Previous Page Next Page 
మహిమ పేజి 26


    "పాపం... ఇలా ఎన్నాళ్లు గడుపుతుంది డబ్బు లేకుండా..."
    "ఏడాదిగా ఆమె తాగుడు, తిండికి ఆమె సంపాదించుకున్న కొన్ని లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ఇప్పుడు ఆమె దగ్గర చిల్లిగవ్వలేదు. చివరికి మాకు నెలకి ఇవ్వడానికి కూడా డబ్బు లేకపోయినా మేం భరించాం కొన్నాళ్లు. కానీ ఎవరైనా ఎన్నాళ్ళని పెట్టగలరు? ఏమైనా ఎన్నాళ్ళని అలా పెట్టగలం? అందుకే ముఖ్యంగా తనని తాగుడు మాన్పించి దారిలో పెట్టాలని అందరం కలిసి నిర్ణయించాం".
    "ఏం చేశారు?" కుతూహలంగా అడిగింది మహిమ.
    "ఒకరోజు అందరం కూర్చుని గట్టిగా చివాట్లు పెట్టి, ఇలా పనీపాటా లేకుండా తాగి పడుకుంటే మాకేం అవసరం లేదు నీకు తిండిపెట్టడానికి" అని చాలా కఠినంగా హెచ్చరించాం. 'ఇంక ఏడుపు, విషాదపర్వం నుంచి లేచి పని మొదలుపెట్టు. లేకపోతే నీ దారి నువ్వు చూసుకో' అని చెప్పాం.
    "నేనేం చేస్తాను, నాకెవరిస్తారు ఉద్యోగం..." అంది దీనంగా.
    'ముందా తాగుడు మాని, మామూలుగా తయారయి నాలుగు ఆఫీసులు తిరుగు... ఏ పని దొరికితే అది చెయ్యి. ఎక్స్ ట్రా వేషాలైనా వేసుకో. నీకు కావల్సింది డబ్బు. ప్రకటనల ఉద్యోగం కాకపోతే ఏదయినా కంపెనీలో చిన్న ఉద్యోగం అన్నా వెతుక్కో. ముందు మామూలుగా మునుపటిలా తయారవ్వు. నీకు అందం ఉంది. టాలెంట్ ఉంది. ఎవరో ఒకరు ముందుకు రావచ్చు. డబ్బుకి బేరాలాడకుండా ఎంతిస్తే అంత తీసుకో. నెలరోజులు చూస్తాం, లేకపోతే నీ పెట్టె బయటపారేస్తాం' అని బెదిరించాం.
    'నాకెవరిస్తారు ఉద్యోగం? ఇంత జరిగాక నాకు యాడ్ వరల్డ్ లో ఛాన్సులెలా వస్తాయి?' దిగులుగా అంది ప్రీతి. 'ఇంట్లో కూర్చుంటే అవకాశాలు వెతుక్కుంటూ రావు. నువ్వే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి' అని ప్రోత్సహించాం. బెదిరించాం. మొత్తానికి ఇంట్లోంచి పొమ్మంటామన్న భయంతో ఉదయమే లేచేది. వాక్, యోగా చేయడం మొదలెట్టింది. మొహం కాస్త తేటపడింది. నాలుగైదు తెలిసిన కంపెనీలు తిరిగివచ్చింది. ఏదైనా అవకాశముంటే పిలుస్తాం అన్నారట. కాస్త దారిలో పడింది. వినోద్ మీద కక్షతో రగిలిపోతోంది. మనసులోంచి ముందు ఆ భావన తీస్తే తొందరగా మనిషి తేరుకుంటుంది అని, విన్న సంగతిని ఆమెకు చెప్పాం. వినోద్ పాత్ర ఏమీలేదని విన్న ప్రీతి... "నిజంగానా... నిజమేనా..." అని తిరిగి నిజమే అయి ఉండచ్చు. నాకు తెలిసిన వినోద్ అంత నీచంగా ప్రవర్తించలేడు. ఇంత క్రూరంగా నామీద ప్రతీకారం తీర్చుకోడు..." అంది మనసు కాస్త తేటపడినట్లు.
    తర్వాత నెల, రెండు నెలలకి ఒకటి రెండు చిన్నచిన్న ప్రకటనల కోసం, రైవల్ కంపెనీవాళ్లు ప్రీతిని పిలిచారు. వాళ్లకి జైన్ కంపెనీతో ఎప్పుడూ పోటీయే. ప్రీతి చేసిన ప్రకటనల పొటెన్సీ వాళ్లకు తెలుసు. ప్రీతిని తమవైపు తిప్పుకోవాలన్న అప్పటి ప్రయత్నాలు సాగలేదు. ఇప్పుడు తనంతట తాను వచ్చింది. కాకపోతే ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో లేదు. చవకలో కొట్టేయచ్చు. వాళ్ల ఆలోచనలవి. ఏదో ఒకటి ప్రీతి కాస్త దారిలో పడింది. చేతిలో డబ్బు ఉన్నరోజు, చిన్న రమ్ బాటిల్ కొనుక్కుని వచ్చేది. ఉన్న అలవాటుని ఒకేసారి మానడం కష్టమవుతుందని మేం కూడా చూసీ చూడనట్టు ఊరుకునేవాళ్ళం. ఇదీ ప్రీతి కథ. మన ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు పాఠాలు చెపుతుంది అందరికీ" సీమ ముగించి, తలగడలు సర్దుకుని, గుడ్ నైట్ చెప్పేసి పడుకుంది.
    కానీ మహిమకి చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు.

                                      *  *  *  *

    మహిమ పనిలో చేరి నెలరోజులయింది. ఆఫీసు వాతావరణం అలవాటయింది. అక్కడి పనితీరు కూడా తెలిసింది. ఇచ్చిన ప్రకటనలకి భావయుక్తమైన, క్రిస్పీ, స్పార్క్ ఉండేలా తయారుచేసే మహిమ కాప్షన్స్, విశాల్ కి బాగా నచ్చేవి. ఆమెలో భావుకత, అది మాటల్లో చెప్పగలిగే నైపుణ్యం - ఆ యాడ్స్ ప్రేక్షకులను, పాఠకులను ఆకట్టుకుంటున్నట్టు రిపోర్ట్స్ రావడం కంపెనీకి అస్సెట్ అయింది. మహిమకి ఏదన్నా పని ఇస్తే అది పూర్తి చేసేవరకు ఆలోచనలను చెదరనీయని ఏకాగ్రత, పట్టుదల మీనన్ కీ అర్థమైంది. ఒకసారి విశాల్ దగ్గర ఆ ప్రసక్తి తెచ్చాడు. విశాల్ కూడా అంగీకరిస్తున్నట్టు తల ఊపాడు. ఈ మధ్య ఒకటి రెండు కొత్త ప్రకటనలకి ఆమె ఇచ్చిన కాప్షన్స్ వెరైటీగా ఆకట్టుకునేటట్టున్నాయి.
    "గులాబీలాంటి సౌకుమార్యం మీ సొంతం చేసుకోవాలంటే మీ కలని కలలా మిగలనివ్వద్దు. రోజూ సబ్బుతో మీ కల నిజం చేసుకోండి."
    "నోరు తెరిస్తే ముత్యాలు రాలుతాయేమో అనుకోవాలి, పళ్లు కాదు అందానికి భరోసా ఇచ్చే మా పౌడరు".
    "మీ ఆరోగ్యం మాకు మహాభాగ్యం... 'మా మూలికా లేహ్యం' మీ ఆయుష్షుకి గ్యారెంటీ ఇస్తుంది" లాంటివి కొత్తగా ఉండి, ప్రకటనలను ఇచ్చే కస్టమర్లను కూడా ఆకట్టుకున్నాయి. కస్టమర్లనే కాదు, చదివిన అందరినీ...
    విశాల్ ఆ రోజు ఇంట్లో ఉదయం కాఫీ తాగుతూ, మహిమ రాసిన ఓ కాప్షన్ గురించి చెప్తూ, అదే మాట అన్నాడు. "డాడీ! మహిమ కాప్షన్స్ కొత్తరకంగా ప్రెజెంట్ చేస్తోంది. చూశారా?" అన్నాడు పేపర్లో వచ్చిన ప్రకటన చూపిస్తూ.
    అవినాష్ తల ఊపాడు. "అవును ఇంటర్వ్యూలోనే అనిపించింది పొటెన్సీ ఉన్న కాండిడేట్ అని" అన్నాడు అవినాష్.
    "ఈ అమ్మాయికి క్రియేటివ్ సైడ్ కాక, విజువల్స్ సైడ్ కూడా... అంటే కెమెరా యాంగిల్స్, ప్లేస్ మెంట్, షాట్ డివిజన్ వగైరాల మీద కూడా నాలెడ్జ్ ఉంది.

 Previous Page Next Page