Previous Page Next Page 
చెక్ పేజి 23


    తనూ భర్తలా వడ్డీ, ఖర్చు టర్మ్స్ లో మాట్లాడడం భయమేసింది ఆమెకు. ఆ మాటలన్నాక నాలుక కరుచుకుంది. ఇంకెప్పుడూ వడ్డీ అనేమాట తన నోటంట రాకూడదని ఒట్టుపెట్టుకుంది.

 

    "మీటర్ తిరగదా?" ఆశ్చర్యపోయాడు రాఘవులు.

 

    వెంటనే ఎదురింటికెళ్ళి జీరో వాల్ట్స్ బల్బు తీసుకొచ్చాడు. దాన్ని వేసి, మీటర్ చూశాడు. అందులోని చక్రం తిరగకపోయేసరికి సంతృప్తి పడి బల్బు కొనుక్కొచ్చాడు.

 

    గట్టిగా శబ్దం కావడంతో ఆలోచనల గొలుసు తెగింది.

 

    కళ్ళు విప్పింది.

 

    తన ఇంటి వెనుక భాగం నుంచే శబ్దాలు వస్తున్నట్టు అనిపించింది. దాంతో ఠక్కున లేచి కూర్చుంది.

 

    మళ్ళీ గట్టిగా కొడుతున్నట్టు చప్పుడు. దొడ్లో ఎవరో వున్నట్టు అలికిడి.

 

    రాఘవులను లేపుదామని హాల్ లోకి చూసింది. అతను గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.

 

    ఆమె ముఖమంతా చెమటతో జిడ్డుగా తయారైంది. పైన ఫ్యాన్ తన మూడు చేతులను వూపుతూ అల్లిబిల్లి ఆట ఆడుతూనే వున్నా చెమట్లు పడుతున్నాయి.

 

    గట్టిగా అరవాలని నోరు తెరిచిన శ్రీలేఖ చివరి నిముషంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

 

    గుండెలో భయం రెక్కలు విప్పుకుంది.

 

    దొంగలు... ఒకరు కాదు ఇద్దరు కాదు ... డజన్లకొద్దీ దొంగలు ఇంట్లోకి వచ్చేస్తున్నట్టే ఉంది. వాళ్ళంతా తనను కత్తులతో పొడిచి పేగులను బయటకు లాగి మఫ్లర్ గా మెడలకు చుట్టుకుని వెళుతున్నట్టు వుంది.

 

    ఆమెకు కాళ్ళూ, చేతులూ ఆడడంలేదు. శ్వాస పీల్చడం కూడా కష్టంగానే ఉంది.

 

    ముఖాన్నంతా పైటతో తుడుచుకుంది.

 

    ఇంకా ఏమైనా శబ్దాలు వినిపిస్తాయేమోనని కళ్ళంతా విప్పదీసుకుని చెవులను మరింత ముందుకు జరపడానికి తలవంచింది.

 

    ఎలాంటి అలికిడీ లేదు. దొంగలొస్తున్నట్టు తను అనవసరంగా భ్రమపడుతున్నట్టు అనిపించింది. పక్కింట్లో మనుష్యులు తిరగాడుతూ ఏవో పనులు చేసుకుంటూ వున్నారేమో అనుకుంది.

 

    ఇక నిశ్చింతగా పడుకోవాలని నడుము వాల్చింది.

 

    కళ్ళముందు దృశ్యాన్ని మార్చాలనుకుని, పుట్టింటిని గుర్తు చేసుకుంది. తన ఇంట్లో సినిమా నుంచి వచ్చాక చాలాసేపు ఆ కబుర్లతోనే కాలం గడిచేది. ఇప్పుడు ఎవరితో చర్చించడం?

 

    అంతలో ఇనుప చీల కింద పడ్డట్టు చప్పుడు.

 

    దిగ్గున లేచి కూర్చుంది.

 

    ఎర్రటి వెలుగులో హాల్ రక్తం నింపిన స్విమ్మింగ్ ఫూల్ లా వుంది.

 

    ఆమెకు భయంతో నోరెండిపోయింది.

 

    ఇక తన భర్తను లేవగొట్టకపోతే చాలా ప్రమాదమనిపించింది. దోపిడీ దొంగలు కత్తులతో లోనికి ప్రవేశిస్తే ఏమిటి చేయడం?

 

    రాఘవుల దగ్గరకు వెళ్ళి మనసు మార్చుకుంది. గాఢంగా నిద్ర పోతున్న అతనిని లేపడానికి మనస్కరించలేదు.

 

    తిరిగి తన గదిలోకి వస్తూ దొడ్డి గుమ్మంకేసి చూసింది. చీకట్లో ఏమీ కనిపించడం లేదు. తలుపులు వేసి వుండడం మాత్రం మసగ్గా కనిపించింది.

 

    అక్కడ ఎవరూ లేరనిపించడంతో నిద్ర ముంచుకొస్తున్నట్టనిపించింది. మంచం మీద పడుకుంది.

 

    ఎవరో తమింట్లోకి దూకినట్టు శబ్దం.

 

    ఠక్కున లేచి కూర్చుంది.

 

    కేకలు వేద్దామన్నా నోరు రావడంలేదు. నాలుక పిడచ కట్టుకుపోయింది.

 

    దొంగలు తనింట్లో దూరారని ఆమెకు స్పష్టంగా తెలిసిపోయింది.

 

    అడుగుల చప్పుడు.

 

    చెమటతో తడిసి ముద్దయిపోయింది శరీరం.

 

    దొంగలు తనను కత్తులతో పొడిచినట్టనిపించి గట్టిగా కళ్ళు మూసుకుంది.

 

    అడుగుల చప్పుడు మరింత స్పష్టంగా వినిపిస్తోంది. గుండె దగ్గర ఎవరో డప్పులు మోగిస్తున్నట్టుంది. ఆమె శరీరం వణకడం ప్రారంభించింది.

 

    కళ్ళు విప్పింది. ఆమె కనుగుడ్లు అలజడితో పిచ్చి పట్టినట్టు అటూ ఇటూ కదులుతున్నాయి.

 

    హాల్లోకి చూసింది.

 

    చీకటంతా మానవాకారం దాల్చి, గాల్లో కొట్టుకొచ్చినట్టు. నేలపై నీడ పాక్కుంటూ వస్తోంది.

 

    ఆమెలో భయం తల విరబోసుకుంది. రక్తం శరీరం పైకి చిమ్ముకొస్తున్నట్టుంది. గుండె ముక్కలై ఒక్కో ముక్క ఒక్కో దశన ఎగిరి పడుతున్నట్టు భావన. కాళ్లూ, చేతులూ చచ్చుబడి, వాటిలోని ఎముకలు కరిగి పోతున్నట్టు నిస్సత్తువ కమ్మేస్తోంది. తన జుట్టంతా ఒక్కసారి తెల్లబడి పోయినట్టనిపించి కెవ్వున అరవబోయింది.  

 

    అప్పటికే ఆ కారం హాల్లోకి వచ్చేసింది. ఆమెలోని నీళ్ళన్నీ ఆవిరైపోయాయి. తలుపు పక్కకు తప్పుకుని అక్కడ్నుంచి చూస్తోంది.

 

    వచ్చింది ఒక వ్యక్తే. ఎర్రటి వెలుగులో అతను మండిపోతున్న మనిషిలా వున్నాడు. నల్లటి కండరాలపై వెలుగు పడడంతో గడ్డకట్టిన రక్తం ముద్దలా కనిపిస్తున్నాడు. అతని కళ్ళు పగిలిన పత్తికాయల్లా వున్నాయి. అతను వేసుకున్న తెల్లటి షర్ట్ వూడిపోవడానికి సిద్ధంగా వున్న సున్నం పెళ్ళలా వుంది. గళ్ళున్న నల్లటి లుంగీ గొడుగు గుడ్డ మీద గుడ్లగూబ కళ్లను అతికించినట్టుంది. అతనికి మహా వుంటే ముప్పై ఏళ్ళుంటాయి.

 

    అతను మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ రాఘవుల దగ్గరకు వచ్చాడు.

 

    అతను దొంగతనానికి వచ్చినట్టు అతని ప్రవర్తనే చెబుతోంది.

 

    శ్రీలేఖ తలుపు పక్కనించి గుడ్లప్పగించి చూస్తోంది.

 

    అప్పుడేం చేయాలో ఆమెకు అంతు పట్టలేదు. అరిస్తే చంపేస్తాడేమోనని భయం ఆమె అవయవాలన్నింటినీ లొంగదీసుకుంది.

 

    రాఘవులు గురక ఏదో దారుణం జరగడానికి ముందు విన్పించే డేంజర్ సైరన్ లా వుంది. కొలిమికి వూదుతున్న గాలి తిత్తిలా అతని నల్లటి పొట్ట ఎగిరెగిరి పడుతోంది.

 

    రాఘవులు ఇప్పుడిప్పుడే లేవడని నిర్ధారించుకున్న దొంగ నింపాదిగా శ్రీలేఖ వున్న గదివైపు తిరిగాడు.

 

    పక్కన ఎవరో వున్నట్టనిపించి దొంగ ఓక్షణం పాటు వులిక్కిపడ్డాడు. "ఎవరక్కడ" గర్జించినట్టు అడిగాడు.

 

    శ్రీలేఖ అక్కడ వుండలేక, బయటకూ రాలేక కాసేపు గింజుకుంది. తనను దొంగ గమనించాడు కాబట్టి ఇక తప్పదని తలుపు చాటునుంచి బయటకు వచ్చింది.

 

    అతని చేతిలోని బటన్ కత్తి నిగనిగా మెరుస్తోంది. ఆ కత్తి తన మెడను కోస్తున్నట్టు విలవిల్లాడిపోయింది.

 

    "ఎవరు నువ్వు?"

 Previous Page Next Page