రెండే రెండు నిమిషాలు ఆలోచించి నా సమ్మతి తెలిపాను.
"గుడ్! నీవు రేపటి నుంచి రంగ ప్రవేశం చెయ్యి. నీ నీడలా మన వాళ్ళు వుంటారు. వున్నా వాళ్ళు నీ పిలుపు విని చివరి క్షణాల్లో తప్ప నీ ముందుకు రారు. నీవు ఇలా...! ఇలా...! ప్రవర్తించాలి. కుడి కంటి కింద కంది గింజంత పుట్టుమచ్చ ముఖ్యం. అలాగే పెదవి పక్కన అంగుళం గాటు కూడా వుండాలి" అంటూ అలవాట్లతో సహా వివరించారు.
జాగ్రత్తగా విన్నాను. కొన్ని పాయింట్లు నోట్ చేసుకున్నాను.
"యీ మారువేషం వున్నంత వరకూ నీ పేరు రాజారావు."
"మరో పేరు వుండకూడదా!" నవ్వుతూ అడిగాను.
"ఏ పేరు మాడుకున్నా ఫరవాలేదు. రూపము పేరు యీ కేసు విషయంలో మార్చకూడదు."
"అయితే రాజారావు అన్న పేరే వుంచుకుంటాను."
"మంచిది."
"నా నివాసం!"
"ముందు హోటల్. ఆ తర్వాత మారుద్దువుగాని. ఇంక నీవు రాజారావువి అయిపోయిం తర్వాత, రాజారావు అనే వ్యక్తిగానే మెలుగు. యీ కేసు అయిందాకా నీ పేరు ఊరు అన్నీ మర్చిపో. రాజారావు అనే వ్యక్తికి ఏ వ్యక్తులయినా తారసపడవచ్చు. వకానొక రాజారావు అన్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అలా నీ ప్రవర్తన వుండాలి అంతే. కేసు పూర్తిగా తెలియకుండానే ఆ కేసుని బయటకి లాగటానికి ఇది ఒక చిన్న ప్రయోగం. మొదట యీ కేసులో నీవు కేవలం ఒక పావువి. మన పాచిక పారితే కీలకమైన వ్యక్తివి. కనుక నీ సొంత నిర్ణయం తీసుకోవచ్చు" అంటూ చాలా విషయాలు వివరించారు ఆనంద్ ప్రేమదత్.
"రేపటి నుంచి నా పేరు రాజారావు. ఈ కేసుపూర్తి అయిందాకా మార్పు ఉండదు మర్చిపోను" అన్నాను.
"అంతే. యీ పూటకి రెస్టు తీసుకో."
"అలాగే" అంటూ లేచాను.
21
రాజారావు ఓసారి చుట్టు పక్కల పరికించి కనకదుర్గా హోటల్లో అడుగు పెట్టాడు. హోటల్లో పెద్దగా జనం లేరు. సగం టేబుల్సు ఖాళీగానే వున్నాయి. ఓ మూలగా పూర్తిగా ఖాళీవున్న టేబుల్ చూసి అటు నడిచి కుర్చీలో కూర్చున్నాడు రాజారావు.
బేరర్ కుర్రాడొచ్చి వేలంపాటలాగా హోటల్లో వున్న సరుకునంతా ఏకరువు పెట్టి ఏం కావాలి సార్ అన్నాడు.
కావలసినవి ఆర్డరు ఇచ్చాడు రాజారావు.
బేరర్ కుర్రాడు క్షణాలలో వేడి టిఫిన్ తెచ్చి రాజారావు ముందుంచాడు.
రాజారావు ఇడ్లీముక్క తుంచి చపాతి కూరలో నంజుకుని నోట్లో పెట్టుకున్నాడు.
చపాతీ కూరలో చపాతీలే నంజుకుంటారా ఎవరైనా, కాని రాజారావుకి చపాతీ కూరలో ఇడ్లీ నంజుకుని తినటం ఇష్టం. అది అతని టేస్ట్.
రాజారావు ఇడ్లీ తినటం పూర్తి చేశాడు రెండో ఇడ్లీ మీద దాడి చేయబోతుండగా ఎదుటి కుర్చీలో ఎవరో వచ్చి కూర్చున్నారు.
రాజారావు తల ఎత్తి వచ్చిన వ్యక్తివైపు ఓసారి చూసి తిరిగి టిఫిన్ తినడంలో మునిగిపోయాడు.
ఆ వచ్చిన వ్యక్తి మాత్రం రాజారావుని చూడలేదు నుదుట పట్టిన చేతులనీ కర్ చీఫ్ తో తుడుచుకుంటూ వుండిపోయాడు.
బేరర్ కుర్రాడు కొత్తాయన రావటం చూసి టేబుల్ దగ్గర కొచ్చాడు.
ఆ వచ్చిన అతని పేరు అప్పారావు. బేరార్ కుర్రాడుతో తనకి కావలసినవి చెప్పి పంపాడు అప్పారావు. తల ఎత్తి ఎదుట సీట్లో ఇడ్లీ తింటున్న రాజారావుని చూశాడు.
అప్పారావు ఉలిక్కిపడి మరోసారి చూశాడు ఆపై కళ్ళు నాలుగు కల్సుకున్నాయి.
చెయ్యి గిల్లుకున్నాడు.
అప్పారావు కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవయ్యాయి. ఒరేయి అనంత పద్మనాభశాస్త్రి అన్నాడు.
రాజారావు తల ఎత్తి చూడలేదు.
అప్పారావు మరోసారి ఆశ్చర్యపోయి, రాజారావు వైపు అతను తింటున్న ఇడ్లీ ప్లేటువైపు చూశాడు.
అప్పారావు కళ్ళు మిలమిల లాడాయి. టేబుల్ పై నుంచి తన చెయ్యి చాచి రాజారావు చెయ్యిపట్టుకుని బలంగా నొక్కుతూ అరేయ్ అనంతం నేనురా అప్పారావుని అన్నాడు.
రాజారావు చివ్వున తల ఎత్తి అప్పారావు కళ్ళల్లోకి గుచ్చి చూస్తున్నట్లే చూశాడు.
నా పేరు అనంతం కాదు రాజారావు అన్నాడు.
అప్పారావు పగలబడి నవ్వాడు.
పోరా అనంతం నన్ను ఫూల్ ని చెయ్యకు అన్నట్టు రంగూన్ నుంచి ఎప్పుడు వచ్చావ్. ఎలా వున్నావ్?
సారీ సర్ మీరు పూర్తిగా పొరబడుతున్నారు. మీరు ఎవరో నాకు తెలియదు. ఇదే ప్రప్రధమసారి మిమ్మల్ని చూడటం నా పేరు రాజారావు రంగూన్ నుంచి వచ్చిన మాట వాస్తవం.
రాజారావు మాటలకు అప్పారావు తెల్లబోయాడు నన్ను గుర్తు పట్టలేదా అనంతం?