కానీ అమెరికన్లు మాత్రం ఇండియాలో రష్యాకి ఉన్నంతమంది గూఢచారులు ఇంకేదేశానికి లేరంటారు. రష్యా తన గూఢచారులనీ, ఉద్యోగులనీ, చివరికి పైలట్ లనీ కూడా తన రాయబార కార్యాలయపు సిబ్బందిగా చూపిస్తుంది రికార్డులలో. రాయబార కార్యాలయంలో పనిచేసే కార్లకి డిప్లమాటిక్ నెంబర్ ప్లేట్లు ఇస్తారు.75-CD-302 అనే నెంబరు ప్లేటుగల కారుకూడా ఉంది సోవియెట్ రాయబార కార్యాలయానికి. అంటే మూడు వందలు ఇద్దరు సిబ్బంది (బాధ్యతగల పదవుల్లో) అక్కడ వున్నారన్న మాట. అదీగాక రష్యన్లు డూప్లికేట్ నెంబర్ ప్లేట్లు కూడా వాడతారన్న వదంతి వుంది. తమ దగ్గర నిజంగా ఎంతమంది పనిచేస్తున్నారో బయటి వాళ్ళకి తెలియకుండా నన్నమాట.
"వీళ్ళలో చాలామంది గూఢచారులంటుంది అమెరికా." అని ఆగాడు ప్రతాప్.
"లెక్చరు ఇస్తున్నట్లు చెప్పేస్తుంటే వినడానికి నీకు బోరుగా లేదు కదా?" అన్నాడు వినీలతో. "నిజానికి ఇది లెక్చరే: బోరుగా వున్నా వినక తప్పదు. లేకపోతే గూఢచారుల గురించిన నిజమైన సంగతులు నీకు చాలా తెలియకుండా పోతాయి"
"అదేమీలేదు చెప్పండి" అంది వినీల శ్రద్ధగా.
"రష్యన్లు మన భాషలను నేర్చుకోవడం కోసం చాలా కృషి చేస్తారు. అందువల్ల ప్రజలేమనుకుంటున్నారన్నది బాగా గ్రహించవచ్చు. చాలామంది రష్యన్ గూఢచారులు హిందీ, బెంగాలీ ఉర్దూలాంటి భాషలు ధారాళంగా మాట్లాడతారు అమెరికన్స్ కి ఈ ప్రావీణ్యం లేదు.
ఇకపోతే బ్రిటిష్ గూఢచారులు. జేమ్స్ బాండ్ బ్రిటిష్ గూఢచారే. పుస్తకాల్లోనూ, సినిమాల్లోనూ అతను ఎదురులేని మనిషి;
కానీ నిజజీవితంలో బ్రిటిష్ ఏజెంట్ కి డబ్బులు అంత ధారాళంగా అందుబాటులో వుండవు. అమెరికన్ ఏజెంట్ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, కనీసం తమ దేశంలో వుండడానికి గ్రీన్ కార్డు ఇప్పిస్తానంటే ఎగిరిగంతేసి రహస్యాలు చెప్పేస్తున్నా వాళ్ళు చాలా మంది వున్నారు.
బ్రిటన్ ఎక్కువగా ఆమెచ్యూర్ పాట్రియాట్స్ మీద ఆధారపడి ఇండియాకి సంబంధించిన రహస్యాలు సేకరిస్తుంది.
ఇంకా చైనా గూఢచారుల గురించి చెప్పాలంటే - వీళ్ళకి వున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ళకి ఇండియాలో భాషలు అంతగారావు. వాళ్ళను ఇట్టే గుర్తు పట్టెయ్యవచ్చు. కాబట్టి వాళ్ళు ఇండియాలో యధేచ్చగా తిరగలేరు. వాళ్ళది కూడా మనలాగే బీదదేశం. వాళ్ళ దేశానికి వెళ్ళడానికి వీలు కల్పిస్తానంటే ఎవడూ వెళ్ళడు. వాళ్ళకి స్నేహితులు తక్కువ. వాళ్లు ఇండియాకి వస్తున్నప్పుడు తక్కిన దేశస్తులలాగా భార్యాబిడ్డలని వెంట తీసుకురావడానికి వాళ్ళ ప్రభుత్వం ఒప్పుకోదు. వాళ్ళకి ఇండియా అంటే ద్వేషం. అందుకని ఇక్కడ ఏడుస్తూ, సంతోషం లేకుండా రోజులు గడుపుతూ వుంటారు.
కానీ ఒక విధంగా ఇదే వాళ్ళకు ఒక వరం అయ్యింది వాళ్ళు తక్కిన వాళ్ళలాగా పార్టీలు చేసుకుంటూ, కులాసాగా కాలం గడపడానికి వీల్లేకపోవడం వల్ల పొద్దస్తమానం తెగ చదువుతూ వుంటారు చైనాగూఢచారులు. అందుకని వాళ్ళు ఇండియన్ వ్యవహారాలమీద అధారిటీ గూఢచారిగా పనిచేస్తున్న ఒక చైనా అమ్మాయికి హర్యానా అసెంబ్లీలో ఏ సంవత్సరం ఏ పార్టీకి ఎన్ని సీట్టొచ్చాయో, ఆంధ్రప్రదేశ్ లో అవనిగడ్డలో మునిసిపల్ కౌన్సిలర్ లు ఎవరో కూడా కంఠతా వచ్చు.
చైనా వాళ్ళలో వున్న చాలా లోపాలను, ఇలా కష్టపడి చదివే గుణం కప్పేస్తుంది.
ఫ్రెంచి, ఇటాలియన్ గూఢచారులకి మన మిలటరీ శక్తి సామర్థ్యాల గురించిన కమర్షియల్ ఇంటలిజెన్స్ ఎక్కువగా కావాలి.
ఢిల్లీలో పట్టుకున్న గూఢచారి కేసులన్నీ తిరగేసి చూస్తే కమర్షియల్ ఇంటలిజెన్స్ కోసం జరుగుతున్న ఎస్పియనేజ్ ఎక్కువని తేలుతుంది. కానీ మన సెక్యూరిటీ సర్వీసుల వాళ్ళు, ఇలాంటి గూఢచారుల మీద కూడా మిలటరీ వ్యవహారాలకు సంబంధించిన కేసులు రుద్ది సెన్సేషనల్ గా చేసి మాగ్జిమమ్ పబ్లిసిటీ సంపాదిద్దామని చూస్తారు.
ఆస్ట్రేలియన్స్ ఫ్రెండ్లీ పీపుల్ తక్కిన దేశస్తులతో మాట్లాడటానికి భయపడే జనం కూడా, ఆస్ట్రేలియన్స్ చిరునవ్వులకి లొంగిపోయి, సమాచారం అందించిన సంఘటనలు కోకొల్లలు.
నెదర్ లాండ్స్ మొదలయిన స్కాండనేవియన్ దేశాలకు కావలసిన సమాచారమల్లా, వాళ్ళ మన దేశంలోని పిల్లలకు ఇచ్చిన పాల పొడిలాంటివి చేరవలసిన వాళ్ళకు చేరుతున్నాయా? లేక రాజకీయ పందికొక్కులు మధ్యలో మింగేస్తున్నాయా అని మాత్రమే. ఈ దేశాలకు మన మిలటరీ కమర్షియల్ సమచారంమీద ఆసక్తి లేదు వాళ్ళెప్పుడూ గూఢచారి చర్యలు చెయ్యరు.
చివరగా చెబుతున్నా కూడా, మనకి సంబంధించినంత వరకూ అందరికన్నా ముఖ్యమైన వాళ్ళు పాకిస్తానీలు. మనదేశాన్ని గురించిన సమాచారం సేకరించడం వాళ్ళకు కేవలం ఒక అవసరం మాత్రమే కాదు.
అది వాళ్ళకి జీవస్మరణ సమస్య:
మన దేశపు నావికాదళానికి చెందిన నౌక ఐ ఎస్ యస్ గోదావరి. ఎలాంటి కండీషన్ లో వున్నదీ అన్న విషయం వేరే దేశాలకు కేవలం కుతూహలం కలిగించవచ్చు. కానీ అది పాకిస్తాన్ కి ప్రాణాలతో సమానమైన సమాచారం:
మనలాగే పాకిస్తాన్ కూడా పేదదేశం. మనమీద గూఢచారిచర్యలు జరపడానికి వాళ్ళు కడుపుమాడ్చుకుని కూడబెట్టాలి డబ్బు. పాకిస్తానీలకి మనదేశంలో ఇంకెవ్వరికీ లేని ప్రమాదం వుంది. అదేమిటంటే వయొలెన్స్. వాళ్ళు అచ్చం మనలాగే వుంటారు కాబట్టి, అనుమానమొస్తే ముందు చితక బొడిచేసి తర్వాత పొరబాటయిపోయిందనీ, ఇండియన్ అనుకుని భ్రమ పడ్డామనీ బుకాయించవచ్చు.