Previous Page Next Page 
దశావతారాలు పేజి 24


    "వెరీగుడ్, బేబీ!" అని సుధ చెక్కిలి ప్రేమగా మీటి కాడర్ బరీ మిల్క్ చాక్ లెట్లు సుధ చేతిలోపెట్టి వయ్యారితో వెళ్ళిపోయాడు.
    విలసిత కళ్ళు చీకట్లు కమ్మాయి. లోకం అంధకారమయింది. నిగ్రహానికి గట్లు తెగాయి. సంవత్సరాలుగా కూడబెట్టిన కన్నీరు పొంగి పొంగి పెల్లుబికింది. తల్లిని అలా చూసిన సుధకు పూనకం దిగిపోయింది. చేతిలో చాక్ లెట్లు... ఎదురుగా తల్లి కన్నీళ్ళు...ఏడేళ్ళ ఆ పసి మనసుకు తను చేయగలిగింది ఒకటే తట్టింది. ఒక చేత్తో తల్లి కన్నీళ్ళు తుడుస్తూ మరో చేత్తో చాక్ లెట్ అందించింది ... ఆ చాక్ లెట్ ను విసిరి కొట్టింది విలసిత_పిచ్చిదానిలా ఇంట్లోంచి పరుగెట్టింది...
    పరుగు...ఒకటే పరుగు...ఒళ్ళు తెలియని పరుగు__గమ్యం తెలియని పరుగు...
    అంధకారం...గాడాంధకారం... ఆగిపోయింది. ఏం చేయాలి? ఏం చేయాలని వచ్చింది? ఎదురుగా రైలుపట్టాలు కంకరరాళ్ళ మధ్య... నల్లగా పొడుగ్గా అంతులేని ఆశల్లా__అర్ధంలేని జీవితాల్లా సాగిన రైలు పట్టాలు.
    పరుగెత్తి పరుగెత్తి అలిసిపోయిన విలసిత ఆ పట్టాల మీద వాలిపోయింది. చల్లగా కర్కశంగా తగిలాయి అవి... దూరాన రైలుకూత...మృత్యుదేవత గర్జనలా...దగ్గిరవుతోంది...చప్పుడు...ధన్ ...ధన్ ... దౌర్భాగ్యదేవత అందెల ఛప్పుళ్ళలా....
    ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయింది విలసిత. ఏదో శక్తి ప్రేరేపించినట్లు గభాలున పట్టాలమీద నుంచి బయటకు దూకింది. రైలు ధన్, ధన్ మని శబ్దం చేసుకుంటూ సాగిపోయింది.
    బ్రతికింది! బ్రతుకుకోసం పెనుగులాడే ప్రాణి లక్షణమేదో తనను బ్రతికించింది.
    ఏం చేయాలిప్పుడు ?
    తనలాగే తన చెల్లెళ్ళకూ పదేసివేల కట్నాలతో పెళ్ళిళ్ళుచేసి తలిదండ్రులు చితికిపోయారు. తనను...మొగుణ్నొదిలి వచ్చినదాన్ని ఎవరాదు కుంటారు? అయ్యో! డిగ్రీ అయినా తీసుకోలేదే!
    సుధ! తన సుధ...
    పెద్దపెద్దవాళ్ళే డబ్బుకోసం తమ అంతరాత్మల్నీ అనురాగాల్నీ సునాయాసంగా చంపుకుంటున్నారు. ఏడేళ్ళ సుధ చాక్ లెట్లకోసం తనను కొట్టడంలో ఆశ్చర్యం ఏముంది?
    ఆ కొట్టిన చెయ్యే తన కళ్ళు తుడవ వచ్చింది. తనను అవమానించి సంపాదించుకున్న చాక్ లెట్లలో తనకు భాగం అందించబోయింది.

    తియ్యని లంచాలకు లొంగిపోయినా, కరకుతనానికి బెదిరిపోయినా, సుధ తన సుధే! అక్కడికే వెళ్తుంది. లేచి బయలుదేరింది విలసిత...వస్తున్నప్పుడు పిచ్చ బలంలేదు. కాళ్ళు ముందుకడుగు వేయనని మొరాయిస్తున్నాయి. మనసు దీనాతి దీనంగా ఆక్రోశిస్తోంది. ఏమూలో ఇంకా కొద్దిగా మెదులుతోన్న వ్యక్తిత్వం లేని ఓపికతో ఛీ! ఛీ! అంటోంది.
    ముందుకే నడిచింది.
    తల్లిని చూడగానే ఒక్క పరుగున వచ్చి కౌగిలించుకుంది సుధ. ఆ ఆలింగనంలో సమస్తమూ మరిచిపోయింది విలసిత...సుధను మరింత దగ్గిరగా తీసుకుని "ఇంక వెళ్ళను. నిన్ను వదిలి చావను." అని గొణుక్కుంది.
    "రాత్రంతా ఎవడి దగ్గిరున్నావ్?" కర్కశంగా వినిపించింది రామారావు గొంతు.
    బొమ్మలా నిలబడ్డ విలసితను చూసి "నిన్నే? ఎవడి దగ్గరున్నావ్ రాత్రంతా?" అన్నాడు మళ్ళీ...
    మొదట రామారావు అడుగుతున్నదేమిటో అర్ధం కాక అయోమయంగా చూసిన విలసిత అర్ధమయ్యాక వెఱ్ఱిగా నవ్వింది...   
    చెప్పులుకూడా లేక రక్తం చిమ్ముతున్న పాదాలు__దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు...పీక్కుపోయిన ముఖం... తను జరిపిన శృంగార క్రీడలన్నీ తన ముఖంమీదే తెలుస్తున్నాయి.
    విడాకులకోసం కేసుపెట్టాడు రామారావు. కోర్టు... లా...
    విలసిత తనంత తానే భర్తను వదిలిపోయింది. రామారావు విడాకులు పొందటం న్యాయం__లా ప్రకారం సుధ రామారావుకే చెందాలి...
    అవును! విలసిత దోషి!
    రామారావుకు చెందిన సుధను ఎత్తుకురావటం కిడ్ నేపింగ్...లా ప్రకారం... న్యాయసూత్రాలననుసరించి... న్యాయం!... ధర్మం...
    ప్రభాకరరావు వంచిన తల ఎత్తలేక పోతున్నాడు. ఏ ముఖం పెట్టుకుని విలసితతో మాట్లాడగలడు?
    "సుధను నా కప్పగించలేవా ప్రభాకర్!"
    "లా ప్రకారం..." ప్రభాకర్ ఏదో అనబోతుండగానే అడ్డగించింది విలసిత...
    "వద్దు! వద్దు! లా గురించి... న్యాయం గురించీ... ధర్మం గురించీ నాకేం చెప్పద్దు...సరే! వస్తాను__"
    హేమతోపాటు లేచివెళ్ళబోయింది విలసిత....
    "విలసితా! ఒక్కమాట..."
    ఆగింది విలసిత...
    "నువ్వేమీ అనుకోకపోతే....ఇప్పటికీ నేను నిన్ను పెళ్ళిచేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను..."
    సంకోచిస్తూ అన్నాడు ప్రభాకరరావు.
    విలసిత విస్తుపోయింది. తరువాత చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో కొద్దిపాటి జీవం...విలసిత పరిభాషలో పూర్వజన్మ వాసన! తొంగిచూసింది.
    అక్కడ నిలబడలేనట్లు గిర్రున తిరిగి గబగబ ముందుకు నడిచింది.
    "మళ్ళీ వస్తా ప్రభాకర్!" అంటూ హేమ విలసితననుసరించింది.
    రాత్రంతా నిద్రలేని ప్రభాకర్ దగ్గిరకు హడావుడిగా వచ్చింది హేమ__
    "ప్రభాకర్! విలసిత ఆత్మహత్య చేసుకుంది. త్వరగా రా!" అంది.
    ప్రభాకర్ దిగ్గునలేచి ఉన్నవాడున్నట్లు బయలుదేరాడు...
    హేమ ఎంత జాగ్రత్తగా కనిపెట్టి చూస్తున్నా విలసిత ఎలాగో తప్పించుకుంది. తన ఇంటికి...కాదు....రామారావు ఇంటికి వచ్చేసింది. నిద్రపోతున్నా సుధను ఆప్యాయంగా కౌగిలించుకుని చివరి శ్వాశ వదిలేసింది.
    గుంపులుగా మూగిన జనం... రకరకాల వ్యాఖ్యానాలు!
    "అబ్బ! ఎంత గట్టిగా పట్టుకుందో పిల్లను ప్రాణంపోయినా చేతులాపిల్లను చుట్టే ఉన్నాయి." అంటున్నారు ఎవరో....
    "చివరకు ఈ విధంగా నా మీద కసితీర్చుకుంది" అని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు రామారావు. అతనిని చాలామంది ఓదారుస్తున్నారు.
    నిశ్చింతగా నేలమీద పరుకుని విలసితను చూసాడు. ప్రభాకర్ ... ఈపాటికి స్వర్గానికి చేరుకొని ఉంటుంది. స్వర్గాన్ని చేరుకుంటుందా? పై లోకాలలో న్యాయవాది "మిలార్డ్ ఆత్మహత్య మహాపాపం! వ్యాయసూత్రాలననుసరించి ఈ ప్రాణిని నరకజ్వాలలలో దహించి ...." వగైరా వగైరా వాదించడూ?


                                 * * *

 Previous Page Next Page