Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 27


    "రాత్రి పదకొండున్నరకి."

    "ఆలస్యంగా బయలుదేరుతుందా?"

    "అవును."

    వేణు ఫోన్ పెట్టేసి వచ్చి ఆమెకు చెప్పాడు. ఆమె తలూపింది.

    "ఏమయినా సర్దుకోవలసినవి వున్నాయా?" అడిగాడు.

    "ఉహూ. అన్నీ రెడీగానే వున్నాయి."

    అతడు బయటకు వెళ్ళబోయి, ఆగాడు. ఏదో అర్ధంకాని ఫీలింగ్. తలుపుమీద చెయ్యివేసి, "భోజనానికి ఆర్డరివ్వనా?" అన్నాడు.

    ఆమె వాచీ చూసుకుని, "ఇంకా టైముందిగా రెస్టారెంట్ కి వెళదామా?" అంది.

    ఆమె అలా అడగటం చూసి, అతడు విస్మయం చెంది, అయినా దాన్ని ప్రకటించకుండా "అలాగే" అన్నాడు.

    ఇద్దరూ ఐదో అంతస్థుకి వెళ్ళారు. రూఫ్ గార్డెన్ రెస్టారెంటు_ ఇంకా బాగా చీకటి పడలేదు కాబట్టి ఖాళీగా వుంది. ఇద్దరూ ఒక మూలకు వెళ్ళి కూర్చున్నారు. గోడ రెండు అడుగుల ఎత్తుమాత్రమే ఉంది. దానిమీద రంగు రంగుల బల్బులు అమర్చారు. అక్కడ్నుంచి క్రింది నగరం_ నేల మీద నక్షత్రాలు ఆకాశం పరిచినట్లు వుంది.

    అక్కడికి గాలి మరింత బలంగా వీస్తూంది.

    ఆ రాత్రినీ, నిస్సబ్దాన్నీ, గాలినీ ఆస్వాదిస్తున్నట్టు ఆమె చాలాసేపు మౌనంగా వుండిపోయింది. వేణు ఆమెవైపు కన్నార్పకుండా చూసేడు. అదే మొదటిసారి అతడలా చూడటం.

    ఆగి ఆగి వస్తూన్న గాలికి ఆమె ముంగురులు అందంగా కదులుతున్నాయి. కనులు దించుకుని చేతిగోళ్ళవైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూంది ఆమె.

    ఆ నిశ్శబ్దాన్ని భంగపరచాలనిపించింది అతడికి.

    ముందుకి వంగి, "ఏమిటాలోచిస్తున్నారు?" అని అడిగాడు.

    చాలా చిన్న ట్రిక్. ముందుకు వంగటం ద్వారా 'దగ్గిర' అన్న ఫీలింగు కలగచెయ్యటం.

    ఆలోచనలనుండి బలవంతంగా విడివడినట్టు ఆమెలో అస్పష్టమైన కదలిక. సన్నగా నవ్వి, "ఏం ఆలోచిస్తున్నాననుకుంటున్నారు?" అంది.

    ఆ నవ్వుతో ఆమె తనకి మరింత దగ్గరయినట్లు అనిపించింది. ఆ అవకాశాన్ని అతడు వదులుకోదల్చుకోలేదు. మరింత వేగంగా పని కొనసాగిస్తే తప్ప ప్రసాదరావు తనమీద పెట్టిన బాధ్యతని తొందరగా పూర్తిచేయటం కష్టం. ఈ టాపిక్ తీసుకురావటానికి ఇంతకన్నా మంచిముహూర్తం మరొకటి రాదు.

    హుషారుగా అన్నాడు- "అందమైన సాయంత్రం- చల్లటిగాలి.... ఈ టైములో అమ్మాయిలు ఏం ఆలోచిస్తారు?"

    "ఏం ఆలోచిస్తారు?"

    అతడు ఆమెవైపు చూసేడు. ఆ మొహంలో ఏ భావమూలేదు. ఆమె కళ్ళల్లో వున్న కామ్ నెస్ అతడికి కాస్త భయపెట్టినమాట వాస్తవమే. అనవసరంగా తొందరపడి చొరవ తీసుకున్నానా అనుకున్నాడు. తన తప్పేం లేనట్టు, మీరు తెలుగు నవలలు చదవరా ఏం?" అన్నాడు వాతావరణాన్ని తేలిక చెయ్యటానికి ప్రయత్నిస్తున్నట్టు.

    "అప్పుడప్పుడు చదువుతాను. ఏం?"

    "అదీ సంగతి. రెగ్యులర్ గా చదివితే తెలిసి వుండేది."

    "ఏం తెలిసి వుండేది?"

    "మీలాంటి అందమయిన అమ్మాయి ఒక అందమైన సాయంత్రం ఉన్నట్టుండి ఆలోచనల్లోకి జారుకుందీ అంటే దాని కర్ధం ఏమిటో నవలా రచయిత్రులు పలుపలువిధాల వర్ణించారు."

    "అమ్మాయిలేం ఆలోచిస్తారో రచయితలకేం తెలుసు?"

    ఆమె యీ విషయం పట్ల ఇంత ఆసక్తితో- చొరవగా (పైగా నవ్వుతూ) అడగటంతో అతడికి తిరిగి ధైర్యం వచ్చింది. నమ్మకం పెరిగింది.

    "రచయితల సంగతి వదిలెయ్యండి. రచయిత్రులూ ఒకప్పుడు ఆడవా.... ఐ మీన్- అమ్మాయిలేగా. వాళ్ళు ధృవీకరించిన విషయమే ఇది."

    "కొద్దిగా సమయం దొరికితే చాలు- అమ్మాయిలు మాధురోహల్తోనూ అందమయిన ఆలోచన్లతోనూ నిండిపోతారని వాళ్ళుగానీ వ్రాస్తూ వుంటే అంతకన్నా స్టుపిడిటీ ఇంకొకటి వుండదు. బహుశా వాళ్ళు తాము యవ్వన కాలంలో దాన్ని కోల్పోబట్టి వాళ్ళ ఆలోచనలెప్పుడూ దానిచుట్టూ కేంద్రీకృతమై వుండి వుండవచ్చు. ఆ తరంలో వాళ్ళకేముంది? చాలా చిన్న ప్రపంచం వాళ్ళది. అందులోంచి వచ్చిన ప్రేరణకి తమ సెల్ఫ్ అగోనిని కలిపి రంగరించి వ్రాయటం కొనసాగిస్తున్నారు."

    అతడు కాస్త దెబ్బ తిన్నాడు. అయినా తనకి కావల్సిన టాపిక్ గురించి ఆమె మాట్లాడటం సంతోషంగానే వుంది. "అంటే యీ కాలం అమ్మాయిలకి ప్రేమంటేనే తెలీదంటారా?" అని అడిగాడు అమాయకంగా.

    ఆ క్షణం అతడి మొహాన్ని ప్రసాదరావు చూసినా కూడా ఆ అమాయకత్వం నటన అని గ్రహించలేడు.

    ఆమె తల అడ్డంగా వూపి, "తెలీదనను. కానీ వాళ్ళు వ్రాస్తున్నట్టు అబ్బాయిలకీ, అమ్మాయిలకి_ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి అదొక్కటే ఆలోచన అంటే నేనొప్పుకోను. సైన్సు నుంచి ఫిలాసఫీ వరకూ క్రికెట్ నుంచి కామర్సు వరకూ ఏ ఆలోచన అయినా ఇంత ఆనందాన్నీ ఇస్తుంది. జీవితంలో ప్రేమ ఒక భాగమంతే, ప్రేమే జీవితమంతా కాదు. కానీ వీళ్ళు వ్రాస్తున్నదేమిటి? "కాలేజీ అమ్మాయిలోకెల్లా అందమయిన, తెలివైన, హుషారైన అమ్మాయిని హీరోయిన్ గా చిత్రీకరించడం ద్వారా, పాఠకుల్ని ఆ హీరోయిన్ తో సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకునే స్థితికి తీసుకువెళ్తారు. ప్రేమించటం తప్ప ఇంకేం చేయకపోవడంతో- ఆ వయసులో ప్రేమలో పడటం హీరోయిన కుండవలసిన అర్హత అని ఇండైరెక్టు హిప్నాటిక్ సజెషన్ ఇస్తున్నారు. జీవితంలో ఎంతో నేర్చుకుని- ఆలోచన్లని ఎంతో విస్తృత పర్చుకోవలసిన వయసులో జీవితమంతా సంపూర్ణ ప్రేమాయణమనే భ్రాంతి కలుగజేస్తున్నారు" అంది.

    అతడు అప్రతిభుడై ఆమె వంక చూసేడు. ఈ అమ్మాయి, ఇంత లోతుగా ఆలోచిస్తుందని అతడు అనుకోలేదు. ఈ అమ్మాయినేనా డైనింగ్ టేబిల్ దగ్గిర రెక్కపట్టుకుని దగ్గరికి లాక్కొని రోషంగా ముద్దు పెట్టుకోవాలని ప్లాన్ చేసింది? ఈ అమ్మాయినేనా జ్వరం పేరుతో దగ్గరవ్వాలని ఆలోచన చేసింది.

    అతడికి మొట్టమొదటిసారి తాము ఓడిపోతామేమో అన్న భయం కలిగింది. కానీ అంతలోనే ధైర్యం వెన్ను తట్టింది. తనొక్కడేకాదు- తన వెనుక ప్రసాదరావు వున్నాడు. అతడు వెంటనే సర్దుకున్నాడు.

    నవ్వి, "ఏదో టాపిక్ లోంచి మనం ఇంకేదో విషయంలోకి వచ్చాం. ఇంతకీ మీరేం ఆలోచిస్తున్నారో చెప్పనేలేదు?" అన్నాడు.

    "ఎప్పుడు?....ఓ అప్పుడా?"

    "ఆఁ_ అప్పుడే."

    ఆమె ఏం చెప్తుందా- అని అతడు ఊపిరి బిగపట్టేడు. ఎందుకో రాత్రి తనకు అనుకూలిస్తుందని అనిపిస్తూంది. అనుకోకుండా జరుగుతున్న ఒక్కో సంఘటనే, తన ప్రయత్నం లేకుండానే ఆమెని తనకి దగ్గిర చేస్తూంది. థాంక్ గాడ్!

    "మళ్ళీ ఏమిటి ఆలోచిస్తున్నారు? అంత చెప్పకూడనిదా? పోనీ అంత రహస్యమయితే వద్దులెండి." ఓరగా చూస్తూ అన్నాడు- ఓ రహస్యం పంచుకున్నట్టు.

    "అబ్బెబ్బె! అటువంటిదేమీలేదు."

    "మరి?"

    "మీరన్నట్టూ చల్లటిగాలి అందమైన సాయంత్రం....కానీ చూడండీ! మన చుట్టూ వాతావరణానికీ, మన ఆలోచనలకీ ఏ సంబంధమూ వుండదు ఒక్కోసారి. నేను నిజంగా అప్పుడు ఆలోచించింది దేనిగురించో తెలుసా?"

    "అదేగా చెప్పమంటున్నాను?" ముందుకు వంగి అన్నాడు.

    అలా వంగటంలో ఆమె మెడమీద నుంచి వచ్చే గాలి తాలూకు పౌడరు పరిమళం అతడిని చుట్టుముట్టింది.

    టేబిల్ మీద పడిన నీటి చుక్కని చూపుడువేలుతో గీతగా గీస్తూ ఆమె అంది- "నేను ఆలోచించింది మా అమ్మ గురించి."

    అప్పటివరకూ నిశ్చలంగా వున్న నీటిమీద నుంచి రెక్కలు టపటపా కొట్టుకుంటూ కొంగలన్నీ ఒక్కసారిగా లేచి చెల్లాచెదరైనట్టు- లాగి సంధించిన వింటినుంచీ బాణం వెలువడినప్పుడు కలిగే ఝంకార శబ్దం మనసుని కదిలించినట్టు గగుర్పాటు. అతడిని చలింపచేసే ఆలోచన అమ్మ తాలూకు జ్ఞాపకం ఒక్కటే.

    "మీకూ అమ్మలేదు కదూ?"

    "అవును."

    "నాక్కూడా."

    ఇద్దరూ మాట్లాడుకోలేదు. మనసు అర్ధమయినప్పుడు మౌనమే మాట్లాడుతూంది. నీటిచుక్కలో మెరుస్తూన్న లైట్ల వెలుగుకేసి, చుక్కల్ని గీతలు చేస్తూ కదిలే ఆమె వేళ్ళ కేసి చూస్తూ వుండిపోయాడు.

    దూరంగా స్పీకర్ లోంచి పాట.

    चलो एक बार फ़िरसे
    अजनबी बन जाये हम दोनो_ 
  

    "చాలా మంచి పాట కదూ?" అన్నాడు.

    "నాకు హిందీ సరిగ్గా రాదు" అంది.

    "మనిద్దరం ఒకసారిగా అపరిచితులమయిపోయి తిరిగి కొత్తగా స్నేహం మొదలుపెడితే ఎంత బావుణ్ణు! .... అనే అర్ధం. చలో ఏక్ బార్ ఫిర్ సె అజ్ నబీ బన్ జాయె హమ్ దోనో.... నాకు అన్వయించే పాట."

    "మీకా?"

    "మనకి."

    "ఏమిటీ?"

    అతడికి తన తప్పు అర్ధమయింది. నోరు జారేనని తెలిసింది. వెంటనే సర్దుకుని "మనిషికి ప్రేమ గురించీ. మిగతా ప్రపంచంలో బాంధవ్యం గురించీ అర్ధమయ్యేటట్లు చెప్పేది చిన్నతనంలో తల్లేకదూ! ఆమె లేకపోతే మిగతా జీవితమంతా ఆ వాక్యుమ్ వెంటాడుతూనే వుంటుంది" అన్నాడు.

    ఆమె విషాదంగా నవ్వి, "ఆ విషయంలో మనిద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాంగా!" అని చాలాసేపు మౌనంగా వూరుకుని సన్నటి స్వరంతో_ "వేణూ!" అంది.

    "ఊఁ!"

    "ఒక్కోసారి నాకు చాలా ఒంటరిగా, ఎవరూ లేనట్టు అనిపిస్తుంది. నీకూ అలాగే అనిపిస్తుందా?"

    మరీ చిన్నపిల్లలా ఆమె అడిగిన ఆ ప్రశ్నకి అతడికి నవ్వురాలేదు. కళ్ళెత్తి ఆమెవైపు చూసేడు. గుండె లోతునుంచి ఎక్కణ్ణుంచో 'ఊఁ' అన్న అస్పష్టమైన మాట బయటికి వెలువడింది.

    ఆమె అంది_ "ఈ మధ్య నాకా భావం మరీ ఎక్కువైంది వేణూ! అందరూ నన్ను మోసం చేస్తున్నారన్న భావం...."

    అతడు ఉలిక్కిపడ్డాడు. కానీ అంతలోనే సర్దుకున్నాడు. బహుశ రాత్రి జరిగిన సంఘటనతో ప్రసాద్ గురించి ఆమె అలా వుండి వుండవచ్చు.

    "అలా అనకండి. కళ్ళు తెరచి చూస్తే ప్రపంచం అంతా స్నేహమయంగానే కనిపిస్తుంది అన్నాడు ఓ కవి...."

    "నిజమా?"

    "నిజం!"

    ఆమె వెంటనే మాట్లాడలేదు. కాస్త తటపటాయింపు. ఏదో చెప్పాలన్న తపన.... లోపల్నుంచి బయటికి రాలేదని భావం. సందిగ్ధత__ఆపుకోలేని ఉద్విగ్నత. "నాకు....నాకు కొద్దిగా స్నేహం కావాలి వేణూ!" ఒక అనూహ్యమైన విషయాన్ని వింటూన్నట్టు_అతడు చప్పున తలెత్తి చూసేడు.

    ఆమె కళ్ళు దించుకోలేదు. ఆ కళ్ళల్లో సిగ్గుకూడా ఏమీలేదు. ఒక చిన్నపిల్ల తాలూకు నిష్కలమైన స్నేహపు భావం వుంది. అతడు వెంటనే జవాబు చెప్పకపోయేసరికి ఆమె నొచ్చుకుంటూ "చొరవ తీసుకుంటే సారీ! ఐ వాజ్ బాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ దట్" అంది.

 Previous Page Next Page