Previous Page Next Page 
నిర్భయ్ నగర్ కాలనీ పేజి 25


    "హోమియోపతి ప్రకృతి సహజమైన అతి ముఖ్యమైన ప్రిన్సిపుల్ మీద పనిచేస్తోంది. ముఖ్యంగా మన ప్రాచీన భారత వైద్య శాస్త్రానికి హోమియోపతి వైద్యం ఎంతో దగ్గరగా ఉంది. ఉదాహరణకు 'ఉష్టం ఉష్ణేన శీతలం' అనేది మన ప్రాచీన వైద్య విధానానికి చెందిన సూత్రం. హోమియోపతి కూడా అదే సిద్ధాంతం ప్రకారం పని చేస్తుంది. అందుకే హోమియోపతి మందులు ముందు రోగి జబ్బుని మరింత పెంచి అప్పుడు దానిని తగ్గించేందుకు చర్య ప్రారంభిస్తుంది-"
    నాకు ఆ మాటల్లో ఏదో గొప్ప మెసేజ్ కనిపించింది.
    ఆ రూల్ మా ప్లాట్స్ గొడవకు కూడా వర్తిస్తుందనిపించింది.
    అంటే అన్యాయాన్ని అన్యాయంతోనే ఎదుర్కోవాలి! అక్రమాన్ని అక్రమాలతోనే ఎదుర్కోవాలి! గూండాయిజాన్ని గూండాయిజంతోనే ఎదుర్కోవాలి.
    అంతేకానీ తెల్లారి లేస్తే ఆ గూండాల దయాదాక్షిణ్యాల మీద బ్రతికే పోలీస్ సహాయం కోరగూడదు. ఎదుటిమనిషి ఎంత పెద్దమనిషి అన్న విషయం వదిలేసి వాడు తెచ్చుకున్న సాక్ష్యాధారాలకు విలువిచ్చే కోర్ట్ ల సహాయం తీసుకోకూడదు.
    ఉదయం లేస్తూనే ఆవేశంగా వెళ్ళి శాయిరామ్ ని నిద్రలేపాను.
    "వెంటనే మన వాళ్ళందర్నీ పిల్చుకురా! రాత్రి నాకు బ్రహ్మాండమైన అయిడియా వచ్చింది. మన ప్లాట్స్ లోనుంచి ఆ గుడిశెల వాళ్ళను ఒక్కరోజులో లేపేద్దాం-" అన్నాను.
    పావుగంటలో అందరూ వేదిక దగ్గర గుమిగూడి పోయారు. నేను చాలా గర్వంగా నా ప్లాన్ వాళ్ళకు చెప్పాడు.
    "మనం చేయాల్సింది చాలా సింపుల్! శంకర్ దాదా దగ్గరకెళ్ళి ఎంతోకొంత రేటు మాట్లాడి డబ్బు ఇచ్చేశామంటే మన ప్లాట్స్ లోనుంచి వాళ్ళందరినీ దెబ్బకు ఖాళీ చేయిస్తాడు శంకర్ దాదా!"
    అందరికీ ఆ ఆలోచన నచ్చింది.
    నిజానికి గూండాయిజాన్ని ప్రోత్సహించడం మాలో ఎవరికీ ఇష్టం లేదు కానీ మేము కష్టార్జితానికి నీళ్ళు వదులుకోకుండా వుండాలంటే అంతకంటే గత్యంతరం లేదు.
    అప్పటికప్పుడే తలో వెయ్యి రూపాయిలూ పోగుచేసి, ఆ మొత్తం తీసుకుని శంకర్ దాదా ఇంటికి చేరుకున్నాం. అప్పటికి టైమ్ పదవుతోంది.
    అప్పుడే గుడుంబాతో మొఖం కడుగుతున్నాడు శంకర్ దాదా.
    మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాడు.
    "ఏమ్ సంగతి- చాల్దినాలకొచ్చిన్రు" అన్నాడు మొఖం కడగగా మిగిలిన ద్రావకం త్రాగేస్తూ.
    సంగతంతా చెప్పామతనికి.
    కొద్దిక్షణాలు ఆలోచనలో పడ్డాడు శంకర్ దాదా.
    "ఆ ఏరియా దాదా ఎవరు? పాండూ దాదానా?" అడిగాడు మమ్మల్ని.
    "అవున్సార్"
    "గట్లనా? ఆడయితే కొంచెం కిరికిరి కొడుకే" మళ్ళీ ఆలోచనలో పడ్డాడు.
    "మీరెంత డబ్బంటే అంత ఇచ్చేస్తాం సార్!" అన్నాడు రంగారెడ్డి ఆ మాటతో శంకర్ దాదా మొఖంలోకి కళ వచ్చేసింది.
    "అగో చెప్పక పోతిరి మల్ల! ఇంకా మీ కేస్ లో పుకట్ గా పని జేయాలనుకుంటున్న! పైసల్దెస్తే కిరికిరి మున్నదివయ్యా? నిమిషాల్ల ఖాళీ జేయ్ పిస్త! సమజయిందా?"
    "అయింది సార్!"
    "ఎన్ని పైసలు తెచ్చిన్రు?"
    "పదివేల్సార్"
    "పదివేలా? పదివేలకు గిసంటి ఖతర్ నాక్ పనులెవళ్ళు జేస్తారయ్యా! పదిహేను వేలయినగాని వుండాలె!"
    మేము మారు మాట్లాడకుండా పదిహేనువేల రూపాయలు అతని చేతిలో పెట్టాము.
    అతను మావేపు ఆప్యాయంగా చూశాడు.
    "ఇగో- ఇంక ఇండ్లకు పోయి భేపికరుండండి! రేపీ టైమ్ కల్లా మీ జాగాలన్నీ ఖాళీ అయిపోతై సమజయిందా?"
    "అయింది సార్" అన్నాడు యాదగిరి.
    "అయితే ఇకపోండ్రి"
    మేమంతా కాలనీ కొచ్చేశాము.
    మర్నాడు ఉదయం మేము ప్లాట్స్ దగ్గరకెళ్ళేసరికి సగం గుడిశెళు కనిపించడంలేదు.
    అయితే మిగతా సగం ఇంకా ఉండటం ఇబ్బందికరంగా అనిపించి మళ్ళీ శంకర్ దాదా దగ్గరకెళ్ళాం. ఆ టైమ్ లో గుడంబాతో స్నానం చేస్తున్నాడతను.
    "ఏమాయే? ఖాళీ జేసిన్రుగదా ఆళ్ళు-" అడిగాడతను గుడంబా నెత్తినబోసుకుంటూ.
    "సగం మందే చేశారు సార్"
    "మిగతా వాళ్ళు ఆ ఏరియా ఎమ్మెల్యే గ్యాంగ్ రాభయ్! నేను పోయి ఎమ్మెల్యేను బ్రతిమిలాడితేగానీ పోరు-"
    "ఒక్కసారి ఆయన్తో మాట్లాడండి సార్"

   "మాట్లాడిన లాభంలేదురాభయ్! ఆడసలే పైసల్ కోసం గడ్డితినేటైప్- కనీసం ఓ పదివేలైనా వానికియ్యకపోతే ఒప్పుకోడు."
    గత్యంతరం లేక శంకర్ దాదాకి ఇంకో పదివేలిచ్చాం.
    "మంచిది బిడ్డా! నేనిప్పుడే ఎమ్మెల్యేతానకు బోయి- సెటిల్ జేస్తా-" అన్నాడతను.
    రెండోరోజు ఉదయానికి పూర్తిగా గుడిశెలన్నీ ఆనవాల్లేకుండా లేచిపోయినయ్.
    పోలీసుల వల్లా, కోర్టుల వల్లా కాని పని కేవలం గూండావల్ల అయిందంటే నిజంగా మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో, మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఉన్నత స్థితిలో వుందో, మనరాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులో- మాకు అర్థమయింది. తిన్నగా అందరం శంకర్ దాదా ఇంటికి చేరుకున్నాం.
    "మళ్ళీ వచ్చిన్రేమి సంగతి? ఇంకెవళ్ళయినా ఖాళీ చేయకుండ మిగిలిన్రా?" అడిగాడతను.
    "లేద్సార్! అన్ని గుడిశెలూ లేచిపోయాయ్! మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీడం లేదు" అన్నాడు రంగారెడ్డి.
    "అరె- నీ యవ్వ- దాన్దేమున్నది భాయ్! ఒక జాగాల వున్నోళ్ళం! మంచిగ ఒకరి గురించి ఒకళ్ళు సహాయం చేసుకోవాలె! ఏం జెపున్నా! గట్లనే జరవచ్చే ఎలక్షన్ల గురించి గూడా ఖ్యాల్ తోటుండండి! నేనే ఎంపీగా ఈ ఏరియాకి నిలబడుతున్నా-"
    అందరం అతనికే ఓట్లువేస్తామని ప్రామిస్ చేసి అక్కడి నుంచి మా కాలనీ వైపు బయలుదేరాం ఆనందంగా. దాదాలూ, మర్డరర్లూ, గాంగ్ లీడర్లూ, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎందుకు ఎన్నికౌతున్నారో అప్పుడే తెల్సింది మాకు.

                                  *  *  *  *  *

 Previous Page Next Page