Previous Page Next Page 
మహిమ పేజి 27


    "ఎలా తెలుసు?"
    "మన చీరాల యాడ్ షూట్ అప్పుడు మహిమ షూటింగ్ స్పాట్ కి వెళ్ళడానికి పర్మిషన్ అడిగింది. వెళ్ళి మూడు నాలుగు షాట్స్ ఎలా తీస్తే బాగుంటాయో సూచించిందట. కెమెరామేన్ రఘు చెప్పాడు".
    "అలాంటప్పుడు తనకు ఇంటరెస్ట్ ఉంటే చిన్న ఛాన్స్ ఇచ్చి చూద్దాం. డైరెక్షన్ కి. మనమూ కొత్తవారిని తయారుచేసుకోవాలి గదా! ఏదన్నా ఆమె ఇంటరెస్ట్ చూసిన యాడ్ కి ఛాన్స్ ఇచ్చిచూడు" అన్నాడాయన.
    తల ఊపాడు విశాల్.
    ఇద్దరి సంభాషణ విన్న వినోద్ "ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు?" కుతూహలంగా అడిగాడు పేపరులోంచి చూస్తూ.
    విశాల్ తండ్రి వంక చూశాడు. అవినాష్ ముభావంగా "మహిమ అని క్రియేటివ్ అసిస్టెంట్" అన్నాడు. వినోద్ ఇదివరకటి వినోద్ కాదు. పూర్తిగా మారిపోయాడని ఆయనకి తెలుసు. అయినా మహిమ లాంటి అమ్మాయి... అన్నివిధాల ఆకర్షించగల అమ్మాయి అతని కంటపడితే... మళ్లీ... లేదు లేదు... వినోద్ లో గత ఏడాది నుంచి చాలా మార్పు వచ్చిందని తెలిసినా, అవినాష్ ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి.
    నిజంగానే వినోద్ ఇదివరకటివాడు కాదు. ఒక ఆరు నెలలు... వినోద్ జీవచ్చవంలాగే బతికాడు. ప్రీతి చేసిన అవమానం తట్టుకోలేక, ఇంట్లో భార్య సూటిపోటి మాటలతో తూట్లు పొడుస్తుంటే, అడుగడుగునా హీనాతిహీనంగా కుటుంబ సభ్యుల ముందు, ఆఖరికి పనివాళ్ల ముందు కూడా తీసిపారేస్తుంటే, తల ఎత్తలేక, జవాబిచ్చే ధైర్యం లేక, తలదించుకుని వెళ్లిపోయేవాడు. రోజులో మూడొంతుల టైము ఆఫీసులో ఉంటూ నిద్ర సమయానికి దొంగలా వచ్చి తిని పడుకునే కొడుకుని చూస్తే తల్లి తండ్రి తల్లడిల్లిపోయేవారు. కొడుకు చేసింది తప్పే. కానీ ఇంతటి కఠిన శిక్షా దానికి? ఓ పక్క ప్రీతి, రెండో పక్క భార్య చేసిన అవమానంతో అతనికి స్త్రీ జాతి అంటేనే అసహ్యం పుట్టిందని, విరక్తి కలిగిందని అవినాష్ కి తెలుసు. కాలమే గాయాన్ని మాన్పుతుందని ఊరుకోలేక, ఓ రోజు కొడుకు ఇంట్లో లేని సమయంలో కోడలికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. కానీ మామగారు అని కూడా లేకుండా, 'ఇంత జరిగినా నన్నే అంటారా' అని దులిపి పారేసింది. వియ్యంకుడితో మాట్లాడి చూద్దాం అనిపించి మాట్లాడితే... ఆయన, 'దాని బాధ మీకర్థం కాదా? మీకు మీ కొడుకెంతో, నాకు నా కూతురూ అంతే. దానికి ఆ బిడ్డే గనుక లేకపోతే దాన్ని ఆ కొంపనుంచి ఎప్పుడో నా ఇంటికి తీసుకొచ్చేవాడిని' అని నోరు మూయించాడు. 'మీరు చేయలేని పని నేను చేసి నా కూతుర్ని కాపాడుకున్నాను. ఇంటిపెద్దగా మీరేం చేశారు? అన్నీ తెలిసి ఊరుకున్నారు' అని వాతపెట్టాడు. కొడుకు ఇంక జన్మలో ఆడదానివైపు వెళ్లడని, ఎవరినీ నమ్మడని ఆయనకి నమ్మకం. ప్రీతి మీద దాడి, జైలు కబురు విన్న అందరూ ఇది ఎవరు చేశారో తెలియక, నింద తమ మీద పడడంతో ఆఫీసులో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాని నాలుగైదు రోజుల తరువాత, సుస్మిత ఆవేశపు క్షణాలలో నోరు జారి 'మా నాన్న నాకు అండగా నిలబడ్డారు కనుక న్యాయం జరిగింది. లేకపోతే మీరంతా చోద్యం చూస్తూ నిలబడేవారు' అన్న మాటతో నిజం తెలిసి విస్తుపోయారు. అంత అవమానభారంలోనూ వినోద్, ప్రీతికి జరిగిన పరాభవం విని విచలితుడయ్యాడు. ప్రీతి తొందరపడింది. తనమీద నమ్మకం పోగొట్టుకుని విచక్షణ కోల్పోయి ప్రవర్తించింది. ఇంత అరాచకంగా ఓ అమ్మాయిని శిక్షించడం, ఆఫీసులో అమ్మాయిలంతా అతన్ని బెరుగ్గా చూడడం తనను చూసి తప్పుకు తిరగడం, ఆఫీసు పనిమీద మాట్లాడినా బిక్కుబిక్కుమంటూ చూడడం... అందరూ ఈ సంఘటనకి ఎంత భయపడ్డారో తెలిసి ఎవరికీ మొహం చూపలేక, షూటింగులప్పుడు సెట్ మీదకి వెళ్లడం మానేశాడు. పూర్తయ్యాక విజువల్స్ తెప్పించుకుని చూసి మార్పులు చేర్పులు చెపుతూ వీలయినంతవరకు రూముకే పరిమితమయ్యాడు.
    అలాంటి వినోద్ ఇన్నాళ్ల తరువాత మహిమ గురించి చెప్పుకుంటుంటే వివరం అడగడం, అవినాష్ కే కాస్త ఆశ్చర్యం అనిపించింది.

                                                             *  *  *  *

    "సీమా, ఆఫీస్ స్టాఫ్ లో సగం మంది అమ్మాయిలున్నారు. మనం పురుషుల మధ్య స్నేహబాంధవ్యాలతో, సహృద్భావ వాతావరణంలో, ఒక కుటుంబంలా వెలగలేమా? స్త్రీ పురుషుల మధ్య స్నేహం ప్రేమలోకి దించుతుందనే రూలు మారదా ఎప్పటికీ? ఆడపిల్లలు మగవారి ప్రేమ మాటలకి మోసపోతూనే ఉంటారా?" మహిమ కాస్త ఆవేశం, ఆవేదన కలిపి అంది ఆరోజు ఆఫీసులో లంచ్ చేస్తున్నప్పుడు సీమ.
    "నువ్వు ఇంకా అవే ఆలోచనల్లో ఉన్నావా? ఫర్ గెట్ ఇట్! కొన్నాళ్లు మేము ఎంత బాధపడ్డామో... ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కాలం గాయాన్ని మాన్పుతుంది. అలాగే ప్రకృతి నైజం మారదు కదా! ఎంత చదివినా, ఉద్యోగా లేలినా, స్త్రీ పురుష ఆకర్షణ ఎలా పోతుంది? కాస్త తెలివైన అమ్మాయిలు ఒకటి రెండుసార్లు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు. చూడు మహిమ... ముఖ్యంగా పరిస్థితులు అలా తోసుకొస్తాయి. ఒక మధ్యతరగతి అమ్మాయి ఉద్యోగం కోసమో, బాస్ ని ఇంప్రెస్ చేసి లాభపడ్డానికో, పేరు తెచ్చుకుని నిలబడడానికో... తమ అవసరాల కోసం కొంతమంది, ప్రేమను నమ్ముకుని కొంతమంది... ఇలా రకరకాలుంటారు. అన్నింటికి మగవాళ్లనే తప్పుపట్టలేం. ఆకర్షించడం దీపం లక్షణం, వెలుగు దరిచేరడం భ్రమర లక్షణం. తప్పదు... జీవితం అంటే ఇదే!"
    "అవుననుకో. కనీసం ఒకే ఆఫీసులో పనిచేస్తున్న మనలో మనమన్నా ఆకర్షణకు లొంగకుండా జాగ్రత్తలు తీసుకోలేమా! ఈ ఫ్యాషన్ వరల్డ్, యాడ్ వరల్డ్ లో ఉండే ఆకర్షణలకు, ప్రలోభాలకు లొంగకుండా... మన బాస్ లు మనల్ని లొంగదీసుకునే ప్రయత్నాలు చేయకుండా... మనం ఏమీ చేయలేమా?" సాలోచనగా అన్నది మహిమ.

 Previous Page Next Page