Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 25


    దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అతడి మనసులో కదలాడింది.


                               9


    "శారదా!" పిలిచాడు మోహన్రావ్. శారద వంటింటిలో నుండి బయటి కొచ్చింది.

    "ఇలారా శారదా ! ఇక్కడ కూర్చో__" అన్నాడతను తాపీగా.

    శారద ఆశ్చర్యపోయింది. అతనలా సౌమ్యంగా, ప్రేమగా పిలిచి యుగాలయిపోయింది. పెళ్ళయిన కొత్తలో కొద్ది రోజులు - ఆ ఆప్యాయతను అనుభవించిందేమో ! అంతే ! ఆ తరువాత అతనిని తాగుడు మార్చేసింది, తన జీవితాన్ని నరకం చేసేసింది.

    "కూర్చో శారదా !"

    శారద అతని ప్రక్కనే కూర్చుంది.

    "ఎన్నో రోజులుగా నిన్ను చాలా బాధలు పెడుతున్నాను శారదా ! అదంతా నా మనసుకి నాకు తెలుస్తూనే వుంటుంది. ఎప్పటికప్పుడు నా ప్రవర్తనకు నీకు క్షమార్పణ చెప్పుకోవాలనుకుంటాను. కానీ మళ్ళీ ఓ చుక్క పడితే చాలు ! రాక్షసత్వం ఆవహించేస్తుంది." బాధగా అన్నాడతను.

    శారద ఆశ్చర్యపోయింది.

    "పోనీలెండి ! మీరు చేస్తున్నది తప్పని మీ మనసులోనయినా అనిపిస్తే చాలు! నేనీ బాధలను చిరునవ్వుతో సహిస్తాను."

    "శారదా ! భార్యకూ, ప్రాణ స్నేహితుడనుకున్న వాడికీ తేడా ఏమిటో ఇప్పుడు తెలిసింది నాకు. ఇన్ని హింసలు పెడుతున్నందుకు - భార్య తల్చుకుంటే - ఇంత విషం పెట్టి భర్త పీడ వదిలించుకోవచ్చు. కానీ ఏ భార్యా అందుకు పాల్పడదు. కాని నా తాగుడు అలవాటుని ఆసరాగా తీసుకుని నా ప్రాణ స్నేహితుడు నరసింహం ఏం చేశాడో చూశావా? నాకు విషప్రయోగం చేశాడు."

    శారద ఉలిక్కిపడింది.

    "ఏం జరిగిందండీ ?" గాభరాగా అడిగింది.

    "వ్యాపారం గొడవ నేనే మాత్రం పట్టించుకోకుండా అంతా అతని మీదే వదిలినందుకు - కుట్ర పన్ని నష్టం చూపిస్తున్నాడు."

    శారద ఆందోళనగా చూసిందతని వేపు.

    "అంటే ..."

    "అంటే - నరసింహం లెక్కలు నమ్మితే మనం కట్టు బట్టలతో మిగులుతాం ! కానీ నేనెంత తాగుబోతునయినా, నాకు వ్యాపారఅంటే ఏమిటో తెలుసు. నష్టం ఎప్పుడొస్తుందో, లాభం ఎప్పుడు వస్తుందో తెలుసు. అందుకే ఇవాళ నరసింహాన్ని మనింటికి రమ్మని పిలిచాను. ఇవాళరాత్రి అతని వ్యవహారం తేల్చేస్తాను. అలాంటి మోసాలు, దొంగ లెక్కలు నా దగ్గర పనిచేయవని హెచ్చరిస్తాను, ఇదంతా నీకెందుకు చెపుతున్నానంటే - తెల్లారేసరికి మనం ఏ పరిస్థితికి దిగజారినా నువ్వు భయపడకూడదు."

    "నాకు దరిద్రమంటే భయం లేదండీ! మీరు సవ్యంగా ఉంటే ఆనందంగా భరిస్తాను."

    "ఇవాళ నా తాగుడికి ఆఖరి రోజు శారదా ! రేపట్నుంచీ కొత్త జీవితం ప్రారంభిస్తాను. నరసింహంతో తెగతెంపులు చేసుకుని, మనం సొంత బిజినెస్ ప్రారంభిద్దాం ..."

    రాత్రి ఎనిమిదింటికి వచ్చాడు నరసింహం.

    అర్దరాత్రి పన్నెండింటి వరకూ ఇద్దరికీ గట్టిగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయ్. సమయం గడుస్తున్న కొద్దీ శారదకు ఆందోళన పెరిగిపోతోంది. తాగిన మైకంలో ఎవరెలా ప్రవర్తిస్తారో అన్న భయం ! కేకలు తారస్థాయి చేరుకునే సరికి ఇంక ఉండ బట్టలేక హరికృష్ణను నిద్ర లేపిందామె. 

    కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు హరికృష్ణ, "ఏమిటమ్మా ?"

    "హరీ ! ఓ సారి మీ నాన్నగారి గదిలోకెళ్ళి,  మంచినీళ్ళు కావాలేమో అడిగి రారా !"

    నిద్ర మత్తులోనే తండ్రి గదిలో కెళ్ళాడు హరికృష్ణ. అప్పుడే గదిలో శబ్దాలు మారినయ్. ఇద్దరూ పెనుగులాడుతున్నట్లు తెలిసిపోతోంది. ఆత్రుతగా తనూ పరుగెత్తి గది గడప దగ్గర ఆగి లోపలకు చూసింది. సరిగ్గా అప్పుడే నరసింహం చేతిలోని రూళ్ళకర్ర బలంగా మోహన్రావ్ నెత్తిన పడింది. రక్తం చివ్వున చిమ్మి నరసింహం బట్టలమీద పడి భయంకరంగా కనిపించసాగింది. వరుసగా అయిదారు దెబ్బలు పడిపోవటం నిశ్చేష్టురాలయి చూస్తూండిపోయింది.

    "అమ్మో ! నాన్నని చంపేశారు - నాన్నని చంపేశారు" అన్న హరికృష్ణ కేకలు గదంతా మార్మోగిపోయినయ్.

    కింద పడిపోయిన మోహన్రావ్ ని వదిలేసి నరసింహం హరికృష్ణను పట్టుకుని నోరు మూయటానికి ప్రయత్నించాడు. హరికృష్ణ మరింత భయంతో అతని చేతి నుండి తప్పించుకుని ఇంకా గట్టిగా అరుస్తూ బయటకు పరుగెత్తాడు. అతనిని తరుముతూ నరసింహం కూడా పరుగెత్తాడు.

    శారద ఒక్కసారిగా స్పృహలో కొచ్చింది. పరుగుతో మోహన్రావ్ ని చేరుకుని అతని మీద పడి ఎడ్చేయసాగింది. అతనిలో చలనం కనిపించకపోయే సరికి దుఃఖం మరింత ఎక్కువయి పోయింది.

    కొద్ది నిమిషాల తర్వాత గది తలుపులు మూసిన చప్పుడు విని వెనక్కు తిరిగి చూసింది.

    నరసింహం నిలబడి వున్నాడు.

    "శారద ! ఇప్పుడింక ఏడ్చినా లాభం లేదు. మోహన్రావ్ చచ్చిపోయాడు. నీ కొడుకుని ఇక్కడకు పంపి అనవసరంగా వాడిని కూడా దూరం చేసుకున్నావు. వాడు భయపడి ఎక్కడికో పారిపోయాడు ..." 

 Previous Page Next Page