Previous Page Next Page 
ఆత్మబలి పేజి 23


    రుద్రకాళిలా వర్ధనమ్మను సమీపించింది శోభ.
    "అడగటానికైనా సిగ్గులేదూ? మా ఉమ కాళ్ళు పట్టడానికైనా అర్హత ఉందా చలపతికి? ఎన్ని జన్మలు తపస్సు చేస్తే తాను దానికి భర్త కాగలడు? నోరుమూసుకో!"
    పదిమందిలో ఈ తిరస్కారానికి వర్ధనమ్మ భగభగలాడిపోయింది.
    "నా నోరు మూస్తావుకాని లోకం నోరు మూయమ్మా. ఏదో బంధువులు కదా అని జాలిపడి పెళ్ళిపీటల మీద పెళ్ళి చెడిన పెళ్ళికూతుర్ని నేను చేసుకుంటానన్నాను కానీ, ఈ దరిద్రగొట్టునెవడు చేసుకుంటాడు? నువ్వో వీధి నూరేగుతున్నావుగా, మీ చెల్లెల్నింకోవీధిన ఊరేగమను. నాకేం?"
    ఈ అవకాశం వదులుకోలేని పేరంటాళ్ళు కొందరు పకపకలాడారు.
    శోభ మరింత తీక్షణంగా సమాధానమిచ్చేటంతలో కామాక్షమ్మ అడ్డుపడింది.
    "శోభా! నోరుముయ్యి. అవతలకు పో! వదినా! నువ్వే దీన్ని కాపాడాలి. నీ కోడలిగా చేసుకుని నీ కడుపులో పెట్టుకో దీన్ని.."
    వర్ధనమ్మ చేతులు పట్టుకుని కళ్ళలోంచి రక్తం బొట్లు రాల్చింది కామాక్షమ్మ. పార్వతి అయోమయంగా చూసింది. ప్రభాకరం శిలా విగ్రహంలా కూర్చున్నాడు. శోభ సుడిగాలిలా ఉమ దగ్గిరకు పరుగెత్తింది.
    "ఉమా! నీ జీవితం సర్వనాశనం కాబోతూంది. నిన్ను చలపతికి కట్టబెట్టపోతున్నారు. పిన్ని స్వయంగా ఒప్పుకుంది. నీకేం ఫర్వాలేదు. నేనున్నాను. ఈ పెళ్ళి జరగనివ్వను."
    గౌరీపూజ ముగించి భక్తితో నమస్కరించింది ఉమ.
    "పరిస్థితులకు ఎదురుతిరగటం నా లక్ష్యం కాదక్కయ్యా! పరిస్థితుల కనుగుణంగా నన్ను నేను మలచుకోవటమే నా ధ్యేయం"
    ఎప్పటి చిరునవ్వుతో అంది ఉమ.
    కొరడాతో ఛెళ్ళున కొట్టినట్లయింది శోభకు. మూఢురాలిలా ఉమ ముఖం వంక చూస్తూ "ఇది బొమ్మలాట కాదు ఉమా! నూరేళ్ళ జీవితం" అంది.
    "నూరేళ్లయినా, ఎన్నేళ్ళయినా జీవితం జీవితమే! ఈ జీవితంలో ఏదీ ఆటలు కాదు."
    "ఉమా! నిన్ను నువ్వు సర్వనాశనం చేసుకుంటావా?"
    "నాకు నాశనం లేదు."
    "ఛా! ఉమా! ఏవిఁటిది? వేదాంతమా? పిరికితనమా? నీకు ఆత్మవిశ్వాసం లేదూ? పరిస్థితుల నెదుర్కోలేవూ?"
    "అనంతమైన ఆత్మవిశ్వాసం ఉండబట్టే పరిస్థితులతో రాజీ పడగలుగుతున్నాను. నీకున్న ఆత్మవిశ్వాసమే నాకూ ఉంది. నీది తిరుగుబాటు. నాది తపస్సు. పరిస్థితుల నెదుర్కొని నీకు కావలసింది పొందటానికి ఎంత మనోబలం కావాలో ఏ పరిస్థితులనైనా స్వీకరించటానికీ అంతే మనోబలం కావాలి. మన మార్గాలు భిన్నమైనవి. నా మార్గాన్ని లోకం హర్షిస్తుంది. గెలిస్తే బ్రహ్మరథం పడుతుంది. ఓడితే సానుభూతి చూపిస్తుంది. మానవానీకమంతా అంతరాంతరాల్లో గాఢంగా వాంచిస్తూ ఆచరణలో పెట్టడానికి సాహసించలేని అందమైన మార్గం నీది కావటమే ఇందుకు కారణం. ఆత్మవిశ్వాసమూ, మనోబలమూ ఇవి రెండేకాక నా మార్గంలో పయనించటానికి ఆత్మసంయమనం కావాలి. నీ మార్గంలో పయనించడానికి ధైర్యసాహసాలు కావాలి. ఇంతే తేడా!"
    శోభకు నోటమాట రాలేదు. చెక్కుచెదరని చిరునవ్వుతో ప్రశాంతమైన చూపులతో పెళ్ళిపీటలమీద కూర్చుంది ఉమ. ఉమ తన ప్రక్కన కూర్చోగానే గబుక్కున లేచాడు చలపతి.
    "ఉమా! నిజం చెప్పు. నువ్వు...నువ్వు నిజంగా... నిజంగా నన్ను చేసుకుంటున్నావా?" అన్నాడు. ఉమ తనను చేసుకోటం మహాద్భుతంగా ఉంది చలపతికి.
    పెళ్ళిపందిట్లో కొందరు ముసిముసిగా, కొందరు గట్టిగా నవ్వుకొన్నారు. శోభకు కడుపులో తిప్పినట్లయింది.
    ఉమ కళ్ళెత్తి అతనివైపు చూసి చిరునవ్వు నవ్వి తలవంచుకొంది. ఒక్కసారి తల గోక్కుని పీటల మీద కూర్చున్నాడు చలపతి.
    కన్యను ధారపొయ్యటానికి యాంత్రికంగా పీటలమీద కూర్చున్నాడు ప్రభాకరం. పదిమంది చూస్తున్నారనైనా లేకుండా పమిట చెంగు తడిసిముద్దయి పోయినా, కళ్ళు తుడుచుకుంటూనే ఉంది పార్వతి. ఏ కూతురి పెళ్ళి కళ్ళారా చూడాలని కలలుకందో, ఆ కూతురి పెళ్లిలో గోడ కానుకుని కళ్ళు గట్టిగా మూసుకుంది కామాక్షమ్మ.
    ఆ పెళ్లిపందిట్లోంచి పారిపోయింది శోభ.
    

                                       15


    "కట్నాలూ, లాంఛనాలూ ఎలాగూ లేవు. ఉన్న ఒక్క ఆడపడుచుకయినా కాస్త మంచి చీర పెట్టు వదినా!" అంటున్న వర్ధనమ్మను విస్తుపోయి చూసింది శోభ. ఉమ పెళ్ళిలో కట్టుకోవటం కోసం పెళ్ళయ్యాక మొదటిసారిగా కంచి పట్టుచీర కొనుక్కుంది పార్వతి. కట్టుకోవటానికి మనస్కరించక మడత విప్పనే లేదు. అది తీసి ఉమ ఆడపడుచు కాళి చేతిలో పెట్టి అప్పగించింది.
    పదిమందిలోనూ "ఛీ! ఛీ! ఇదేం రంగూ?" అంది కాళి.
    కోపంతో దహించుకుపోతూ "నీకు బాగా సరిపోతుంది" అంటున్న శోభ నోటిని తన చేత్తో మూసేసింది పార్వతి.
    ఆ ఇంట్లో ఉండలేక అవతలకు పోలేక కొట్టుకుపోతోంది శోభ.
    శోభనం పీటలమీద కూర్చున్న ఉమనూ, చలపతినీ చూసేసరికి శోభకు కన్నీళ్ళాగలేదు. సర్వావయవాలలోను తొణికిసలాడే సౌందర్యానికి యవ్వనం మరింత మెరుగులు దిద్దుతూండగా తేజోరాశిలా ప్రకాశిస్తోంది ఉమ. ఆ సౌందర్యాన్ని చూసేపాటి శక్తి కూడా లేని బుద్ధిహీనుడైన చలపతి వెకిలిగా అటూ ఇటూ చూస్తూ ఏదో వింతపశువులా ఉన్నాడు.
    శివుని కోసం తపశ్చర్యసాగించబోతున్న పార్వతీదేవిని తల్లి మేనక వారించగా 'ఉమ' అని పేరు వచ్చిందట.
    ఆనాటి ఉమ తపశ్చర్య ఆత్మనాధునికోసం.
    ఈ ఉమ తపస్సు ఆత్మబలి.
    బరువెక్కిన గుండెలతో ఏమని ఆశీర్వదించాలో తెలియని అయోమయ స్థితిలో వధూవరులమీద అక్షింతలు జల్లి కన్నీళ్ళాపుకొంటూ తన స్నేహితురాలు సరోజిని ఇంటికి పారిపోయింది శోభ.

 Previous Page Next Page