Previous Page Next Page 
అజ్ఞాత బంధాలు పేజి 25

 

    బాపినీడుని చూసి పకపక నవ్వింది రాగిణి. "ఇన్నాళ్ళకు మిసెస్ బాపినీడుగా నా బతుకు పండింది, నీతో సరిసమానమయిన సాంఘిక హొదా అనుభవిస్తున్నాను. ఇవాక నుంచి నీకు నాకు పరువు ప్రతిష్టలు సమానమే! ఇద్దరం కటకటాల వెనక కలిసి మెలిసి కాపురం చెయ్యచ్చు!"
    రాగిణి మాటలకు బాపినీడు కసిగా పళ్ళు నూరు కొంటుంటే మరింత నవ్వింది రాగిణి.


                                          20

    రాష్ట్రమంతా మాధవరావుకు జేజేలు పలికింది. వార్తా పత్రికలన్నీ మాధవరావును ప్రశంశించాయి.
    ఇంతటి జయజయ ధ్వానాల మధ్య బయటికి రాకుండా ఇంట్లో పడుకున్నాడు మాధవరావు.
    ఎంతో సంతోషంతో అభినందించటానికి వచ్చిన లలిత మాధవరావును ఆ స్థితిలో చూసి విస్తుపోయింది.
    "అలా ఉన్నారేం?" అంది ఆందోళనగా.
    "మణిమాల డాక్టర్ వినోద్ దగ్గిరకు వెళ్ళిపోయింది. ఇక్కడకు రానని ఉత్తరం రాసేసింది!"
    బొమ్మలా నిలబడిపోయింది లలిత.
    వృత్తిలో మాధవరావు సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఈనాడు అతను ఆనందంతో పొంగి పోవలసిన మాట, కానీ.....
    లలితకు ఎన్నెన్నో మాటలు నోటి చివరవరకు వచ్చి ఆగిపోతున్నాయి, ఏ ఒక్క భావాన్నీ మాటల్లో పెట్టలేకపోతోంది......
    "సమాజం చిత్రమైనది లలితా! భార్య లేచిపోతే భర్తనే చులకనగా చూస్తుంది. ఫలాని వాడి భార్య లేచిపోయింది అని చెప్పుకుంటుంది. అది ఆ భర్త లోపంగా భావించి నవ్వుతుంది. సంఘంలో ఇలా నవ్వుల పాలు కావటం నాకిష్టం లేదు. అందుకే ఇంతవరకూ ఎంతో సహించాను. కానీ చివరికీ నేనిది ఎదుర్కోక తప్పలేదు! నా అపరాదమేమీ లేకుండానే నా కింత పెద్ద శిక్ష."
    "మీరు......మీరు.........సంఘం కోసమే ఇంతగా భయపడుతున్నారా? అందుకే బాధ పడుతున్నారా?"
    "పూర్తిగా అదొక్కటే కాదు. మణిమాలను నే ఎంతో ప్రేమించాను. అన్నీ తెలిసి కూడా మణిమాలను వదులుకోలేక పోయాను. మణి నా కళ్ళముందు నా ఇంట్లో ఉంటే చాలనుకున్నాను. ఎందుకో ఇప్పటికీ మణిమాల డాక్టర్ వినోద్ ని ప్రేమించిందని నమ్మలేక పోతున్నాను.తనిలా వెళ్ళిపోతే నేను భరింపలేనని తెలుసు. ఎందుకు వెళ్ళిపోయిందో?"
    నిలువునా వణికిపోయింది లలిత. మణిమాల ఎందుకు వెళ్ళిపోయిందో మాధవరావుకు తెలియకపోయినా లలితకు తెలుసు.
    "నన్ను క్షమించండి? ఈ దారుణానికి నేనే కారకురాలినెమో!"
    "చ! నిన్ను అనుమానించి వెళ్ళిపోయిందనుకుంటున్నావా, మణిమాల?"
    "అది కాదు. ఆవిడ ఇక్కడున్నంతవరకూ మీరు మరొకరిని ప్రేమించరని అన్నాను......."
    నిర్ఘాంతపోయి చూసాడు మాధవరావు. లలిత తడబడిపోయింది.
    "నన్ను అర్ధం చేసుకోండి. ఆవిడ వెళ్ళిపోవాలని నేనా మాట అనలేదు. మీరు మరొకరిని ప్రేమించరనీ , ఆవిడ మిమ్మల్ని బాధ పెట్టడం న్యాయం కాదనీ......"
    మాధవరావు ముఖం చూస్తోన్న లలితకు మాటలు పెగల్లేదు. అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడే ఉండి అతన్ని ఓదార్చి ధైర్యం చెప్పాలనుకుంది. ఎలాగైనా ఆ ముఖంలో దిగులును మరిపించి చిరునవ్వు తెప్పించాలనుకుంది. కానీ ఈ పరిస్థితుల్లో తన ప్రవర్తనా ఎలా అర్ధం చేసుకుంటాడో మాధవరావు? తను కావాలని మణిమాలను పంపించేసి ఇలా దగ్గర కావటానికి ప్రయత్నిస్తోందనుకుంటే .......అనుకుని చీదరించుకుంటే.
    ఆ రాత్రే దారుణం జరిగిపోయింది . మాధవరావు ఉత్తరాలతో బెదిరించిన దుండగులు కేవలం బెదిరింపులతో ఆగిపోలేదు. అక్షరాలా తమ మాటలు అమలు జరిపారు. పదిమంది గుండాలూ మాధవరావు ఇంటి మీదకొచ్చి పడ్డారు. మాధవరావు నిద్రలో ఉండడం వల్ల వెంటనే ప్రటిఘతించలేకపోయాడు. అతనికి తీవ్రంగా గాయాలు తగిలాయి. రక్తం అపరిమితంగా స్రవించింది. ఆ మరునాటికి కానీ ఎవరికీ ఏ విషయమూ తెలియలేదు. వంటిమీద స్పృహ లేని దశలో అతడ్ని డాక్టర్ వినోద్ హాస్పిటల్లో నే చేర్పించారు. మాధవరావును హాస్పిటల్లో చూసి పిచ్చిదయిపోయింది మణిమాల. అతని బెడ్ దగ్గరే ఉండిపోయింది.

 Previous Page Next Page