సమ్రాట్ సమాధానానికి డి.ఎస్.పి. తెల్లబోయాడు.
కళ్యాణి అక్కడనుంచి విసవిసా వెళ్ళిపోయింది.
సమ్రాట్, అనూష కారులో బయలుదేరారు.
అతను కుండబద్దలు కొట్టినట్టు డి.ఎస్.పి.తో మాట్లాడటం అనూష విన్నది.
ఆవేశం తెచ్చుకోవడం, అంతలోనే మామూలు స్థితికి రావడం సమ్రాట్ కే చెల్లింది!
కావలసినంత మోతాదులో కసి, ప్రేమ, పగ తెచ్చుకోవడం అవసరాన్ని బట్టి తగ్గించుకోవడం నిజంగా కళే!
"హలో! ఏమిటలా ఉన్నావు?" సమ్రాట్ తన ఉనికిని గుర్తుచేస్తూ అన్నాడు.
"అబ్బే_బాగానే ఉన్నాను! బైదిబై_సాహితి మీకోసం వచ్చింది" అంది సందర్భం మార్చుతూ.
సాహితి పేరు వినగానే సమ్రాట్ ముఖం విప్పారింది. "ఎప్పుడు? ఎక్కడ? ఏది?" ఆత్రుతగా అడిగాడు.
అనూషకు నవ్వాగలేదు. పకపకా నవ్వింది.
అతను చిన్నబుచ్చుకున్నాడు.
"సారీ! ఆడిటోరియం వరకు వచ్చింది. లోపలకు వచ్చిందో రాలేదో నేను చూడలేదు. ఆమె వస్తూ సూట్ కేస్ తెచ్చి నా గదిలో పెట్టింది. మళ్ళీ నా గదికి వస్తుందేమో!" అంది.
బిందుమాధవి ఎదురవడం, వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం చెబితే అతను నిరుత్సాహపడతాడని గ్రహించి ఆ విషయం కావాలనే దాటవేసింది.
సమ్రాట్ భారంగా నిట్టూర్చాడు. సాహితి సన్మాన కార్యక్రమాన్ని ఎందుకు రాలేదో ఎంత ఆలోచించినా అర్థంకాలేదు సమ్రాట్ కు.
ఏది ఏమైనా తను సాహితితో మనసు విప్పి మాట్లాడాలి. ఇకనుంచి ఆమె పట్ల తను జాగ్రత్తగా మసలుకోవాలి. తనకు ఎన్ని పనులున్నా అవి మానుకునైనా సాహితికి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నాడు సమ్రాట్.
"అనూషా! సాహితి రాగానే నాకు తెలియజేయి. ఆమెతో నేను పర్సనల్ గా మాట్లాడాలి" నొక్కి చెప్పాడు.
"అలాగే!" అంది అనూష.
తన గదికి దగ్గరలో కారు దిగింది అనూష.
* * * *
యూనిఫారంలో ఉన్న ఇన్ స్పెక్టర్ వీరేష్ ని చూసి అనూష క్షణం పోల్చుకోలేక పోయింది.
తరువాత గుర్తుపట్టి విష్ చేసింది.
రైల్లో జరిగిన సంఘటనను ఆమె ఇంకా మరచిపోలేదు!
వీరేష్ అనూషను పరీక్షగా చూశాడు. ఆమెలో ఏమాత్రం నదురు, బెదురు కనిపించలేదు.
ఒక పోలీస్ ఆఫీసరు హఠాత్తుగా వచ్చినప్పుడు సామాన్యులెవరైనా విషయం తెలియక ఖంగారు పడటం సహజం. కాని అనూషలో అటువంటిదేమీ లేదు! ఆమె ఎంతో ధైర్యంగా ఉంది. అంతేకాదు_అతనెందుకు వచ్చాడో తెలుసుకోవలసిన ఆసక్తి కూడా ఎంతమాత్రం ఉన్నట్టు కనిపించలేదు.
వీరేష్ కి ఉదయాన్నే శ్రీపతి నుంచి ఫోన్ రావడంతో, అతని బాధపడలేక ఎలాగోలా అనూషను ఒప్పించి ఇంటికి పంపాలని వచ్చాడు.
పోలీసు అధికారి ఆమె వ్యక్తిగత విషయంలో తలదూర్చడం ఎంతవరకు సమంజసం? డ్యూటీ పరంగా అయితే తను గౌతమి కేసులో అనూషను విచారించవచ్చు.
అటెండరు టీ కప్పులు టేబుల్ మీద పెట్టాడు.
"టీ తీసుకోండి, చల్లారిపోతుంది!" అంది నిదానంగా అనూష.
"సమ్రాట్ కు మీరేమవుతారు?" టీ కప్పు చేతిలోకి తీసుకుంటూ అడిగాడు ఇన్ స్పెక్టర్.
"ఏమీ కాను. ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నానంతే!"
"ఎంతకాలం నుంచి?"
"నా వివరాలన్నీ అడుగుతున్నారు, ఏదైనా కేసు దర్యాప్తులో వచ్చారా?" సూటిగా అడిగిందామె.
"అవును. గౌతమి కేసులో మిమ్మల్ని విచారించడానికి వచ్చాను.
క్షణం తెల్లబోయింది అనూష. "గౌతమి కేసుకూ, నాకూ సంబంధం ఏమిటి?"
"మిస్ అనూషా! గౌతమి సమ్రాట్ అభిమాని. మీరు సమ్రాట్ దగ్గర పనిచేస్తున్నారు. మీకు గౌతమి గురించి తెలియకుండా ఉంటుందా చెప్పండి!"
"సమ్రాట్ కు వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయినా వాళ్ళందరి గురించీ తెలుసుకోవడం నా పని కాదు. అందుకోసమే అయితే మీరు అనవసరంగా శ్రమ తీసుకుని ఇంతదూరం వచ్చారంటాను."
ఆమె మాటలకు వీరేష్ కు ఒక్కసారిగా ఒళ్లు మండింది.
"యూ....! అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు.
"సారీ ఇన్ స్పెక్టర్! ఇది మీ పోలీసు స్టేషన్ అనుకున్నారా! మైండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లాంగ్వేజ్!" అనూష కోపంగా ఠకీమని అంది.
తను అనవసరంగా ఆవేశానికి లోనయ్యాడు. తొందరపడి నోరు జారాడు. ప్రాసిక్యూషన్ కు అనుకూలంగా సాక్షులను విచారించే విధానం ఇది కాదు.
అందునా అనూష తన ప్రశ్నలకు ఆచి తూచి సమాధానం చెబుతోంది. ఇక ఆమెను బాధపెట్టి ప్రాసిక్యూషన్ కు అనుకూలంగా ఏ సాక్ష్యాన్నీ చెప్పించలేననుకున్నాడు.
అతను వచ్చిన పని కేవలం సాక్ష్యం కోసమే కాదు. శ్రీపతి కిచ్చిన మాట ప్రకారం అనూషకు తను నచ్చచెప్పాలనుకున్నాడు. సాక్ష్యం పేరుతో మంచి చేసుకుని, వ్యక్తిగత విషయాలలోకి వెళ్ళాలనుకున్నాడు. కాని, ఆదిలోనే బెడిసింది. ఇప్పుడు ఆమె వ్యక్తిగత విషయాల గురించి అడిగి భంగపడటం కన్నా ఉపయోగం లేదనుకున్నాడు.
"సారీ! మీరు మరోలా అనుకోవద్దు. ఏదో ఆడపిల్లకు అన్యాయం జరిగిందన్న కోపంలో నోరు జారాను" అన్నాడు నొచ్చుకుంటూ.
"ఏం ఫరవాలేదు! నా అవసరం ఏమన్నా ఉంటే చెప్పండి. అయినా సమ్రాట్ దగ్గర పనిచేస్తూ అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతానని మీరెలా అనుకున్నారు? వృత్తి విలువలు అందరికీ ఒకటేగా?"
"ఛ! ఛ! అలా చెప్పమని నేననడంలేదు. సమ్రాట్ వ్యక్తిగత విషయాల గురించి నేను అడగలేదుగా! సమ్రాట్ కూ, గౌతమికీ పరిచయం వుంది. ఆమె తరచు అతనిని కలవడానికి వస్తూ వుండేదని మీకు మాత్రం తెలియదా? తెలియదంటే మీరు సమ్రాట్ ను గట్టిగా సమర్ధిస్తున్నారని అనుకోవలసి వస్తుంది."
"చూడండి ఇన్ స్పెక్టర్! సాక్షులను విచారించేప్పుడు వాళ్ళు చెప్పింది రాసుకోవాలే కాని, వాళ్ళకు ప్రాంప్టింగ్ ఇచ్చి సాక్ష్యం రాసుకోమని మీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో వుందా?"