ఇద్దరూ చీకట్లో టెంట్ కి దూరంగా వెళ్ళి కూర్చున్నారు. ఉపోద్ఘాతం ఏమీ లేకుండా సుభాష్ ప్రారంభంచాడు. "దీని కంతటికీ కారణం నేనని నాకు తెలుసు. వరూధిని! నేను నీకు చేసిన అన్యాయానికి నా మీద నీకెంత అసహ్యం వుందో కూడా అర్థం చేసుకోగలను. 'జరిగినదంతా మర్చిపో' అని ఒక్క వాక్యంలో చెప్పలేను".
"ఇంత అర్థరాత్రి యిలా రహస్యంగా రావటంలో నీ వుద్దేశ్య మేమిటి? విషయం చెప్పు" కరుగ్గా అడిగింది.
"మనం గురించి కాలేజీలో పదిమందికీ తెలుసు. అందరూ వుండగా నేనొస్తే, ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో- అది బావోదని రాలేదు".
"మరి ఇప్పుడెందుకొచ్చావు?"
"నీ పరిస్థితి చూసి నా హృదయం కదిలిపోయింది. నీ పట్టుదల చూసి ముచ్చటేసింది. నేనెంత విలువైన వస్తువుని కోల్పోయానో అర్థమైంది" అతడు ఆగి అన్నాడు. "ఈ పోరాటంలో నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వరూధిని. అది చెప్పటానికే ఈ అర్థరాత్రి వచ్చాను."
వరూధిని కొద్దిగా కరిగింది 'థాంక్స్' అంది మనస్ఫూర్తిగా.
"ఇంకో విషయం కూడా"
"ఏమిటి?"
"సందీప్ ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను వివాహం చేసుకోకపోతే, నేను చేసుకుంటాను.... నేను నిన్ను ప్రేమిస్తున్నాను వరూధిని నిజంగా....."
వరూధిని విభ్రాంతురాలై చూసింది. "కానీ...... నాకూ సందీప్ కీ మధ్య స్నేహం ఎంతవరకూ వచ్చిందో నీకు తెలుసుగా".
"నేను ప్రేమిస్తున్నది నీ శరీరాన్ని కాదు, నీ మనసుని".
ఆకాశంలో మెరిసింది. వర్షం కురిసే సూచన్లు కనబడుతున్నాయి. చల్లటి గాలి రివ్వున వీస్తోంది.
సుభాష్ అన్నాడు...... "ఆ విషయం చెప్పటానికి ఇది సరి అయిన సమయం కాదని నాకు తెలుసు. కానీ నీ మేలు గురించి ఆలోచించేవాడిని నేనొకడిని వున్నానని నువ్వు తెలుసుకుంటే చాలు."
వరూధిని కొంచెం ఆగి అంది. "ఆరు మూడయినా మూడు ఆరైనా నేను సందీప్ నన్ను వివాహం చేసుకునేలా చేసి తీరాతాను. నా పోరాటం అందుకే-"
"ఈ పోరాటంలో నీవు గెలిస్తే మంచిదే. కానీ ఇందులో కొంచెం తెలివితేటలు కావాలేమో అనిపిస్తోంది నాకు."
వరూధిని మొహం చిట్లించి "అనుమానం ఎందుకొచ్చింది?" అని అడిగింది.
"సందీప్ తండ్రి మినిష్టర్ గా చేశాడు. కేంద్రంలో కూడా బాగా పలుకుబడి వుంది. ఇంత చిన్న పోరాటానికి అతడు లొంగుతాడనుకోను. పైగా ఈ జనాల్లో ఇప్పుడున్న వేడి కొంతకాలంపోతే వుండదు. ఇప్పుడే ఏమైనా చేయాలి."
వరూధికి- అతడు చెపుతున్న దానిలో లాజిక్ కనబడింది. "ఏం చేస్తే బావుంటుందంటావ్?" అని అడిగింది.
"ప్రజల సానుభూతి మరింత కలిగేలా చూసుకోవాలి. ఈ న్యూస్ త్వరలో 'డెడ్' అయిపోయేలా వుండకూడదు. వీలయితే ఆ సెంబ్లీలోకూడా గొడవ జరిగేటంతగా రెచ్చగొట్టాలి. మనం ఇలా కామ్ గా వుంటే వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా వుండదు. నువ్వు ఏం చెయ్యగలవు? అతడు మోసం చేశాడంటావు. నిన్ను ఖండిస్తూ అతడేమో లేదంటాడు. నీ దగ్గిర సాక్ష్యాలు లేవు. నువ్వు మాత్రం ఎంతకాలం యిలా పోరాటం సాగిస్తావు? దీనిలోకి పోలీసుల్ని, ప్రతిపక్షాల్ని లాగాలి". అతడు చెపుతుంటే, ఆ దృశ్యం వూహించుకొని వరూధిని ఆవేశంతో పొంగిపోయింది.
"నిజమే, కానీ ఎలా?" అంది.
"సందీప్ తండ్రికి బాగా పలుకుపడి వున్నట్టు అందరికీ తెలుసు. ఉదాహరణకి నీ టెంట్ ని రేపు రాత్రి ఏ గూండాలో తగలబెట్టేశారనుకో. మరుసటిరోజు ఈ వార్త సంచలనం అవదూ? ఒక న్యాయం కోసం పోరాడుతున్న చిన్న అమ్మాయిమీద 'అధికారం; ఉక్కుహస్తం అని పత్రికలు ఎలుగెత్తి చాటుతాయి. ప్రతిపక్షాకు ప్రభుత్వాన్ని నిలదీస్తాయి".
"వరూధిని దిగ్భ్రాంతురాలై చూసింది. అయితే, కొద్దిగా నెమ్మదిపాటుతో ఆలోచిస్తే సుభాష్ చెప్పింది బావుందనిపించింది.
తెలిసీ తెలియని వయసులో మనకొచ్చిన ఆలోచనలే అద్భుతమనిపిస్తాయి. వాటికింక ఎదురేమీ లేదని మనసు విర్రవీగుతుంది. ముందు వెనుక చూసుకోకుండా ఆ ఆలోచనని అమలు జరపటానికి ప్రయత్నం చేస్తాం. దానివల్ల పరిణామాల్ని అంచనా వేయకుండా రంగంలోకి దిగుతాం.
ఎదురుదెబ్బ- అది చిన్నదైతే మెచ్యూరిటీ వస్తుంది. పెద్దదైతే తిరిగి కోలుకోలేనంత అనుభవం వస్తుంది.
"టెంట్ తగలబెట్టటం అంటే ప్రమాదమేమో-" సందిగ్ధంగా అంది.
సుభాష్ నవ్వేడు. "నా తండ్రి మున్సిపల్ కౌన్సిలర్ అన్న విషయం మర్చిపోకు. అయినా ఇంత చిన్న విషయానికి నా స్నేహితులే చాలు. అంతా నేను చూసుకుంటాను."
"నాకేదో భయంగా వుంది సుభాష్".
"వరూధిని......." అన్నాడు సుభాష్. ".............నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డువేస్తాను. నువ్వు నన్ను నమ్ము".
ఆమె కరిగిపోయింది. "థాంక్స్. నీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థంకావటంలేదు. ఇంత జరిగాక కూడా నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావంటే........"
"నీ మీద నాకు ప్రేమ ఎప్పుడూ వుంది వరూధిని. తెలిసీ తెలియని వయసులో పోలీసులు మనల్ని ఆ టైమ్ లో రెడ్ హాండెడ్ గా పట్టుకుంటే బెదిరిపోయినమాట నిజమే. కానీ నీ శారీరపు ప్రతి స్పర్శా నాలో ఇంకా మిగిలివుంది." అతడు ఆగి అన్నాడు...... "నేనెంత బాధపడ్డానో నా మనసుకే తెలుసు. నువ్వు ఆ సందీప్ తో కనబడిన ప్రతిక్షణమూ నాలో అపరాధ భావం కలిగేది. మన బంధం గుర్తొచ్చేది. ఒకటి మాత్రం నిజం, నీకు నేనున్నానని గుర్తుంచుకో......చెప్పానుగా! ఈ క్షణమైనా నువ్వు సరే నంటే నిన్ను పెళ్ళాడటానికి నేను సిద్ధం".
వరూధిని నెమ్మదయిన స్వరంతో '.......థాంక్స్' అంది. అతడామె చేతిని అందుకున్నాడు. "నేను.........నేను ఈ చేతిమీద ముద్దు పెట్టుకోవచ్చా వరూధిని?"
ఆమె సమాధానం చెప్పలేదు. అతడు సుతారంగా ఆమె అరచేయి వెనకవైపు ముద్దాడాడు. మెరిసిన మెరుపు కాంతిలో అతడి కళ్ళల్లో తడిని చూసింది, అలాగే శిలాప్రతిమలా నిలబడిపోయింది.
అతడు లేచి, ఆమె నుదుటిని స్నేహభావంతో, కళ్ళనీ నాసిక కొననీ ముద్దాడి "వెళ్ళొస్తాను" అని వెళ్ళిపోయాడు. ఆకాశంలో మెరుపులు అక్కడి ప్రదేశాన్ని ఒకటి రెండుసార్లు వెలుగుతో నింపాయి.
రుక్మిణి ఇంకా గాఢనిద్రలోకి వుంది.
* * *
ఆ తర్వాత రోజు జనం మరీ పల్చబడిపోయారు. దగ్గర స్నేహితురాళ్ళు మాత్రం వచ్చి కాస్సేపు వెళ్ళిపోయారు. ఉన్నట్టుండి ఎందుకలా వెనక్కి తగ్గారో రుక్మిణి, కృష్ణమూర్తిలకు అర్థంకాలేదు. ప్రీతమ్ వారంరోజుల క్రితమే స్నేహితుడి పెళ్ళాని ఏదో ఊరువెళ్ళాడు. అతడు వుంటే కాలేజీ పిల్లలను తీసుకొచ్చి ఏదో గొడవచేసేవాడు.
వరూధిని మనసంతా ఆ రాత్రి జరగబోయే సంఘటన తల్చుకుంటూ టెన్షన్ గా వుంది. రుక్మిణి, కృష్ణమూర్తిలకు రాత్రి జరిగిన విషయమేమీ తెలీదు. దిగులుగా కూర్చుని వున్నారు. అంతలో అక్కడికి నిఖిత వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే రుక్మిణికి కాస్త సంతోషం వేసింది. రుక్మిణిలో క్రితం రోజు వున్న హుషారు లేదు. క్రితం రోజు పేపర్లో పడిన వార్తలన్నీ చూసి, ఢిల్లీ నుంచి ప్రధానమంత్రే టెలిగ్రాం పంపిస్తాడన్నంత నమ్మకంతో వుందావిడ. అది రుక్మిణి తప్పుకాదు. 'వరూధిని ఆరోగ్యాన్ని పరామర్శిస్తూ దేశం నలుమూలల్నుండీ టెలిగ్రాంలు వస్తున్నాయి'. అని రెండురోజుల క్రితమే ఓ లోకల్ పత్రిక వ్రాసి సెన్సేషన్ కలుగచేయాలనుకుంది. నిజానికి ఒక్క కార్డుకూడా రాలేదు.
"ఎలా వుంది?" నిఖిత వరూధిని పక్కన కూర్చుంటూ అడిగింది.
"ఎలా వుంటుందమ్మా! నాలుగు రోజులనుంచి పచ్చి మంచినీళ్ళయినా ముట్టుకోలేదు. ఎప్పుడు స్పృహ తప్పుతుందో అన్నట్లుంది. ఎవరూ పట్టించుకోవటంలేదు. కాలనీలో వుండే తోటి ఆడపిల్ల ఇంత సాహసానికి దిగితే మీరయినా వచ్చి సపోర్ట్ చేయవచ్చుగా" అంది నిష్ఠూరంగా .
"వరూధిని చేస్తున్నా ఈ పని గొప్ప సాహసకార్యంగా మీకనిపిస్తోందా ఆంటీ?" ఎవరు ప్రశ్న వేసింది నిఖిత.
"కాదంటావా? ఎంతమంది అమ్మాయిలు ఎన్ని రకాలుగా మోసపోతున్నారు. ఒక్కరైనా పబ్లిగ్గా న్యాయం కావాలని అడిగారా?"
నిఖితకు ఆమెను చూస్తే జాలేసింది. 'నా కూతురు మా పరువు తీసేసింది' అంటూ నాల్రోజుళ క్రితం గుండెలు బాదుకుని కాలనీలో ఏడ్చింది.
"ఇలా సమ్మె చేస్తే సందీప్ మంచివాడై, వరూధినిని పెళ్ళి చేసుకుని, ఆమెని సుఖ పెడతాడన్న నమ్మకం మీకుందా?" అడిగింది నిఖిత.
"సుఖపెట్టనీ- పెట్టకపోనీ- చట్టబద్ధంగా నాకు రావలసిన హక్కు కోసం నేను పోరాడుతున్నాను" అంది వరూధిని కల్పించుకుంటూ.
"చట్టం వేరు. ధర్మం వేరు వరూధిని. చట్టపరమైన న్యాయం నీకు జరగాలనుకున్నప్పుడు సరైన రుజువులు, సాక్ష్యాలు నువ్వు చూపించగలగాలి. ఈ రోజు పేపర్ చూశావా".
లేదమ్మా. ఏం వ్రాశారు? నిన్నా మొన్నా ఆంధ్రదీపం వాళ్ళు బలే సపోర్టు ఇచ్చారులే" అన్నాడు కృష్ణమూర్తి.
"ఈ రోజు పేపర్లో సందీప్ ఇంటర్వ్యూ వేశారు. ఇదంతా ఒక ప్రొఫెషనల్ గేమ్ ఆంటీ. పేపరు వాళ్ళకు కావలసింది సర్క్యులేషన్ తోటో, స్కాండల్స్ తోటో సర్క్యులేషన్ పెంచుకోవడమే వాళ్ళకు తెలిసింది. వరూధిని దగ్గర ఎలాంటి రుజువులు లేవని వాళ్ళకు అర్థమైంది. పైగా మొన్న ఆమె తన ఇంటర్వ్యూలో సందీప్ కి చాలామంది అమ్మాయిలతో పరిచయం వుందని తనకి తెలుసునని చెప్పింది. 'అలాంటివాడిని ఎలా నమ్మింది?' అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. సందీప్ తన ఇంటర్వ్యూలో అసలు తనెప్పుడూ ఆమె దగ్గర పెళ్ళి ప్రస్తావనతేలేదని, ఆమె తన వెంటపడి విసిగించేదని చెప్పాడు".
"అది అన్యాయం. చాలాసార్లు పెళ్ళి ప్రస్తావన తెచ్చాడతను" అంది వరూధిని ఆవేశంగా.
"పెళ్ళి ప్రసక్తి గురించి నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేకుండా జాగ్రత్తపడ్డాడతడు. కానీ నువ్వు వ్రాసిన ఉత్తరాలు అతడి దగ్గరున్నాయి. అతడితో నువ్వేరకంగా ఎంజాయ్ చేసింది, ఆ అనుభవాలని తిరిగి కోరుకుంటున్న విషయం, రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదన్న విషయం చాలా వివరించి వ్రాశావుగా. వాటి కాపీలను కూడా అతడు పేపర్ వాళ్ళకి యిచ్చాడు. వాటిని బట్టి అతడి కెలాంటి ఇంట్రస్టు లేదని, నువ్వే అతడి పొందు కోరుకున్నావని నిర్ణయించేశారు".
వరూధిని మొహం మాడిపోయింది. ఇది ఆమె ఊహించని దెబ్బ.
వలలు ఆ విధంగా మాట్లాడుకుంటూ వుండగా అక్కడికి ఓ రౌడీ లాంటి వ్యక్తి వచ్చాడు. చూడటానికి పెద్ద గూండాలా వున్నాడు. అయితే అతడేమీ మాట్లాడలేదు. ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. దానిమీద 'విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ సుభాష్ అండ్ సందీప్' అని వ్రాసివుంది. వరూధిని మనసు కీడు శంకించింది. ఈలోపు నిఖితే ఆ ప్యాకెట్ విప్పింది.
అందులో ఒక కొత్త పాకెట్ టేప్ రికార్డర్ వుంది. దాని చుట్టూ రిబ్బన్ కట్టి వుంది. అయితే అందులో క్యాసెట్ కూడా వుంది. రుక్మిణి, కృష్ణమూర్తి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నిఖిత టేప్ రికార్టర్ 'ఆన్' చేసింది. అందులోంచి సంభాషణ వినిపించింది. ఒక కంఠం వరూధినిది రెండోది సుభాష్ ది.
".......వరూధిని......... నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తాను...... నన్ను నమ్ము".