాను. నా వెనకే మరో ఇద్దరు కూడా వచ్చి పక్క కాటేజీలోకి వెళ్ళిపోయారు.

    గదికి వచ్చి షాల్ తీసి కప్పుకుని మళ్ళీ బయటపడ్డాను. పక్క కాటేజీలో అమ్మాయీ-అబ్బాయీ నిద్రపోలేదనుకుంటాను. వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటున్న శబ్దం వినిపిస్తోంది. ఆ అమ్మాయిని సాయంత్రం చూడలేకపోయానని గుర్తురాగానే కాస్త దిగులేసింది. మళ్ళీ అంతలోనే నవ్వొచ్చింది. పక్క కాటేజీలో ఉన్నంత మాత్రాన ఎంతో ఆత్మీయులయిపోయినట్లు, ఒక పూట చూడకపోతే దూరం అయిపోయినట్లు బాధ పడిపోవడం ఏమిటని. అంత రాత్రిపూట అంత గట్టిగా ఏం మాట్లాడుకుంటున్నారో అర్ధంకాలేదు నాకు. పదిహేనో నంబరు కాటేజి ముందు మంత్రిగారి కారు ఆగివుంది. నేను చూస్తుండగానే మరో రెండు కార్లు వచ్చి ఆగాయి. అందులోంచి దిగివెళుతున్న మనుష్యుల్ని చూశాక ఆ సమావేశం ఏమిటో, ఎందుకో ఎవరూ చెప్పకుండానే అర్ధమయిపోయింది. కొద్ది నిమిషాల క్రితం రామం ఇక్కడ వ్యభిచారం కూడా చేస్తున్నాడేమోనన్న ఆలోచన బాధ కలిగించింది కానీ అంతకన్నా భయంకరంగా.... జరుగుతున్నదేమిటో అర్ధం అయ్యాక కోపంతో, అశక్తతతో రక్తం మరుగుతోంది. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra