"పోనీ నాలుగు వేలిస్తాను. అంతకంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను."
"ఇంకో రెండొందలు చేసుకో. మాకు గిట్టదయ్యా బాబూ! ఇంకేం మాట్లాడకు...పద" అంటూ అతనిని బ్రోకర్ ఓ చెట్టుకిందకు తీసుకెళ్ళాడు.
అక్కడ ఓ పెద్దమనిషి ఖద్దరు పంచె, లాల్చీ వేసుకుని తన చుట్టూ చేరిన నలుగురు వ్యక్తులతో మాట్లాడుతున్నాడు "ఆ ఇన్స్ పెక్టర్ ఎవరో మినిష్టర్ని పట్టుకుని ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించుకున్నాడయ్యా. నేనేం చేయను చెప్పు."
"ఏమన్నా చేయండి సార్! ఇంకో లక్ష రూపాయలు ఖర్చయినా సరే. ప్రిస్టేజ్ కొశ్చెన్ యిది."
"సరే! చూద్దాం"
"సార్! ఈయనదో చిన్న వ్యాపారం వుంది" అన్నాడు మోహన్ రాజ్ ని చూపిస్తూ.
"ఏమిటది?"
"తెలుగు నవలొకటి బాన్ చేయించాలంట"
"తెలుగు నవలెందుకు బాన్ చేయించటం? మామూలుగానే ఎవడూ తెలుగు నవలలు కొనటం లేదని మొన్ననేగా ఆ పబ్లిషర్ ఎవరో అంటున్నాడు?"
"ఇదేదో రివెంజ్ వ్యవహారమంట సార్. ప్రిస్టేజ్ వ్యాపారం"
"సరే! ఆ పుస్తకం కాపీ ఏది?"
మోహన్ రాజ్ వెంటనే ఓ కాపీ బాగ్ లో నుంచి తీసిచ్చాడు.
వెంటనే ఆ పుస్తకం తీసుకుని తిన్నగా హోమ్ సెక్రటరీ ఛాంబర్ లోకి జొరబడ్డాడతను. మోహన్ రాజ్ కూడా లోపలకు నడిచాడు.
"ఏమిటండీ! ఏమిటీ రాయడం? ఇలాంటి దారుణమైన పుస్తకాలు మార్కెట్ లో కొచ్చేస్తుంటే ఏం చేస్తుందండీ మీ డిపార్ట్ మెంట్? ఎర్రమట్టి అంటే ఏమిటి ఈ వ్యవస్థను చంపి ఆ రక్తంతో మట్టిని తడపాలనే కదా ఆ రచయిత ఉద్దేశ్యం? వెంటనే బాన్ చేయండీ పుస్తకాన్ని. కావాలంటే హోమ్ మినిస్టర్ గారితో కూడా చెప్తాను."
హోమ్ సెక్రటరీ కంగారుపడ్డాడు "అబ్బే! మళ్ళీ హోమ్ మినిస్టర్ గారిదాకా ఎందుకు? మేమే 'బాన్' ఆర్డర్స్ ఇప్పించేస్తాం. కాకపోతే దానికి కొన్ని ఫార్మాలిటీస్ వున్నాయి. అవన్నీ పూర్తిచేయటానికి ఓ వారంరోజులు పట్టవచ్చు."
"కుదరదండీ! వారం రోజులు కాదుగదా రెండ్రోజులు కూడా ఆగను. ఇది ప్రెస్టేజ్ కొశ్చెన్."
"పోనీ ఎల్లుండి వరకయినా టైమిస్తే...."
"సరే! తెల్సినోళ్ళని వూరుకుంటున్నా. ఎల్లుండికల్లా బాన్ ఆర్డర్స్ రెడీగుండాలి. సరేనా?"
"సరే....!"
అతను మోహన్ రాజ్ తో బయటకు రాగానే మోహన్ రాజ్ అతనికి క్యాష్ ఇచ్చేశాడు.
ఆ రెండోరోజు ఉదయం మార్కండేయులు తన ఆఫీసులో కూర్చుని బాలెన్స్ షీట్ ముందుంచుకుని సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తూంటే పోలీస్ ఇన్ స్పెక్టర్ హడావుడిగా లోపలికొచ్చాడు.
అతనిని చూసి మార్కండేయులు కొంచెం కంగారుపడ్డాడు. పోలీసులంటే ఎంచేతనో అతనికి సైకలాజికల్ గా భయం. అందుకే ఏ రోజూ వాళ్ళు తన జోలికి రాకుండా జాగ్రత్తపడుతూ వచ్చాడు.
"ఎస్ ప్లీజ్! ఏం కావాలి?" అనడిగాడు సౌమ్యంగా.
అప్పటికే ఇన్ స్పెక్టర్ ఫుల్ గా మందుకొట్టేసి వుండటంచేత మాట రాలేదు. కుర్చీలో కూలబడి ఓ నిముషం మార్కండేయులు వైపే గుచ్చి చూస్తూ తనెందుకొచ్చాడా అన్న విషయం గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించసాగాడు.
అతని సైలెన్స్ ని మరో విధంగా అర్థం చేసుకున్న మార్కండేయులుకి భయం వేసింది.
ఆ ఇన్ స్పెక్టర్ తప్పక తనను అరెస్ట్ చేయబోతున్నాడని అనుమానం కలిగిందతనికి.
"ఎర్రమష్షి బాన్ష్! పబ్లిష్షర్ నువ్వేనా?" అడిగాడు ఇన్ స్పెక్టర్.
మార్కండేయులుకి అతని మాటలు అర్థం కాలేదు "మీరనేదేమిటో నాకు అర్థం కావటం లేదు" అన్నాడు వినయంగా.
"ఎర్రమష్షి బుష్..." అన్నాడతను.
"అమెరికా ప్రెసిడెంట్ బుష్ గురించా మీరు మాట్లాడేది?"
"కాదు! బుష్. నేను మాట్లాడేది బుష్ గురించి! ఎర్రమష్షి బుష్. బుష్! ఆ బుష్ ని మన గవర్నమెంట్ బాన్ష్ షేషిడ్ది. బాన్ష్, బాన్ష్! అర్ హ్దంమయిల్షా?"
"ఓహో! జార్జ్ బుష్ మీద వచ్చే బుక్ అన్నిటినీ మన ప్రభుత్వం బాన్ చేసిందంటున్నారా? మా దగ్గర ఆయన మీద బుక్స్ ఏమీలేవు."
ఇన్ స్పెక్టర్ కి చిరాకేసుకొచ్చింది "జాజ్ బుష్ కాదహ! ఎర్రమష్షి బుష్ మీ దగ్గరున్నాయ్. మీరే పబ్బిష్ షేశారు."
మార్కండేయులు వున్న కొద్ది జుట్టులో బాగా తెల్లబడిన రెండు వెంట్రుకలను పీకేసుకున్నాడు చిరాగ్గా.
సరిగ్గా అదే టైమ్ లో మోహన్ రాజ్ భవానీశంకర్ తో పాటు లోపలికొచ్చాడు ఆనందంగా. "హాయ్ ఫాదరిన్లా! చూశారా! మన పుస్తకాన్ని గవర్నమెంట్ బాన్ చేసింది. న్యూస్ పేపర్స్ లో వేశారా న్యూస్. అయ్ మీన్ నేనే వేయించాను" అన్నాడు భవానీశంకర్ న్యూస్ పేపర్స్ మార్కండేయులు ముందు పెడుతూ.
"ఆ అదే! ఎర్రమష్షి బుష్" అన్నాడు ఇన్ స్పెక్టర్ ఉత్సాహంగా.
భవానీశంకర్ ఇన్ స్పెక్టర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు "ఎస్ మైడియర్ ఇన్ స్పెక్టర్! ఎర్రమష్షి బుష్! ఆ విషయం మీకెలా తెలిసింది?"
ఇన్ స్పెక్టర్ జేబులో నుంచి బాన్ ఆర్డర్ తీసి చూపించాడు.
భవానీశంకర్ ఆనందంగా ఆ పేపర్ మార్కండేయులు మీదకు విసిరాడు "చూశారా! ఇదంతా మనం వేసిన ప్లానే. ఎర్రమట్టి బాన్ చేయించాం. ఇక చూడండి రెండురోజుల్లో ఎనిమిదివేల కాపీలు ఠక్కున అమ్ముడయిపోతాయ్."
మార్కండేయులుకి అర్థం కావటం లేదు "బాన్ చేయించారా?"
"అవును ఫాదరిన్లా! మన మోహన్ రాజ్ ఆ పనిని అద్భుతంగా నిర్వహించాడనటంలో సందేహం లేదు"
"ఎర్రమట్టి పుస్తకాన్నా?"
"అవును. అయిదువేలు లంచం ఇచ్చి బాన్ చేయించాను."
"మన పుస్తకాన్ని మనమే బాన్ చేయించామా?"