"ఏండెటోకి, మృదులకి మధ్య ఏమీ ఉండి వుండదు. ఏమైనా ఉండి వుంటే అతని సమక్షంలోనే తన మీద ఇంత ప్రేమ చూపిస్తుందా?"
"ఎక్కడికెళ్ళావు?" అడిగాడు మెత్తగా.
"దేవకి ఇంటికి," చాచికొట్టినట్టయింది. మృదులచేతుల్లోని హాట్ వాటర్ బేగ్ కిందినించి తన ముఖం తప్పించాడు.
"కారులో వచ్చినట్టున్నావు ఎవరు డ్రాప్ చేసారు?"
"ప్లెమింగ్," భాగవతార్ శరీరంలోని రక్తం ఒక్కసారి సలసల పొంగింది. మనసులో ఉడుకుతో పోలిస్తే శరీరం మీది వాపులు ఏమాత్రం బాధగా తోచలేదు.
"కాపడం చాలు, వెళ్ళు," కరుగ్గా అనాలనుకున్నాడు. దీనంగా వచ్చాయి మాటలు. ఎప్పుడూ అదే పరిస్థితి. ఈ అమ్మాయిని కఠినంగా ఎందుకు ఆజ్ఞాపించలేకపోతున్నాడు తను?
"అయితే నే వెళ్ళి స్నానం చేసిరానా?" అడిగింది.
"వెళ్ళు," హాట్ వాటర్ బేగ్ భాగవతార్ పక్కనే పెట్టి, "నొప్పి అనిపిస్తే నెమ్మదిగా ఒత్తుకో," అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది.
మృదుల వెళ్ళిపోగానే, "రాజభూషణంగారి పార్టీకి ప్లాస్టిక్ ముఖాలతో వచ్చిన వాళ్ళెవరో నీకు తెలుసా?" అడిగాడు భాగవతార్ ఏండెటోని.
"తెలీదు సార్. వాళ్ళురావడమే అలా వచ్చారు. వెళ్ళేవరకూ అలాగే ఉన్నారు. మా అమెరికాలో అప్పుడప్పుడు పార్టీలలో ఇలాంటి తమాషాలు చేసుకుంటాము. ఇండియాలో చూడ్డం అదే మొదటిసారి. అయినా మీ ఆంధ్రదేశం అన్ని విషయాల్లోనూ అమెరికాను తలదన్నేలా తయారౌతోందిలెండి." చెప్పాడు ఏండెటో.
పదిహేనేళ్ళకుర్రాడు చేతిలో కవరు పట్టుకుని హాల్లోకొచ్చి "మృదులగారున్నారా?" అని అడిగాడు.
"ఉన్నారు. ఎందుకు?" అడిగాడు భాగవతార్.
"లామా మింగియార్ గారు ఈ కవరు మృదులగారికియ్యమన్నారు" కవరు భాగవతార్ చేతిలోపెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఉత్తరం చింపి చదవబోయాడు భాగవతార్.
"అది మృదులగారి ఉత్తరం, మీరు చింపకూడదు." చటుక్కున అన్నాడు ఏండెటో. "మా మధ్య అలాంటివి లేవు" దురుసుగా అని ఉత్తరం చింపాడు.
"డియర్ మృదులా!"
రేపు మా యింటికి రావొద్దు. ఒకపనిమీద ముఖ్యమంత్రిగారింటికి వెళుతున్నాను. ఎల్లుండి సాయంత్రం నాలుగు- అయిదు మధ్య రండి. ఆ సమయంలో ఎవరూ ఉండరు.
మీ
మింగియార్ ...."
రెండు చేతులతో జుట్టు పీక్కున్నాడు పాపం, భాగవతార్.
సావేరి రాగంలో శ్యామశాస్త్రి కీర్తన "శంకరి శంకురు" అందుకున్నాడు భాగవతార్. తిశ్రగతిలో నడుస్తోంది తాళం. భాగవతార్ గానంతో పోటీపడుతూ మృదంగం వాయిస్తున్నాడు ఏండెటో. గాన కళా సరస్వతి బంగారు మువ్వలా అడుగులు కదుపుతూన్నట్లున్నది మృదంగ వాయిద్యం.
"ఎక్స్ క్యూజ్ మీ!"
పురుష కంఠం వినిపించి, ధ్యాన భంగం అయినట్లు తలలెత్తి చూసారు ఏండెటో, భాగవతార్. ఎవరో అపరిచిత వ్యక్తి.
"ఏం కావాలి?" కొంచెం చిరాగ్గా అడిగాడు ఏండెటో, అతడు తన్మయత్వంతో మృదంగం వాయిస్తున్నప్పుడు ఎవరేనా డిస్టర్బ్ చేస్తే తగని చిరాకనిపిస్తుంది.
మీ సంగీత సాధనకి భంగం కలిగించినందుకు క్షమించండి మృదులగారుండేది ఇక్కడేనా?"
ఈసారి చిరాకుపడటం భాగవతార్ వంతయింది.
"మృదులతో మీకేంపని? కరుస్తూన్నట్లు చూస్తూ అడిగాడు.
"కొంచెం కాన్ఫిడెన్షియల్ గా మాట్లాడాలి."
"ఏం మాట్లాడాలో నాకు చెప్పండి."
"సారీ! ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడే విషయాలు కావవి."
"నేనావిడ భర్తని."
"గ్లాటు మీట్ యూ"
"అంచేత మృదులకు చెప్పవలసిన విషయాలేమిటో నాకు చెప్పొచ్చు."
"అఫ్ కోర్స్ - కాని నేనడిగే ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పలేరు. అంచేత మీతో మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఇంతకీ మృదులగారు లేరా?" ఆ సమయానికి అక్కడికి కాపీ తీసుకొచ్చిన వంటమనిషి ఆ వచ్చిన వ్యక్తిని చూసి, "మృదులగారు లోపలున్నారు పిలుస్తాను" అని లోపలికెళ్ళింది. రెండు నిముషాల్లో మృదుల బయటికొచ్చి అపరిచిత వ్యక్తికి నమస్కారం చేసి "కూర్చోండి, నాతో మీకేంపని?" అంది.
అతడు మొహమాటంగా నవ్వి "కాన్ఫిడెన్షియల్ గా మాట్లాడాలి" అన్నాడు. మృదుల వెంటనే లేచి, "నా గదిలో కూర్చుందాం రండి" అంది. మృదుల వెంట ఆ కొత్తమనిషి మృదుల గదికి వెళ్తోంటే భాగవతార్ చెయ్యి జుట్టు పైకి వెళ్ళింది. ఏండెటో దాన్ని పట్టుకుని కిందికి దింపేశాడు. తన గదిలో కొత్త వ్యక్తికి కూర్చోవడానికి కుర్చీ చూపించి, "ఇప్పుడు చెప్పండి" అంది.
"నా పేరు మహావీర్. ప్రీలాన్స్ జర్నలిస్టుని. దేవకిగారికి సంబంధించిన సమాచారం కోసం వచ్చాను."
"నేను చెప్పగలిగేదేముంది? ఇప్పుడు తను హోటళ్ళలోను, క్లబ్ ల్లోనూ డాన్స్ చేస్తోందని అందరికి తెలిసిన విషయమే గదా!"
"అది కాదు. దేవకిగారు డాన్సర్ కావడానికి ముందు జరిగిన విషయాలు కావాలి. ఆమె డాన్సర్ కావడానికి దారితీసిన పరిస్థితులు, ప్లెమింగ్ ఇండియాకి రావడానికి-ఇవి కావాలి."
"అవి నాకెలా తెలుస్తాయి. నేను కూడా దేవకిని చాలా రోజుల తర్వాత మొన్ననే కలుసుకున్నాను."
"ఈ మధ్యనే మీరు కుసాయిగుడాలో ఆమె యింటికి వెళ్ళినట్లున్నారు కదా!"
"అవును! అయితే నేనామెను తన వ్యక్తిగత విషయాల గురించి ఏమీ అడగలేదు."
"అయినా ఆ ఇంటి వాతావరణం గురించి ఎంతో కొంత తెలిసిఉండొచ్చు కదా! నాకు అందిన సమాచారాన్ని బట్టి ప్లెమింగ్ ఇక్కడొక నర్సింగ్ హోమ్ లాంటిది నడుపుతున్నాడు. అక్కడికి ప్రధానంగా గర్భిణీ స్త్రీలు వెళుతున్నారు. ఏం జరుగుతోందక్కడ?ఎబార్షన్స్ ఇప్పుడు లీగలైజ్ చేసారు కదా! ప్రత్యేకించి ప్లెమింగ్ చేస్తున్నదేమిటి? అక్కడికి అందరికీ ప్రవేశం లేదని కూడా విన్నాను. ప్లెమింగ్ ఏదో రీసెర్చి చేస్తున్నాడని అందుచేత ఇతరులకి ప్రవేశం లేదని చెపుతున్నారు. అక్కడ జరుగుతున్న రీసెర్చి ఏమిటో మీకేమైనా తెలుసా?"
"తెలియదు. రీసెర్చి చేస్తున్నాడని అందుకు ఫ్రండ్స్ కావాలని మాత్రం తెలిసింది. నన్ను కూడా లోపలికి రానీయలేదు."
"పోనీ ప్లెమింగ్ గురించి మీకేమైనా వివరాలు తెలుసా?"
"తెలియదు. అతడితో నాకు అతికొద్ది పరిచయం. బిహేవియర్ నార్మల్ గా లేదని మాత్రం ఊహించాను."
"అలా ఎందుకనుకున్నారు?"
"నన్ను కిడ్నాప్ చేసి భాగవతార్ దగ్గిర రేన్ సమ్ డిమాండ్ చేస్తానని బెదిరించాడు. చాలా ఫూలిష్ గా తోచింది అతని ధోరణి."
"ఇంతకిమించి మీకేమీ తెలియదన్నమాట."
"తెలీదు. ఎవరితను?"
"ఏ దేశానికి చెందినవాడో మాకూ తెలియదు. అమెరికన్ గవర్నమెంట్ స్కాలర్ షిప్ సంపాదించి అక్కడ రీసెర్చి చేసేవాడనికి తెలుసు. ఏ కారణం వల్లనో అరెస్టు అయ్యాడు. దేవకి ఎలాగో డబ్బు సంపాదించి చాలా యాతనపడి అతడ్ని విడుదల చేయించగలిగింది. ఆ తరువాత అతడు ఇండియాకి ఎలా వచ్చాడో, ఇక్కడ ఏ రకమయిన రీసెర్చి చేస్తున్నాడో తెలియడం లేదు."
"గమ్మత్తుగా వుంది. అయితే ఈ విషయంలో నేనేం చెయ్యగలను? మీరు పోలీసు డిపార్ట్ మెంటుకి రిపోర్టు చెయ్యొచ్చుగదా?"
"మీరు సరిగా అర్ధం చేసుకోవడం లేదు. అసలు విషయం తెలుసుకోకుండా విషయం పోలీసుల దాకా వెళ్ళకూడదు. అతనికిక్కడ ఎవరో పెద్దవాళ్ళ అండదండలున్నట్లుగా తోస్తోంది. చెప్పాను గదా! నేను ఫ్రిలాన్స్ జర్నలిస్ట్ నని. సెన్సేషనల్ విషయాలు వ్యాసంగా వ్రాసి తగిన ఆధారాలతో పత్రికల్లో ప్రచురించడమే నా ధ్యేయం. పోలీసు రిపోర్టు ఇచ్చిందానికంటే సమర్ధంగా పరిష్కరించబడతాయి కేసులు."
"దేవకి. నా స్నేహితురాలు. తనని ఈ వ్యూహం నించి బయటపడేయటం నా ధ్యేయం. అయితే ఇది నిజంగా వ్యూహమేనా? దేవకి నిస్సయంగా ఇందులో చిక్కుకుందా? లేక ఆమెకి కూడా జరుగుతున్నదానిలో భాగముందా- ఇవన్నీ నాకు తెలియవు."
"దేవకి మింగియార్ బసకి లేదా అతని మఠానికి వెళ్ళివస్తూన్నట్లు తెలిసింది. మీరుకూడా అక్కడికి వెళుతున్నారని విన్నాను. మింగియార్ ద్వారా ఏమైనా తెలుసుకోగలరా?"
ఉలిక్కిపడింది మృదుల. మింగియార్ మఠానికి చాలామంది తమ ముఖాలు కనబడకుండా వస్తారని తెలుసు. వాళ్ళంతా ఏవో అతీంద్రియ శక్తుల సాధనకోసం, వ్యక్తిగత సమస్యల పరిష్కారాల కోసం, డాక్టర్ల వల్ల నయంకాని రోగాల నివారణ కోసం వస్తున్నారనుకుంటోంది యిన్నాళ్ళూ. ఇలాంటివన్నీ ఇండియాలో మామూలే. ఎటొచ్చి మొహాలు కనబడకుండా ముసుగుల్లో వుండడమే యిక్కడి విశేషం. అయితే దేవకి ఎందుకొస్తున్నట్లు? దీనిలో మింగియార్ పాత్ర ఎలాంటిది? అతడ్ని కుచ్చితంగా ఊహించుకోడానికి మనస్కరించడం లేదు.