Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 22


    ఇప్పుడతనికి ఏం చెప్పటం? అతని పనిని కావాలనే నిర్లక్ష్యం చేసిందనుకొంటాడేమో! ఏమయినా అనుకోని! అప్పుడిక చేయగలిగిందేముందీ? వెనక్కు వెళ్ళి తేవడం అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆఫీస్ కి తాళాలు వేసేస్తాడు తను వెళ్ళేసరికి. రేపు తెచ్చిస్తానని చెపితేసరి.
    కోఠీలో బస్ దిగి సరాసరి ఇంటివేపు నడిచిందామె. చలికాలం కావడంచేత అప్పటికే చీకట్లు అలుముకున్నాయ్. అతని గది దగ్గర కొచ్చేసరికి నడకవేగం పెంచింది. గది తలుపులు దగ్గరగా వేసి వున్నాయి. కిటికీలో నుంచి లైటు వెలుగు రోడ్డుమీదకు పడుతోంది.
    ఇప్పుడేం చెయ్యటం? అతన్నెలా పిలవాలి? తలుపు తట్టాలా? లేక తనదారిన తను వెళ్ళిపోవాలా? మరలా ఆఫీస్ కెళ్ళేటప్పుడు ఎలాగూ తనకోసం ఎదురుచూస్తూ కనబడతాడు! అప్పుడు చెపితే సరి. ఆ గది దాటి నాలుగు అడుగులు వేసిందామె. కానీ మనసొప్పలేదు. అతను తన గురించి చాలాసేపు ఎదురుచూసి ఉంటాడు. ఇప్పుడు కనీసం వాటిని మర్చిపోయిన విషయమయినా చెప్పకపోతే బాధపడతాడేమో!
    "శంకర్ గారూ !"
    "వస్తున్నా..." వెంటనే వినిపించిందతని గొంతు.
    మరుక్షణంలో తలుపులు రెండూ బార్లా తెరచి బయటకు రాబోయి ఆమె గడప దగ్గరే ఉండటం చూసి ఆగిపోయాడు.
    "ఓహ్! మీరా! ఇవాళ చాలా ఆలస్యమైనట్లుంది మీకు. ఇదంతా నా అప్లికేషన్ మూలాన కాదు కదా?" నవ్వుతూ అన్నాడతను.
    "ఊహు...వేరే పనుండిపోయింది..."
    ఆమె మాటకు చప్పున అడ్డు తగిలాడతను. "మిమ్మల్ని నుంచోబెట్టే మాట్లాడుతున్నాను. మీకేమీ అభ్యంతరం లేకపోతే లోపలకు వచ్చి కూర్చోండి..."
    "ఫర్వాలేదులెండి! చిన్న పొరపాటు జరిగిపోయింది. అప్లికేషన్ మీద సంతకాలు చేయించానుగానీ తీరా వచ్చేటప్పుడు అక్కడే మర్చిపోయి వచ్చేశాను. రేపు సాయంత్రం తప్పక తెచ్చిస్తాను__" నొచ్చుకొంటున్నట్లు అంది సావిత్రి.
    "అయ్యో! పెద్ద గొడవచ్చిపడిందే" ఆలోచనలో పడుతూ అన్నాడతను.
    "ఏం? వాటితో అత్యవసరమయిన పనేదయినా వుందా?" ఆత్రుతగా అడిగింది.
    "అవునండి. రేపే ఆ అప్లికేషన్ పంపాలి. రేపు పోస్టు చెయ్యకపోతే అది లాస్ట్ డేట్ కి అందే అవకాశాలు తక్కువ!"
    "ఓహో...అలాగయితే..." తనూ ఆలోచనలో పడింది.
    "పోనీ...మీ ఆఫీసెక్కడో చెప్పండి. నేను వచ్చి తీసుకొంటాను..." అన్నాడతను.
    "మీకు ఎర్రమంజిల్ తెలుసా?" అడిగింది సావిత్రి.
    "ఈ సిటీలో నాకేమీ తెలియదండీ! నేను వచ్చి కొద్దిరోజులేగా అయింది!"
    "మరెలా?" మళ్ళీ ఆలోచనలో పడ్డారిద్దరూ.
    "అలాగయితే రేపు నేను ఆఫీసుకు వెళ్ళేటప్పుడు నాతో రండి. వెంటనే వాటిని తీసుకుని వెళ్ళిపోదురుగాని. వెంటనే అంది సావిత్రి.
    "ఓ...కే__! ఇది బాగా ఉంది..." ఒప్పుకుంటూ అన్నాడతను.
    కొద్ది క్షణాలు ఇద్దరిమధ్యా మౌనం అల్లుకొంది.
    హఠాత్తుగా గుర్తుకొచ్చింది సావిత్రికి. తనెందుకు ఇంకా అతనెదురుగా నిలబడింది? మాట్లాడేదంతా మాట్లాడేశాను కదా!
    "మీరు...లోపలకు రాకుండానే__ఐ మీన్ అలా నుంచోబెట్టి మాట్లాడటం నాకు...బాధగా_ మాటలకోసం తడుముకొంటూ అన్నాడతను. అతనిని చూస్తూంటే సావిత్రికి నవ్వొచ్చింది. కాని బావుండదని తమాయించుకుంది.
    "నేను వెళుతున్నాలెండీ" చిరునవ్వుతో అని అక్కడనుంచి తనింటివేపు బయలుదేరింది.
    "థాంక్యూ వెరీమచ్..." అతని మాటలు మామూలుగా విననట్టే ఊరుకుండిపోయింది.
    ఆ రాత్రి చాలాసేపు అతని గురించే ఆలోచిస్తూండిపోయింది. సిటీకి వచ్చి కొద్దిరోజులే అయిందట. అంతకుముందు ఎక్కడయినా ఉద్యోగం చేసేవాడా? ఏమో... అలాంటి అనుభవం ఉన్నవాడిలా కనిపించటం లేదు. మరి డిగ్రీ పూర్తయ్యాక ఇంతకాలం ఏం చేస్తున్నట్లు? ఇక్కడ ఒంటరిగా ఎందుకుంటున్నాడు...? నవ్వు వచ్చింది సావిత్రికి. ఇవన్నీ తనకెందుకసలు...? ఎందుకింత ఆసక్తి? రేపు అప్లికేషన్స్ ఇచ్చేస్తుంది. అతను "థాంక్యూ సోమచ్..." అంటాడు. తను విననట్లు ఊరుకొంటుంది. ఆ తరువాత అతను ఉద్యోగం వేటలో పడతాడు. తానూ రొటీన్ లో మునిగిపోతుంది. అతనికేమూలో ఉద్యోగం వస్తుంది...చడీచప్పుడూ లేకుండా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. అంతే_ ఎవరికి వారే యమునా తీరే! మరి...ఈ మాత్రానికి ఇలాంటి సాధారణ పరిచయానికి...అతని గురించి ఇన్ని ఆలోచనలెందుకు...? ఇన్ని వివరాలెందుకు? సావిత్రి ఆలోచనల్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నించింది, మనసుని మళ్ళించటానికి తంటాలు పడింది, ఊహు! అదేమంత తేలిక కాదు. అతను తననంతగా పట్టించుకోకపోవచ్చు...! ఫెమినైన్ జెండర్ కదా అని చిరునవ్వు నవ్వి వుండవచ్చు... వయసులో వున్నది కదా అని దొంగచూపులు చూసి ఉండవచ్చు_ కానీ తను అక్కడితో ఆగలేదు. అది కేవలం 'సాధారణ పరిచయం' అని సరిపెట్టుకోలేదు. అంతకంటే బలమయిన ఫీలింగ్ ఏర్పడిపోయింది. అదేమిటో తనకే తెలీదు... స్నేహం కంటే ఎక్కువ బంధం ఏదో తనని అల్లుకుపోయింది... అతను అందగాడు... తనని మొదటి చూపులోనే ఆకర్షించాడు. అయినా అతనిని తను వాంఛించడంలేదు... కాని అతనిని మర్చిపోవడం కూడా తనకి సాధ్యంకాదు.

 Previous Page Next Page