Home » D kameshwari » Geethopadesam

   
    గుంపు చెదరగానే గుడిసెముందు అప్పుడే ఇంట్లోంచి శవం వెళ్లినట్టు దిగులుగా, దీనంగా కూర్చున్న పెంటయ్యని చూసి చరచర అటు నడిచాడు గవర్రాజు సిబ్బందితో. "ఎవడ్రా మా పోలీసోళ్లు నీ పెళ్లాన్ని అట్టుకెళ్లారని చెప్పినవాళ్లు? ఎదవనాయాళ్లు! మీకేం పనిపాట లేక మా పనులు సెడగొడతారు. ఎవర్రా? ఆళ్లని రమ్మను. ఇదిగో మా జవాన్లని యీడ్చుకొచ్చాను. సూపమనరా ఇందులో ఎవరో? ప్రతివోడికీ పోలీసోడు లోకువయిపోనాడు. పోలీసోడు వూ అంటే తప్పు, ఆ అంటే తప్పు. డ్యూటీ చేస్తే తప్పు, సేయకపోతే తప్పు. డ్యూటీ సేసి యెవడికన్నా పనిష్ మెంటిస్తే యెందుకిచ్చావంటాడు? పైవోడు గమ్మునూరుకుంటే యెందుకూరుకున్నావంటాడు? ఎవడో కాకీ డ్రస్సేసుకు వస్తే ఆడు పోలీసోడే, కాకీ డ్రస్సేసుకొచ్చిన ప్రతి అణాకాని ఎదవా పోలీసోడే! నీ పెళ్లాం మీద మోజున్న ఏ రవుడీ ఎదవలో పోలీసు డ్రస్సేసుకు వస్తే ఎవరూ ఏటీ అనరని తొడుక్కుని వచ్చుంటారు. రాత్రంతా దాంతో పడుకుని వుంటారు. మీ మాటలు నమ్మి మా యిన్ స్పెక్టరికి కంప్లెయింట్ చేశా. ఆయన నామీద ఫైరయిపోయి ఎవరు సూశారో ఆలనట్టుకు పోలీసు స్టేషన్ కీడ్చుకురా. ఆల్లే అబద్ధం ఆడారో, యీ ఎదవలే సేశారో తేలుస్తా అని సిందులు తొక్కాడు. ఇదిగో యీల్లనట్టుకు వచ్చా. సెప్పండి యీలలో ఎవరో? అబద్ధాలాడితే డొక్క చీరేస్తా. సరిగా సూసి సెప్పండి. అబద్ధం సాచ్యానికి ఆర్నెల్లు జైలు శిచ్చ. సూసినవాళ్లు నాతో పోలీసు స్టేషన్ కి రండి. ఊ రండి. ముందుకొచ్చి ఈ నలుగురిలో ఆ ఇద్దరున్నారేమో సూసి సెప్పండి."
    వస్తూనే గవర్రాజు చూపించిన 'కానిస్టేబుల్ ధాటి'కి అక్కడ గుమిగూడిన అంతా మొహాలు చూసుకున్నారు. గుసగుసలాడడానికి కూడా భయపడి గమ్మున వూరుకున్నారు.
    "ఏరా! నీ పెళ్లాం ఇంటికొచ్చిందా? దాన్ని పిలు."
    జరగాల్సిన అన్యాయం జరగనే జరిగింది. కానిస్టేబుల్ వచ్చినా, క్యాబినెట్ మినిష్టర్ వచ్చినా ఒరిగేదేం వుంది అన్నట్లు నిర్లిప్తంగా జరుగుతున్నది ఏదో వింతలా చూస్తూ కూర్చున్నాడు పెంటయ్య.
    "ఏరా! మాట్లాడవేం? నీ ఆడదింటికి వచ్చిందా?"
    'వచ్చింది బాబూ! వచ్చింది. చక్కని చుక్కలా వెళ్లిన చుక్కి చింపిన విస్తరిలా వచ్చింది బాబూ!' అని అనాలనుకున్నాడు పెంటయ్య. కానిస్టేబుల్ ని, ఆ చేతిలో లాఠీని చూసి అనలేక తలాడించాడు.
    "నే చెప్పలేదురా, ఎటో వెళ్లిందదే వస్తుందిలే అని..."
    "లేదు బాబూ! అది రాలేదు. స్కూల్లో కట్టిపడేస్తే తెచ్చాం బాబూ! కానిస్టేబుల్ బాబూ! దాని బతుకన్యాయం సేశారు. ఎవరు సేశారో దేముడికెరిక. అది మాట పలుకు లేకుండా కూకుండిపోయింది. న్యాయం చెయ్యండి దొరా!" ఒక ముసలాడు ముందుకు వచ్చి అన్నాడు.
    "న్యాయం సేయాలంటే సాచ్చికం వుండాలి. సాచ్చెం చూపండిరా. ఈళ్లే సేశారని యెవరొచ్చి చెప్తారో చెప్పండిరా."
    అంతా మొహాలు చూసుకున్నారు తప్ప ముందుకు రాలేదు. పెంటయ్య ఉలుకు పలుకు లేకుండా నిల్చున్న అందరినీ చూశాడు. "నూకాలప్పా! మాలచ్చిమ్మ! నిన్న సూశాం అన్నారు గందా ఈళ్లల్లో ఎవరో సెప్పండే..." అన్నాడు దీనంగా.
    నూకాలు, మాలచ్చిమి బెదురుగా పోలీసులని చూశారు. వాళ్ల మొహాలు వాళ్లు చూసుకున్నారు. "ఏటో... ఎవరో మాకేటెరిక. సందెకాడ వచ్చినారు. పోలీసులని చూశాంగాని మొకాలు మాకేటి గుర్తు?" నసిగింది నూకాలు.
    పోలీసులు స్టేషన్ కెళ్లి చెప్పాలి అనగానే బెదిరిపోయారు వాళ్లు. గవర్రాజు మహా ఉదారంగా నలుగురిని తీసికెళ్లి వాళ్లముందు నిలబెట్టాడు. "సూడండి, యీడా... వాడా... ఎవరో సరిగ్గా చూడండి" నలుగురినీ చూపిస్తుంటే యిద్దరూ నలుగురిని చూసి అవునంటూ తల ఊపారు. కాసేపు కాదంటూ తలలూపారు.
    "ఈల్ల సాచ్చికాలట్టుకుని కోర్టుకెక్కితే అయినట్టే! గంగిరెద్దుల్లా తలలూపుతున్నారు. అవునా అంటే తల వూపుతున్నారు. పొండెహెస్... మాకేటి పని పాట నేదనుకున్నారేంటి? పెంటయ్యా! నీ పెళ్లాం నీ యింటికొచ్చింది. సాచ్చికం లేందే కేసెట్టడానికవదు. ఈల్లే సేశారని సాచ్చికం సూపిస్తే చెప్పు. ఇన్ స్పెక్టరు బాబుకాడ కంప్లైంట్ రాసిద్దువుగాని" చాలా నెమ్మదిగా, సౌమ్యంగా అన్నాడు.
    పెంటయ్య వెర్రిమొహం పెట్టి చూశాడు. తర్వాత అదోలా నవ్వాడు. చేతులెత్తి కనిపించని దేముడకి దండం పెట్టాడు. "బాబూ! కనిపెట్టి సూడాల్సిన ఆ భగమంతుడే కనుసాటు చేశాడు. ఇంక మీరేటి సేస్తారు? న్యాయ, అన్నాయం సూడాల్సిన ఆ భగమంతుడే వల్లకున్నాడు. ఇంక కోర్టులో కేసులు ఎట్టడానికి నాకెవరున్నారు బాబూ! నిజం సెప్పాల్సిన సుక్కి నోరు ఆ దేవుడే మూయించి సేసినోల్లపచ్చం అయిపోనాడు. సాచ్చికాలు సెప్పాల్సినోళ్లు నాయానికి, నిజానికి భయపడి మాట తప్పించినారు. వదిలేయి బాబూ! మమ్మల్నిట్టా వదిలేయి బాబూ! ఎల్లండి బాబూ ఎల్లండి" చేతులెత్తి నుదుట తాటించి ఎవరో తరుముకొస్తున్నట్టు లోపలికెళ్లిపోయాడు పెంటయ్య.
    గవర్రాజు విజయగర్వంతో చుట్టూ చూశాడు. ఇంకెవరన్నా నోరెత్తడానికి మిగిలారా? ఎవరొస్తార్రా ముందుకు డొక్క చీలుస్తా అన్నట్టు గుంపుని చూశాడు. అంతా వెనక్కడుగులేశారు. గజరాజులా గవర్రాజు ముందడుగు వేసి కదిలాడు.

                                                 *  *  *

    నాటకం అయిపోగానే బట్టలిప్పేసి వేషాలు తీసేసినట్లుగా.. పోలీసు స్టేషన్ కి రాంగానే నలుగురూ కాకీబట్టలిప్పేసి, ఎర్రటోపీలు తీసి పారేశారు. అప్పలకొండ చేసిన తప్పు కడుక్కున్నట్టుగా వాళ్లకి తలో ఐదు చేతిలో పెట్టి పంపాడు. లుంగీలతో, అండర్ వేర్లతో వున్న ఆ నలుగురు మళ్లీ తమ డ్రస్సులు తొడిగేసుకున్నారు.
    గుర్తడితే - ఎదవల్లారా మీ సాచ్చికం యిదా? మీరేటంటారోనని యీదిన పోయే నల్గురికి డ్రస్సేసి తీసుకొచ్చాను. ఎదవలారా! కాకీ డ్రస్సేసుకున్న ప్రతివోడు పోలీసోడు కాదురా! ఎవర్ని సూసి మా వోల్లంటార్రా? తప్పుడు సాచ్చికం చెప్పినందుకు పదండి పోలీసు స్టేషన్ కి అని దబాయించాలని, గుర్తట్టకపోతే నాలుగు తిట్టి బెదిరించి వచ్చేయాలని - గవర్రాజు పెద్ద బుర్రకి తట్టిన పెద్ద ఆలోచన.
    "వెధవల్లారా, ఆల్లు పల్లెటూరోళ్లు, సదూకోనోళ్లు అని బతికిపోనారు. నేకపోతే మీ ఉద్యోగాలూడి జైల్లో కూకునేవారు" గజేంద్రుడు ప్రార్థించగానే వెళ్లి సహాయం చేసి వచ్చిన విష్ణుమూర్తిలా బెంచీమీద తలకింద చెయ్యి పెట్టి శేషశాయి పోజులో పడుకున్న గవర్రాజు గర్వంగా అన్నాడు. నిజమే! ఆపద్భాంధవుడివి, అనాధరక్షకుడివి అన్నట్టు అప్పలకొండ వినయంగా ఐదుమైళ్లు నడిచి వచ్చిన గవర్రాజు కాళ్లు వత్తాడు.
    గవర్రాజు 'కంచె'ని రక్షించుకున్నాడు. రక్షించాల్సిన 'చేను' మాట మరిచిపోయి. 'చేనే' లేనపుడు 'కంచెం'దుకు అన్నది గవర్రాజు బుర్రకి తట్టదు. ఆ బుర్ర పెద్దదయినా బుద్ధి పెద్దదిగాదు మరి!

                                                                             (ఆంధ్రజ్యోతి వారపత్రిక, 70-80ల మధ్య)

                                                                                *  *  *  *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra