తెలివి రాగానే మణిమాలను చూసిన మాధవ్ ఆప్యాయంగా "మణీ!" అన్నాడు - ఏదో మాట్లాడబోయిన అతనికి అంతలోనే ఆయాసం వచ్చింది.
"మాధవ్! నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు. వెంటనే వేరే హాస్పిటల్ లో చేరాలి. టాక్సీ పిలిపిస్తాను" ఆరాట పడుతూ అంది.
మాధవరావు మాట్లాలేక ఆయాస పడుతున్నాడు. అతి ప్రయాసంతో అన్నాడు-"మణీ! నేనింక ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు. ఈ కొంచెం రోజులయినా నన్ను భరించలేవా?"
మణిమాలకు దుఃఖం పొంగి వస్తోంది. అయినా ఏడవలేదు. క్రింది పెదవిని మాత్రం రక్తం చిమ్మేలా కొరుక్కుంది.
"మాధవ్! నా మాట విను. ఇక్కడెవరూ వినిపించుకోవటం లేదు, టాక్సీ తీసుకొస్తాను. మనం ఇంకో హాస్పిటల్ కు వెళ్ళిపోదాం."
"మనం?..." "అవును! నేనూ నీతో ఉంటాను."
"మరి, వినోద్?" "అతడి కర్మ?"
"అంటే? మళ్ళీ నాతో ఉందామనా?"
"ఉండను? నన్ను క్షమించగలిగే శక్తి నీకుంది. కానీ ఆ క్షమను భరించే శక్తి నాకు లేదు."
"క్షమించటం కాదు మణీ! నేను నిన్ను ప్రేమిస్తున్నాను"
"మాధవ్! నీకు తెలుసు. నేనూ నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే ఆ ప్రేమను ఉపయోగించుకోను. మాధవ్ మనం ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి. నీ ఫ్రెండ్స్ తో చెప్పు. టాక్సీ తెప్పించు."
"ఎందుకంత ఆరాటం మణీ? డాక్టర్ వినోద్ నామీద పగ తీర్చుకుంటాడనా? ఈ స్థితిలో అతనికి నామీద పగ ఏం ఉంటుంది? నేను బ్రతికి బయట పడతానా? బ్రతికినా మళ్ళీ మామూలుగా ఉంటానా?"
"అది కాదు మాధవ్! నా మాట విను...?"
"పర్వాలేదు మణీ! అతనిమీద నాకు పగ ఉండాలికాని, అతనికి నామీద పగ ఎందుకుంటుంది? ఈ మూన్నాళ్ళ ముచ్చటకోసం మీ ఇద్దరి మధ్య మనస్పర్ధ ఎందుకు కలిగిస్తాను నేను? ఇక్కడే ఉంటాను. నా చివరి క్షణాల్లో నా కంటికి కనపడు చాలు!"
మణిమాల ఇంక నిగ్రహించుకోలేక పోయింది. మాధవరావు గుండెలమీద వ్రాలి వెక్కి వెక్కి ఏడ్చేసింది. మణిమాల తనమీద వ్రాలి పోవటం శారీరకంగా ఆ పరిస్థితిలో బాధనే కలిగించినా మనసుకు కలుగుతున్న హాయికోసం ఆ బాధను భరించాడు మాధవ్.
మణిమాల పరిస్థితి అర్ధం చేసుకుని వెంటనే లేచి "సారీ" అంది.
"నువ్వు "సారీ!" అంటున్నావు. నేను "థాంక్స్" చెపుతున్నాను.
"మాధవ్! ఇంక నిజం చెప్పకుండా ఉండలేను. ఏదెలా జరిగినా సరే! డాక్టర్ వినోద్ డాక్టర్ కాడు. అబద్దాల డాక్టర్! అతని డిగ్రీ అబద్దపు డిగ్రీ....అతను నీకు వైద్యం చెయ్యటం భరించలేను నేను."
తన చెవులను తనే నమ్మలేక పోయాడు మాధవరావు.
డాక్టర్ వినోద్, డాక్టర్ గా పేరు ప్రఖ్యాతు లార్జించుకొని కొన్ని సంవత్సరా౦లుగా పెద్ద ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో బ్రాంచీలు, ఎందరో అసిస్టెంట్ లు ఉన్న డాక్టర్ వినోద్, అబద్దాల డాక్టరా?
జనం ఇంత వెర్రివాళ్ళా? అంతే అమాయకులు మోసపోక ఏం చేస్తారు? తనను మాత్రం, తన స్నేహితులు ప్రత్యేకించి ఇక్కడికే తీసుకురాలేదా? అలానే అందరూ వచ్చి ఉంటారు. అదృష్టం బాగుండి రోగాలు తగ్గితే అదంతా డాక్టర్ ప్రతిభగా చెలామణీ అయిపోతుంది. ప్రాణాలు పోయినా అది డాక్టర్ పొరపాటని ఎవరూ అనుకోరు. ఒకారి పేరు ప్రఖ్యాతులొచ్చాక, అదేదో నయంకావడానికి వీల్లేని రోగమనుకుంటారు.
"ఈ విషయం నాకెందుకు చెప్పావు మణీ?" బాధగా అన్నాడు మాధవరావు.
"చెప్పాలని చెప్పలేదు. నిన్ను మరో హాస్పిటల్ కి తీసుకుపోవాలి. నా మాట ఎవరూ వినిపించుకోవటం లేదు. ఏం చేయ్యను?"
"ఈ సంగతి తెలిసాక నేనేం చేస్తానో తెలుసా?"
"తెలుసు వెంటనే ఈ సంగతి రిపోర్టు చేస్తాను."
"మరోలా ప్రవర్తించటం నా సాధ్యం కాదు. అదే చేతనయితే ఈనాడు ఈదశలో ఉండేవాడిని కాదు."
"నాకెందుకు చెప్పుతున్నావు? నేను నీకు కొత్తదాన్ని గాదు."
"నీమీద కసితో ఈ రిపోర్టు చేస్తున్నానని అనుకోవుగా!" "అలా అనుకోగలిగితే నా ప్రాణానికి హాయిగానే ఉంటుంది. కానీ, నామీద నీకేమీ కసిలేద్ని నాకు తెలుసు. అదీగాక వ్యక్తికీ వ్యక్తిగత మయిన కక్షలకు నువ్వు ముడిపెట్టవని కూడా నాకు తెలుసు. ఏమైనా చెయ్యి. ముందిక్కడ్నుంచి కదలాలి."
మాధవరావు స్నేహితులద్వారా వెంటనే డాక్టర్ వినోద్ మీద రిపోర్ట్ డిపార్ట్ మెంట్ కు చేరిపోయింది.
మాధవరావును మరొక హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అప్పటి వరకు మాధవరావుతోనే ఉన్న మణిమాల "నే నొక్కసారి ఇంటికి వెళ్లొస్తాను మాధవ్!" అంది.
"ఎక్కడికి? డాక్టర్ వినోద్ దగ్గిరకా?"
"ఇంకెక్కడికి వెళ్తాను?"
"ఇప్పుడొద్దు మణీ! బహుశ మరో రెండు మూడుగంటల్లో అతను అరెస్ట్ అవుతాడు.
"అందుకే! ఆ సమయానికి ముందు అతనితో ఉండాలని."
"ఎందుకు? హెచ్చరిద్దామనా? లాభంలేదు. ఇప్పుడతను ఎటూ తప్పించుకోలేదు."
"తప్పించడానికీ కాదు, తప్పుకోవడానికీ కాదు. ఇంతవరకు అతనితో కలిసి చాలా చాలా అనుభవవించాను. ఇదికూడా అతనితో కలిసి అనుభవించాలని..."
మాధవ్ మాట్లాడలేదు. అతనికి ఆయాసంగా ఉంది. మాట్లాడ లేకపోతున్నాడు. అతనికి మణిమాలను ఆపాలని ఉంది. కానీ ఆవిడ ఆగదని తెలుసు.
మాధవ్ విషయం తెలిసి ఆదుర్దాగా హాస్పిటల్ లో కొస్తున్న లలిత, మాధవరావున్న గదిముందే మణిమాలకు ఎదురుపడింది. మణిమాల లలిత వంక దిగులుగా చూసి 'లలితా ఆయన లోపలున్నారు జాగ్రత్తగా చూడు' అని చెప్పి వెళ్ళిపోయింది.
మణిమాల ఇంటికి చేరుకునేసరికి డాక్టర్ వినోద్ కోపంగా పచార్లు చేస్తున్నాడు.
"మాధవరావును పట్టుబట్టి నువ్వే మరొక హాస్పిటల్లో చేర్పించావుటగా!" అని అడిగాడు.
"అవును!"
"ఏం?"
"మాధవ్ కి నువ్వు వైద్యం చెయ్యటం నేను భరించలేను గనుక."
వినోద్ ముఖం తెల్లగా పాలిపోయింది.
"కొంపతీసి అన్ని విషయాలూ చెప్పావా, నీ మొగుడితో..."
"మాధవ్ కి అన్ని విషయాలు చెప్పాను."
"అతడు ఊరుకోడు!"
"అవును, అప్పుడే రిపోర్టు వెళ్ళిపోయింది."
"రాక్షసీ..." అంటూ పట్టరాని కోపంతో వినోద్ మణిమాల కంఠం నులమసాగాడు.