"ఛీ! ఛీ! ఇలాంటి వాళ్ళతో నీకు స్నేహాలేమిటే? ఇలా అడ్డమైన వాళ్ళనీ ఇంటికెందుకు రానిస్తున్నావే?" అని తులసిని కసిరింది.
భార్య ఏ మాట మాట్లాడినా దానిని ఖండించి దెబ్బలాడటానికి సిద్ధంగా ఉండే నీలకంఠము వెంటనే అందుకుని, "నోటికొచ్చినట్లు వాగకు. ఇంటికొచ్చిన వాళ్ళని మర్యాద చెయ్యాలని కూడా తెలియదు. కాస్త కాఫీ తీసుకురా!" అన్నాడు చంద్రని గొప్పగా తినేసేలా చూస్తూ.
ఆ మాటలతో ఎప్పటికంటే ఎక్కువగా రెచ్చిపోయింది సుమతి.
"ఏమిటీ? నేను దీనిని మర్యాద చెయ్యాలా? నీ కన్ను దీనిమీద పడిందన్నమాట! మీరిద్దరూ కులాసాగా కూచుంటే, కాఫీలు అందియ్యటానికి నేను....."
చంద్ర చటుక్కున కూచున్న చోటునుంచి లేచి ఉద్రేకముతో వణికిపోతున్న సుమతిని గట్టిగా పట్టుకొంది. చంద్ర ముఖం విచిత్రంగా మారిపోయింది. ఆ ముఖములో వెనుకటి ఆవేదనకాని, రోషము కాని, మచ్చుకైనా లేదు. ఆ ఇంట్లో వ్యక్తులందరినీ చూస్తో వెటకారంగా నవ్వుకుని, "సుమతి గారు! మీరు అనవసరముగా ఉద్రేకపడకండి. మీ శ్రీవారి కన్ను నామీద పడినా, పడకపోయినా మీకేమీ నష్టము లేదు. ఎందుకంటే మేము మీ శ్రీవారిలాంటి సామాన్యులకు అందుబాటులో ఉండేవాళ్ళముకాము. వందలు వందలు మాకోసం తగలబెట్టే శక్తి మీ శ్రీవారికి ఎలాగూ ఉండదు గనుక, ఆయన మిమ్మల్నే అతిగాఢముగా ప్రేమిస్తారు. ఈ ఇల్లు వదిలితే మీకు మరొక ఆశ్రయము లేదు గనుక, మీరు ఆయన పాదపద్మాలు వదలరు. అందుచేత మీ శ్రీవారి ఏకపత్నీ వ్రత్యానికి కాని మీ పాతివ్రత్యానికి కాని ఏనాటికీ టోకరా ఉండదు" అంది.
తెల్లబోయి నిలబడిపోయింది సుమతి. తలకొట్టేసినట్లుగా ఉంది తులసికి.
"తులసిగారూ! మీరు చిన్నతనంలో ఎంతో మంచితనంతో ఉండేవారని సూర్యం చెప్పారు. ఆ మంచితనాన్నే ఆశించి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. వెళ్తాను.... మీకు నానుండి ఏదైనా సహాయం కావాలంటే అడగటానికి సంకోచించకండి."
చంద్ర, సూర్యం పేరు చెప్పి ఏదో చనువునూ, సాన్నిహిత్యాన్నీ ప్రదర్శించబోయినప్పుడల్లా తులసి మనసులో హాలాహలజ్వాలలు లేస్తున్నాయి.
"మీ ముందు చెయ్యిజాపి సహాయం కోరే దశ రావటం కంటే నికృష్ట దశ మరొకటి ఉండదు" అంది.
చంద్ర ఒక్కసారి నిదానంగా తులసి ముఖంలోకి చూసి, నిట్టూర్చి వెళ్ళిపోయింది. ఒక విధమయిన నిరాశా భావంతో నిట్టూర్చిన చంద్ర ముఖం తులసిని వదలలేదు.
ఆ ముఖంలో అంత అమాయకత్వమూ, ఏదో పసి తనపు నైర్మల్యమూ కనిపిస్తోందేమిటి?
13
తులసికి జ్వరం తగ్గలేదు సరికదా, వొళ్ళంతా నొప్పులు ప్రారంభమయ్యాయి. అప్పుడు గాని, కషాయాలలాంటి సొంత వైద్యాలు మాని, డాక్టర్ కి చూపించుకోవాలని బుద్ధి పుట్టలేదు. ఎవరో తెలిసిన వాళ్ళని అడిగి కొంచెం మంచి డాక్టరని పేరుపడ్డ ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ క్యూని చూసి కళ్ళు తిరిగాయి తులసికి. ఎక్కడ చూసినా క్యూలు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో క్యూలు, ప్రైవేట్ డాక్టర్ల దగ్గర క్యూలు, అంతటా, అన్నిచోట్లా 'క్యూ'లు. క్యూలో కూచుని కూచుని ఎప్పటికో డాక్టర్ దర్శనం చేసుకుని విజిటింగ్ ఫీజ్ పది రూపాయలూ చెల్లించుకున్నాక, ఆ డాక్టర్ పరీక్ష చేసి చెప్పిన దాని సారాంశం..... "ఈ జ్వరం ఫలానా అని చెప్పటానికి వీల్లేకుండా ఉంది. వొళ్ళు నొప్పులు కూడా అంటున్నారు. కుడిచేతి వేళ్ళు అప్పుడే పట్టు తప్పిపోతున్నాయి, మీరు వెంటనే, రాయ వెల్టూరుకు వెళ్ళి స్పెషలిస్ట్ లకు చూపించుకోవటం మంచిది."
ఆ మాటలు విన్నాక ఎంత ఆశాభంగం కలిగిందో, అంత మండిపోయింది తులసికి. "నా జబ్బు డయాగ్నైజ్ చెయ్యలేకపోయాం, నా దగ్గిర విజిటింగ్ ఫీజ్ ఎందుకు తీసుకున్నట్లు? నా పదిరూపాయలూ నాకిచ్చెయి" అని అడగాలనిపించింది. అలా అడగలేక, ఏడుపు నవ్వుతో డాక్టర్ కొక నమస్కారం చేసి ఇవతలపడి, చూస్తూ చూస్తూ ఆటోకి డబ్బు ఖర్చుపెట్టలేక, అరగంట బస్ కోసం నిలబడి, బస్ లో కిక్కిరిసి ఉన్న జనం మధ్య ఊపిరాడకుండా మరో అరగంట నిలబడి, ఇంటికి చేరుకొనేసరికి ఇంటిదగ్గర సూర్యం ఉన్నాడు.
"డాక్టర్ దగ్గరకు వెళ్ళారుటగా! ఏమన్నాడు డాక్టర్?" ఆదరముగా అడిగాడు సూర్యం.
తులసి ఆ మాటలకు సమాధానము చెప్పకుండా, "వంట్లో బాగుండక తలా అదీ సమంగా దువ్వుకోకుండా వెళ్ళాను. దానికి తోడు బస్ లో తుక్కుతుక్కయి వచ్చాను. ఎలా ఉన్నానో_ఏమిటో?" అంది.
సూర్యం గమ్మత్తుగా నవ్వాడు. అక్కడితో తులసికి తాను చేసిందేమిటో తెలిసివచ్చి చాలా సిగ్గుపడింది. అభిమానముతో, ఆ సిగ్గు రోషముగా మారింది.
"చంద్ర చెప్పింది, మీరు డాక్టర్ దగ్గరకి వెళ్ళకుండా కషాయాలు తీసుకొంటున్నారని. అందుకే ఒకసారి వచ్చి డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యమని మీకు చెప్పాలనుకున్నాను. మీరే వెళ్ళారని తెలిసింది. ఏమన్నాడు డాక్టర్?"
ఆ సమయంలో చంద్ర ప్రస్తావన అగ్గిమీద గుగ్గిలం జల్లినట్లయింది తులసి మనసుకు.
"మీ దయకు చాలా థాంక్స్! కానీ, నా యోగక్షేమాలు విచారించడానికి చంద్ర రాకుండా ఉంటేనే సంతోషిస్తాను నేను."
ఈ మాటలకు సూర్యం కొంచెం నొచ్చుకున్నా, నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అనునయముగా, "తులసీ! నువ్వు చంద్రను సరిగా అర్థంచేసుకోవటం లేదు. పాపం! ఎంతో అభిమానముతో నిన్ను చూడాలని వచ్చింది. ఇక్కడ జరిగిన సంగతులన్నీ చెప్పింది. తనకు అంత అవమానం జరిగినా, నీకెలా ఉందో కనుక్కుని తనకు చెప్పమంది" అన్నాడు.
తులసి మనసు మరింత భగ్గుమంది.
"ఆవిడ నా ఆరోగ్యం ఎలా ఉందో చెప్పమన్నారని వచ్చారా మీరిక్కడికి?"
తెల్లబోయాడు సూర్యం.