"ఎస్...ఎస్...ఎస్..."
"యూ ఆర్ మాడ్! నీకు పిచ్చెక్కింది. అసలే పుస్తకాలు అమ్ముడవక ఛస్తుంటే అయిదువేలు లంచం ఇచ్చి...ప్లీజ్ గెటౌట్! యూ ఆర్ డిస్ మిస్ డ్, గెటౌట్. ఇంకోసారి నీముఖం నాకు చూపించకు! మా అమ్మాయి ప్రతిమకు కూడా చూపించకు! గెటౌట్" ఆవేశంగా అరిచాడతను.
సరిగ్గా అప్పుడే నలుగురు వ్యక్తులు ఆఫీసులోకి జొరబడ్డారు.
"ఎవరు మీరు?" మరింత రెచ్చిపోతూ అడిగాడు మార్కండేయులు.
"ఎర్రమట్టి బుక్స్ కావాల్సార్! జనమంతా తెగ అడుగుతున్నారు మా షాప్స్ లో కొచ్చి. మేము బుక్ షాప్ ఓనర్స్ మి! మా నలుగురికీ తలో రెండువందల కాపీలు కావాలి" ఓ వ్యక్తి హడావుడిగా అన్నాడు.
"చూశావా మైడియర్ ఫాదరిన్లా! ఆవేశంలో గెటౌట్! గెటౌట్ అంటూ తెలుగు సిన్మాలో చచ్చు హీరో ఫాదరిన్లాలాగా అరిచేయటం గొప్ప కాదు. సర్ఫ్ ఎడ్వర్టయిజ్ మెంట్ లో లలితాజీ మెదడు ఉపయోగించినట్లు చేత్తో మెదడుని మోగించినట్లు చూడుము! సత్ఫలితాలుంటాయి."
ఆ మాటలతో ఇన్ స్పెక్టర్ పుంజుకున్నాడు. అతికష్టం మీద తూలుతూ లేచి నిలబడ్డాడు "ఏయ్ మిష్షర్! ఎర్రమష్షి బుష్ ని అమ్మడానికి వీల్లేదు. అమ్మితే అందరినీ అరెష్ష్ షేస్తా, ఆ షాపంతా జీప్ లో వేషుకెళ్ళిపోతా" అన్నాడు కిందపడబోయి గోడ పట్టుకుని నిలబడుతూ.
భవానీశంకర్ కి విషయం అర్థమయ్యింది.
ఇన్ స్పెక్టర్ వైపు చిరునవ్వుతో చూశాడు "మీరు చెప్పదల్చుకుందేదో చాలా చక్కగా వివరించారు మైడియర్ ఇన్ స్పెక్టర్! మీకు ఎర్రమష్షి బుష్ స్టాకంతా కావాలి అంతేనా?"
"అంతే!"
"కానీ అవన్నీ రాష్ట్రమంతటా బుష్ షాప్స్ కి పంపించేశాం బ్రదర్! వెంటనే మీ కానిస్టేబుల్ ని షాప్స్ కి పంపించి స్టాకంతా సీజ్ చేయండి."
"ఓ! అయ్ షీ! అయితే ఇక్కడేం ష్షాక్ లేదు. అంతేనా?"
"అంతే బ్రదర్"
"ష్ష్! నన్ను బ్రదర్ అనకు"
"అనకూడదా బ్రదర్"
"అనకూడదు. అయామ్ ఆన్ డ్యూటీ" అంటూ దభేల్ మని కిందపడిపోయాడు. వెంటనే ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి అతనిని మోసుకుని తీసుకెళ్ళిపోయారు.
భవానీశంకర్ కి మళ్ళీ ఉత్సాహం వచ్చేసింది "ఇంకా చూస్తావేమిటి మైడియర్ మోహన్ రాజ్! వెంటనే మిగిలిన స్టాకంతా కూడా పంపించేసేయండి. ఆ ఇన్ స్పెక్టర్ మందు ప్రభావంలో నుంచి బయటపడి మళ్ళీ మా ఆఫీసుకొచ్చేసరికి ఎర్రమట్టి పుస్తకం ఒక్కటి కూడా మన దగ్గర కనిపించకూడదు. సరేనా?"
"ఓ.కె.సార్!" అనేసి బయటకు పరుగెత్తాడు మోహన్ రాజ్.
మార్కండేయులుకి మతిపోయినట్లయింది. అతనికి ఇదంతా కలో నిజమో అర్థం కావటంలేదు. అంతకుముందురోజే తమ పబ్లికేషన్స్ లో అటకమీదున్న పుస్తకాల స్టాకంతా పాత న్యూస్ పేపర్లు కొనేవాడికి అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ స్టాకంతా హార్డ్ క్యాష్ గా మారి తన చేతికి రాబోతోంది.
భవానీశంకర్ మార్కండేయులు వైపు చిరునవ్వుతో చూశాడు "చూశారా మైడియర్ ఫాదరిన్లా? బిజినెస్ కి తెలివితేటలు ముఖ్యం గానీ, సఫారీ సూట్ వీసుకుని వచ్చి ఆఫీస్ లో కూర్చుని సీలింగ్ వంక చూస్తూ ఆలోచించడం ముఖ్యంకాదు. అంచేత కొంచెం ఎదగటం నేర్చుకోండి."
మార్కండేయులు ముఖం కోపంతో జేవురించింది "నన్ను ఫాదరిన్లా అని పిలవొద్దని అదివరకోసారి చెప్పాను."
"అలా చెప్పటం చాలా మంచి అలవాటు! ప్లీజ్ కీపిటప్ ఫాదరిన్లా! ఎప్పటికప్పుడు నాకు రిమైండ్ చేస్తూండండి" అనేసి బయటకు నడవబోతుంటే మార్కండేయులు త్వరత్వరగా అతని దగ్గరకొచ్చాడు.
"ఎనీవే... ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్... ఆ పుస్తకాలు బాన్ చేయించడం వల్ల అమ్ముడు పోవచ్చు గానీ, నా జనరంజనీ పబ్లికేషన్స్ మీద ప్రజలకు సదభిప్రాయం పోతుంది. జనరంజనీ పబ్లికేషన్స్ ఎప్పటి సంస్థో తెలుసా? మా ముత్తాతల కాలం నుంచీ వస్తోన్న ప్రిస్టేజియస్ సంస్థ!"
"ప్రిస్టేజియస్ సంస్థ కాబట్టే అది దభేల్ మని బొక్కబోర్లా పడిపోకుండా ఆపుతున్నాను ఫాదరిన్లా! లలితాజీ చెప్పినట్లు సమజ్ నే కీ బాత్ హై" అంటూ మెదడు మోగించి చూపాడు.
మార్కండేయులుకి కోపం ముంచుకొచ్చింది కానీ అప్పటికే భవానీశంకర్ బయటకు నడిచాడు.
* * * *
వరహాల్రావ్ డైనింగ్ టేబుల్ కింద కూర్చుని ఆ రోజు న్యూస్ పేపరు రహస్యంగా చూస్తున్నాడు. ఆ పేపర్లో ఏ రోజు ఏ గుర్రం గెలవడానికి అవకాశం వుందో రాసి వుంటుంది. ఆ రోజు 'చెక్మే' అనే గుర్రం గెలువబోతోందని రాశాడు పేపరువాడు. కనుక ఎట్లాగయినా దానిమీద ఓ వంద కాయాలని నిర్ణయించుకున్నాడు. ఎటొచ్చి తన దగ్గర ఆ వందే లేదు. అంతే!
అడపాదడపా వంద సంపాదించాలంటే ఆ ఇంట్లో పెద్ద కష్టమేం కాదు.
"మీరు చెప్పిందంతా ఫ్యాక్టరీ యూనియన్ లీడర్సుతో చెప్పాను సార్! మీరు ఆరు నెలలపాటు స్ట్రయిక్ చేసుకోండి. మీ కోర్కెలలో ఒక్కటి కూడా ఒప్పుకోము అన్నాను. దాంతో వాళ్ళందరూ వెళ్ళి తమలోతాము గుసగుసలాడుకుని సరే! మా స్ట్రయిక్ విత్ డ్రా చేసుకుంటున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయారండీ!"
"ఛట్! సిగ్గులేకపోతేసరి. నువ్వు సరిగ్గా డీల్ చేయకపోబట్టే వాళ్ళ సమ్మె రద్దయ్యింది. నువ్వు నీ తెలివితేటలు ఇంకొంచెం ఉపయోగించి వాళ్ళను మరింత రెచ్చగొట్టినట్లయితే సమ్మె జరిగి వుండేది. దాంతో మన ఫ్యాక్టరీ మూలన పడేది. అంటే మనకు కోటి రూపాయలు నష్టం వచ్చేది. కోటి రూపాయలు నష్టం రావటమంటే మాటలా? ఎంత పూర్వజన్మ సుకృతం వుండాలి! దానికి చక్కని అవకాశాన్ని సర్వనాసనం చేసేశావ్. సంగీతరావ్ ఐయామ్ సారీ! నీలాంటివాడు జనరల్ మేనేజరుగా వుంటే పదేళ్ళయినా నేను కోటీశ్వరుడిగానే వుండిపోతాను. ఎప్పటికయినా ఆస్తంతా పోగొట్టుకుని నేను కోరుకునే విధంగా పూరిగుడిశెలో నా శరీర శక్తి మీద ఆధారపడి నా స్వంత శ్రమతో పొట్టపోసుకుంటూ జీవితం గడపలేను. అందుచేత నిన్ను డిస్మిస్ చేస్తున్నాను."
శ్యామల్రావ్ నిశ్చేష్టుడయ్యాడు "ఇదన్యాయం సార్! ఎవరయినా లాభాలు రానందుకూ, కంపెనీని సరిగ్గా నిర్వహించలేనందుకూ డిస్మిస్ చేస్తారు. మీరేమో కంపెనీ మూతపడలేదని డిస్మిస్ చేసేస్తానంటున్నారు. అన్యాయం సార్!"
సుధీర్ కుమార్ కి కోపం పెరిగిపోతోంది "శంకర్రావ్! దయచేసి వెళ్ళిపో! నా ఆస్తంతా హారతి కర్పూరంలా హరించి వేసే మేనేజర్ కావాలి నాకు. గెటౌట్! నీలాంటి నమ్మక ద్రోహులు అవసరం లేదు."
శంకర్రావు దిగులుగా అతనివైపు చూశాడు "తప్పదంటారా సార్?"
"ఇప్పటికే చాలా ఆలస్యమయిపోయింది. ఎప్పుడో చేయాల్సిందీపని నేను."