Previous Page Next Page 
సంకెళ్ళు మరియు పిల్లదొంగ పేజి 25


    
    "ఊ" అన్నాడు చలం.
    
    "శంకరం ఇంటికి చేరేసైర్కి తల్లి "ఇంత ఆలస్యం అయిందేమిట్రా?" అనడిగింది. "ఇవ్వాళ చాలాసేపటివరకూ ఆడుకున్నానే అందుకని" అన్నాడు శంకరం. శాంతమ్మ కొడుక్కి ఫలహారంపెట్టి కాఫీ ఇచ్చింది.
    
    శంకరం కాఫీ తాగి పెరట్లోకి పోయేటప్పటికి రాముడు చెట్లకు నీరు పోస్తున్నాడు. వాడిని చూసేసరికి శంకరానికి జాలి వేసింది. తన ఈడే వాడిది. కాని గొడ్డులాగా తన ఇంట్లో ఎలా పని చేయించుకుంటున్నారో! పొట్టిలాగు మాత్రం వేసుకున్నాడు. చొక్కాలేదు. తడుస్తుందని తీసివేసినట్లున్నాడు వాడి శరీరంలోనుంచి స్పష్టంగా కనిపిస్తున్న బొమికల్ని లెక్కపెట్టవచ్చు. అప్పుడప్పుడూ నాన్న వాణ్ణిచూసి అవేమాటలు గుర్తుకొచ్చినై. "తిన్న తిండంతా ఏమయిపోతుందిరా, అలా ఊచలాగా చస్తావు? దొంగపొట్టరా నీది, పాముపొట్ట" అని వాడు అన్నం తింటుంటే తను చాలాసార్లు చూశాడు. అప్పుడప్పుడు ఏమైనా పండగ వస్తే అమ్మ వాడికి ఇక్కడే అన్నం పెడుతుంది. ఏం తింటాడు? తనే అసలు తక్కువ తింటాడని అంటుంది అమ్మ తను తినేదాంట్లో సగమైనా తినడుగా వాడు ఐతే అది గొడ్డుతిండి ఎలా అవుతుంది?

    "ఈపూట అన్నం తిన్నావురా రాముడూ?" అని అడిగాడు శంకరం అక్కడ కూచుంటూ.
    
    రాముడు తలెత్తి చూశాడు. "ఎందుకండి బాబుగారు?" అన్నాడు జాలిగా.
    
    "ఊరికినేలే, చెప్పరా"
    
    "లేదండి."
    
    ఇటువంటి మాటలు వినటం శంకరానికి చేతగాదు. విన్నా విని సహించటం అంతకంటే చేతకాదు. వెంటనే జేబులోకి చెయ్యిపోనిచ్చి వెదికాడు. ఒక పావలాకాసు మాత్రం చేతికి తగిలింది. అది బయటికి తీసి "ఇందరా" అన్నాడు. రాముడు చూసి "ఎందుకండీ?" అన్నాడు కొంచెం సిగ్గుపడుతూ. "ఫర్వాలేదు తీసుకోరా" అంటూ శంకరం అందిచ్చాడు. రాముడు అందుకున్నాడు. కాని చేయిదాటి క్రిందపడింది.
    
    సరిగ్గా అదే సమయానికి శాంతమ్మగారు బయటికి వచ్చింది. కొడుకు చేస్తున్న ఘనకార్యం ఆవిడ కళ్ళబడింది. ఆవిడనుచూసి రాముడు భయపడి పోయాడు. "ఏమిట్రా అదీ" అని ఆవిడ అడగకముందే "ఏం...ఏంలేదండీ!" అంటూ నచ్చులుకొట్టాడు. శంకరానికి కూడా కొద్దిగా భయంవేసింది. అయినా కప్పిపుచ్చుకుని "అదికాదమ్మా... పాపం యీపూట అన్నం తినలేదుట అందుకని ఇచ్చాను" అన్నాడు.
    
    "బాగానే వుందిలే నీ నిర్వాకం. ఇందుకేనా ఏమిటి నీకు డబ్బులివ్వటం? దానధర్మాలు జోరుగా సాగుతున్నట్లున్నాయేం, ఏడిసినట్లుగానే వుందబ్బాయ్" అంటూ నాలుగు తిట్టి ఆ పావాలాకాసు కాస్తా తీసుకుని లోపలికి చక్కా పోయింది. శంకరానికి తలకొట్టేసినంత పనయింది. కోపంతోనూ, అవమానం తోనూ అతని శరీరం దహించుకుపోయింది. ఏమీ మాట్లాడలేక బయటకి వచ్చేశాడు. "అమ్మకూడా చెడ్డదే కాని నాన్నకంటే కాదు" అనుకున్నాడు చాలాసేపు అయిన తర్వాత.
    
                                            4
    
    శంకరం మరునాడు స్కూలుకు పోయేసరికి బడంతా మహా హడావుడిగా కనిపించింది. మొదట అర్ధంకాలేదు. తరువాత తెలిసింది- రేపటినుంచి దసరాసెలవులూ అని. శంకరం ఇప్పటిదాకా ఆ విషయమే మరచిపోయాడు. సెలవులంటే ఎవరికైనా సరదాయే శంకరంకూడా సంతోషపడ్డాడు.
    
    స్కూల్లో అన్నిక్లాసులకు ఆ రోజు నోటీసు పంపించారు, పదిహేను రోజుల దాకా సెలవులని, ఆ శుభవార్తకోసం ఎదురుచూస్తున్న పిల్లలందరూ మనసుల్లో జేజేలు కొట్టుకొన్నారు.
    
    శంకరం వాళ్ళ తెలుగుమాస్టరు చాలామంచివాడు. ఆయన పిల్లలతో చాలా సరదాగా మాట్లాడతాడు. ఎప్పుడూ పిల్లల్తో కలిసి మెలిసి వుండాలనే ఆయనకోరిక. శంకరం వాళ్ళక్లాసంతా వెళ్ళిపోయేటప్పుడు క్లాస్ రూంలో ఆయన ఎదుట సమావేశం కావాలని చెప్పాడు. ఎందుకో తెలియలేదు ఎవరికీ. కాని, అందరికీ ఆయనంటే ఆదరాభిమానాలు వుండటంచేత ఒక్కరూ తప్పిపోకుండా అందరూ హాజరయ్యారు అంతా కూర్చున్న తర్వాత ఆయనవచ్చి యిలా చెప్పాడు.
    
    "అబ్బాయిలూ! ఏమైనా సెలవులు వచ్చాయంటే ఒక్క ఆటపాటల్తోనే కాదు కాలంగడపటం పిల్లలకి వినోదం, విజ్ఞానం కలిగించే మరొక ముఖ్యసాధనం వుంది, అదే నాటకం నేను ఒక చిన్ననాటకం వ్రాసి వుంచాను. అది వినోదంతో పాటు విజ్ఞానంకూడా కలిగిస్తుంది. ఆ నాటకంలో అంతా మీరే నటించాలి. ఏమంటారు?"
    
    అందరూ సంతోషంతో చప్పట్లుకొట్టారు. "ఆ నాటకం పేరు ఏమిటండీ?" అనడిగాడు శర్మాయి.
    
    "పిల్లదొంగ"
    
    శంకరానికి ఎందుకో ఆ పేరు వింటేనే అదోలా తోచింది. వళ్ళంతా ఒకసారి ఝల్లుమన్నట్లయింది.
    
    "ఆ నాటకంలో కథేమిటో నేను సంక్షిప్తంగా చెప్తాను" అన్నారు మాస్టారు. "అనగా అనగా ఒక అబ్బాయి వుంటాడు. ఆ అబ్బాయి మంచివాడు కాదు చాలా టక్కరి. వాళ్ళకి బాగా డబ్బుందికాని, వాడి స్వభావం తెలియటంవల్ల తల్లిదండ్రులు కాణీ అయినా వాడిచేతికి చిక్కనివ్వరు. ఇస్తే పాడైపోతాడని వాళ్ళభయం. అందుకని వాడు యింట్లో దొంగతనాలు మొదలుపెడతాడు. మొదట అమ్మ గూట్లో పెట్టుకున్న డబ్బుతో ఆరంభమవుతుంది వాడి దొంగతనం. క్రమ క్రమంగా నాన్నజేబులు తడవటం, బీరువాతాళాలు తియ్యటం ఇంకా ఇనప్పెట్టెలు తెరవటం వరకూ వస్తుంది వ్యవహారం. మొదట్లో తల్లిదండ్రులకు అనుమానం వెయ్యలేదు. కాని తరువాత తరువాత దొంగ యీ అబ్బాయేనని తెలిసిపోతుంది. దాంతో కోపం ఆపుకోలేక ఇంట్లోంచి తన్ని తగలేస్తారు. ఆ అబ్బాయి కొన్ని రోజులదాకా ఊరంతా ఛడామడా తిరుగుతాడు. తన డబ్బుతో జల్సాలు చేసిన స్నేహితులెవ్వరూ వాడ్ని ఆదరించరు. చివరికి మూడురోజుల కటికి ఉపవాసాలు చేసి బుద్ది తిరిగిపోయి ఏమీ పాలుపోక ఇంటికి వచ్చి తల్లిదండ్రుల కాళ్ళమీద పడతాడు. వాళ్ళు క్షమిస్తారు. అప్పట్నుంచి ఆ అబ్బాయి బుద్దిమంతుడయిపోతాడు" అని చెప్పాడాయన.       

 Previous Page Next Page