Previous Page Next Page 
ధ్యేయం పేజి 25


    నిఖిత కుర్చీలోంచి లేచి తండ్రి వీల్ ఛెయిర్ దగ్గరకు వచ్చింది. అతని వీపు వెనగ్గా చెయ్యివేసి పట్టుకుంది. ఆమె కంఠంలో ఒక నిర్ణయం స్పష్టంగా వినిపించింది. ఆ నిర్ణయానికి ఇక అడ్డులేదన్న  కమాండ్  కూడా స్వరంలో ప్రతిబింబిస్తూండగా స్పష్టంగా చెప్పింది. "మరో రెండేళ్ళ ఆగటం వలన నా వయసేం మించిపోదు నాన్నా. దీనికోసం మరిన్ని చర్చలనవసరం".

    "అదికాదమ్మా....." కౌసల్య ఏదో చెప్పబోయింది.

    "అమ్మా! నీకు జ్ఞాపకం వుందా? ఒకరోజు నీ పెళ్ళిరోజు సినిమాకి టిక్కెట్టు బుక్ చేసుకున్నారు. నాకు కాస్త జ్వరం తగిలిందని సినిమాకి వెళ్ళటం కూడా  మానేశారు. ఆ రోజు నా జ్వరం  తగిలిందని సినిమాకి  వెళ్ళటం  కూడా  మానేశారు. ఆ రోజు నా జ్వరం  అంత ప్రమాదకరమైంది కాదే? కానీ, నన్నా  పరిస్థితుల్లో మీరు ఎందుకు వదిలి వెళ్ళలేకపోయారు. అదేకదమ్మా మన కుటుంబంలో అల్లుకున్న అందమైన అనుబంధం. ఇక్కడ ఒకరివి బాధ్యతలని, మరొకరివి హక్కులని  మనందరం  ఎప్పుడూ  అనుకోలేదు. అలాంటి  ఆలోచన రాకుండా  మమ్మల్ని పెంచారు మీరిద్దరూ. నాన్న పరిస్థితి నిజంగానే క్షీణించిందన్న వాస్తవం మనందరికీ తెలుసు. అయినా ఈ సమయంలో పెళ్ళి చేసుకుని నేను  సంతోషంగా ఎలా వుండగలననుకుంటున్నారమ్మా మీరంతా? ఆయన దగ్గర వున్నానన్న తృప్తి నాకు పెళ్ళి చేసుకుంటే వస్తుందని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా?"

    కౌసల్య, దశరధ్ లు ఏమీ మాట్లాడలేకపోయారు. తమ ముందే ఒక వృక్షంలాగా వ్యక్తిత్వం పెంచుకున్న కూతుర్ని విప్పారిన కళ్ళతో చూస్తూ వుండిపోయారు. ముందుగా కదిలింది కౌసల్య. కూతురి తలమీద చెయ్యివేసి నిమురుతూ "మాట వచ్చిందని కాబట్టి అడుగుతున్నానమ్మా. అవినాష్ తో నీకు...... నీకు  స్నేహమేనా? అంతకుమించిన ఆలోచన వుందా?" అని అడిగింది.

    "ప్రస్తుతానికి అది స్నేహమే" నిర్లిప్తంగా అంది నిఖిత. "అంతకు మించి చెప్పవలసిన అవసరం ఇప్పుడేమీ లేదమ్మా. ఉంటే నేనే చేప్తాను" అని అక్కడనుంచి  వెళ్ళిపోయింది.


                          *    *    *

    ఆ రాత్రి నిఖితకి చాలాసేపటివరకూ నిద్రపట్టలేదు. ఏ విషయాన్నయినా తనంతట తాను విశ్లేషించి స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగినా" ఆమె అవినాష్  విషయంలో మాత్రం సందిగ్ధావస్థలో వుంది.

    అతని ప్రేమలో నిజాయితీ వుంది. అది నిలకడగా వుంటుంది కూడా. అతడి ప్రేమని తాను జీవితాంతం నిలుపుకోగలనన్న నమ్మకం కూడా ఆమెకుంది. కానీ  పెళ్ళంటే ఇద్దరి మనుష్యుల మధ్య బంధమేకాదు, రెండు కుటుంబాల మధ్య సయోధ్యకూడా వుండాలి. లేకపోతే అది అనవసరమైన కలతలు తెచ్చిపెడుతుంది.

    అవినాష్ ఇంట్లో ప్రేమ, ఆప్యాయతలకన్నా కృతజ్ఞత, బాధ్యత అనేవే ఎక్కువ కనిపిస్తాయి. అవినాష్ ని అతని తల్లిదండ్రుల డామినేషన్ నుంచి బయటికి తీసుకురావటం పెద్ద కష్టమైన పనేమీకాదు. తన ప్రేమ అతడ్ని అందుకు పురికొల్పుతుంది కూడా. ఆ మాటకొస్తే ప్రేమలోపడ్డ ఎవరైనా తల్లిదండ్రుల్ని ఎదిరించటానికి వెనుదీయరు. ముఖ్యంగా అవినాష్ లాంటి ఉద్యోగం, సంపాదన వున్నవాళ్ళు.

    కానీ నిఖితకి అలా చేయటం యిష్టంలేదు. అవినాష్ లో మార్పు దానంతట అదే రావాలి. తనలోని బలహీనతని అతను గెలవగలగాలి. తల్లిదండ్రుల్ని ఒప్పించాలి. అంతే తప్ప తను వెనుకవుండి ఇదంతా జరిపించిందనీ, తన ప్రోద్బలంవల్లనే అవినాష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తనకి అనిపించిన రోజు ఇంక ఆ గిల్టీ ఫీలింగ్ వెంటాడుతూనే వుంటుంది. అంతకన్నా ఈ వివాహం జరగకపోవటమే మంచిది.

    ఈ ఆలోచన వచ్చాక ఆమెకి మామూలుగా నిద్రపట్టింది.


                                                                  7

    ఆ సాయంత్రం అవినాష్ ఆఫీసునుంచి ఇంటికి వెళ్ళలేదు. అతడికి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. కారు ధియేటర్ ముందు ఆపుచేసి ఒక్కడే టిక్కెట్ కొనుక్కొని సినిమాహాల్లో కూర్చున్నాడు. ఇంటర్వెల్ అయ్యేసరికి బాగా తలనొప్పిగా అనిపించి బయటికొచ్చాడు. అక్కడ రఘుప్రసాద్, ఆయన భార్య కనిపించారు. అవినాష్ ని చూసి "ఏమిటి, నువ్వొక్కడివే సినిమాకొచ్చావా?" అని అడిగాడు ఆశ్చర్యంగా.

    అవినాష్ బలవంతంగా నవ్వి, "అవునంకుల్. ఏం తోచలేదు. అందుకే వచ్చాను" అన్నాడు.

    "ఏమిటి డల్ గా  కనిపిస్తున్నావ్?" అనడిగింది రఘుప్రసాద్ భార్య. వాళ్ళు అవినాష్ కుటుంబానికి ఫామిలీ ఫ్రెండ్స్. కొంచెంసేపు కూల్ డ్రింక్ తాగుతూ అక్కడే మాట్లాడుకున్నారు. టాపిక్ దశరధ్ మీదకి  మళ్ళింది. దశరధ్ ట్రీట్ మెంట్  తీసుకుంటున్నది ఆ డాక్టర్  ఆస్పత్రిలోనే. "దశరధ్ కూతురు నిఖిత తెలుసుగా? చదువు మానేసి ఉద్యోగంలో చేరింది" అన్నాడు రఘుప్రసాద్.

    అక్కడ నిఖిత ప్రసక్తి వచ్చేసరికి అవినాష్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. తెలుసన్నట్లు మామూలుగా తలూపాడు.

    "అంత చిన్నతనంలోనే బాధ్యతంతా నెత్తిన వేసుకింది. అటు అన్నయ్యని చదివిస్తూ, ఇటు ఇంట్లో ఇద్దరు  పేషంట్లకి సపర్యలు చేస్తూంది. షీ ఈజ్ గ్రేట్" అన్నాడు రఘుప్రసాద్.

    "ఇద్దరు పేషెంట్లేవరు?" ఆశ్చర్యంగా అడిగాడు అవినాష్. "వాళ్ళ నాన్నగారికి వెన్నెముక దెబ్బతగిలింది. వీల్ ఛెయిర్  లో తిరుగుతుంటారని తెలుసు. ఇంకో పేషెంట్ ఎవరు?"

    "అయితే నీకు చాలా విషయాలు తెలియవన్నమాట. అవున్లే. వాళ్ళు అలా బయటికి చెప్పుకునేవాళ్ళు కాదు. నేనైనా డాక్టర్ని కాబట్టి నాకన్నీ చెప్పి వుంటారు. వాళ్ళ నాన్నగారికి కిడ్నీ ప్రాబ్లం కూడా వుంది. మహాఅయితే ఒక సంవత్సరమో, సంవత్సరమున్నరో బ్రతుకుతారు. ఆయన ట్రీట్ మెంట్ కి వాళ్ళు చాలా ఖర్చుపెట్టారు. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నిఖిత వాళ్ళమ్మకి యూట్రస్ క్యాన్సర్. అదీ బాగా ముదిరిపోయిన స్టేజిలో వుంది. ఎప్పుడేమవుతుందో తెలియదు. పాపం వాళ్ళ కుటుంబాన్ని చూస్తే జాలేస్తుంది".

    నిఖిత రెండు సంవత్సరాలు టైం ఎందుకడిగిందో అవినాష్ కి  ఇప్పుడర్థమైంది. ఆమె తనతో అంత కటువుగా ఎందుకు మాట్లాడిందో కూడా తెలిసింది. అయితే కోపం రాలేదు. అతడి కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. ఎప్పుడూ చూచాయగా కూడా ఏ విషయమూ చెప్పని ఆమె గొప్పతనం ముందు తనెంతో అల్పుడిలా  తోచాడు. తనతో మాట్లాడుతున్నంతసేపూ ఆర్థకంగా కానీ, మానసికంగా కానీ తను  ఎటువంటి బాధపడుతున్నట్లు ఆమె ఏ క్షణంలో కూడా బయటపడలేదు. తన దగ్గర  యింత డబ్బుండి కూడా ఆమె తనని ఒక్కపైసా సహాయమడగలేదు.

    అవినాష్ కి తలనెప్పి మరింత ఎక్కువైనట్లు అనిపించింది. ఇంతలో సినిమా తిరిగి స్టార్ట్ అవుతున్నట్లు బెల్ వినిపించింది. "వెళదాం రా" అన్నాడు రఘుప్రసాద్.

    "లేదంకుల్, మీరెళ్ళండి నేను ఇంటికి వెళ్ళిపోతాను. నా వంట్లో బాగాలేదు" అని అక్కడినుంచి బయటికొచ్చేశాడు.

    అవినాష్ కారు పార్కుచేసి ఇంట్లోకి అడుగుపెడుతూండగానే గుమ్మంలో ఎదురొచ్చింది పార్వతి. 'ఏరా ఎక్కడి కెళ్ళిపోయావ్? ఆఫీసుకి ఫోన్ చేస్తే సాయంత్రమే వెళ్ళిపోయావన్నారు. నువ్వెంత సేపయినా రాకపోయేసరికి నాకు  తలనొప్పి వచ్చేసింది" అంటూ పెద్దగా అరిచింది. ఆమె మాటల్లో ఆందోళనకంటే అధికారం ఎక్కువ ధ్వనించటాన్ని అవినాష్ మొట్టమొదటిసారి గుర్తించాడు. ఈ లోపులో ఆఫీస్ నుంచి తండ్రి కూడా వచ్చేశాడు. భార్యను చూసి "ఏమిటి తలనొప్పా; తలపట్టుకు కూర్చున్నావ్" అని అడుగుతున్నాడు లోపల.

    "ఆ అవినాష్ మూలంగానే ఇదంతానూ. రాత్రి ఎనిమిదిన్నర కొచ్చాడు. అందులోనూ కారు తీసుకెళ్ళాడేమో" దాంతో భయమేసింది. టెన్షన్ తో  తలనొప్పి వచ్చేసింది" అంటూ ఫిర్యాదు చేసింది.

    అవినాష్ మూలంగానే ఇదంతానూ. రాత్రి ఎనిమిదిన్నర కొచ్చాడు. అందులోనూ కారు తీసుకెళ్ళాడేమో" దాంతో భయమేసింది. టెన్షన్ తో తలనొప్పి వచ్చేసింది" అంటూ ఫిర్యాదు చేసింది.

    అవినాష్ కి అర్థంకాలేదు. తనప్పుడు ఆఫీస్ కెళ్ళినా కారు తీసుకొనే వెళ్తాడు. మరి తల్లి ఎందుకిలా మాట్లాడుతోంది.

    భోజనం చేస్తున్నంతసేపూ కనీసం పదిసార్లు తన తలనొప్పి గురించి ప్రస్తావించింది తల్లి.

    "పార్థసారధిగారు ఏమన్నా కబురు చేశారా?" తండ్రి అడిగాడు.

    "ఏం లేదు. మీకూ చేయలేదా ఆఫీస్ కి?" అంది పార్వతి.

    శంకరం నెమ్మదిగా  నిట్టూరుస్తూ "ఇంకా ఏవో సంబంధాలు చూస్తున్నారట. అన్నీ చూశాక సెటిల్ చేసుకుంటారనుకుంటాను" అన్నాడు.

    పార్వతి కంఠంలో నిరాశ, ఉక్రోషం ధ్వనించాయి. "మన వాడికన్నా మంచి సంబంధం వాళ్ళు కాగడా పేట్టి వెతికినా సంపాదించలేరు".

    తన ఆలోచనలు ఇప్పటికైనా బయట పెట్టకపోతే లాభంలేదని అవినాష్ కి  అనిపించింది. "నేను బాంబే వెళ్ళి కొత్త  ఉద్యోగంలో చేరదామనుకుంటున్నాను మమ్మీ. పెళ్ళి విషయంలో మీరిప్పుడు ఏ నిర్ణయాలూ తీసుకోవద్దు" అన్నాడు.

    "చూడండి ఎలా మాట్లాడుతున్నాడో? ఇంతసేపూ ఎక్కడికెళ్ళావురా అంటే సమాధానం చెప్పలేదు. ఇప్పుడేమో బాంబే వెళ్ళి ఉద్యోగంలో చేరిపోతానంటున్నాడు" అంది పార్వతి ఫిర్యాదు చేస్తున్నట్టు.

    "ఏరా, నీ నిర్ణయాలు నువ్వే తీసుకునేటంత పెద్దవాడివైపోయావా" అన్నాడు శంకరం కోపంగా. 

    "ఇన్నాళ్ళూ మీరు చెప్పినట్టే వింటూ వచ్చాను డాడీ. ఇకనుంచైనా నా నిర్ణయాలు నన్ను తీసుకోనివ్వండి. అంతేకాదు పెళ్ళి విషయంలో కూడా. నేను.......ఆ సంబంధం చేసుకోను".

    పార్వతి దాదాపుగా అరుస్తున్నట్లు "నువ్వేం మాట్లాడుతున్నావో నీకర్థమవుతుందా? ఆ పెళ్ళి చేసుకోవా? నీ పెళ్ళి విషయం నువ్వే నిర్ణయించుకున్నావా?" అంది.

    "నేను దశరధ్ అంకుల్ వాళ్ళమ్మాయి నిఖితని పెళ్ళి చేసుకుంటాను".

    భోజనం చేస్తున్న శంకరం చెయ్యి మధ్యలోనే ఆగిపోయింది. చేతిలో ముద్ద ప్లేట్లోకి జారిపోయింది. గిన్నె పట్టుకున్న పార్వతి దాన్ని బల్లమీద బలంగా పెడుతూ  కుర్చీలో కూర్చుండిపోయింది. కొన్ని క్షణాల పాటు అక్కడ గాఢమైన నిశ్శబ్దం నాట్యం చేసింది. ఆ షాక్  నించి తేరుకోవటానికి ఆ దంపతులకి చాలా  సేపు  పట్టింది.

    "ఏమిటి! ఏమిటిరా నువ్వు మాట్లాడుతుంది?" హిస్టీరియా వచ్చినట్టు అరిచింది పార్వతి.

    అప్పటికి అవినాష్ కి పూర్తి ధైర్యమొచ్చేసింది. మొట్టమొదటి వాక్యం చెప్పడానికే తటపటాయించాడు. ఇక తన నిర్ణయాన్ని  స్పష్టంగా చెప్పటానికి నిర్ణయించుకున్నట్టు "అవునమ్మా! నేను పెళ్ళంటూ చేసుకుంటే నిఖితనే చేసుకుంటాను" అన్నాడు.

    శంకరం మొహం కోపంతో ఎరుపెక్కింది. పార్వతి గట్టిగా "అయితే  ఇదంతా వాళ్ళ ప్లాన్ అన్నమాట. కూతుర్ని ఎర చూపించి పకడ్బందీగా వల్లో వేసుకున్నారన్న మాట. మమ్మల్ని ఎదిరించి ఇలా మాట్లాడమని కూడా వాళ్ళే చెప్పారా?" అంది.

    "వాళ్ళెవరికీ ఈ విషయం  తెలియదు. ఆమాటకొస్తే నిఖిత కూడా ఈ పెళ్ళి  పట్ల మీరనుకునేటంత బలవంతంగా ఏమీలేదు. ఇదంతా నా నిర్ణయమే. నేనే  మీకు చెప్పి వాళ్ళతో మాట్లాడదామని అడుగుదామనుకుంటున్నాను".

    పార్వతి నిర్ఘాంతపోయింది. "ఆ ముదనష్టపు కొంపకెళ్ళి నీ పెళ్ళి విషయం మేం మాట్లాడాలా?" అని భర్తవైపు తిరిగి "ఏమండీ, వీడికేదో  దెయ్యం పట్టింది. వాళ్ళేదో మందు పెట్టారు" అది దాదాపుగా ఏడుస్తూ.

    ఈ అభియోగానికి అవినాష్  నిర్ఘాంతపోయాడు. "వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు మమ్మీ" అన్నాడు అనునయంగా.

    "కాదా? కాకపోతే మాత్రం వాళ్ళింటికి ఎలా వెళ్తామనుకున్నావ్".

 Previous Page Next Page