Previous Page Next Page 
చెక్ పేజి 22


    మధ్యాహ్నం భోజనానికి వచ్చిన రాఘవులతో సినిమా కెళదామని చెప్పింది.

 

    "ఆ సినిమా ఏమీ బాగా లేదంట. ఎవడో తాగుబోతు సినిమా అంట అది. ఆ డబ్బులు పెడితే చాటెడు శనగలను బెల్లంలో నంజుకుని తినొచ్చు. ఆ పనిచెయ్" అన్నాడు రాఘవులు.

 

    "చూడండీ. ఆ సినిమాను నేను చూడాలి. మీరు వచ్చినా, రాకపోయినా నేను ఫస్ట్ షోకి వెళతాను. ఆ తరువాత మీ ఇష్టం" అంది. గొంతులో అంత కఠినత్వాన్ని అతనెప్పుడూ వినలేదు. దాంతో ఖంగుతిన్నాడు.

 

    ఇక లాభం లేదని, కాదంటే వంటరిగా వెళుతుందని భయపడి సరేనన్నాడు.

 

    ఇద్దరూ కలిసి బయల్దేరారు.

 

    టికెట్లు తీసుకుని వస్తూ, వాటివంక దీనంగా చూస్తున్న అతన్ని చూసి నవ్వాలో ఏడ్వాలో అర్ధంకాలేదు శ్రీలేఖకు.

 

    సినిమా ప్రారంభమైంది.

 

    తను తమ్ముళ్ళతో కలిసి, అల్లరితో త్రుళ్ళిపడుతున్న కళ్ళతో చూస్తున్నట్లే వుంది ఆమెకు.

 

    సినిమా చూస్తున్న రాఘవులు మధ్యలో "వాడు ఎందుకలా తాగేది?" వడ్డీ ఎంత నష్టం" అన్నాడు.

 

    ఇక చాలన్నట్టు మోచేత్తో అతని పొట్టమీద బలంగా పొడిచింది.

 

    ఆ తరువాత కూడా రాఘవులు జమ, ఖర్చుల కోణంలో నుంచే సినిమా చూస్తూ మాట్లాడుతూనే వున్నాడు.

 

    ఆమె మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. తన ప్రపంచంలో తాను మునిగిపోయింది.

 

    తన వూర్లో సాయంకాలం విరిసిన ముద్దమందారంలా తయారై సినిమాకు వెళుతున్నట్టే వుంది ఆమెకు. పక్కన తమ్ముళ్ళు తమ అభిమాన హీరోలను వెనకేసుకొస్తూ వాదులాడుకుంటున్నట్టే వుంది. స్త్రీలకయితే టికెట్లు సులభంగా దొరుకుతాయని క్యూలో తనే వెళ్ళి టికెట్లు తెచ్చినట్టే వుంది. తన చేతిలో టికెట్లు చూసి, ఆనందంతో తమ్ముళ్ళు కేరింతలు కొడుతున్నట్టే వుంది.

 

    సినిమా అయిపోయింది.

 

    పెళ్ళయిన రెండేళ్ళ తరువాత తను బతికున్నట్టు మొదటిసారి అనిపించింది ఆమెకు, మనసు అట్టడగు పొరల్లోని చెమ్మ పైకి వుబుకుతోంది.

 

    ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు.

 

    భోజనం చేసి, నిద్రకు వుపక్రమిస్తూ "వారం రోజులుగా దొంగతనాలు ఎక్కువైపోయాయి. దారి దోపిడీలు మితిమీరిపోయాయి. జాగ్రత్తగా తలుపులెయ్. ఎవడైనా దూరి, అంతా వూడ్చుకుపొతే నా గుండె పగిలిపోతుంది." అని జాగ్రత్త చెప్పాడు రాఘవులు.

 

    అలాంటి విషయాలు గురించి ఆలోచించే స్థితిలోలేదు శ్రీలేఖ.

 

    ఆమెకు మరోసారి బాల్యం వచ్చినట్టుంది. తల్లి దండ్రుల వెచ్చటి ఒడిలో పడుకుని, తమ్ముళ్ళని చూసి నవ్వుతున్నట్టుంది.

 

    "మీరేం భయపడకండి. మీ సొమ్ముకు నేను కాపలా. నిశ్చింతగా నిద్రపోండి."

 

    రాఘవులు యథాప్రకారం ఊయలపై పడుకున్నాడు.

 

    హాల్ కు ఎదురుగ్గా వున్న గదిలో పడుకుంది శ్రీలేఖ.

 

    ఆమెకు నిద్ర రావడంలేదు. గతంలో తను అనుభవించిన ఆనందాలన్నీ ఆమె ముందు నిలబడి వెక్కిరిస్తున్నాయి. ఏదో వెలితి గుండె నిండా అలుముకుని ఊపిరి ఆడనివ్వడంలేదు. గుత్తి వంకాయలో మసాలా కూరినట్టు జీవితంలో ఆనందాన్ని కూరాలనిపిస్తూ వుంది.

 

    ఒంటరితనం ఆమెను చుట్టుముట్టి వుక్కిరిబిక్కిరి చేస్తోంది.

 

    కళ్ళలో నీళ్ళు వూరాయి.

 

    ఈ రెండేళ్ళలో బతికున్నట్లు అనిపించిన క్షణాలే లేవు.

 

    ఆమె బోర్లా పడుకుంది.

 

    సరిగ్గా అదే సమయంలో ఇంటి వెనుక ఏదో శబ్దమైంది.


                                       6


    శ్రీలేఖ ఉలిక్కిపడి, చెవులను రిక్కించింది.

 

    ఏమీ వినిపించలేదు. తన జీవితంలో రాఘవుల ప్రవేశంలా, ఏమిటీ డిస్టర్బెన్స్ అనుకుంది.


    
    మళ్ళీ ఆమె తన చిన్నతనాన్ని ముందేసుకుంది.

 

    ఈసారి అద్దం ముక్క విరిగి కిందపడినట్టు చప్పుడు.

 

    ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. భయంతో క్షణంపాటు ఒణికింది.

 

    దొంగలా? దోపిడిదారులా?

 

    ఆ ఆలోచన రాగానే ఆమెకు ముచ్చెమటలు పోశాయి. ఆ వూహ ఎంతసేపో భరించలేకపోయింది.

 

    పిల్లి వంటింట్లో సృష్టిస్తున్న బీభత్సం లెమ్మని సరిపెట్టుకుంది.

 

    మళ్ళీ తన వూహల ప్రపంచం తలుపు తెరిచింది.

 

    పెళ్ళికి ముందు తను కన్న కలలన్నీ ప్రత్యక్షమయ్యాయి. ఆ కళలు కాలిపోయాయి. ఇప్పుడు వాటి తాలూకు అస్తిపంజారాలు కూడా లేవు. జీవితం ఆకులన్నిటినీ రాల్చేసి, ఎండిపోయింది. మళ్ళీ దానికి నీళ్ళు పోస్తే చిగురిస్తుంది. అనుభూతుల మొగ్గేస్తుంది. అనుభవాల పూలు పూస్తాయి.

 

    నిద్రకోసం ఆరాటపడుతున్న శరీరం బద్దకంగా పొర్లుతోంది.

 

    కళ్ళు మూసుకుంది.

 

    ఏవో చిన్నచిన్న శబ్దాలు. ప్రత్యేకించి గమనిస్తే ఎవరో దేన్నో కొడుతున్నట్టనిపించింది.

 

    ఆమెకు ఇటీవల దోపిడీదారులు సృష్టిస్తున్న హింసాకాండ గుర్తుకొచ్చింది. ఊరికి దూరంగా వున్న ఓ డాక్టరింట్లో దొంగలు దూరారు. ఇంట్లో వున్న అందరినీ తాళ్ళతో కట్టేశారు. అయితే డాక్టర్ ఇరవయ్యేళ్ళ కూతురు మాత్రం వాళ్ళకు చిక్కకుండా తప్పించుకుని పరుగెత్తడం ప్రారంభించింది. ఈ విషయం గమనించిన దొంగలు ఆమె వెంటపడి తరిమారు. దగ్గరలో ఉన్న కాళికా దేవాలయంలో ఆమె దాక్కుంది. దీన్ని పసిగట్టిన దొంగలు ఆమెను పట్టుకున్నారు. అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు.

 

    అదంతా మనసులో మెదిలి, ఆమె కళ్ళు నిగుడుకున్నాయి.

 

    హాల్ లోని జీరో క్యాండిల్ బల్బు ఎర్రటి చుక్కలా వుంది. ఊయలలో పడుకుని నిద్రపోతున్న రాఘవులు బొగ్గు ముక్కలా ఉన్నాడు.

 

    అంత భయంలోనూ ఆమెకు ఆ బల్బును చూస్తే నవ్వొచ్చింది. ఆ బల్బు బిగించిన రోజు జరిగిందంతా ఫ్రేముకట్టి పటంలా బిగించినట్టు కనిపిస్తోంది.

 

    అది ఆమె కాపురానికి వచ్చిన మొదటిరోజు.

 

    ఆమెకు లైట్ లేకుంటే నిద్రరాదు. రాత్రంతా లైట్ వేసుంచమని రాఘవులతో చెప్పింది.

 

    "ఎందుకు బల్బు ఖర్చు" అన్నాడు రాగం తీస్తూ.

 

    "అయితే జీరో క్యాండిల్స్ బల్బు తెండి" అంది.

 

    "దానికి మాత్రం కరెంట్ కాలదూ" అన్నాడు.

 

    "దానికి మీటర్ తిరగదు లెండి. మొదట మూడు రూపాయలు పెట్టి బల్బు కొనుక్కొస్తే ఆ తరువాత ఖర్చుండదు. వడ్డీ పోతుందన్న భయంలేదు."

 Previous Page Next Page