Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 26


    సంగతి తెలుసుకుని మొద్దుబారినట్లు అయిపోయాడు రవి. అతడి బుర్రకి ఆలోచించే శక్తి నశించిపోయింది కొన్ని క్షణాలు.
    మేడలూ, మిద్దెలూ వుండి, సిరిసంపదలతో తూలతూగుతున్న వాళ్ళు, రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదల కష్టార్జితంలకిలా ఎగబడగలరో రవి ఊహకందేది కాదు. కథలలో ఇలాంటివి చదివినప్పుడు వీళ్ళు మరీ ఎగ్జాగరేట్ చేస్తున్నారు అనుకునేవాడు. ఆ మాటే ఒక ఫ్రెండ్ తో అంటే అతడిలా చెప్పాడు.
    "మైడియర్ బ్రదర్! నీకు విషయం సరిగా అర్థం కాలేదు. ఒక కూలివాడి చేతిలో ఒక అయిదు రూపాయల నోటుకి ఎలా ఆశ పడతారా అని ఆలోచిస్తున్నావు నువ్వు. కాని ఇక్కడున్నది వందల, వేల సంఖ్యలో కూలీలు ఎగబడుతున్నది. వేల! లక్షల రూపాయలకీ ఒక్కసారిగా అయిదు వేల రూపాయలు కళ్ళబడితే నువ్వూ వదులుకోలేవు."
    అప్పుడర్థమయింది రవికి "అదనపు విలువ" సిద్దాంతం.
    ముసలమ్మ ఏడుపు రవిని ఈ లోకంలోకి తెచ్చింది "ఏడవకు మామ్మా! నేను సుబ్బయ్యతో మాట్లాడతాను. మీ వాళ్ళందరినీ విడిపిస్తాను" అన్నాడు.
    ముసలమ్మ ఏడుపు కూడా మరిచిపోయి విచిత్రంగా చూసింది. ఇప్పటివరకు ఆమెకి "ఏయ్! ముసలిదానా!" అనే నిరసనతో కూడిన ఆజ్ఞాపూర్వకమైన సంబోధన మాత్రమే అలవాటు.
    ఈ చదువుకున్న నాగరిక యువకుడు తనను ఆప్యాయంగా "మామ్మా!" అని పిలుస్తున్నాడు. రవి మాటలతో గిరిజనులందరి మనసులూ స్థిమితపడ్డాయి.
    సామాన్య జనంలో విశ్వాసాలు ఎలా ఏర్పడతాయో చెప్పటం కష్టం. సాధారణంగా గిరిజనులు నాగరికులను నమ్మరు. కానీ జాతర రోజు పిల్లాడిని భుజాన వేసుకుని వెళ్ళిన రవిని అతడిని ఆరోగ్యవంతుడుగా తిరిగి తెచ్చిన రవిని వాళ్ళు పూర్తిగా నమ్మేశారు. తమ కష్టాలు గట్టెక్కించే అవతార పురుషుడిగా రవిని ఆరాధించటానికి అప్పటికే సిద్ధపడుతున్నాయి వాళ్ళ మనసులు.
    రవి సుబ్బయ్య ఇల్లెక్కడుందాని అడిగి తెలుసుకున్నాడు. అది లచ్చింబోడులో ఉంది. డాబా యిల్లు, సహకార సంఘాలు ప్రారంభించాక కొత్తగా కట్టుకున్న ఇల్లు.
    రవి సుబ్బయ్య ఇంటికి బయలుదేరబోతుంటే గిరిజన స్త్రీలు కూడా అతడివెంట రాబోయారు. వాళ్ళని రావొద్దని తనొక్కడే బయలుదేరాడు రవి.
    వాళ్ళు కూడా వస్తే సుబ్బయ్య దీనిని ప్రిస్టేజ్ ఇష్యూ కింద తీసుకోవచ్చు. అప్పుడు తన పని మరింత క్లిష్టమవుతుంది.
    తలుపు కొట్టగానే సుబ్బయ్య తలుపు తియ్యలేదు. తలుపు పక్కనున్న చిన్న సందులోంచి తొంగిచూసి తలుపు తీశాడు. చాలా జాగ్రత్తగల మనిషి. బహుశా ఎవర్నీ నమ్మని మనస్తత్వం కావచ్చు. "తానెంతో జగమంత" అన్న సామెత ఉందికదా. తను కుటిలుడు గనక ఎదుటి వ్యక్తులలోను కౌటిల్యమే ఉంటుందనుకుంటాడు.
    సుబ్బయ్య శివయ్యలాగ పంచె కట్టుకోలేడు. ప్యాంటు, బుష్ షర్టుతో నాగరికంగా ఉన్నాడు. టౌన్ లోనూ, సిటీస్ లోనూ, ఆఫీసుల చుట్టూ తిరిగే "వ్యాపారం" కదా ఇతనిది.
    "రండి! రండి! కూర్చోండి" అని అతి గౌరవంగా ఆహ్వానించాడు సుబ్బయ్య. సుబ్బయ్య ఎవరో రవికి తెలియకపోయినా రవి ఎవరో సుబ్బయ్యకి తెలుసు. అతడెప్పటికప్పుడు అందరిగురించీ అన్ని వివరాలూ సేకరించి ఉంచుకుంటాడు.
    "ఏమిటి ఇట్లా దయచేశారు? ఒంటరిగా వచ్చారు. విష్ణుగారు రాలేదా? కాఫీ పుచ్చుకుంటారా?"
    శివయ్యని మించిన వినయంతో అడిగాడు సుబ్బయ్య. ఈ ప్రశ్నలతో అతడికి తనను గురించీ, విష్ణు గురించీ వివరాలన్నీ తెల్సిపోయాయని అర్థమయింది రవికి. ఇతడు తనకు చూపిస్తున్న గౌరవమంతా విష్ణుకున్న పలుకుబడి తెలుసుకోవటం వల్ల కలిగింది.
    "నాకు కాఫీ వద్దు. కానీ మీరు అరెస్ట్ చేయించిన గిరిజనులను విడిపించండి. వాళ్ళలో ఒక వయసులో ఉన్న ఆడపిల్ల ఉంది. మీకు తెలుసు" ఏ ఉపోద్ఘాతమూ లేకుండా అన్నాడు రవి.
    గతుక్కుమన్నాడు సుబ్బయ్య. అతడి ముఖ భంగిమలు మారిపోయాయి. అతడి ముఖం చూస్తోంటే బురద గొడ్డులాంటి పాము గుర్తొస్తుంది. కళ్ళలో కల్మషం, నాలుక మాటిమాటికీ బయటికి తీసి పెదవులు తడుపుకుంటూ ఉంటాడు. పాముకి లాగానే!
    "మీకు తెలీదండి రవిగారూ! వాళ్ళని అణిచి వుంచితేనే మనుష్యులు లేకపోతే భయం భక్తీ లేకుండా పెట్రేగిపోతారు. నా ఇంటిమీదకి కర్రలతో వచ్చిపడ్డారు. ఆ వెర్రి ఆవేశంతో నా బుర్ర పగలకొట్టినా కొడతారు తాగుబోతులు. బొత్తిగా మంచి చెడు తెలీదు. వీళ్ళ కోసం నా పనులన్నీ మానుకుని వీళ్ళకి ఇళ్ళు కట్టుకోటానికీ, గేదెలూ, కోళ్లూ కొనుక్కోటానికీ, పొలాల్లో బావులు తవ్వించుకోటానికీ, అప్పులిప్పించటానికి ఆఫీసుల చుట్టూ చెడ తిరిగాను.
    నా ప్రయాణం ఖర్చులైనా తీసుకోలేదు. ఆఫీసుల్లో మాత్రం ఫ్యూన్ మొదలుకొని, మేనేజర్ వరకూ అందరికీ తినిపించాలి. మీకు తెలీనిదేముందీ? అందుకు మాత్రం తీసుకున్నాను. నా జేబులో డబ్బులెలా ఖర్చుపెట్టనూ? నా దగ్గిర మాత్రం ఏముందీ? వీళ్ళ కోసం నా టైమంతా పాడుచేసుకుని తిరిగినందుకు నాకు దక్కిన ప్రతిఫలం ఇదీ? అందరికీ ఒకేసారి అప్పులు శాంక్షన్ కావాలంటే ఎలా అవుతాయి చెప్పండీ?"
    'సంఘసేవ' ఎక్కడ విన్నా ఇదేమాట. ఇంతమంది ఇలాంటి సంఘసేవకులుండబట్టే సంఘం ఇలా తగలబడిపోతోంది. అయినా ఆ సమయంలో సుబ్బయ్యతో వాదించకూడదని రవికి తెలుసు. తన పని సాధించుకోవాలి.
    "నిజమేనండీ! గిరిజనులకి పోలీసులంటే చాలా భయం. ఒకసారి అరెస్ట్ చేయించారు గనుక ఇకముందు ఇలాంటి సాహసాలు చెయ్యరు, విడిపించెయ్యండి"
    సుబ్బయ్య లొంగలేదు, మొండిఘటం.
    "పోలీసులకి రిపోర్ట్ ఇచ్చేవరకే మన చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు చూసుకుంటారు. మన మాట వినరు. మీకు తెలీనిదేముందీ?"
    కాలం గడుస్తున్న కొద్దీ రవిలో ఆందోళన ఎక్కువ కాసాగింది. ఒక ఉపాయం స్ఫురించింది.
    "చూడండి. మీకు అన్నీ తెలుసు? నాకూ అన్నీ తెలుసు. మీరు నా మాట విని మర్యాదగా వాళ్ళని పోలీస్ కస్టడీ నుంచి విడిపించకపోతే, నేను వెళ్ళి విష్ణుగారిని తీసుకొస్తాను. అప్పుడు సహకార సంఘాల సంఘసేవ కథ చాలా దూరం వెళ్తుంది."
    నిజానికి తను ఈ విషయాలన్నీ చెప్పినా విష్ణు రాడని రవికి తెలుసు. రాడు సరి కదా! గ్రామవాసుల వ్యవహారాల్లో కలిగించుకుంటున్నందుకు తనను తిడ్తాడు. అయినా చీకట్లో బాణం వదిలాడు.
    ఈ అస్త్రం పనిచేసింది. తన 'సంఘసేవ' సంఘానికంతకూ ప్రకటించడానికి సుబ్బయ్య సిద్ధంగా లేదు.
    "మీ అంతటివారు చెప్తోంటే కాదనలేను. ప్రయత్నించి చూస్తాను."
    సణుక్కుంటూ వెళ్ళాడు.
    సుబ్బయ్యకీ, ఆ చిన్న పల్లెటూళ్ళో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ కీ మంచి సంబంధాలే ఉన్నట్లున్నాయి. గంటలోనే తిరిగొచ్చాడు.
    "బతిమాలి, బామాలి పోలీసుల చేతుల్లోంచి వాళ్ళని విడిపించేసరికి తాతలు దిగొచ్చారు. బాగా చేతులు తడి చెయ్యాల్సొచ్చింది" తెగ బాధపడిపోతూ అన్నాడు.
    అదేం విచిత్రమో డబ్బు సంపాదన ఎక్కువయిన కొద్దీ డబ్బు కాపీనం కూడా ఎక్కువయిపోతూ ఉంటుంది.
    "థాంక్స్" చెప్పి బయటపడ్డాడు రవి. సుబ్బయ్య ఇంటి బయట చేతిలో తుపాకీతో పోలీసు కనిపించాడు. తన కాపలా కోసం పిలిపించుకున్నట్లుగా ఉన్నాడు. గిరిజనులకి భయపడుతున్నాడన్నమాట!

 Previous Page Next Page