"నేను ఇప్పుడు చెప్పిన దానివల్ల నీ జీవితానికి ఏ ఉపకారం జరిగినా, నా జీవితం ధన్యమైందనుకుంటాను....
ఉత్తరం చివర సంతకం లేదు. 'నీ అభాగ్యురాలైన చెల్లెలు' అని మాత్రం వుంది- అసంపూర్తి చరిత్రలా.
వెనక్కువాలి కళ్ళు మూసుకున్నాను. మనసు పొరల్లోకి ఏ ఆలోచనలూ వెళ్ళడం లేదు. అప్పటికే సంఘటన తర్వాత సంఘటనతో హృదయం మొద్దుబారి వుంది. తలలో సన్నని పోటు ప్రారంభమైంది. ఈ మధ్య తరచూ అలా వస్తోంది. ఆలోచించకుండా వీల్లేకుండా ముందే మొదలవుతుంది.
నా అత్తగారు, తోడికోడలు గుడినుంచి తిరిగి వచ్చారులా వుంది. అక్కడి పురాణ కాలక్షేపం గురించి చర్చించుకుంటున్నారు. నా భర్త వస్తే వాళ్ళే తలుపు తీస్తార్లే అనే ఉద్దేశంతో నిస్త్రాణగా మంచంమీద వాలిపోయాను.
నా కళ్ళముందు నా తోడికోడలి చెల్లెలి మొహం కదలాడింది. పాపం ఏమీ తెలీని తెలివితక్కువ పల్లెటూరి గబ్బిలాయి అని జాలిపడ్డాను. అనుభవమూ, జీవితం నేర్పిన పాఠమూ మనుష్యుల్ని ఇంత తాత్వికుల్ని చేస్తుందా? నా అత్తగారింట్లో వాళ్ళందరికీ ఇంత దగ్గరగా వుండికూడా నేను తెలుసుకోలేని విషయాలు ఆ అమ్మాయి కెలా తెలిశాయి?
నా భర్తని తల్చుకుంటే నా కాశ్చర్యం కలిగింది. అతని దగ్గర ఎంతో నిరాదరణ, నిరాసక్తత, నిర్లక్ష్యం, నిర్లిప్తత ఎదురైన తర్వాత కూడా నేను నా బావగారికి దగ్గరవడానికి గిల్టీగా ఫీలయ్యాను. అలాంటిది నా గురించి వున్నవీ, లేనివీ చెప్పి, నన్నో రాక్షసిలా చిత్రీకరించి ఆ పిల్ల ఒడిలో ఎంత తేలిగ్గా తల పెట్టుకుని ఏడ్చి, ఆ తర్వాత ఎంత చులాగ్గా కళ్ళు తుడుచుకుని తన అవసరం తీర్చుకున్నాడు? అయినా అంతగా అతనికోసం ప్రాకులాడిన నాలో లేనిది ఏం చూసి ఆ అమ్మాయిని మోహించాడు? కేవలం 'పరాయి' అనే ఆకర్షణ ఒకటేనా? మరి నా బావగారూ అంతేనా...?
నా చెంప ఛెళ్ళున చరిచినట్లయింది.
నిజమే, అందరు మగవాళ్లలోనూ ఈ కోణం దాగి వుంటుంది. అవసరం, అవకాశాన్నిబట్టి అది బయటపడుతుంది. అయితే ప్రతి ఒక్కడూ తన భార్యతో తనకున్న భేదాభిప్రాయాలనే ప్రాతిపదికగా తీసుకుని వేరే స్త్రీతో 'స్నేహం' మొదలుపెడతాడు. తమ ఇళ్ళలో తమ కొంగుచాటున ఏం జరుగుతుందో గమనించుకోని నాలాంటి ఆడవాళ్ళకి ఓదార్పు నందివ్వడంలో బిజీగా వుంటారు. నా క్వాలిఫికేషన్, తెలివితేటలు చూసి నేను గర్వపడడం తల్చుకుంటే నాకే రోత కలిగింది.
నా రిసెర్చి పూర్తవడానికి ఇక ఎక్కువకాలం పట్టదు. చదువులో డాక్టరేట్ సంపాదిస్తున్నానేమో కానీ జీవితంలో మాత్రం ఇంకా ఓనమాల స్టేజిలోనే మిగిలిపోయాను. న రిసెర్చి ఇంకా పూర్తవకుండానే నా జీవితంలో ఎన్నో పుటలు తిరిగిపోయాయి. ఓ అధ్యాయం పూర్తిగా విషాదంగా ముగిసిపోయింది.
ఎక్కడ్నుంచొచ్చాయో కానీ చన్నీళ్ళు నా చెంపల్ని ఓదార్పుగా తడుపుతున్నాయి.
నేనూహించని నిజాలు ఒక్కసారిగా ఎదుర్కోవలసొచ్చేసరికి ఆ సంచలనం నన్ను బాధించిందేమో కానీ, దాన్నించి కోలుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. తేరుకున్నాక నా మనస్సునేదో తెలీని ప్రశాంతత ఆవరించింది. అప్పటివరకూ ఏ మూలో గిల్ట్ అంటూ వుంటే అది పూర్తిగా పోయిన భావన. ఎవరికైనా నా విషయం తెలిస్తే ఆ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలా అనే భయమేదైనా ఇంతకుముందు వుండి వుంటే- అదంతా పోయి ఓరకమైన నిశ్చింత కలిగింది. 'అమ్మయా! నేనొక్కదాన్నే కాదు తప్పు చేసింది' అనే ధైర్యమో, 'నన్నడిగే ధైర్యం ఎవరికీ లేదు' అనే నిర్లక్ష్యమో దానికి కారణం అయి వుండవచ్చు.
నాకు నా భర్తమీద కోపం రాలేదు. అతనికీ, నాకూ పెద్ద తేడా లేదు అనే నిజం నన్నతనికి కాస్త దగ్గర చేసినట్టు అనిపించింది- ఒకే సిద్దాంతం పట్ల ఆకర్షితులైన ఇద్దరు టెర్రరిస్టులు దగ్గరైనట్టుగా!
నా తోడికోడలి చెల్లెలు సూచించినట్లు ఈ ఊర్నిండి మేమిద్దరం దూరంగా ఎటైనా వెళ్ళిపోయి జీవితాన్ని ఫ్రెష్ గా మొదలు పెట్టాలన్న ఆలోచన ఇటీవల బలంగా కలగసాగింది.
జరిగినపోయిన తప్పులని గురించి బలంగా నేనతనితో ఏం చర్చించదల్చుకోలేదు. అది మా జీవితాల్లో గతించిన పీడకలగానో, తిరిగిపోయిన చేదు పుటగానో మర్చిపోవచ్చు.
అయితే ఈ ఊరొదలి వెళ్ళిపోదామన్న విషయం అతనితో ఎలా కదిలించాలో అర్థం కావట్లేదు. 'ఎందుకు' అని అతనడిగితే ఏం కారణం చెప్తే అతను ఒప్పుకుంటాడో నాకు తట్టలేదు. మా మధ్యసరైన కమ్యూనికేషన్ లేక సంవత్సరాలు దాటింది.
నేను నా బావగారితో కలిసి కాలేజీకి వెళ్ళడం మానేశాను. ఎక్స్ స్ట్రా క్లాసుంది అనే నెపంతో ఓ అరగంట ముందుగానే వెళ్ళిపోతున్నాను. ఇదంతా ఆయనమీద నేనేర్పర్చుకున్న ద్వేషంతో కాదు. నాకే ఎందుకో మనుషులకి దూరంగా, ఒంటరిగా బతకాలనుంది. నిజానికి నాకాయన మీద కోపం లేదు. అతను అతి నేర్పుగా మాట్లాడి నన్ను ట్రాప్ చేశాడనే కోపమేదైనా ఇంతకు ముందు వుండుంటే, అది- నా భర్త చేసిన నిర్వాకాన్ని నాకు చెప్పకుండా దాచి, నన్ను బాధకు గురిచేయలేదన్న విషయం తెలియగానే పూర్తిగా పోయింది. ఆయన నన్నొక సమయంలో గాఢంగా ప్రేమించాడన్న విషయం నేను ఒప్పుకుంటాను. అంతే కాదు, కాలంతోపాటు ఆకర్షణ తరిగిపోవడంతో ప్రేమ సాంద్రత తగ్గిపోతుందని కూడా ఒప్పుకుంటాను.
ఓ రోజు సాయంకాలం నేనూ, నా భర్తా మాత్రమే ఇంట్లోవున్నాం. నా కూతురు కూడా తన బామ్మతో కలిసి గుడికి వెళ్ళింది. నిజానికి ఆ ఏర్పాటు నేనే చేశాను. చాలా రోజుల తర్వాత నేను నా భర్తతో పొడిమాటల స్థాయిని దాటదల్చుకున్నాను. గొడవేదైనా జరిగితే అందరి ముందూ జరగడం నా కిష్టంలేదు.
అతను కుర్చీలో వెనక్కువాలి బాల్కనీలో ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. నేను చాలా రోజుల తర్వాత ఇద్దరికీ టీ చేసి కప్పులతో బాల్కనీలోకి నడిచాను.
అతను విస్మయంగా నాకేసి చూశాడు. నేనదేం పట్టించుకోనట్లు కప్పు అతని ముందుంచి 'టీ' అన్నాను. 'థాంక్యూ' అంటూ అందుకుని నిశ్శబ్దంగా తాగేశాడు.
నేనేదో మాట్లాడడానికి వచ్చినట్లు అతనికి అర్థమయిందనుకుంటాను. నేనూ అతన్ని ఎక్కువ సస్పెన్స్ లో వుంచడం ఇష్టం లేక మాటల్ని కూడగట్టుకుంటున్నాను. "ఏమండీ! మీకు ఈ ఊర్నించి ట్రాన్స్ ఫర్ చేయించుకోవడానికి వీలుపడుతుందా?" అనడిగాడు. అది మంచి నాందియో కాదో నాకు తెలీదు.
అతను కాసేపు నిశ్శబ్దంగా వుండి "దేనికి?" అనడిగాడు.
"నా కెందుకో మనిద్దరం పాపతో దూరంగా వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని వుంది..." నేను చెప్తున్న దానికి అతని రియాక్షన్ గమనించడానికి ప్రయత్నించాను. అతని మొహం భావరహితంగా వుంది.
నేను కొనసాగించాను. "ఇంతకాలం తెలిసో, తెలీకో, ఆవేశంలోనో మనిద్దరం బోలెడంత అపార్థాలతో, అశాంతితో బ్రతికాం. పాప పెద్దదవుతూంది. ఇన్ని గొడవల మధ్య దాని మనస్సు కలుషితం చేయడం మంచిది కాదు. అందుకే ఇంతకాలం జరిగినదానికి దోషులెవరు అన్నది మర్చిపోయి పాపకోసమైనా మనిద్దరం సయోధ్యతో బ్రతుకుదాం. ఈ ఊరు వదలడంవల్ల అది సులభమవుతుందని నేననుకుంటూన్నాను".
ఊపిరి పీల్చుకుంటూ ఓ క్షణం ఆగాను. అతనన్నాడు- "నీ కెందుకో మొదట్నుంచీ నన్ను మా వాళ్ళనుంచి దూరం చేయాలనే ఆలోచన?" ఒక్కక్షణం దిమ్మెరపోయాను. అతను నాతో ఏకీభవిస్తాడనో, నేను చెప్పినదానికి ఒప్పుకుంటాడనో నేను ఆశపడలేదు. అయితే ఇలా మాట్లాడతాడని మాత్రం వూహించలేదు. ఇతను అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలేదు- అన్నది అర్థమైంది.
అయినా నేను సహనం కోల్పోదల్చుకోలేదు. అందుకే అన్నాను- "మీరూహిస్తున్నది తప్పు. నేను ఎప్పుడూ చెడు ఉద్దేశంతో మీకు దగ్గరవ్వాలని ప్రయత్నించలేదు. పెళ్ళయిన కొత్తలో మనిద్దరి మధ్యా సదవగాహన ఏర్పడడానికి ఆ మాత్రం ప్రైవసీ అవసరమనుకున్నాను. అయినా ఇప్పుడు అది గతజలసేతుబంధనం. ఆ విషయాలొదిలేసి ప్రస్తుతంలోకి వద్దాం. మీరొప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మనిద్దరిమధ్యా సరైన కమ్యూనికేషన్ లేదు. విడిపోవాలనుకున్న వాళ్ళ సంగతి సరే. కానీ కలిసి వుండాలనుకున్నంతవరకూ అది నిర్మించుకోవడం చాలా అవసరం. మనిద్దరి కోసం కాకపోయినా, కనీసం మన పాప కోసం".
"పాప భవిష్యత్తు కోసమూ లేక అత్తగారి సేవ తప్పుతుందనా?" అతని కంఠంలో తీవ్రమైన వ్యంగ్యం. నేను బిత్తరపోయాను.
తిరిగి అతనే అన్నాడు. "చూడూ, నాకు నా వాళ్ల అండకావాలి. ముఖ్యంగా మా అమ్మని వదిలి నేను రాలేను. ఇంకెప్పుడూ ఇలాటి ప్రపోజల్స్ చేయకు. అంతవరకూ నేనూ నిన్నేం ప్రశ్నలు వేయను. 'కొత్త జీవితం' అన్నావు. పాత జీవితం పట్ల నీ కంప్లయింట్ ఏమిటి? ఏం తక్కువైంది నీకు? కేవలం ఉమ్మడి కుటుంబంలో వుండడమేనా?" అనేసి విసురుగా లేచి వెళ్ళిపోయాడు.
నేనెంతసేపు అచేతనంగా అదే కుర్చీలో కూర్చుండి పోయానో నాకే తెలీదు. మనసులోని నీలినీడలు మొహంపై ప్రతిబింబించి పరిసరాల్లోకి సంధ్య చీకట్లలా వ్యాపిస్తున్నా నేనలాగే నిస్తేజంగా అక్కడే వుండిపోయాను.
20
అన్నయ్య, వదిన స్టేట్స్ నుంచి తిరిగొచ్చారు. "ఏర్ పోర్ట్ కి రావే" అని అమ్మ ఫోన్ చేసి పిలిస్తే వెళ్ళాను.
అందరూ కలుసుకుని ఆనందంతో కళ్ళనీళ్ళ పర్యంతమై పోయారు. అవన్నీ అయిపోయాక కుశక ప్రశ్నలు వేసుకున్నారు. వదిన కొద్దిగా ఒళ్ళుచేసి తెల్లబడి మరింత కళగా వుంది. అన్నయ్య మొదట్నుంచీ అందగాడే. మరింత స్టయిలు వచ్చింది. నేను వాళ్ళనే చూస్తున్నాను. అమ్మా, నాన్న గర్వంగా వాళ్ళను చూసుకుంటూ వుంటే, నాకే మూలో వాళ్ళందరికీ నేను పరాయిదాన్ననే భావం కలిగింది. ఎక్కువగా అక్కడ ఇమడలేకపోయాను. నాలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు కూడా వుందేమో అని అ క్షణం అనిపించింది. వాళ్ళందరూ అంత స్వ...చ్చం...గా వుండడం చూసి నాకు కాస్త ఈర్ష్య అనిపించింది కూడా.
వదిన నాకోసం ఏవేవో కాస్మెటిక్స్, జర్నల్స్, నా కూతురికి బట్టలు, వీడియో గేమ్స్ పట్టుకొచ్చింది. అంత హడావుడిలోనూ తను నాతో పర్సనల్ గా మాట్లాడడం మర్చిపోలేదు.
"నీ జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా నీ కూతురివల్ల" అని అడిగింది. నేను తేలిగ్గా నవ్వడానికి చాలా ప్రయత్నించాను. తనకి అర్థమైందేమో "కాస్త వీలు చూసుకుని మనం మాట్లాడుకుందాం. నువ్వేమీ బెంగ పట్టుకోకు. అన్నీ సర్దుకుంటాయి. నేనూ, మీ అన్నయ్యా వున్నాంగా" అంది ప్రేమగా. ఆ మాత్రం ఆప్యాయతకే నా కళ్ళలో నీళ్లు కదిలాయి. తనకి కనబడకుండా తుడుచుకున్నాను. నాకు వదినతో మాట్లాడే అవకాశం అంత త్వరగా దొరకలేదు కానీ, ఆ మధ్యలో అనూహ్యంగా నా బావగారు నన్ను కలుసుకోవడం జరిగింది.
అతను నా కాలేజీ విజిటర్స్ రూమ్ లో నాకోసం ఎదురు చూస్తున్నాడన్నప్పుడే నాకు అంతులేని చికాకు కలిగింది. వెళ్ళిపొమ్మని చెప్పి పంపేద్దామనిపించింది. కానీ చికాకుని బలవంతంగా అణుచుకుంటూ అతని ముందుకి వచ్చాను.
అతను నాతో అక్కడేం మాట్లాడకుండా 'పద' అని ముందుకి నడిచాడు. నాకతని అధికారానికి ఒళ్ళు మండిపోయినా అక్కడ యాగీ చేస్తే పోయేది నా పరువే కాబట్టి నోరు మెదపకుండా అతన్ని అనుసరించాను. ఫలితంగా నేను అతని గెస్ట్ హౌస్ లో అతని ముందు కూర్చుని వున్నాను. అయితే అదే చివరిసారి అని గట్టిగా చెప్పాలనే నిర్ణయించుకున్నాను.
అతను ఉపోద్ఘాతమేం లేకుండా సూటిగా నా మొహంలోకి చూస్తూ "చెప్పు...ఎందుకలా తప్పించుకు తిరుగుతున్నావ్?" అని అడిగాడు. నాలో ఉవ్వెత్తున ఆవేశం ఎగిసిపడింది. బలవంతంగా అణచుకుంటూ "ఈసారి మీరు చెప్పింది సరిగ్గా అర్థం చేసుకునీ....." అన్నాను.