Home » Yandamuri veerendranath » మరో హిరోషిమా


    "చేతులు జోడించి సానుభూతి అడగడం తప్ప ఏం చేయగలను? ఆడదాన్ని."

    "మరీ అంత నాటకం అక్కర్లేదుకానీ, నెలరోజులపాటు ఒక ఉద్యమం లేవదీయి. మా బాబాతో చెప్పి బదిలీ చేయిస్తాను".

    "ఏం ఉద్యమం అది?" ఆశగా అడిగింది.

    "అయ్యప్ప దీక్ష మగవాళ్ళకే పరిమితం. అలాగే భవానీ దీక్ష, కన్యకా పరమేశ్వరి దీక్ష ఇటీవలే ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ మధ్యే ఎన్.టి. రామారావు దీక్షకూడా ప్రారంభమైంది. అలాగే నువ్వు 'ఓంఫట్ బాబా దీక్ష' మొదలుపెట్టు. వాడి పేరు చరిత్రలో నిలబడిపోతుంది. పాతిక రోజుల తర్వాత నీకు విముక్తి లభిస్తుంది."

    "ఏం చెయ్యాలి?"

    "దీక్షంటే సర్వం వదిలిపెటడం. అయ్యప్ప దీక్షలో నల్లబట్టలూ, ఎన్.టి.ఆర్. దీక్షలో పసుపు బట్టలూ, భవానీ దీక్షలో కాషాయ వస్త్రాలూ ధరించడం ఆనవాయితీ. 'ఓంఫట్ బాబా' దీక్షలో నువ్వు మరో అడుగు ముందుకేసి, బట్టలు కూడా త్యజించు. పాతిక రోజులపాటు నగ్నంగా దీక్షని ఆచరించు. జనం తండోపతండాలుగా వస్తారు...."

    అతడి మాటలు పూర్తికాకుండానే ఆమె కోపంగా అక్కడి నుంచి విసవిసా వెళ్ళిపోయింది. అప్పటికి కానీ అతడు తనని ఏడిపిస్తున్నాడని ఆమెకి అర్ధంకాలేదు. ఆ విధంగా ప్రొద్దున్నించీ వళ్ళు మండిపోతూనే వుంది.

    దానికితోడు ప్రస్తుతం ఈ దోమలు ప్రతిపక్ష సభ్యుల్లాగా కుట్టి కుట్టి చంపుతున్నాయి. ఈ పరిస్థితినుంచి ఎలా బయటపడాలా అని ఆమె ఆలోచిస్తుండగా మిషన్ గన్ చప్పుళ్ళు వినిపించాయి.

    గతంలో రాజ్ ఘాట్ లో రాజీవ్ గాంధీ మీద టెర్రరిస్టు చెట్టు పైనుంచి తుపాకీ పేలుస్తుంటే- ఎవరో దూరంగా బాణాసంచా కాలుస్తున్నారని అనుకున్నారట చుట్టూ వున్న రక్షణ బృందం. ఆ విధంగా, ఓంఫట్ బాబా భక్తులు బాణాసంచా కాలుస్తున్నారేమో అనుకుంది.

    ఆ సంబరం చూడడానికి బయటికి వచ్చిన సరళరేఖకి మెషిన్ గన్ తో దావూద్ హర్షద్ కనిపించాడు. కెవ్వున అరిచింది. అతడప్పుడే మొదటి రౌండ్ పూర్తిచేసి, రెండవ రౌండ్ కాల్పుల కోసం ముందుకు దూకబోతున్నాడు. గుండు తగిలి, కెవ్వున అరిచిన చప్పుడు ముందునుంచి కాకుండా 'వెనక' నుంచి వినబడడంతో తికమకపడి వెనుకకి చూసాడు.

    రావిచెట్టుకి కొద్దిదూరంలో సరళరేఖ టెంట్ వుంది. ఆ రెంటికీ మధ్య తుప్పలు వున్నాయి. దావూద్ హర్షద్ కాల్పులు సాగించింది ఆ తుప్పల వెనక నిలబడే! సరళరేఖ టెంట్ నుంచి బయటికొచ్చి అరవడంతో ఇద్దరూ ముఖాముఖీగా ఎదురయ్యారు. 'దావూద్' అంది అతడిని గుర్తు పట్టినట్టు అయోమయంగా!

    మాఫియా మనుషులు ప్రధాన సాక్షులని వదలరు. 'అసలు వ్యక్తి' తప్పించుకున్నాసరే, ప్రత్యక్ష సాక్షులని మాత్రం ముందుగా మట్టుపెట్టాల్సిందే! అందుకని అతడు సరళరేఖ మీదకి కాల్పులు సాగించాడు.

    ఆమెకి ఓ క్షణం ఏం జరుగుతుందో అర్ధంకాలేదు. ఈలోగా ఒక బుల్లెట్ ఆమె చెవి పక్కనుంచీ, మరొకటి నడుము పక్కనుంచీ దూసుకు వెళ్ళాయి. ఎంతయినా ఆమె ఇన్ స్పెక్టర్ కాబట్టి క్షణంలో జరిగింది అర్ధమైంది. చప్పున నడుముదగ్గిర రివాల్వర్ కోసం తడుముకుంది కానీ అక్కడ నైటీ తాడు తగిలింది. తను యూనిఫామ్ లో లేనని గుర్తొచ్చింది. ఈలోగా యింకో బుల్లెట్ భుజాన్ని రాసుకుంటూ వెళ్ళింది. ఇనపకడ్డీ ఎర్రగా కాల్చి వాతపెట్టినట్టు భగ్గున మండడంతో పెద్దగా ఆర్తనాదం చేస్తూ తుప్పలు దాటి కొండలవైపు పరుగెత్తింది.

    వెనుకే దావూద్ హర్షద్ ఆమెను వెంటాడాడు.

    ముళ్ళూ, చెట్లూ, కొమ్మలూ, పొదలూ- ఏమీ చూసుకోవడం లేదు ఆమె. వింటినుంచి వెలువడిన బాణంలాగ చీకట్లో దూసుకుపోతోంది. ప్రాణభయం ఆమెనలా పరిగెత్తిస్తోంది. అయితే దావూద్ హర్షద్ ఇలాంటి వ్యవహారాల్లో ఆరితేరినవాడు. ముందే చెప్పినట్టు హత్యాప్రదేశంలో ప్రత్యక్ష సాక్షుల ప్రాముఖ్యత తెలిసిన వాడవడంచేత అసలయిన వాళ్ళని వదిలేసి ఆమె వెంట పడ్డాడు. తను పేల్చిన మొదటి రౌండ్ తాలూకు ఫలితం కూడా అతడు పట్టించుకోలేదు.

    దావూద్ హర్షద్ పేల్చిన మొదటి బుల్లెట్ రత్నాబాయి నుదుటి కపాలంలోకి దూసుకుపోయింది. ఆమె కుప్పకూలి పోతుండగా వరుసగా దూసుకొచ్చిన తుపాకీ గుళ్ళు ఆమె మొహాన్ని ఛిన్నాభిన్నం చేసాయి. వాటి తాకిడి ఎంత ఫోర్స్ తో ఉందంటే ఆమె తల- మెడ పైభాగం నుంచి పుచ్చకాయ విచ్చుకున్నట్టు- రూపురేఖలు లేకుండా ఛిద్రమై పోయింది. గిలగిలా కొట్టుకుంటున్న మొండెం నేల మీదకి వాలిపోయింది.

    అంత షాక్ లో కూడా ఈ భీభత్స దృశ్యాన్ని చూడలేక రెండు చేతులతో కళ్ళుమూసుకుని వెనక్కి తిరిగి గట్టిగా అరిచాడు రావు. అతడి అరుపు పూర్తికాకుండానే రెండు బుల్లెట్స్ అతడి కాళ్ళగుండా దూసుకుపోయాయి. అతడు గాలిలో ఎగిరి ఆర్తనాదం చేస్తూ కూలుతుండగా మరొక బుల్లెట్ అతడి వెన్నెముకలో గుచ్చుకుంది. పౌంటెన్ లాగ రత్నాబాయి మెడ పైభాగం నుంచి రక్తం ఎగజిమ్ముతోంది. ఆ మడుగులోకి జారడంతో రావు మొహం అంతా రక్తంతో తడిసిపోయింది.

    అనూహ్యమైన ఈ పరిణామానికి చెట్టు పైనున్న దొంగల్లో ఒకడు పట్టు తప్పి కిందపడ్డాడు. అయితే వాడు పూర్తిగా నేల మీదకి పడకముందే ,శరపరంపరలా వస్తున్న బుల్లెట్స్ వాడి శరీరాన్ని తూట్లు తూట్లు చేసాయి.

    ఒక బంతినిండా ఎర్రసిరా పోసి, గుండుసూదితో రంధ్రాలు చేసి, బంతిని గట్టిగా ఒత్తితే, లోపలినుంచి ఎర్రరంగు ఎలా ఎగజిమ్ముతోందో, అతడి ఒంటినుంచి రక్తం అలా స్ప్రేలా బయటికి వచ్చింది.

    ఊహించని రీతిలో ఒకవేపు బుల్లెట్ల వర్షం, పైనుంచి ఒక మనిషి కిందపడుతూ శవరూపంలోకి మారడం ఒకేసారి జరగడంతో బృహస్పతి కూడా అయోమయంలో ఎటూ తోచక స్తబ్దుడయ్యాడు. మరో క్షణం ఆగి వుంటే అతని ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయి వుండేవే! అయితే అంతలోనే అతణ్ణి రక్షించడానికి అన్నట్టు దావూద్ హర్షద్ వెనకనుంచి సరళరేఖ కేక పెట్టింది. అది విని, వెనక్కి తిరిగి, ఆమెని వెంటాడుతూ దావూద్ హర్షద్ పెరుగెత్తడం కనిపించింది.

    ఇదంతా ఎందుకు జరుగుతుందో తమమీద కాల్పులు సాగించింది ఎవరో బృహస్పతికి తెలియలేదు. అయినా అవన్నీ అతడు ఆలోచించే స్థితిలో లేడు.

    తన పక్కనే పడివున్న శవాల గురించి కూడా అతడు పట్టించుకోలేదు. పట్టించుకున్నా చేయగలిగేది ఏమీ లేదని అతడికి తెలుసు.

    సరళరేఖ వెళ్ళినవేపు చీకట్లోకి అతడు కూడా పరుగెత్తాడు. మసక వెన్నెల్లో ఆకారాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి.

    ఆ పయనం అలా అయిదు నిముషాలు కొనసాగింది. దావూద్ హర్షద్ కన్నా వయసులో చిన్న వాడవడంతో బృహస్పతి వేగం హెచ్చించి అతడికి దగ్గరయ్యాడు. అదే అతడు చేసిన తప్పు. వెనక అలికిడి దగ్గరగా వినిపించడంతో దావూద్ ఆగి వెనుతిరిగాడు.

    బృహస్పతి పరుగెత్తుకుంటూ సమీపంలోకి రావడం కనబడింది.

    దావూద్ చేతిలో మిషన్ గన్ బుల్లెట్లు కక్కింది.

    ఒక బుల్లెట్ బృహస్పతి కడుపులోకి దూసుకుపోయింది.

    అతడు ముందుకు వంగి తుప్పల్లోకి పడిపోయాడు.

    అతడి ఉదరభాగం అంతా రక్తసిక్తమైంది. కళ్ళముందు చీకట్లు కమ్మసాగాయి.

    అయితే ఈ క్షణకాలం జాప్యం ,సరళరేఖ దూరంగా వెళ్ళటానికి దోహదపడింది.

    ఆమె దిశ మార్చి చీకట్లో కలిసిపోయింది.

    ఎదురుగా చిన్న గుట్టలాంటిది వుంది. ఆమె అటువైపు పరుగెత్తింది. దావూద్ కూడా ఆమెని వెతుక్కుంటూ ముందుకు సాగాడు.

    ఎదుటి వ్యక్తి చేతిలో వున్నది మిషన్ గన్ అని తెలీగానే తమని చంపటానికి ప్రయత్నిస్తున్నది మామూలు వ్యక్తి కాదని బృహస్పతికి అర్ధమైంది. సరళరేఖ ఎంతటి ప్రాణాపాయ స్థితిలో వుందో కూడా తెలిసింది.

    అతడు నెమ్మదిగా మోకాళ్ళమీద లేచాడు. కడుపులో బల్లెంపెట్టి తిప్పుతున్నట్టు బాధ సుడులు తిరుగుతోంది. పంటి బిగువున బాధని అదిమిపెట్టి సరళరేఖని వెతుక్కుంటూ అడ్డదారిన అతడు గుట్ట పైభాగానికి చేరుకున్నాడు.

    గుట్టకి అవతలివేపు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చిన్న చిన్న కొండరాళ్ళ మధ్య -వెడల్పు తక్కువగా వుండడంతో అక్కడి ప్రవాహం మరింత వడిగా వుంది. నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. ఆ నిశ్శబ్దంలో నది హోరు మరింత స్పష్టంగా వినిపిస్తోంది.

    రక్తం బయటికి రాకుండా కడుపు దగ్గర గాయంపై చేతిని గట్టిగా అదిమిపెట్టి చుట్టూ చూసాడు బృహస్పతి. తన ప్రాణాలు ఇంకెంతోసేపు నిలబడవన్న విషయం అతడికి అర్ధమైంది. స్పృహ తప్పబోతున్న అతడికి చివరి క్షణంలో సరళరేఖ కనబడింది.

    వెంటాడుతున్న వేటగాడు ఎటున్నాడో తెలీక దిక్కులు చూస్తున్న లేడిపిల్లలా ఆమె రొప్పుతూ అటూ ఇటూ చూస్తోంది.

    ఆమెని సమీపించటానికి బృహస్పతి అడుగు ముందుకు వేయబోయాడు. అదే సమయానికి మరోపక్క చెట్టుచాటునుంచి దావూద్ బైటికి వచ్చాడు. అతడి గన్ ఆమెవైపు గురిపెట్టబడి వుంది. బృహస్పతి మరేమీ ఆలోచించకుండా.... "రేఖా! రన్" అని అరిచాడు.

    పక్కలో బాంబుపడ్డట్టు దావూద్ చకితుడై చప్పున వెనుతిరిగాడు. అప్పటికే బృహస్పతి అతడికి దగ్గరగా వచ్చేసాడు. నరాల చివర్లలో వున్న బలాన్నంతా చేతుల్లోకి తీసుకొని ప్రాణాలు మిగిలి వుండగా అదే తన చివరి చర్య అన్నట్టు దావూద్ చేతిలోంచి గన్ లాక్కున్నాడు.

    కానీ అప్పటికే అతను పూర్తిగా బలహీనుడై పోవడంతో, నిలదొక్కుకోలేక, దావూద్ విదిలింపుకి గుట్టమీదనుంచి గన్ తో సహా గాలిలోకి జారిపోయాడు.

    అక్కడినుంచి అతని శరీరం అరనిముషం పాటు ఆధారం లేకుండా దెబ్బతిన్న పక్షిలా గాలిలో పయనించి పెద్ద చప్పుడుతో నది మధ్యలో వున్న రాయిమీద పడింది. తల్లకిందులుగా పడటంతో రాయి తగిలి తల రెండుగా చీలింది. ఆ ప్రదేశంలో నది నీరంతా క్షణాలలో ఎర్రగా మారింది. ప్రవాహ వేగం ఎక్కువ వుండటంతో రెండు నిముషాల్లో అక్కడి ఎరుపుదనం నశించింది. నది ఎప్పటిలాగే తన పూర్వపు స్థితిని సంతరించుకుంది. శవాకారంలో వున్న అతడి అచేతనమైన శరీరాన్ని ప్రవాహం తనతోపాటు తీసుకుపోయింది.

    ....నోటికొచ్చిన చిన్న అబద్ధం ఆడి, సరదాగా డబ్బూ, అధికారం సంపాదిద్దామనుకున్న అతడు- ఆ చిన్న అబద్ధం తాలూకు పరిణామం ఇంత దారుణంగా వుంటుందని ఊహించక, ఆ విధంగా నదికి అర్పితమయ్యాడు.

    సరళరేఖ ఆ దృశ్యాన్ని దిగ్ర్భాంతితో చూసింది. కేవలం తనని రక్షించడానికే బృహస్పతి ఆ విధంగా హర్షద్ దావూద్ కి ఎదురయ్యాడని ఆమెకి అర్ధమయింది. తన ప్రాణాలు కాపాడటానికే అతడు చెట్టు వెనుకనుంచి ముందుకొచ్చి, ప్రాణాలు కోల్పోయాడని అర్ధమవగానే ఆమె కృతజ్ఞతతో కదిలిపోయింది. మరోవైపు దుఃఖం ఉప్పెనలా ముంచుకొచ్చింది. అయితే అది ఉద్విగ్నతకి సమయం కాదు.

    ఆమె చప్పున చీకట్లోకి జారిపోయింది.


                                                    15


    ప్రభుత్వం సజావుగా నడవటానికి, ప్రజల్ని సంక్షేమ మార్గంలో నడిపించటానికి మనం అత్యున్నతమైన ప్రజాస్వామ్య పద్ధతుల్ని అవలంబిస్తున్నాం. ప్రపంచంలోనే ఇది గొప్ప పరిణామంగా గుర్తింపబడింది. సైనిక పాలన, ఫ్యూదలిస్ట్ విధానం, కమ్యూనిజం- మొదలయిన విధానాల కన్నా, 'ప్రజాస్వామ్యమే' గొప్పదని ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ వున్న భారతదేశం గత ఏభై సంవత్సరాల్లో నిరూపించింది."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra