కోపం పెరిగిపోయింది.
"అలాగా! డబ్బిమ్మని నేనేమయినా ఏడ్చానా? నువ్వే నా కాళ్ళమీదపడి ఛాన్స్ ఇమ్మని అడిగావు. ఆ రచన మీద వచ్చే డబ్బులో ఫిఫ్టీ పర్సెంట్ మీరే తీసుకోండి సార్! అని బ్రతిమాలావ్_ మర్చిపోయావా?"
చంద్రకాంత్ స్పృహలో కొచ్చాడు.
"సారీ గురువుగారూ! కోపంలో ఏదో అనేశాను. మీరేం చెప్తే అది చేస్తాను. కావాలంటే హిందీ సీరియల్ కాపీ కొట్టింది నేనే. మా క్రియేటివ్ హెడ్ గారికేం సంబంధం లేదని రాసిచ్చేస్తాను."
నీలకంఠానికి కోపం తగ్గిపోయింది.
"అలా దారికిరా! ఇప్పుడు అర్జంటుగా మొగుడు_ప్రియుడు సీరియల్ హీరోయిన్ నీలిమ ఇంటికెళ్ళి దాన్ని మన గెస్ట్ రూమ్ కి తీసుకురా!"
"ఇంట్లో వాళ్ళాయన వుంటాడేమో!"
"ఉండడు_ ఇవాళ పేక్కాడ్డానికి వెళుతున్నాడని ఫోన్ చేసి చెప్పింది. ఒకవేళ వాళ్ళాయన వున్నా కూడా నీలిమ మన ఛానెల్ సీరియల్ గురించి క్రియేటివ్ హెడ్ గారు అర్జంటుగా డిస్కషన్ చేయాలంటున్నారని చెప్పు"
చంద్రకాంత్ కి చిరాకుగా వుంది.
నీలంకంఠం తీసుకురమ్మన్న యాంకర్లనూ, మిగతా లేడీ ఆర్టిస్ట్ లనూ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళి అప్పజెప్పటం, తర్వాత మళ్ళీ వాళ్ళను తీసుకెళ్ళి ఇంటిదగ్గర డ్రాప్ చేయటం.
నీలంకంఠం మెప్పు సంపాదించి నాలుగు డబ్బులు చేసుకోవాలంటే ఇలాంటి వెధవపన్లు చేయక తప్పదు.
నీలిమ ఇల్లు చేరుకున్నాడు చంద్రకాంత్. ఆమె అలంకరించుకుని సిద్ధంగానే వుంది.
"మిమ్మల్ని నీలంకంఠంగారు తీసుకురమ్మన్నారు" చెప్పాడతను.
"పదండి. మీ కోసమే ఎదురుచూస్తున్నాను" అంటూ బయటకు వచ్చి ఆటో ఎక్కింది.
ఇద్దరూ గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు.
అప్పటికే విక్కీ సీసా ముందు పెట్టుకుని కూర్చున్నాడు నీలంకంఠం.
"నువ్వు బీరు తాగుతావా, విస్కీ తాగుతావా?" అడిగాడతను.
"నేనా? విస్కీయే గురూజీ!" ఉత్సాహంగా అన్నాడు చంద్రకాంత్.
"నేనడిగేది నిన్ను కాదు, నీలిమని."
"ఛీ_ నేను తాగను" అంది నీలిమ.
"అదేంటి_ ఇంత గొప్ప హీరోయిన్ వయ్యావ్_ ఇంకా తాగకపోతే ఎలా? ఇవాళ ప్రారంభోత్సవం చెయ్_ కమాన్" అంటూ ఆమెతో విస్కీ తాగించసాగాడు నీలంకంఠం.
చంద్రకాంత్ నాలుక తడుపుకుంటూ విస్కీ బాటిల్ వైపు చూస్తున్నాడు. నీలంకంఠం వళ్ళో నీలిమను కూర్చోబెడుతుంటే తను ఆమె నడుంచుట్టూ చేయివేశాడు చంద్రకాంత్. దాంతో నీలకంఠానికి కోపం వచ్చేసింది."
"ఏయ్ చంద్రకాంత్! నువ్వెళ్ళి బయట కూర్చో కాసేపు" అన్నాడు కసిగా.
చంద్రకాంత్ బయటకు వెళ్ళగానే తలుపు వేసుకుంది నీలిమ. "మీరు ఒక్కరూ అంటే ఫర్లేదు. వాడు కూడా నన్నలా చూస్తే వూరుకోను" అంది కోపంగా.
సరిగ్గా అప్పుడే స్కూటర్ దిగాడు పానకాలు.
"ఏదది? ఎక్కడుంది?" చంద్రకాంత్ దగ్గరకొచ్చి చొక్కా పట్టుకుంటూ అడిగాడు.
అతని చేతిలో కత్తి చూసేసరికి చంద్రకాంత్ పై ప్రాణాలు పైనే పోయాయి.
"ఏమిటది?" అడిగాడు అర్థంకాక.
"ఏమిటదా? ఇదిగో_ ఇదీ" అంటూ బలంకొద్దీ లాగి చెంప మీద కొట్టాడు.
చంద్రకాంత్ దభేల్ మని కిందపడ్డాడు.
"అరె! నన్ను కొడతావేమిటి?" దుమ్ము దులుపుకుంటూ లేచి నిలబడ్డాడు చంద్రకాంత్.
"మర్యాదగా చెప్పు_ ఏదది?"
"ఏమిటది?"
మళ్ళీ చెంప పేలిపోయింది.
"అదేమిటో చెప్పకుండా ఏదది అంటే నాకేం తెలుస్తుంది?" ఏడుపు ఆపుకుంటూ అడిగాడు.
"అదే నా భార్య నీలిమ ఎక్కడుంది? స్కూటరు మీద తీసుకొచ్చింది నువ్వేనా?"
"నేనే... అహహ... నేను కాదు" భయంగా అన్నాడు.
"ఎక్కడుందది?"
"ఆ గదిలో..."
పానకాలు ఆ తలుపు మీద దభేల్ మని తన్నాడు.
ఆ తలుపు పగులిచ్చింది.
రెండో తన్నుకి విరిగిపోయింది.
నీలంకంఠం వళ్ళో పడుకున్న నీలిమ అదిరిపడి లేచి నిలబడింది.
ఒక్క దూకు దూకి ఆమె జుట్టు పట్టుకున్నాడతను.
"ఏమే ఇల్లు కదలొద్దంటే అడ్డమయినోడితో తిరుగుతున్నావా?" అంటూ ఒక్క తన్ను తన్నాడు.
నీలిమ కింద పడిపోయింది. అది చూసి నీలంకంఠం బయటకు పరుగెత్తాడు శరవేగంతో.
నీలకంఠాన్ని చూసి చంద్రకాంత్ పరుగెత్తాడు. పానకాలు కత్తి పట్టుకుని ఇద్దరి వెంటా పడ్డాడు. రోడ్డుమీద జనమంతా వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొంతమంది సినిమా షూటింగేనా అనుకుని కెమెరా కోసం వెతుకుతున్నారు.
నీలకంఠానికి సన్మానం చేసిన ఆ ఏరియా సాంస్కృతిక సమాజం తాలూకూ మెంబర్లు కొంతమంది అతనివెనుక ఓ రచయిత, వాళ్ళిద్దరి వెనకా కత్తి పట్టుకుని ఓ ఆవేశపరుడూ పరుగెత్తటం చూసి ఏమీ అర్థంగాక_
"సార్! ఏమిటలా పరుగెడుతున్నారు?" అనడిగారు వారు పక్కనే పరుగెడుతూ.
"మరేం లేదోయ్! డాక్టర్ గారు రోజూ రెండు కిలోమీటర్లు పరుగెత్తితే హెల్త్ కి మంచిదన్నారు" అన్నాడతను రన్నింగ్ ఆపకుండానే.
పానకాలు రన్నింగ్ వేగం పెంచాడు.
అది చూసి చంద్రకాంత్, నీలకంఠం కూడా వేగం పెంచేశారు.
పానకాలు కత్తితో మరీ దగ్గరపడడంతో చంద్రకాంత్ అమాంతం బాగా రద్దీగా వున్న సందులోకి తిరిగిపోయాడు.
పానకాలు నీలకంఠంనే టార్గెట్ చేసుకోవటం వల్ల అతనివే అందుకోవడానికి ప్రయత్నించసాగాడు.
నీలకంఠాన్ని గుర్తుపట్టిన ఇద్దరు ప్రొడ్యూసర్లు "సార్! మేము పంపిన స్క్రిప్ట్ ఏమైంది సార్? తీసుకుంటున్నారా? రిజెక్ట్ చేస్తున్నారా?" అనడిగారు పక్కనే కొద్ది దూరం పరుగెడుతూ.
"డైలీకి అయిదు లక్షలు_ వీక్లీ సీరియల్ కీ మూడు లక్షలు" అన్నాడు నీలకంఠం పరుగు వేగం కొంచెం తగ్గించి ఆశగా.
"అబ్బే! మాకు ఇప్పుడు డబ్బివ్వకపోయినా ఫర్లేదు సార్! యాక్సెప్ట్ చేస్తే చాలు."
"మీకివ్వటం కాదోయ్_ మీరే కిక్ బాక్స్ నాకివ్వాలని చెప్తున్నాను" కోపంగా అన్నాడతను.
"ఆ! అంత డబ్బే_ ఓ పాతికవేలు కొడితే చాలు_ యాక్సెప్ట్ చేస్తారని మా ఫ్రెండ్ చెప్పాడు సార్?"
"షటప్! పిచ్చివాగుడు వాగకు. యాక్సెప్ట్ చేయడానికి ముందు ఎనిమిదిసార్లు బార్ లో మందు తాగించాలి_ అ సీరియల్ హీరోయిన్ని తీసుకొచ్చి ఓ నైట్ నాకప్పగించాలి" అంటూ వెనక్కు తిరిగి పానకాలు బాగా దగ్గరగా వచ్చేయటం చూసి మరింత వేగంగా పరుగెత్తాడు.