ఇంగ్లీష్ లెక్చరర్ పాఠం చెపుతున్నారు__పాపం, ఆయన పాఠం బాగానే చెపుతారు__ విద్యార్ధులలో చాలామంది శ్రద్ధగా వింటున్నారు__ఈలోగా ఎక్కడినుంచో ఒక కాగితపు నమస్కార బాణం వచ్చి పాఠం చెపుతున్న లెక్చరర్ గారి గుండెలను తాకి కింద పడింది__కోపంతో ఆయన ఆ కాగితం మడతను విప్పాడు__ అది నగ్న సుందరి బొమ్మ__క్లాసంతా నవ్వు ఆపుకోలేక పక పక నవ్వేసింది__ ఆయన కోపంతో మండిపడుతూ గభాలున స్టేజి దిగి తన మీదకు ఆ బాణం ఏ వైపునుంచి వచ్చిందో, ఆ వైపుకు విద్యార్ధుల మధ్యకు వచ్చేశాడు. కుమార్ ముందు డెస్క్ మీద రకరకాల సుందరీ మణుల బొమ్మలు చాలా అసభ్యమైన భంగిమలలో ఉన్న కాగితాలున్నాయి__ఇంగ్లీష్ లెక్చరర్ వాటిని చేతిలోకి తీసుకుని "వాట్ ఈజ్ దిస్!" అని అరిచాడు.
"ఇంగ్లీష్ నోట్స్ సార్!" అని ఏ మూలనుండో ఎవరో సమాధానం చెప్పారు-మళ్ళీ క్లాసంతా నవ్వులు.
"గెటౌట్ ఫ్రం మై క్లాస్!" అని అరిచాడు మళ్ళీ లెక్చరర్.
"సార్! నాకేం తెలియదు సార్! నేను చాలా శ్రద్ధగా పాఠం వింటున్నాను__ఈ కాగితాలు నా డెస్క్ మీద ఎవరో పడేశారు." అని వినయంగా చెప్పుకోబోయాడు కుమార్__తన మాటకు ఎదురు తిరగటం సహించలేక పోయాడు ఇంగ్లీష్ లెక్చరర్. పట్టరాని కోపంతో కుమార్ చెంప ఛెళ్ళుమనిపించాడు. అంతవరకూ నవ్వుతోన్న క్లాస్ ఆ సంఘటనకు నిర్ఘాంతపోయింది. తీరా కొట్టేశాక తాను తొందరపడ్డానని ఇంగ్లీష్ లెక్చరర్ కూడా అనుకున్నాడు__ అంతవరకూ వినయంగా మాట్లాడుతోన్న కుమార్ తన తప్పులేక పోయినా అంత మందిలో లెక్చరర్ కొట్టేసరికి నిటారుగా నిలబడ్డాడు.
"సార్! ఆ బాణం నేను వెయ్యలేదని చెప్పాను__అయినా మీరు నన్ను కొట్టారు_ఆ బాణం వేసినదెవరో నాకు తెలుసు__నేనిప్పుడే ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ చేసి వస్తాను." అని చర చర నడిచి ప్రిన్సిపాల్ కి అనవసరంగా లెక్చరర్ తనను కొట్టి అవమానించాడని రిపోర్ట్ చేసి దర్జాగా వచ్చి క్లాస్ లో కూచున్నాడు__ఇంత జరిగాక నమస్కార బాణం వదిలిన విద్యార్ధి ఎంతో బుద్ధిగా తన తప్పు ఒప్పుకున్నాడు; లెక్చరర్ తప్పుని, పెద్దది చెయ్యటానికి! తననెవరూ ఏం చెయ్యలేరని ఆ విద్యార్ధికి తెలుసు__ మహా అయితే కొద్దిగా ఫైన్ వేస్తారంతే! కానీ ఇంగ్లీష్ లెక్చరర్ అనవసరంగా కుమార్ ని కొట్టినట్లు రుజువవుతుంది__ఆ తరువాత తమాషా చూడాలి!
పరిస్థితులు ఆ తరువాత మరింత విషమించాయి, ఉన్నట్లుండి కాలేజిలో ఉన్న షెడ్యూల్డ్ క్లాస్ విద్యార్ధులందరికీ కుమార్ మీద అపరిమితమైన ప్రేమనురాగాలు పుట్టుకొచ్చాయి- "మా కుమార్ ని నిష్కారణంగా కొట్టిన ఆ లెక్చరర్ ఈ కాలేజిలోంచి పోయేవరకూ మేం కాలేజికి రాము. ఒక లెక్చరర్ కి విద్యార్ధినికొట్టే అధికారం లేదు__ కేవలం అహంకారంతో, వెనుకబడిన జాతులవాడనే చిన్న చూపుతో కుమార్ ని కొట్టారు. ఈ దుర్మార్గాన్ని మేము సహించము." అంటు ప్రచారం ప్రారంభించారు. సమ్మె చెయ్యాలంటూ పట్టుబట్టారు. ఎప్పుడు ఏకాస్త వంక దొరికినా సమ్మెలంటూ గొడవలు చెయ్యాలనుకునే వాళ్ళంతా ఆ పార్టీలో చేరిపోయి 'సమ్మె, సమ్మె' అని ఆందోళన ప్రారంభించారు. చీటికీ మాటికీ సమ్మెలంటూ చదువులు పాడుచేసుకోవటం కొందరు విద్యార్ధుల కిష్టంలేదు. "ఇంత చిన్న విషయానికి సమ్మె దేనికి? ఆ లెక్చరర్ క్షమార్పణకోరితే సరిపోదా? ఆయన ఉద్యోగం వదులుకుని పోవాలని కోరటం ఏం న్యాయం? ఈయన చక్కగా పాఠం చెపుతారు__ ఇలాంటి వ్యక్తిని పొమ్మని సమ్మె చెయ్యటం మనకే మంచిదికాదు." అని ప్రతిఘటించారు. సమ్మె చెయ్యాలనే వాళ్ళు మరింత రెచ్చిపోయి "మీరంతా ఉన్నత కులాలవాళ్ళు-మొదటినుంచీ మమ్మల్ని చిన్న చూపుచూసి అవమానించటమే మీకు అలవాటయి పోయింది.... ఈ నాటికీ పేపర్లలో మీ కులాలవాళ్లు మా కులాలవాళ్ళని ఎంతగా హింసిస్తున్నారో చూస్తూనే ఉన్నాం! ఈ ఆటలిక సాగవు__దురహంకారంతో మా కుమార్ వంటిమీద చెయ్య చేసుకున్న ఆ లెక్చరర్ ఈ కాలేజినుంచి పోయేవరకూ సమ్మెచేసి తీరాలి!" అన్నారు.
విద్యార్ధులలో కొందరు సమ్మెలుచేసి, అల్లర్లుచేసి ఎలాగైనా క్లాసులు సాగకుండా చూడాలనుకునేవాళ్ళు- మరికొందరు సిన్సియర్ గా చదువుకుని పైకిరావాలని ఆరాటపడేవాళ్ళు.... అతి సామాన్యమైన ఈ అభిప్రాయ భేదాలకి విచిత్రంగా కులాల రంగు పులిమేశారు__విద్యార్ధులు సమ్మె ప్రారంభించారు-కాలేజి గేటుదగ్గిర నిలబడి.
"బీదలపై ధనికుల దౌర్జన్యం నశించాలి!"
"అగ్రవర్ణాలవారి అహంకారం అణగారి పోవాలి!"
"కులమత వర్గ భేదాలు రూపుమాసి పోవాలి!" అని గట్టిగా అరుస్తూ ఒక్క విద్యార్ధి కూడా లోపలకు పోకుండా అటకాయించటం మొదలు పెట్టారు. కాలేజీలో మూడువంతులు మంది సమ్మెలోనే చేరి పోయారు, సరదాగా ఉంటుందని__ నాలుగోవంతు విద్యార్ధులకు సమ్మెజోలికి పోకుండా చదువుకోవాలని ఉన్నా, ఏం చెయ్యలేక ఊరుకున్నారు.
ఇంతటి అల్లకల్లోలానికి కుమార్ కారకుడని తెలిసి కూడా బాధపడ్డాడు చంద్రశేఖర్__పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిన ఆ దశలో ఏం చెయ్యాలో అర్ధం కాలేదు అతనికి- ఇంగ్లీష్ లెక్చరర్ కి చంద్రశేఖర్ పెంపుడు కొడుకని తెలిసింది. అతడు మరింత నొచ్చుకుంటూ "సారీ, మిస్టర్ చంద్రశేఖర్! ఆ అబ్బాయి మీ కొడుకని నాకు తెలియదు-డెస్క్ మీద నగ్న స్త్రీల బొమ్మలున్న కాగితాలు పెట్టుకుని కనిపిస్తే కొట్టేశాను" అన్నాడు.
ఆ లెక్చరర్ సంజాయిషీ చంద్రశేఖర్ కి నచ్చలేదు__ "ఇంతజరిగినా, మీరు ఇప్పటికీ, జరిగింది అర్ధం చేసుకోవటం లేదు. మన లెక్చరర్లం. మనకు స్టూడెంట్స్ కీ ఉండే సంబంధం. ఆఫీసుల్లో ఆఫీసర్స్ కీ సబార్డినేట్స్ కీ ఉండే సంబంధం లాంటిదికాదు- ఇది స్నేహసౌహార్దాలతో కూడిన సంబంధం-కాలేజీలోకి వచ్చే స్టూడెంట్స్ పసివాళ్ళు కాదు, ఒక మొట్టికాయ మొట్టి కూచో బెట్టడానికి! అలాగే పెద్దవాళ్ళు కాదు. సభ్యతా, సంస్కారాలతో మసలుకోవటానికి! మనం మన విద్యార్ధులను, అభిమానిస్తూ, మన్నిస్తూ ఒకదారిలోకి తీసుకు రావటానికి ప్రయత్నించాలి కాని, ఈసడించి నిరసించకూడదు-ఎటూకాని ఈ వయసులో వాళ్ళ అహం గాయపడితే, వాళ్ళు తిక్కరేగి ప్రవర్తిస్తారు. కుమార్ నా కొడుకయినా లేక నిజంగా గుడిసెలలోంచి వచ్చి చదువుకొంటున్న విద్యార్థే అయినా, ఒక విద్యార్ధిని కొట్టే అధికారం మీకు లేదు."