శ్రీజ ఒళ్ళు విరుచుకుంటూ లేచి "బావా స్నానం చెయ్యాలి.... బాత్రూం ఎక్కడ? కాస్త వీపు రుద్దుతావా?" అని అడిగింది.
మధు ఆలస్యం చెయ్యకుండ ఒక అంగలో గది గుమ్మం అవతలికి వచ్చిపడ్డాడు.
బామ్మగారు జపమాల తిప్పుతూనే పైకి వచ్చి "అమ్మాయి ఏం చేస్తోంది?" అంది.
శ్రీజ లోపల్నుంచి "చూడండి బామ్మగారూ! నీళ్ళు పోసుకుంటానంటే వినడం లేదు మా బావ" అంది.
"అదేం మాటయ్యా? ఆడపిల్ల నీళ్ళు పోసుకుంటానంటే ఒద్దంటావా?" ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది.
మధుకి ఆ పరిస్థితి ఇబ్బందికరంగానూ, చాలా అసహ్యంగానూ అనిపించింది. "నేను ఆఫీసుకి వెళ్తాను.
కాస్త అమ్మాయినీ, ఇంటినీ కనిపెట్టి వుండండి మీరు" అన్నాడు.
"బావా!" శ్రీజ పెద్దగా బాత్రూంలోంచి కేక పెట్టింది.
"ఎందుకో అమ్మాయి పిలుస్తోంది" బామ్మగారు చెప్పారు.
మధు విధిలేనట్లు లోపలికి నడిచాడు.
బాత్రూం తలుపు కాస్త ఓరగా తెరిచి "సబ్బు!" అంది, చెయ్యిజాపిన శ్రీజ.
మధు ఒంట్లో రక్తప్రసారం వేగవంతమైంది. నున్నని భుజం నగ్నంగా సగం తడిసి బైటికి కనిపిస్తోంది. నోరు తెరిచి అలాగే వుండిపోయాడు.
శ్రీజ మొహం కాస్త బయటికి పెట్టి "ఇస్తావా నన్నే వచ్చి తీసుకోమంటావా?" అని అడిగింది.
ఆ మాటకి అతను షాక్ కొట్టినట్లు వులిక్కిపడి "ఒద్దు.... ఒద్దు" అంటూ కొత్త సబ్బు తీసి అందించాడు.
అతను సబ్బు అందిస్తూ వుండగా ఆమె అతని చేతిని పట్టుకుని "అలా ఒణికిపోతున్నావేం బావా?" అని అడిగింది.
మధుకి టెంపరేచర్ నూట మూడికి చేరుకున్నట్లు అనుమానం వచ్చింది.
"వదులు" అన్నాడు.
శ్రీజ గొంతు తగ్గించి "ఉష్.... అరవకు బామ్మగారు వింటారు" అంది.
మధు వెంటనే గొంతు తగ్గించి "వదులు" అన్నాడు. ఆమె అతని చేతిని గట్టిగా బిగించి పట్టుకుని "ఇప్పుడు వదులుగా లేదుగా, బావుందా?" అంది.
మధు గట్టిగా వదిలించుకుని, దూరంగా వెళ్ళిపోయాడు.
ఇంతలోనే బామ్మగారు లోపలికి వచ్చేసింది. "ఏవంటోంది అమ్మాయి?" అని అడిగింది.
శ్రీజ లోపల్నుంచి చెప్పింది "బాత్రూం తలుపుపైన చిన్న కన్నం వుంది. స్నానం చెయ్యాలంటే సిగ్గేస్తోంది బామ్మగారూ!"
బామ్మగారు ఆశ్చర్యంగా చూసారు. బాత్రూం రేకు తలుపుకి పైన కుంకుడి గింజంత కన్నం వుంది. ఆవిడ పకపకా నవ్వి "నీ సిగ్గు పాడుగాను! అంతపైకి ఎక్కి ఎవరు చూస్తారమ్మా! అయినా ఆడపిల్లకి ఆ మాత్రం జాగ్రత్త వుండడం మంచిదిలే! ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు రెచ్చిపోతుంటారు మొగపీనుగలు!" అంది.
"నాకు మొదట్నించీ సిగ్గెక్కువ! స్నానం చేసేటప్పుడు నీళ్ళ బక్కెట్టులోకి కూడా చూసుకోను!" అంది శ్రీజ.
మధు ఇంక అక్కడ నిలబడలేనట్లు చరచరా క్రిందికి వచ్చేసాడు. అతనికి వళ్ళు మండిపోతుంది. "ఛీ, ప్రొద్దుటే ఎవరి మొహం చూసానో! మెడపెట్టి బైటికి గెంటెయ్యక అలా మొద్దులా, ఆ అమ్మాయి నాటకం చూస్తుండి పోయానేమిటి? నేను ఇంత వాజమ్మని అని ఇప్పటిదాకా నాకు తెలియనే తెలియదుమ్మీ!" అనుకున్నాడు. అతనికి రిషి గుర్తొచ్చాడు. వాడితో చెప్తాను. ఇటువంటి వాళ్ళకి వాడే సరిపోతాడు" అనుకుంటూ స్కూటర్ భారత్ థియేటర్ వైపు పోనిచ్చాడు.
* * * *
జరిగినదంతా చెప్పి శ్రీజ ఆపకుండా నవ్వసాగింది. "ఎందుకలాంటి ఆటలాడ్తావు శ్రీజా? ప్రమాదం కాదూ?" నవ్వుతున్న శ్రీజని చూస్తూ అడిగింది ఆశ్రిత.
"నువ్వేం తక్కువతిన్నావా? మంచు పర్వతంలాంటి వాడిలో లావా పొంగించావు. దాంతో మా రిషి లవ్ లవ్ అంటూ ప్రేమర్షిగా మారి నీకోసం తపస్సు మొదలెట్టాడు" అంది శ్రీజ.
ఆశ్రిత మంచంమీద కూర్చున్నదల్లా శ్రీజ పక్కనే కూర్చుని ఆమె భుజం పట్టుకుని "అతనెలా వున్నాడు?" అని అడిగింది.
"అరవై ఆరోసారి!" విసుగ్గా అంది శ్రీజ.
"ఏవిటి అరవై ఆరోసారీ?"
"నువ్వు ఈ ప్రశ్న వెయ్యడం!"
"నిజమా? నాకు తెలియనే తెలియదు!" సిగ్గుపడింది ఆశ్రిత.
"ఆశ్చర్యం లేదు!" శ్రీజ సీరియస్ గా అంది. "ప్రేమలో పడిన వారికి తమ ప్రియుల గురించి తప్ప వేరే ధ్యాసే వుండదు. ఈ రోగ లక్షణాలే అంత! ఉదాహరణకి ఇందాకటి నించీ నా భుజాన్ని గట్టిగా గుచ్చిపట్టుకుని నలిపేస్తున్నావని గానీ, నీ పైట వుండాల్సిన స్థానంలో అస్సలు లేదని గానీ నీకు తెలియనే తెలియదు. అంటే వ్యాధి బాగా ముదిరిపోయినట్లే లెక్ఖ. అసలు ఈ వ్యాధి ముదిరితే కానీ బైటపడదు. దీనికి మందు లేనేలేదన్న విషయం చెప్పడానికి నేనస్సలు సందేహించడం లేదు."
"చాల్లే!" శ్రీజ భుజాన్ని వదిలేసి దూరంగా జరిగి చిరుకోపంగా అంది ఆశ్రిత.
"చాలదని నాకూ నీకూ కూడా తెలుసు కానీ ఎందుకీ దాగుడుమూతలూ? రిషికి నీ ఎడ్రెస్ చెప్పెయ్యనా?" అడిగింది శ్రీజ.
ఆశ్రిత తల అడ్డంగా వూపింది. "అతను నా జాడ ఎలా తెలుసుకుంటాడో చూస్తాను" అంది.
"నిజమే థ్రిల్స్ లేకుండా ప్రేమ రక్తికట్టదు" అంది శ్రీజ.


