అతడి ఇబ్బంది గమనించినట్టు గులాబీ రంగు చీరె కట్టుకున్న అమ్మాయి "చాల్లెండే" అని అతడి వైపు తిరిగి "మా కాలేజీకి శలవలండీ వచ్చే నెల పదో తారీకు వరకూ శలవలు" అంది.
వాళ్ళేదో అంటున్నారు అతడు గమనించలేదు కాళ్ళక్రింద భూమి జారిపోతున్నట్లు వుంది. హీనమైన కంఠంతో "ఒక్క కాలేజీయేనా?" అని అడిగేడు.
"కాదు - యూనివర్సిటీ అంతా."
చిగురుటాకులా అతడు వణికిపోయేడు. అయిపోయింది. ఏ మూలో వున్న ఆఖరి ఆశ కూడా పోయింది. ఇక ఎక్కడని వెతుకుతాడు.
అదీ వారంరోజుల్లో.
అతడు అక్కడనుండి మౌనంగా సాగిపోయేడు.
అప్పటివరకూ లేని మార్పు ఒక్కసారిగా అతడిలో వచ్చేసరికి ఆ అమ్మాయిలు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. వాళ్ళు కూడా బయటికి నడిచేరు.
సైకిల్ స్టాండు పక్కన తచ్చాడుతున్న ప్రొఫెసర్ని చూసి, "ఈ రోజు కూడా మీరు కారు తేలేదా మాస్టారూ" అంది గులాబీరంగు చీరె కట్టుకున్న అమ్మాయి.
"అవును కదూ" తల గోకున్నాడు పండిత్.
"రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. నేను వెళ్ళేది అటేగా"
"సరే -"
కారు "తులసి" ఇంటివైపు సాగిపోయింది.
* * *
సరిగ్గా అదే సమయానికి ఓ ఆలోచన వచ్చింది అతడికి. కళ్ళు దీప్తితో వెలిగేయి. ఒక్క వుదుటున లేచాడు దార్కా, సరిపడా డబ్బు వుందా అని చూసుకున్నాడు. పరుగులాంటి నడకతో మొదట పత్రికాఫీసు చేరుకున్నాడు.
* * *
ఆ రోజు సాయంత్రం ఎడిషన్ లో అన్ని లోకల్ న్యూస్ పేపర్లలోనూ ఒక మూల ఒక ప్రకటన పడింది ఇలా.-
'తు ల సి'
నిన్ను కవలాలనుకుంటున్నాను. కోట పక్కన
మైలురాయి దగ్గరికి శనివారం అయిదింటికి రా.
'కా ష్మో రా'
* * *
తన జీవితంలో ఎన్నడూ లేనంత ఉద్విగ్నతతో దార్కా ఆ రోజు గడిపేడు. సాయంత్రం అవుతున్న కొద్దీ టెన్షన్ అయితే దానిక్కారణం వుంది.
ఆ రోజు మధ్యాహ్నం అథడు పత్రికాఫీసుకు వెళ్ళినప్పుడు అడ్వర్ టైజ్ మెంట్ మేనేజర్ "రండి" అని "చిన్న న్యూస్ మీకు" అన్నాడు.
"ఏమిటి?"
"మీకు పోన్ వచ్చింది"
దార్కా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. తనని తను కంట్రోల్ చేసుకుంటూ "ఎవరు?" అన్నాడు. అంటూంటే అతడి కంఠం వణికింది.
"ఓ స్త్రీ"
రక్తనాళాలు పగిలిపోతాయేమోనన్నంత ఉద్నిగ్నత. పరిస్థితి పట్టించుకోకుండా ఆ మానేజర్ చెప్పుకు పోతున్నాడు.
"సాధారణంగా అడ్వర్టెయిజ్ మెంట్ ఇచ్చిన వాళ్ళకి వచ్చిన పోన కాల్స్ మేం పట్టించుకోం. కానీ మీ ప్రకటన చాలా చిత్రంగా వుండటంతో నాకు ఇంటరెస్టు కలిగింది. కాష్మోరా ఎవరు?"
దార్కా పళ్లుబిగువున అడిగేడు "ఆ అమ్మాయి ఏమంది?"
"మీ గురించి అడిగింది. మాకు తెలీదన్నాను. అంతే."
దార్కా లేచాడు. "సాయంత్రం వస్తానందా?"
"వస్తుందట కాష్మోరా అంటే ఎవరు?"
దార్కా జవాబు చెప్పలేదు. "వెళ్లొస్తాను" అంటూ కదిలేడు. ఫర్వాలేదు తన బాణం తగలవలసిన చోటే తగిలింది.