Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 24


    "ఎందుకు గుర్తులేవు? ప్రతి చిన్న విషయమూ కూడా నిన్న మొన్న జరిగినట్టుగా ఉంది. ఇంతకీ మన మిత్రుల సంగతి చెప్పలేదు నువ్వు. పేరు మార్చుకుని నువ్వు జనస్రవంతిలో కలిసిపోయినట్టే, వాళ్ళూ కలిసి పోయారా? లేక మరణించారా?"

    "లేదు ప్రస్తుతం ఢిల్లీలో మంత్రి పదవుల్లో ఉన్నారు."

    బృహస్పతి నిర్ఘాంతుడై చూసాడు.

    అతడి కళ్ళలో విస్మయం గమనించిన హరిస్వామి "అవును మంగళ్! త్రిలోకనాధ్ యాదవే, సంకల్పనాథ్ గా పేరు మార్చుకున్నాడు. జానికిరాం భగత్ - రాంభగవాన్ లక్ష్మణ్ భరత్ అయ్యాడు"

    "రాం....భ....ర....త్" కీచుగా ధ్వనించింది బృహస్పతి కంఠం. అతడు కళ్ళు మూసుకున్నాడు. భృకుటి ముడిపడింది. తనలో తనే గొణుక్కున్నట్టు "అవును కదూ.... అవును కదూ!" అనుకున్నాడు.

    "ఏమిటి అవునూ?"

    "ఇప్పుడు గుర్తొచ్చింది?"

    "ఏమిటి గుర్తొచ్చింది?"

    "నిజమే!"

    "ఏమిటి నిజమే?"

    "నా ప్రతిమాటకీ ముందు నువ్వు 'ఏమిటీ' అన్న పదం చేర్చి ప్రశ్నించకు హరిస్వామీ! నేనసలే అయోమయంలో వున్నాను."

    "ఏమిటి అయోమయం?"

    "అదిగో మళ్ళీ?"

    "కాదులే చెప్పు?"

    "కొన్నాళ్ళ క్రితం రాంభరత్ మీటింగ్ కి నేను వెళ్ళాను. నిజమే! ఇప్పుడు పోలికలు బాగా గుర్తొస్తున్నాయి. బాగా లావయ్యాడు సుమా. ఎలా ఉండేవాడో జానకిరాం. గుర్రం ఎక్కి తూనీగలా స్వారీ చేసేవాడు. ఢిల్లీ నీళ్ళు బాగా పడ్డట్టున్నాయి. త్రిలోక్ కూడా అలాగే మారిపోయి ఉంటాడు కదూ?"

    "ఆహా! ప్రస్తుతం ప్రధానమంత్రికి చాలా దగ్గర. అయితే ఇద్దరికీ చాపకింద నీరులా చాలా గొడవలున్నాయనుకో"

    "మనం నలుగురం ఒకసారి కలవాలి. చాలాకాలమైంది. నువ్వయితే అడగలేదు కానీ, మనం కలవగానే వాళ్ళిద్దరూ అడగబోయే మొదటి ప్రశ్న ఏమిటో నాకు తెలుసు"

    "ఏమిటది?"

    "ఆ నిధి ఎక్కడ దాచావ్? అందులో మూడు వంతుల వాటా మాకు వస్తుంది అని."

    "ఛ.... ఛ.... వాళ్ళిద్దరూ అంత తక్కువ స్థితిలో ఏమీ లేరు. కేంద్ర మంత్రుల గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేసినట్టున్నావ్. ఛంబల్ వాలీలో పాతిక సంవత్సరాలు మనం కష్టపడి ప్రాణాలకి తెగించి సంపాదించినది వాళ్ళు అయిదు సంవత్సరాల్లో సంపాదించేసారు"

    "నిజమే సుమా! మనంగానీ ఏ స్మగ్లర్లమో, మాఫియా లీడర్లమో అయితే పోలీసులు మనని వెంటాడి వేటాడుతారు. అదే మాఫియా లీడర్ల, స్మగ్లర్ల సహాయంతో మంత్రులమైతే, ఆ పోలీసులే బాడీగార్డులై మనకి రక్షణ కల్పిస్తారు."

    "కరక్ట్ గా చెప్పావు. ఇప్పటివరకూ నా సహాయం తీసుకున్న మంత్రులందరూ నా మీద కాస్త సి.బి.ఐ. ఎంక్వయిరీ రాగానే దూరంగా ఉంచుతున్నారు. నిజంగా ఆ నిధి అవసరం ఎవరికైనా ఉందంటే అది నాకే"

    "అదేమిటి స్వామీ! ప్రధానమంత్రులని కూడా నియమించగల స్థాయిలో ఉన్న నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ బాగాలేదు"

    "అదంతా ఒకప్పటి మాట! నా ఆశ్రమానికి ఎలక్ట్రిసిటీ కూడా కట్ చేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొని వుంది."

    "కొంపతీసి ఇప్పుడు నువ్వు వచ్చింది ఆ నిధి గురించి అడగడానికేనా? అదే అయితే నన్ను క్షమించు. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లోనే ఎక్కడో దాచాను. ప్రస్తుతం గుర్తు రావడంలేదు. ఒకవేళ వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని వెల్లడి చేయడానికి వీల్లేదు. అది రాజా విక్రమ్ దేవ్ కి సంబంధించినది కదా!"

    "నేను దాన్ని గురించి అడగటానికి రాలేదు."

    "పాత స్నేహితుణ్ణి పలకరిద్దామని వచ్చావన్నమాట. థాంక్యూ!"

    "నిజానికి ఆ మాటకూడా సరైనది కాదనుకో.... " సందిగ్ధంగా ఆపుచేసాడు హరిస్వామి.

    అతడు కొంచెంసేపు ఏమీ మాట్లాడకపోయేసరికి "నువ్వు చాలా మారిపోయావు ఇబ్రహీంఖాన్!" అన్నాడు బృహస్పతి. "....నా దగ్గరే ఇంత తటపటాయిస్తున్నావంటే నువ్వు పూర్వపు ఖాన్ వేనా అని అనుమానం వస్తోంది."

    హరిస్వామి చప్పున బృహస్పతి చేతులు పట్టుకుని "లేదు.... లేదు.... అటువంటిదేమీ లేదు. నేను వచ్చిన పని - డైరీలు, ఫోటోల గురించి మాట్లాడటానికి" అన్నాడు.

    "డైరీలూ....ఫోటోలునా? అవేమిటీ?"

    "నీకు గుర్తులేదూ? మనం ఎవరెవరి దగ్గర ఎంత దోచుకున్నదీ ఓ డైరీలో రాసేవాడివి. హతుల శరీరాలు ముందు పెట్టుకుని నలుగురం ఫోటోలు తీయించుకునేవాళ్ళం."

    "ఓ! వాటి సంగతా నువ్వు మాట్లాడేదీ?"

    "అవును. అవి ఎక్కడున్నాయ్?"

    బృహస్పతి ఒక్కక్షణం మాట్లాడలేదు. తర్వాత తనలో తను అనుకుంటున్నట్లు- "ఎప్పటిమాట అది! పాతిక సంవత్సరాల క్రితం సంగతి. రత్నాబాయి దగ్గర ఉండచ్చు. అయినా ఇప్పుడు వాటితో ఏం పని?"

    "ఏం పనా?" హరిస్వామి గొంతు కీచుగా ధ్వనించింది. "....మన నలుగురి భవిష్యత్తూ సమూలంగా నాశనమవడానికి అందులో ఒక ఫోటో చాలు. డైరీలో ఒక పేజీ చాలు."

    "మన నలుగురి భవిష్యత్తూ కాదు.... మీ ముగ్గురి భవిష్యత్తూ!" నవ్వుతూ అన్నాడు బృహస్పతి. "....నేను మరణించానన్న విషయం మర్చిపోతున్నావు ఇబ్రహీంఖాన్."

    హరిస్వామి మొహం వాడిపోయింది. "అదే.... అదే.... మా ముగ్గురి భవిష్యత్తు" అన్నాడు తడబడుతూ.

    "భారతదేశానికి మంచి నాయకత్వాన్నిచ్చి, ప్రగతిపథం వైపు నడిపించడమే నా ఆశయం. నిజానికి నువ్వు గుర్తుచేసే వరకూ నాకా ఫోటోల సంగతే తెలీదు. అందులో ఉన్న ముగ్గురూ ప్రస్తుతం దేశపు అత్యున్నత స్థాయిలో ఉన్నారని కూడా తెలీదు. అన్నిటికన్నా ముఖ్యవిషయం ఏమిటంటే ఆ ఫోటోలు ఎక్కడున్నాయో తెలిసినది రత్నాబాయికి ఒక్కదానికే. అయినా, ఎప్పుడో జరిగిపోయిన దాని సంగతి ఇప్పుడెందుకు?"

    "అయితే ఫోటోల సంగతి మర్చిపొమ్మంటావా?"

    "నా గురించి భయపడవద్దంటాను."

    హరిస్వామి గుండెలనిండా గాలి పీల్చుకుని నెమ్మదిగా వదుల్తూ "ఆ ఫోటోల్తో వాళ్ళిద్దరినీ భయపెట్టవచ్చు మంగళ్!" అన్నాడు నెమ్మదిగా.

    ఆ ఆర్ధరాత్రి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఓ బాంబు పడినట్లయింది.

    బృహస్పతి విభ్రాంతుడై చూసాడు.

    హరిస్వామి నవ్వాడు. "అదే మరి రాజకీయం అంటే! కేవలం దేవుడి ఆశీర్వాదంతో వచ్చిన నీకు ఇక్కడి రాజకీయాల సంగతి పూర్తిగా తెలీదు. ఇక్కడ ఓకే మతతత్వ పార్టీని గద్దె దింపడానికి కులతత్వ పార్టీలూ, కమ్యూనిష్టు పార్టీలూ, కాపిటలిస్టు పార్టీలూ కూడా కలిసిపోతాయి. ఈ దేశం సంగతి చూస్తే నిన్ను పంపించిన దేవుడికే మతిపోతుంది."

    "ఇంతకీ ఆ ఫోటోలు దేనికి ఉపయోగపడతాయి?" సందిగ్ధంగా అడిగాడు బృహస్పతి.

    "ఆ విషయానికే వస్తున్నాను. నువ్వు ప్రధానమంత్రివి కావాలంటే సంకల్పనాధ్, ఆర్.బి.ఎల్. భరత్ లాంటి పెద్ద పెద్ద నాయకుల అవసరం చాలా వుంది. ఈ ఫోటోలు నీ దగ్గర ఉన్నంతకాలం వాళ్ళు నీ దగ్గర కుక్కల్లా పడి ఉంటారు. అంతే కాదు, కనీసం పదికోట్లకి తక్కువ కాకుండా నీకు సమర్పించుకుంటారు. కాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎలాగూ దేవుడి పుత్రుడి వైన నీ వైపే ఉన్నారు. దానికితోడు ఈ డబ్బు కూడా తోడైతే నువ్వే భవిష్యత్ ప్రధానివి. రాజకీయాల్లో తెలివితేటలు, ముందు చూపు చాలా ముఖ్యం బృహస్పతీ! ఆలోచించుకో."

    బృహస్పతి నవ్వాడు. "....ముందుచూపే కాదు, వెనక చూపు కూడా ఉండాలి. నా వెనక జరిగినది ఏమిటో చెప్పమంటావా హరిస్వామీ? మంగళ్ సింగ్ పునర్జన్మ వార్త పేపర్లో రాగానే మీ ముగ్గురూ సమావేశమై ఉంటారు. ఆ ఫోటోలు డైరీల విషయం మాట్లాడటానికి నిన్ను రాయబారిగా పంపించారు. అవునా?"

    హరిస్వామి తెల్లముఖం వేసి అప్రయత్నంగా "అవును" అన్నాడు.

    "ఆ ఫోటోలు బహిర్గత పరిచే ఉత్సాహం నాకు ఏ మాత్రం లేదని చెప్పగానే నువ్వు హతాశుడివయ్యావు. నిజానికి అక్కడితో నీ పని అయిపోయింది. నువ్వు ఆనందంగా వెళ్ళి మీ వాళ్ళకి ఈ విషయం చెప్పవచ్చు. కానీ అలా వెడితే అది రాజకీయం ఎందుకు అవుతుంది? సంకల్పనాధ్, ఆర్.బి.ఎల్. భరత్ లు అధిష్టాన వర్గపు Good Looks లో లేరని నీకు తెలుసు. భవిష్యత్తులో వాళ్ళు పదవులు కోల్పోవచ్చు కూడా! అలాంటి వాళ్ళని పట్టుకుని వేలాడడం నీకు అనవసరం. మరో వైపు -ఈ సారి ఎన్నికల్లో ప్రస్తుత అధిష్టానవర్గంకూడా పదవిలోకి రాకపోవచ్చు. అందువల్ల నన్నొక Third Force గా తీర్చిదిద్దుదామనుకుంటున్నావు. అందుకే వాళ్ళిద్దరి తరఫునా రాయబారిగా వచ్చిన నువ్వు - ప్లేటు మార్చి, వాళ్ళని ఎలా బ్లాక్ మెయిల్ చెయ్యాలో చెప్పి నన్ను వాళ్ళ మీదకి ఉసిగొల్పుతున్నావు. దీనివల్ల నీకు రెండు లాభాలు ఉన్నాయి. మొదటిది-నీ గత చరిత్ర ప్రజలకి తెలిసే అవకాశం ఉండడు. రెండవది- మరో ప్రధానమంత్రి నీ చేతుల మీదుగా తయారయ్యాడన్న పేరు వస్తుంది."

    హరిస్వామి నిర్ఘాంతపోయి చూస్తూండగా బృహస్పతి కొనసాగించాడు. "....ముందుచూపూ, వెనుకచూపూ ఉండడం అంటే అదే హరిస్వామీ! ఛంబల్ వాలీలో మన గుర్రపుస్వారీ గుర్తు తెచ్చుకో. ఎటునుంచి ఏ ప్రమాదం వస్తుందోనని అన్నివైపులా చూపు నిలిపేవాళ్ళం. ఆ ప్రక్రియలో మీకు అందరికీ శిక్షణ ఇచ్చింది నేనే. గుర్తుందా? అటువంటి నాకు- రాజకీయం గురించి నేర్పుతున్నావా? నువ్వు రాజకీయ చదరంగంలో పావుల్ని నడిపి మంత్రులనీ, ప్రధానమంత్రులనీ తయారుచేసే తాంత్రికస్వామివి అయితే అయ్యుండవచ్చు. కానీ నీ వేళ్ళ కదలికని బట్టి నీ మనసులో ఏముందో తెలుసుకో గలిగే తంత్రగాళ్ళకు మంత్రగాడ్ని నేను. అర్ధమైందా?" 

    హరిస్వామి అప్రతిభుడయ్యాడు. అతడి గత పాతికేళ్ళ జీవితంలో ఇలా మాట్లాడినవారు లేరు. ఒక్క మంగళ్ సింగ్ లోనే ఆ నిష్కర్ష, స్పష్టత, నిర్మొహమాటత్వం.... అవసరమైతే నిరంకుశత్వం కనబడేవి.

    అతడు అడుగు ముందుకువేసి, బృహస్పతి చేతులు పట్టుకుని "నన్ను క్షమించు మంగళ్! నిన్ను బెదిరించాలనో, లేక ఫోటోల కోసం బేరం పెట్టాలనో ఉద్దేశం నాకెప్పుడూ లేదు. ఎలాగూ నువ్వుకూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నావు కాబట్టి మీ ముగ్గురూ కలిస్తే బాగుంటుందన్న విషయం మాత్రమే సూచించాను. పోతే మిగతా ఇద్దరినీ అదుపులో ఉంచుకోవడానికి నీకు ఆ ఫోటోలు సహాయపడతాయని మాత్రమే నా ఉద్దేశం. అందులో నా స్వార్ధం కూడా కాస్త ఉంటే ఉండవచ్చు. పోతే ఒక విషయం మాత్రం నిజం. నీకు ఈ జన్మలో 'బృహస్పతి' అని ఎవరు పేరు పెట్టారో కానీ చాలా కరెక్ట్ గా పెట్టారు. ఇంత చిన్నవయసులో ఇంత వ్యూహాన్ని రచించగల వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. అయితే రాజకీయ పరమపద సోపానంలో మిగతావాళ్ళ అండదండలూ, డబ్బూ కూడా అవసరమే! దానికి మొదటి మెట్టుగా నువ్వు ఆ ఫోటోలు సంపాదించు. విక్రమ్ దేవ్ కి ఇవ్వడం అనే విషయం మర్చిపోయి మనమా వందకోట్లు విలువచేసే ఆ నిధి ఎక్కడుందో పట్టుకోవాలి" అన్నాడు.

 Previous Page Next Page