"చూడండి! నా పేరు అనంత పద్మనాభ శాస్త్రికాదు. రాజారావు మీ ఫ్రెండ్ కి, నాకు పోలికలు వున్నట్లున్నాయి. మీరు పొరబడ్డారు" అన్నాడు రాజారావు నిదానంగా.
ప్రేమగా ఫెడేల్ మని రాజారావు వీపుమీద చరిచాడు సుందరం. "ఒరే అనంతం! అబద్దమాడినా అతికినట్లు వుండాలిరా! నేను నిన్ను అనంతం అని మాత్రమే పిలిచాను. నీవు నీ పూర్తి పేరు చెప్పావు అవునా?" అన్నాడు సుందరం.
రాజారావు గతుక్కు మన్నాడు.
"నా పేరు రాజారావు...ఒరేయ్ ముందు నోరు మూస్తావా రెండివ్వనా?"
"చెప్పేది పూర్తిగా వినండి."
"అదిగో మల్లి!"
రాజారావుకు ఏదో ఆలోచన వచ్చి కళ్ళు తళుక్కున మెరిసినాయి.
"అరే సుందరం నిన్ను జోక్ చేశానురా. నేను నీ అనంతంనే" అన్నాడు నవ్వుతూ.
"ఊ! అలా దారికి రా! ఇంకా యీ నాటకాలు, జోక్స్ మానలేదన్న మాట. సరిసరి రంగూను నుంచి ఎప్పుడు దిగావు?"
"రెండు రోజులయింది."
"రంగూను వెళ్ళి మమ్మల్ని పూర్తిగా మరచిపోయావురా!"
"అదేం కాదురా! బిజినెస్ వ్యవహారాలకే క్షణం తీరికి వుండడు అంతే."
"నేను నమ్మను."
"దానికి నేనేం చేయను?"
"ఏం చెయ్యద్దు. రంగూన్ నుంచి దిగి రెండు రోజులయినా మా ఇంటి కొచ్చావా?"
"రేపు వస్తాను."
"ఈ రోజు ఏం చేస్తావు? పోదాం పద" అంటూ బలవంతం చేశాడు సుందరం.
రాజారావు మాత్రం లొంగలేదు. "పనుంది రేపు వస్తాను" అని మొండిగా సమాధానం చెప్పాడు.
"అయితే నాతో కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళు" అంటూ పక్కనే ఉన్న చిన్న పార్కుకి లాక్కెళ్ళాడు రాజారావుని.
పార్కులో కూర్చున్న తరువాత రాజారావేం అడగలేదు. సుందరం అడుగుతున్న వాటికి మాత్రం జవాబిస్తున్నాడు.
"ఒరేయ్ అనంతం! నువ్వు చాలా మారిపోయవుగా? అన్నింటికీ ముక్తసరిగా జవాబిస్తున్నావు. మనిషివి నునుపు తేలావుగానీ నీలో ఉషారు ఏది."
సుందరం అంటున్నది వింటూ రాజారావు లేచి నిలబడ్డాడు.
"రేపు మీ ఇంటికొస్తాగా అప్పుడు అన్నింటికీ జవాబు చెపుతాను, అర్జంటు పనుంది వెళతాను" అని మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా రాజారావు ముందుకు వేగంగా నడిచాడ".
సరిగ్గా అప్పుడే లాంగ్ కోటు వ్యక్తిని రాజారావు ఓ చెట్టు పక్కగా నుంచుని వుండగా చూడటం జరిగింది.
రాజారావు తల పంకించి వేగంగా అడుగులు వేస్తూ పార్కులోంచి బయటపడ్డాడు.
వీడు చాలా మారిపోయాడు. డబ్బు సంపాదిస్తున్నాడు గదా గర్వం! అంతే - నాబోటి వాడు ఏం చూసుకుని గర్వపడాలి, పార్కులో కూర్చున్న సుందరం అనుకున్నాడు.
23
హోటల్ ఊర్వశిలో నలభైనాలుగో నెంబరు గదిలో మెత్తని పరుపుగల సింగల్ కాట్ పై విశ్రాంతిగా పడుకున్నాడు రాజారావు.
ఫోన్ ట్రింగ్ అనే శబ్దం వినపడి రిసీవర్ అందుకున్నాడు.
"హల్లో! ఎవరు కావాలండీ" అన్నాడు రాజారావు. తనకి ఫోన్ చేసేవాళ్ళెవరూ వుండరనే ఉద్దేశంతో.
"మిష్టర్ అనంతపద్మనాభశాస్త్రి" అవతలి కంఠం గంభీరంగా వినపడింది.
రాజారావుకి వళ్ళు మండిపోయింది.
రాజారావు టక్కున రాంగ్ నెంబర్ అని చెప్పి అంతకన్నా క్విక్ గా రిసీవర్ క్రెడిల్ పై వుంచాడు.
ట్రింగ్ మంటూ మళ్ళీ ఫోన్ మ్రోగింది.
అతడు అదేమీ పట్టించుకోకుండా వెళ్ళి మంచంమీద పడుకున్నాడు.
మోగిన ఫోన్ ఆగిపోయింది.
అతడు చిన్నగా నవ్వుకున్నాడు.
మళ్ళీ పదినిమిషాల తరువాత మళ్ళీ ట్రింగ్ మంటూ ఫోన్ అరిచింది.
అతడు బెడ్ మీదనుంచి లేవలేదు. తన్ను కాదన్నట్లు వుండిపోయాడు.
పదినిముషాలకోసారి ఫోన్ మోగటం చేస్తూనే వుంది.
అలా పది సార్లు జరిగింది.
రాజారావు సహనం నశించింది.
ఈ సారి ఫోన్ మోగకముందే అతడు లేచి వెళ్ళి ఫోన్ వద్ద రెడీగా నుంచున్నాడు. అప్పుడే మళ్ళీ ఫోన్ మోగటం అతడు రిసీవర్ ని వేగంగా అందుకుని "హలో ఎవరు కావాలండీ!" అని మర్యాదగా అడగటం జరిగింది.
"హోటల్ ఊర్వశియేకదండీ!" అవతలి నుంచి ఇందాకటి కంఠస్వరం అడిగింది.
"అవునండీ!"
"రూమ్ నెంబర్ నలభైనాలుగేనా ?"