Home » Yandamuri veerendranath » రక్త సింధూరం


    అదే అడిగాను. వాళ్ళు మాట్లాడలేదు. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.
    "వాడి వెనుక రౌడీలు ఎవరన్నా వున్నారా?"
    అవునన్లేదు. కాదన్లేదు. కరుడు గట్టిన భయం వాళ్ళనుంచి మాటని బయటకు రానివ్వటం లేదు.
    "మీరందరూ ఎందుకింత భయపడుతున్నారు? అతడేమీ పులి కాదు. కనీసం బలమైన పిల్లి కూడా కాదు. ఇంతమంది ఉన్నారు మీరు. అందరూ కలిసి మీ వూరి ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్ పెట్టకూడదు? నేను చూడండి- పోలీసుస్టేషన్ కి వెళ్ళాను. పని జరగలేదు. తాలూకాఫీసుకి వెళ్ళాను. అక్కడా పని జరగలేదు. అలా అని వూరుకున్నానా? లేదే. కలెక్టర్ ఆఫీసు కెళ్ళాను."
    జీపు మెయిన్ రోడ్డునుంచి పక్కదారిలోకి మళ్ళింది. ఘనాపురం విసిరేసినట్టు ఓ పక్కగా వున్నవూరు. గతుకుల రోడ్డుమీద జీపు ఎగిరెగిరి పడుతూంది. పైన రాడ్ పట్టుకున్నాను.
    పురుషోత్తమ్ వెళ్ళిపోతూ, జీపులో మమ్మల్ని దింపమని చెప్పి వెళ్ళిపోయాడు. పని చేయలేనందుకు క్షమాపణలు చెప్పుకున్నాడు. అసలు చెప్పుకోవలసింది నేను! ఫిర్యాదే లేకపోతే ఇంక ఎవరు మాత్రం చేసేది ఏముంది?
    దూరంగా ఘనాపురం వూరు కనిపిస్తూంది. వీళ్ళను దింపేసి నేను వెళ్ళిపోవాలి. అంతే! నేను ఓడిపోయాను.
    కానీ అడగబోయే ప్రశ్న ఒకటి మిగిలిపోయింది. వెళ్ళిపోబోయే ముందు ఒక ప్రశ్న అడిగేసి వెళ్ళిపోతాను. అదే అడిగాను.
    "అయిదొందలకి నోటు రాసినా, ఆ విషయాన్ని వప్పుకొనే ధైర్యం నీకు లేకపోయింది. మరి నేనొచ్చి నీ కొడుకుని చాకిరీనుంచి విడిపిస్తానని అనగానే వద్దని నాతోనే ఎందుకు అనలేదు. నన్నో వెధవని ఎందుకు చేశావు?"
    ఆ చివరి మాటకి నారాయణ మొహంలో బాధ కనిపించింది. నొచ్చుకున్నట్టు కనిపించాడు. "అంతమాట అనకుదొరా" అన్నాడు.       
    "నా ప్రశ్నకి సమాధానం అది కాదు. నే నొకవేళ నీ కొడుకుని తీసుకొచ్చినా, నేను వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి వాడికి అప్పగించేసి వుండే వాడిని. నేను ప్రామిసరీ నోటుని చింపేసినా, తిరిగి ఇంకొకటి వ్రాసి వుండేవాడిని."
    అతడు నావైపు అయోమయంగా చూస్తూ నెమ్మదిగా అన్నాడు. "కానీ నువ్వు 'పెద్దన్న' పంపగా వచ్చినవని నెప్పినావు గద్దొరా"
    "అయితే?"
    "పెద్దన్న సెప్పినాక ఇయ్యకుండుంటాడు?"
    షాక్!
    ఈ సమాధానం వూహించలేదు. తమాయించుకుని అన్నాను- "నేను మీ పెద్దన్న పేరు ఉపయోగించదల్చుకోలేదు. వాడి డబ్బు వాడి మొహాన కొట్టవచ్చు. అదీ చేయదల్చుకోలేదు. గొడ్డలితో పందెం కాసేను. మనం మన హక్కుల్ని రక్షించుకో లేకుండా ఈ ప్రపంచంలో ఏ శక్తీ మనని ఆపుచేయలేదని నిరూపిద్దామనుకున్నాను. అతడి భ్రమల్ని తలగిద్దామనుకున్నాను. సమస్యని కలెక్టర్ దగ్గిర దాకా తీసుకు వెళ్ళాను. మీ గొడ్డలి చేయలేని పనుల్ని నేను చేసి చూపించి వుండేవాణ్ణి. చివరివరకూ వచ్చిన దాన్ని మీరు పాడుచేశారు, ఇప్పుడు రాబోయే కలెక్టరు ఎటువంటివాడో మనకు తెలీదు."
    "ఈ కలెకటరేట్ బాబు సాన మంచోడు గిట్ల వున్నడు" అన్నాడు వాళ్ళలో ఒకడు.
    "నీకు దెల్వదూరుకోరా! ఈ కరకటేర్దొర ఇయ్యాలుంటాడు- రేపు పోతాడు. ఆ ధర్మారావు గెప్పటికీ ఈడనే వుంటడు." ఒక గొప్ప జీవిత సత్యం చెపుతున్నట్టు వాడు అంటూ ఉంటే నాకు వళ్ళు మండింది. "అయితే ఏమిటిట?" అన్నాను కోపాన్ని అణచుకుంటూ.
    అంతలో జీపు ఆగింది. ఎవరో కుర్రాడు చేయిసాచి ఆపమని అంటున్నాడు. ఆగగానే వచ్చి "ఇల్లు కాలిపోయిందన్నా నీది" అన్నాడు నారాయణతో రొప్పుతూ.
    అందరం నిశ్చేష్టులమయ్యాము. నారాయణ మొహం అయితే పూర్తిగా పాలిపోయింది. వేగంగా అక్కడికి వెళ్ళాము. ఇంటి స్థానంలో బూడిద మిగిలి వుంది. దూరంగా లక్ష్మి ఒక చెట్టు క్రింద జీవచ్చవంలా కూర్చుని వుంది. నాలుగైదు వంట పాత్రలు మాత్రం మిగిలినట్టున్నాయి. కాలిన స్థలంలోంచి ఇంకా కొద్దిగా పొగ వస్తూనే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు తమ పాకలకి కూడా అగ్ని పాకకుండా తడిపినట్టున్నారు. అక్కడంతా చిత్తడిగా వుంది. బూడిద కలిసిన తెల్లనీళ్ళు కాల్వ కట్టినయ్.
    నారాయణ లక్ష్మి దగ్గిరకి వెళ్ళాడు. అప్పటివరకూ బింకంగా కూర్చున్న లక్ష్మి భర్తను చూడగానే ఒక్కసారిగా బావురుమంది.
    నాతోపాటూ జీపులో వచ్చిన వాళ్ళతో ప్రొద్దున్నించి జరిగింది అక్కడ వాళ్ళు చెపుతున్నారు. వాళ్ళలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. "ఎదో జీపొచ్చి నిన్నూ, మరో నలుగుర్నీ తీసుకుపోయిందని చిదానందం తెలుసుకున్నాడు. ఏడకి పోయిన్రని ఇచారించిండు. పట్నం పోయిరని చెప్పినం. ఆ తర్వాత కొద్ది సేపట్కి ధర్మారావు మనుషులొచ్చిన్రు. నిన్ను కలకటేరు బంగ్ల కాడ సూసిన్రట. సప్పుడు చేయకుండా ఆళ్ళు కూడా ఎళ్ళిపోయిన్రు."
    వింటున్న నారాయణ నావైపు చూశాడు. ఆ చూపు ఒక బాణంలా నాలో గుచ్చుకుంది. అతడేమీ మాట్లాడలేదు. మాట్లాడే అవకాశం లేదుకూడా. ఆ ఒక్క చూపులోనే నాకు ఎన్నో విషయాలు తెలిసినయ్! ఎన్నో ప్రశ్నలు నన్ను చుట్టిముట్టినయ్!! నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది.
    "పొలం బోయిన కొత్తలో నేనూ ఈ ఆఫీసుల చుట్టూ తిరిగాన్దొరా.... నువ్వు తిరిగినట్టే నేనూ దిరిగినాను."
    "ఈ కలకటేరు దొర ఇయ్యాలుంటడు. రేపు పోతాడు. ధర్మారావుదొర గెప్పటికీ ఈడనే ఉంటాడు... ఈ అన్న ఇయ్యాలొచ్చి నా కొడుకుని విడిపిస్తాడు. రేపట్నుంచీ నాకు నరకం మొదలవుతుంది."
    - నారాయణ ఎందుకు అబద్ధం చెప్పాడో ఇప్పుడు అర్ధమైంది. వాళ్ళమీద అపరిచితమైన జాలికల్గింది. 'చిదానందం' అనుకున్నాను మనసులో ... "చాలా గొప్పగా వీళ్ళందర్నీ నీ గుప్పెటిలో పెట్టుకున్నావు. వీళ్ళు కొద్దిగా ధైర్యం చేసి నాతో బయల్దేరారని తెలియగానే, వీళ్ళధైర్యాన్ని మొక్కగా వున్నప్పుడే తెంచెయ్యాలన్న ఉద్దేశ్యంతో ఇంటికి నిప్పెట్టేవు! సెహబాష్!! కానీ ఒక్క విషయం మర్చిపోయావు. వీళ్ళ వెనుక వున్నది నేను!!! నీకంటే కిరాతకులూ, నరరూప భక్షకులూ అయిన నేరస్థుల్ని కంటి చూపుతో శాసించగల జైలర్ వీళ్ళ వెనుక వున్నాడన్న విషయం తెలుసుకోలేకపోయావు. నీకు తగిన పాఠం నేను చెప్పాలి. చెపుతాను"
    ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళి జీపు ఎక్కాను. నా ప్రవర్తనకి అక్కడివాళ్ళు ఆశ్చర్యపోవటం స్పష్టంగా కనిపిస్తూంది. అయినా పట్టించుకోలేదు, డ్రైవర్ తో పోనివ్వమని చెప్పాను. పట్నం చేరుకునేసరికి సాయంత్రం కావొస్తూంది. జీపుని వెళ్ళిపోమని చెప్పాను. కాళి నడకన చిదానందం ఇంటికి చేరుకున్నాను.
    చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో దాదాపు ప్రతి రైతు, కూలీ- అందరి శ్రమశక్తినీ పిండి, డబ్బుగా మార్చుకున్న భోషాణం లాంటి ఇల్లు- రక్తంలో ఇంకిపోయిన పిసినారితనంవల్ల- ప్రతి గదిలోనూ లైటు లేక చీకటిగా ఉంది. ముందు వరండాలో దీపం మసగ్గా వెలుగుతొంది. అంతా నిర్మానుష్యంగా ఉంది.
    ఇంతకుముందు ఒకసారి రావటంవల్ల - చిదానందం ఎక్కడుండేది తెలుసు. నేరుగా లోపలికి వెళ్ళాను. వసారా వెనుక కిటికీలోంచి ఒక కుర్రవాడు గేదెల్ని కడుగుతూ కనిపించాడు. నన్ను పట్టించుకోలేదు.
    చిదానందం గదిలో ప్రవేశించి తలుపు దగ్గిరగా వేశాను.
    చిన్న దీపం వెలుతురులో కూర్చొని పుస్తకాలు చూసుకుంటున్నాడు. అలికిడికి తలెత్తి చూశాడు. బహుశా ఆ క్షణం అక్కడ నన్ను వూహించి వుండడు. చప్పున లేవబోయాడు. స్నేహ పురస్కరంగా నవ్వి "కూర్చో చిదానందం" అన్నాను తలుపు వేస్తూ.
    "ఏమిటది, ఎందుకొచ్చావ్?" అని అడిగాడు. అతడి కంఠంలో కంగారు కనిపించింది. నవ్వుతూ "కొంచెం మాట్లాడదామనీ" అన్నాను. వెళ్ళి అతడి పక్కన కూర్చుంటూ. 
    "వెళ్ళు... వెళ్ళిక్కణ్ణుంచి... ఒరేయ్ రంగా" అరవబోయాడు.
    "అదేమిటి చిదానందం! వచ్చిన కస్టమర్లతో అలాగేనా మాట్లాడేది. వెళ్లిపోమ్మంటావేమిటి? నేను నీ కోసం నా కాబోయే భార్య మంగళసూత్రాలూ, నాకు పుట్టబోయే కొడుకుని నీ దగ్గిర జీతానికి దాఖలు పరుస్తున్నట్టు పత్రలూ తీసుకొచ్చాను."
    అతడు కళ్ళప్పగించి చూడసాగాడు.
    "నాకో పదివేలు అప్పు కావాలి చిదానందం! అర్జెంటుగా ఇవ్వు-"
    "నా దగ్గర డబ్బులేవు. వెళ్ళు. వెళ్ళు."
    "అయ్యో అలా అంటే ఎలా? అక్కడ నారాయణ వాళ్ళకుటుంబం నడివీధిలో ఉంది. అర్జెంటుగా వాళ్ళకో ఇల్లు కట్టించాలి. కాలిపోయిన సామాన్లు అన్నీ కొనాలి. దానికి మొత్తం అయిదువేలు అవుతుంది. పైగా వాళ్ళకి ఈ కష్టంలో సాయం చేయటానికి ఒక కుర్రవాడు కూడా కావాలి. ఇంకొకరూ ఇంకొకరూ ఎందుకు వాళ్ళ కొడుకే వుండగా! కానీ పాపం అతడు అయిదువేలు నీ దగ్గిర అప్పు చేశాడటగా. న్యాయం న్యాయమే! అయిదువేలు నీ అప్పు తీర్చి మరీ కొడుకుని పట్టుకుపోతాడు. అన్నిటికీ కలిసి మొత్తం పదివేలు అవుతుంది. తొందరగా యివ్వు చిదానందం" తాపీగా అన్నాను.
    అతడిలో అంత శక్తి ఎలా వచ్చిందో తెలీదు. అంత స్థూలకాయాన్నీ ఒక్క ఊపులో లేపి తలుపువైపు చువ్వలా పరుగెత్తాడు. అయితే నేను డిపార్టుమెంట్ మనిషిని అని అతడికి తెలీదు. పెద్దగా కదలకుండానే, ఉన్న చోటునుంచి కాలుని ముందుకు జరిపాను. దానికి పట్టుకుని ధడేలున ముందుకు పడ్డాడు. తల అదిరిపోయినట్టంది. నేను జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకునే వరకూ లేవలేదు.
    "పదివేలు కావాలి చిదానందం. అయిదువేలు నువ్వు కాల్పించిన ఇంటికి. అయిదువేలు 'న్యాయబద్ధంగా' నీ అప్పు తీర్చటానికి... నాజేబులోంచి తుపాకీ తీసే అవకాశం కల్పించకు-"
    అతడు లేచాడు. ఏమనుకున్నాడో ఏమో బొడ్లోంచి తాళం చెవుల గుత్తి తీసి, ఇనప్పెట్టె తెరచి పదివేలు తీసి ఇచ్చాడు.  
    అందుకుని జేబులో పెట్టుకున్నాను. "నాకింకో ఉత్తరం వ్రాసివ్వాలి నువ్వు."
    "ఏమిటది?"
    "రేపు నేను వెళ్లిపోయాక నారాయణకి గానీ, అతని కుటుంబానికి గానీ ఏ విధమైన అపకారం జరిగినా దానికి పూర్తి బాధ్యత నీదే అని."
    అతడు ఏదో అనబోయాడు.
    "నాకు నువ్వు చెప్పేది అనవసరం. వ్రాసివ్వాలి. అంతే"
    అతడు కాగితం కలం తీసుకుని నేను చెప్పినట్టు వ్రాసి ఇచ్చాడు. అదికూడా జేబులో పెట్టుకుంటూ అన్నాను-
    "రేపు నారాయణ వస్తాడు. అతడి దగ్గిర డబ్బు తీసుకుని, అతడి పత్రం అతడికి అప్పగించు. కొడుకుని కూడా ఇచ్చెయ్యి ఆ తరువాత వాళ్ళ కుటుంబానికి అగ్నివల్ల కానీ, వరదలవల్ల కానీ ఏ ప్రమాదమూ రాకూడదని ప్రతి రోజూ దేవుణ్ణి ప్రార్ధించు. ఏ కారణంవల్ల జరిగినా నువ్వే ఖరీదు చెప్పించుకోవాలి కాబట్టి."
    లేచాను.
    అతడు కళ్ళప్పగించి చూస్తున్నాడు. 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra