Previous Page Next Page 
తృప్తి పేజి 26


    "చాలా ప్రమాదం జరగబోయింది. ఆయనుండబట్టి సరిపోయింది. లేకపోతే మీ కూతురికివాళ ఆఖరి రోజయ్యేది" అంటూ ఏడుస్తూ చెప్పింది యమున. అందరూ వేసే రకరకాల ప్రశ్నలకి జవాబులు చెప్పి యమునకి వెళ్ళొస్తానని చెప్పి బయటపడేసరికి తొమ్మిదయింది శేఖర్ కి.


                                           *    *    *    *


    సింధుకి చాలా విసుగ్గా ఉంది. ఇంటికొచ్చేటప్పటికి ఎక్కడపడితే అక్కడ పుస్తకాలు, బొమ్మలు, డైనింగ్ టేబుల్ మీద ఎంగిలిప్లేట్లు.
    "ఈ చిట్టెమ్మ ఎప్పుడొస్తుందో" అనుకుంటూ ఇల్లంతా శుభ్రం చేసింది.
    "ఈ మధ్య చిట్టెమ్మ అప్పుడప్పుడూ మూలుగుతోంది. జ్వరమనీ, జలుబనీ ముసుగుపెట్టి పడుకుంటోంది. తను వెంటనే డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళి మందిప్పించి తీసుకొస్తుంది. జ్వరం తగ్గేదాకా బ్రెడ్డూ, పాలూ లాంటివి తనే కలిపిస్తుంది. ఎంత త్వరగా కోలుకుంటే అంత బావుంటుందని ఆలోచిస్తుంది. ఒక్కోసారి కోపమొస్తుంది." తనకే టైమ్ లేక చస్తుంటే ఇదో ఖర్మా! అనిపిస్తుంది. కానీ లేస్తే మళ్ళీ బండెడు చాకిరీ చేస్తుందిలే పాపం! అని సరిపెట్టుకుంటుంది.
    చిట్టెమ్మ రెండురోజులయింది వాళ్ళమ్మకి బాలేదని వూరెళ్ళి. వంటపనీ, అవీ తను ఎలాగో చేసుకున్నా పిల్లల విషయం మాత్రం పెద్ద గొడవగా తయారయింది. రమ్యకి తను తల దువ్వితే నచ్చదు. తేజా తను అన్నం పెడ్తే తినట్లేదు. "నీకు వంట అలవాటు తప్పిపోయినట్లుంది" అంటున్నాడు అరుణ్. అంతవరకూ ఎందుకు? తనకు మాత్రం ప్రతి పనిలో తడువులాడుకోవడమే అవుతోంది. వంటింట్లో ఏ డబ్బాలో ఏమున్నాయో తెలియట్లేదు. ఏమయిపోయాయో, ఏమున్నాయో అసలే తెలీదు. నెల మధ్యలో చిట్టెమ్మ పప్పయి పోయింది, ఉప్పయిపోయింది అని చెప్తుంటే తనే దుకాణంలో ఖాతా తెరిచి, అందులో కావలసినవి తీసుకొమ్మంది. అప్పటినుంచీ ఎంతో హాయిగా అనిపించింది. మొన్న అరుణ్ "కొట్లో రెండువేల చిల్లరయింది. మనకంత ఎప్పుడూ అవలేదు" అన్నాడు. తను చిట్టెమ్మతో ఆ మాటే అంటే "పాప బిస్కెట్లయిపోతే గొడవ పెడుతుందమ్మా, బాబు నాతో వచ్చినప్పుడు ఖరీదైన చాక్లెట్లు తీసుకుంటాడు. ఇక బాబుగారి బ్లేడ్ల దగ్గర్నుంచీ, మీకు పిన్నీసుల దగ్గర్నుంచి అందిస్తున్నానంటే ఎట్లా అందిస్తున్నానంటారు?" అంది కాస్త బాధపడుతూ. చిట్టెమ్మని ఏమీ అనబుద్దికాదు సింధుకి. ఎందుకంటే తనకీమధ్య చిట్టెమ్మచేత తలకి నూనె రాయించుకోవడం, అప్పుడప్పుడు మసాజ్ చేయించుకోవడం, చివరకి చీర కట్టుకోవడంలో కూడా సహాయం తీసుకోవడం అలవాటయిపోయింది. చిట్టెమ్మ వెళ్ళిపోతే ఎలా అనే పరిస్థితికొచ్చేసింది. తన జాకెట్లు, చీరలు అన్నీ కాస్త పాతగిలగానే చిట్టెమ్మకిచ్చేస్తుంది. చిట్టెమ్మ శుభ్రంగా ఉంటుంది. తమ సబ్బుతోనే స్నానం చేస్తుంది. తమలాగే టూత్ పేస్ట్ షాంపూ, పౌడర్, స్నో అన్నీ వాడుతుంది. ఇవన్నీ తనకి మొదట ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడలవాటయిపోయాయి. బహుశా! ఆమెతో అవసరమో లేక దగ్గరితనం పెరగం వల్లనేమో. తను కూడా కొన్ని విషయాల్లో చనువుగా కలగజేసుకుని సలహా ఇస్తుంటుంది. "పెద్దపెద్ద వాళ్ళొస్తుంటారు, కర్టెన్లు పాతబడ్డాయి. కొత్తవి తీసుకుందాం" అంటుంది. "అయ్యగారీమధ్య సిగరెట్లు ఎక్కువే తాగుతున్నారు. ఆరోగ్యం పాడవుతుందని చెప్పండి" అంటుంది. "పాపకి పరీక్షలొస్తున్నాయి కాస్త దగ్గర కూర్చోపెట్టుకుని చెప్పండి. నాకు చదువొస్తే నేనే చెప్పేదాన్ని" అంటుంది. అన్నీ ఇంట్లో మనిషిలా కలుగజేసుకుని చెప్పడం, తనకు వినడం అలవాటయిపోయింది.
    "ఎవరు చెప్పినా విననిదానివి, చిట్టెమ్మ చెప్తేమాత్రం వింటావు" అన్నాడోసారి అరుణ్.
    "మంచేగా చెప్తోంది. వింటే తప్పేమిటి?" అంది తను.
    ఓసారి ఆనంద్, అతని భార్యా వచ్చారు. అతను కూడా అరుణ్ ఆఫీస్ లోనే పనిచేస్తాడు. వాళ్ళింట్లో సత్యనారాయణవ్రతం, భోజనాలూ అని పిలిచిందివాళ్ళావిడ. ఆమె చాలా ముభావంగా ఉంది. వచ్చినప్పటినుండీ అసహనంగా కూడా ఉంది. అరుణ్ లేకపోబట్టి తనే ఆనంద్ తో మాట్లాడవలసి వచ్చింది. అతను ఇంగ్లీషులో మాట్లాడుతుంటే తను ఇంగ్లీషులోనే సమాధానం చెప్తోంది. తను కాలేజ్ లో ఇంగ్లీష్ లెక్చరర్ అవ్వడం మూలాన ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు గబుక్కున ఇంగ్లీషే వచ్చేస్తుంది. తాము మాట్లాడుకునేది ఆవిడకర్ధం కాదనేమో విసుగ్గా చూస్తూ కూర్చుంది.
    ఇంతలో చిట్టెమ్మ కాఫీ తెచ్చింది.
    "వద్దు" అంది ఆవిడ.
    "పోనీ పాలు కానీ, జ్యూస్ కానీ..." అని తనంటుంటే
    "నేను బయటచేసినవి తిననూ, తాగనూ" అంది చిట్టెమ్మని చూస్తూ.
    దానిభావం తనకర్ధమయిపోయింది. ఇంక తను ఫోర్స్ చెయ్యలేదు. రెండు నిమిషాలు ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చుంది. వెళ్ళిపోయారు వాళ్ళు.
    చిట్టెమ్మొచ్చి "ఆమె తీరు అంతగా బాలేదమ్మా, సరిగ్గా పిలవను కూడా లేదు. ఇంక వెళ్తే ఏం మర్యాద చేస్తుంది? వద్దు" అంది.
    తనకీ వెళ్ళాలనిపించలేదు వెళ్ళలేదు. అరుణ్ కారణమడిగితే చెప్పి "చిట్టెమ్మ కూడా ఇలాగే అంది" అని అన్నది. అతనోరకంగా తనవైపు చూసి వెళ్ళిపోయాడు. "చిట్టెమ్మ మాటంటే నీకంత విలువా" అన్నట్టుగా అన్నమాట.
    "మమ్మీ! మమ్మీ! ఈరోజు డాడీ రాగానే బయటికెవెళ్దాం" అంది రమ్య.
    నిజమే! చాలా రోజులయింది ఎక్కడికైనా వెళ్ళి. అరుణ్ కి సరదానే పిల్లలతో బయటికెళ్ళడం. తనూ వంట తప్పించుకోవచ్చు అనుకుంది సింధు. లేచి ఫోన్ చేసింది అరుణ్ కి. అవతలనించి ఆపరేటరు గొంతు తియ్యగా పలికింది. తను ఫలానా అని తెలియగానే విష్ చేసింది. "సార్ ఒబెరాయ్ హోటల్లో కాన్ఫరెన్స్ కి వెళ్ళారు. ఇంటి నుంచి ఫోనొస్తే లేటవుతుందని చెప్పమన్నారు" అంది. ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లలతో చెప్పింది.
    తేజా చిందులు తొక్కి "వెళ్దాం ఎక్కడికన్నా వెళ్దాం" అంటూ గొడవచెయ్యసాగాడు. రమ్య కూడా చిన్నబుచ్చుకుంది. "సరే పదండి" అంటూ తనూ తయారై వాళ్ళని రెడీచేసి బయటికి తీసుకెళ్ళింది. ముందు హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేశారు. అక్కడినుండి ఇందిరాపార్కుకి వెళ్ళారు. పిల్లలు కాసేపు ఆడుకున్నాక ఐస్ క్రీం" అంటూ వచ్చారు. తను కొనడానికి పర్స్ తెరిచి డబ్బులు తీసింది. వాటితోపాటు కాయితం కూడా కిందపడింది. ఏమిటా? అని తీసిచూస్తే అది కావేరి అడ్రస్. ఇక్కడికి దగ్గరేగా ఓసారి వెళ్తే? అనుకుంది. మళ్ళీ ఇక తీరుబడి ఎప్పటికి దొరికేను అనుకుంటూ పిల్లలకి ఐస్ క్రీమ్ పెట్టించి, ఓ పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని టి.వి.యస్.మీద అడ్రస్ వెతుక్కుంటూ బయల్దేరింది.

 Previous Page Next Page