దార్కాకు ఒక్కసారిగా నిస్పృహ ఆవరించింది. తను తులసి గురించి ప్రకటన ఇస్తే, ఈ దెయ్యాలు తోలేవాడు వచ్చాడు స్మశానానికి.
"చెప్పు -కాష్మోరా ఎవరు? దాని గురించి నీకెలా తెలిసింది."
దార్కా నవ్వేడు "కాష్మోరా గురించి అలా ప్రకటిస్తే మానవాతీత శక్తులు అలవడతాయని చదివేను ఎక్కడో అందుకుని....." అన్నాడు.
ఆ మూర్ఖత్వం చూసి అబ్రకదబ్రకు నవ్వొచ్చింది. కానీ అంతలోనే తీరని అనుమానంతో దార్కా కళ్ళలోకి చూస్తూ "నిజం చెప్పకపోతే వళ్ళు చీరేస్తాను" అన్నాడు. ఒకరికి కావాల్సిన విషయం ఒకరు తెలుసుకోవడం కోసం ఎంత పక్కపక్కగా వెళుతున్నారో ఇద్దరికీ తెలియలేదు. అప్పటికే దార్కా వళ్ళంతా చీరుకుపోయి ఉంది. ముళ్లు గుచ్చుకుని రక్తం స్రవిస్తూంది. బట్టలు పీలికలైపోయాయి. అబ్రకదబ్ర చేతులమధ్య అతడు శవంలా జారిపోతున్నాడు.
"నాకు తెలీదు ఇంకేమీ" అంటున్న దార్కా మాట పూర్తికాలేదు గెడ్డంకింద ఇంకొకసారి దెబ్బ పడింది.
దార్కా కూలిపోయాడు కుప్పగా.
వెన్ను దగ్గిర తగిలిన రాయి నరాల్ని పిండేస్తూంది. "పిచ్చి పిచ్చి మంత్ర తంత్రాలతో మనుష్యుల్ని భయపెట్టి బాధపెట్టే నీకు యిదే శిక్ష" అంటూ తిరిగి చేతులు దులుపుకుని కారు దగ్గరకు వెళ్ళిపోయాడు బ్రాహ్మిణ్.
అచేతనంగా పడివున్నాడు దార్కా. స్మశానాపు చరచరాలన్నీ తమ సహచరుడి స్థితికి జాలిగా మౌనం వహించినట్టు వున్నాయి.
ఆ నిశ్శబ్దాన్ని చెదురుస్తూ కారు కదిలి వెళ్ళిపోయిన శబ్దం. అదీ తగ్గిపోయింది - దూరంగా నెమ్మది నెమ్మదిగా.
ఆ నీరవంలో అచేతనంగా పడివున్న దార్కా నెమ్మదిగా తలెత్తాడు.
అతడికి అడుగు దూరంలో కాలి జాడలున్నాయి.
అతడి ప్రత్యర్ధివి
దార్కా చేతుల్లోకి బలం తీసుకుని కొద్దిగా ముందుకు దూకేడు. ఆ అడుగుజాడ ముద్రలోంచి కాలి క్రింద నలిగిన మట్టిని చేతిలోకి తీసుకున్నాడు.
అతడి కళ్ళు మూతలు పడుతున్నాయి. శరీరం తేలిపోతున్నట్టు భావన.
అప్పుడు స్ఫురించింది అతడికి, తన గురువైన ఆచార్యుల వారికి్చిన వాగ్దానం............ దక్షిణంగా గురువుకు చేసిన ప్రతిజ్ఞ.......
"ఆ ముగ్గుర్నీ తప్ప ఇంకెవర్నీ చంపను నేను. నాకున్న విద్యల్తో నాలుగో వ్యక్తికి ద్రోహం తలపెట్టను......"
అతడి పిడికిలి నెమ్మదిగా విచ్చుకుంది. చేతిలోని మట్టి భూమ్మీద మట్టిలో కలిసిపోయింది. తనకి కావలసిన ముగ్గురిలో తనని కొట్టినవాడు ఒకడని అతడికి తెలీదు. అతడి తల వాలిపోయింది పక్కకు.
స్పృహ తప్పుతూంటే దూరంగా ఒక కారు వస్తూన్న శబ్దం వినిపించింది. అది మైలురాయి దగ్గర ఆగింది. అందులోంచి ఒక స్త్రీ దిగింది. ముందురోజు అతడికోసం పత్రికాఫీసుకు ఫోన్ చేసిన స్త్రీ ఆమే -
సిద్ధేశ్వరీదేవి !
8
అబ్రకదబ్ర ఇంటికి వచ్చాడన్న మాటేగానీ సంతృప్తిగా లేడు.
అసలు ఆ ప్రకటన ఏమిటో ఎందుకో అర్ధం కాలేదు.
తులసి కోసం కాష్మోరా వేచి వుండడం ఏమిటి ? దానికి పత్రికా ప్రకటన ఏమిటి? ఎవరిచ్చి వుంటారు ఆ ప్రకటన? స్మశానంలో తనను కలిసిన కుర్రవాడికి, ఈ కాష్మోరాకి ఏమిటి సంబంధం?
అన్నీ అనుమానాలే. ఒకవేళ ఈ కుర్రవాడు ఎవరిచేతనయినా నియమించబడిన వాడు అయితే.......
ఎవరిచ్చి వుంటారు ఈ ప్రకటన?
ఈ తెరవెనుక వున్నవాడు ఎవడు?
తెర వెనుక అన్న ఆలోచన రాగానే అతడికి వెంటనే స్ఫురించింది ఒక పేరు -
'శ్రీనివాస పిళ్ళయ్' మరి ఆగలేదు.
కారు వేసుకుని బయలుదేరాడు.
కారు శ్రీనివాసపిళ్ళయ్ (ఒకప్పటి) ఇంటిముందు ఆగింది.
ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ వుంటున్నాడు ఆ ఇంట్లో అబ్రకదబ్ర శ్రీనివాస్ పిళ్ళయ్ గురించి అడిగేడు.