Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 22


    "చూస్తాను. తండ్రితోపాటు లేవటం ప్రేమకు అలవాటే. పోతే నాక్కొంచెం బురద కావాలి."

    "బురదా!" అన్నాడు ప్రసాదరావు పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడి.

    "అవును. వెళ్ళి అర్జంటుగా పట్రండి."

    "ఎందుకు?"

    "చెప్తాగా!"

    'మంత్రసానితనానికి ఒప్పుకున్నాక తప్పుతుందా మరి' అనుకుంటూ వెళ్ళాడు.

    పది నిముషాల్లో బురదతో సహా వచ్చాడు.

    "నా బట్టలమీద కొంచెం జల్లండి" అని జల్లించుకుని బయలుదేరాడు.

    అతడు వెళ్ళేసరికి ఊహించినట్లే జగపతిరావు ప్రయాణానికి సిద్ధంగా వున్నాడు. ప్రేమ అప్పుడే కాఫీ తెచ్చి ఇస్తోంది.

    "నువ్వు రడీయేనా?" అడిగాడు జగపతిరావు.

    "రడీయే సార్!"

    "అదేమిటి నీ బట్టలమీద బురద?"

    వేణు అప్పుడే చూసుకున్నట్లు నటించి, "అరే! అయామ్ సారీ సర్!"

    "ఏం జరిగిందోయ్?" అన్నాడు జగపతిరావు.

    "వద్దులెండి సర్! చెప్పడానికంత బాగోదు!" అన్నాడు వేణు.

    ఈ సమాధానంతో తండ్రీకూతుళ్ళిద్దరిలో మరింత ఆసక్తి పెరిగింది.

    మళ్ళీ రెట్టించి అదే ప్రశ్న అడిగాడు.

    వేణు మొహమాటంగా ప్రేమవైపు చూసి, "రాత్రి కాగితాలన్ని టైప్ చేసేసరికి ఒంటిగంటయింది సర్! నా రూమ్ ఇక్కడకు అయిదు మైళ్ళ దూరం. అర్దరాత్రి అంత దూరం వెళ్ళి మళ్ళీ తెల్లవారుజామునే తిరిగి రావడానికి కన్వియన్స్ ఏదీ దొరకదని...."

    "ఊఁ ఏదీ దొరకదని?"

    "ఎదురు అరుగుమీద పడుకున్నాను సర్? ఏ లారీనో నిద్రలో బురదకొట్టి ఉంటుంది."

    "మైగాడ్! అంత అవస్తేం పట్టిందోయ్?" అన్నాడు జగపతిరావు.

    ప్రేమ కూడా వేణూవైపు విస్మయంగా చూసింది.

    "ఇక్కడికి దగ్గర్లో ఏదైనా ఇల్లు చూసుకోలేకపోయావా?"

    "నేనొక్కణ్ణే సార్! నాకు ఇల్లక్కర్లేదు. అంత చిన్న రూమ్ ఈ లికాలిటీలో దొరకదు."

    "నువ్వొక్కడివే అయితే మా ఇంటి ఔట్ హౌస్ లో ఉండొచ్చు కదా!" అన్నాడు జగపతిరావు.

    వేణు మొహం గప్పున వెలిగింది. ఆయన నోటివెంట ఆ మాట రావడంకోసమే ఇంత ప్లాన్ వేసింది.

    జగపతిరావు కూతురివైపు తిరిగి, "ఏమ్మా! అలా చెయ్యవచ్చు కదా?" అన్నాడు.

    "దానికేవుంది నాన్నా! ఔట్ హౌస్ ఖాళీగా ఉంది కదా!" అంది అంగీకారంతో.


                      *    *    *    *


    "నాకు బలంలేదుగానీ, ఉంటే నిన్ను ఎత్తి గాలిలో తిప్పుదునోయ్!" అన్నాడు ప్రసాదరావు. కాంప్ నుండి రాగానే వేణు అతనికి ఈ విషయం చెప్పేసరికి ఆనందంతో దాదాపు నోట మాటరాలేదు అతనికి.

    "కథ క్లయిమాక్స్ కి వచ్చేసినట్లేనోయ్ ఇంక."

    "ఇంకా మా పరిచయమే పెరగలేదు. అప్పుడే క్లయిమాక్స్ ఏమిటండీ?"

    "నీకు తెలియదోయ్. నేను పన్నెండు నవల్లు చదివాను. అందులో తొమ్మిది నవలల్లో ఎంతో డబ్బున్న హీరో కడు బీదదైన హీరోయిన్ ని కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఒక నెలో, సంవత్సరమో కలిసి ఉండాల్సి వస్తుంది. "మొగుడూ పెళ్ళాలు కాకుండా ఎలా ఉంటారు?" అని అడక్కు ఉండాల్సి వస్తుంది అంతే! దాంతో కథ ముగింపు వచ్చేస్తుంది. మొత్తం తొమ్మిది నవలల్లోనూ ఇలాగే జరిగింది. ఈ కథ కూడా సుఖాంతము జరగబోతోంది."

    "మనకి సుఖాంతం_వాళ్ళకి దుఃఖాంతం" అన్నాడు వేణు.

    "అదే, అదే."

    "పోతే మా చెల్లెల్ని ఏం చెయ్యాలి?"

    "కంటి ఆపరేషన్ చేయిద్దాం! ఇక ఆ విషయాలన్నీ నాకు వదిలిపెట్టు అంతా నేను చూసుకుంటాను."

    వేణు సాలోచనగా, "నాకో చెల్లెలున్న విషయం ప్రేమకు చెప్పినట్లు జ్ఞాపకం. నేనిప్పుడు ఒంటరిగా ఉన్నాను అంటే నమ్మేసినట్టుంది పాపం?" అన్నాడు.

    డబ్బున్నవాళ్ళకి వ్యాపకాలు. ఇంతంత చిన్న చిన్న విషయాలు వాళ్ళేం జ్ఞాపకం ఉంచుకుంటారు. ఆవిడెప్పుడో మర్చిపోయి ఉంటుంది" అన్నాడు ప్రసాదరావు.

    ఇద్దరూ అక్కడే పప్పులో కాలేశారు.


                                                                          4


    "రొట్టె విరిగి నేతిలోప్ పడటం అంటే ఇదే" అని ఒకసారి అన్నాడు ప్రసాదరావు. నిజంగా రొట్టె విరిగి నేతిలో పడితే అది తినటం ఎంత కష్టమో అర్ధం అయింది వేణుకి. మొదటిరోజు ప్రొద్దున్న ఆరున్నరకి జగపతిరావు యింటినుండి బ్రేక్ ఫాస్టుకి రమ్మని ఆహ్వానం రాగానే కలిగిన ఆనందం డైనింగ్ టేబుల్ దగ్గరే రోజుకి సరిపడా పని జగపతిరావు చెప్పటంతో ఆవిరయిపోయింది. బైట వున్నప్పుడు పది నుండీ అయిదు వరకూ వుండే ఆఫీసు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ఎట్-యువర్- సర్వీస్ అయింది.

    రోజులు గడిచేకొద్దీ ప్రసాదరావు బాధ ఎక్కువైంది. 'ఎంతవరకూ వచ్చిందీ ,ఎంతవరకూ వచ్చిందీ' అని అడగసాగేడు.

    "వాళ్ళింటిలో వుంటున్నానన్న మాటేగానీ ఈ వారం రోజుల్లోనూ ఒక్కసారి కూడా ఆ అమ్మాయిని చూడలేదు. తన రూమ్ లోంచి భోజనానికైతే డైనింగ్ రూమ్ లోకి వస్తుంది. బైటకైతే కారులో వెళ్తుంది. ఇక నాకు కనబడేదెక్కడా? ఈ బీదబ్బాయిలు డబ్బున్న అమ్మాయిల ప్రేమ ఎలా సంపాదిస్తారో నాకు చచ్చినా అర్ధం కావటంలేదు. అసలీ డబ్బున్న అమ్మాయిల టేస్టే వేరు. పాప్ మ్యూజిక్, మంచి మంచి ఇంగ్లీషు డ్రామాలూ, బుక్ రీడింగూ_ గెట్ టు గెదర్సూ వీటిల్తోనే వాళ్ళ కాలం గడిచిపోతుంది. ఇలాంటిచోటే ఏ డబ్బున్న అబ్బాయో పరిచయం అవుతాడు. ప్రేమ వివాహం అంటూ జరిగితే ఆ స్థాయిలోనే జరుగుతుంది. మనం చదువుతూ వున్నవన్నీ స్టుపిడ్ రచనలని నా ఉద్దేశం. నాకు తెలిసినంతలో సొంత కారున్న అమ్మాయెవరూ కారు డ్రైవింగ్ చేతకాని కుర్రాడ్ని ప్రేమించిన దాఖలాల్లేవు" నిస్పృహగా అన్నాడు వేణు.  

    "నువ్వు చెప్పింది 99 శాతం నిజమవచ్చు. ఒక శాతం మినహాయింపు ఎప్పుడూ వుంటుంది. మనదంతా మినహాయింపు సాహిత్యమే కదా! వున్న వాస్తవాలు వ్రాస్తే పాఠకులు చదవరు అని భయమేమో ఈ వ్రాసేవాళ్ళకి. ఆ ఒక్క శాతం మినహాయింపులోకి చేరటానికి ప్రయత్నించాలే తప్ప ఇలా బెంబేలు పడకూడదు. ట్రై మై బోయ్!"

    "అదే ఎలా?"

    "ఏముంది? ఒక అర్ధరాత్రి నిద్రపట్టక ప్రేమ తన బెడ్ రూం తలుపులు తీస్తుంది. కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ నువ్వు కనబడతావు. ఆమె మనసు ఆర్ద్రత చెందుతుంది. కళ్ళు తడి అవుతాయి. అలా తడి అవటమే ప్రేమకి మూడో స్టెప్పు."

    "అప్పుడు దిగి నా రూమ్ దగ్గరికి వస్తుంది. ఒళ్ళు వేడెక్కటం ప్రేమకి నాలుగో స్టెప్పు. అంతేనా?.... లేకపోతే ఏమిటండీ? ఆవిడ ఎప్పుడు కిటికీ తలుపు తీస్తుందా అని నన్ను మంచులో రాత్రంతా కిటికీ దగ్గర నించోమంటారా?"

    "పోనీ యింకో అయిడియా" అన్నాడు ప్రసాదరావు పట్టువదలని విక్రమార్కుడిలా."

    "ఏమిటి?"

    "ఇంటాక్సికేటింగ్ కిస్."

    "వ్వాట్?"

    "ఆమె డైనింగ్ టేబిల్ దగ్గర్నుండి తన గదివైపు వెళ్తూ వుంది_ నువ్వు అట్నుంచి వచ్చావు.... ఇద్దరూ ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు. ఆమె చూపులో రోషం, తిరస్కారం వుంది. కాని నువ్వు విసురుగా ఆమెని దగ్గరికి లాక్కొన్నావు. ముందుకు వంగావు. తియ్యగా తగలటంతో నీ పెదవులు అక్కడే ఆగిపోయాయి. ఆమె కూడా వివశత్వం నుంచి తేరుకోలేకపోయింది_ అదే ఇంటాక్సికేటెడ్ కిస్_ అంటే!"

    "అది డైనింగ్ టేబిల్ దగ్గర ఉదయం టైమా_ సాయంత్రం టైమా?"

    "ఆ ప్రశ్న ఇప్పుడెందుకు?" అని అడిగాడు ప్రసాదరావు.

    "ఉదయం బ్రేక్ ఫాస్టులో స్వీటు తినరుగదా- తియ్యగా వుండటానికి...."

    "వేణూ! ఈ పనికి నిన్ను ఎన్నుకోవడములో చాలా ఘోరమైన తప్పిదం చేశాననిపిస్తూందయ్యా!"

    "నాకూ అలాగే అనిపిస్తూందండీ!"

    "అమ్మాయిల గురించి నీ కసలేం తెలియదయ్యా!"

    "అంతే అనుకుంటానండీ!"

    "అసలు మనం ఈ ప్లాన్ మొదలు పెట్టటానికి ముందే నీక్కొద్దిగా ప్రాక్టికల్ ట్రయినింగ్ ఇస్తే బాగుండేది."

    వేణు అదిరిపడి- "ప్రాక్టికల్ ట్రయినింగా?" అన్నాడు.

    "అవును. ఇప్పుడు మించిపోయింది కూడా లేదు" అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు.

    ఆ ముసలివాడి ఎత్తేమిటో వేణుకి ఆ సాయంత్రంగానీ అర్ధం కాలేదు. తీసుకొచ్చిన అమ్మాయి పేరు రోషనారా. అమ్మాయంటే అమ్మాయికాదు- ఇరవై ఆరేళ్ళుంటాయి. కళ్ళల్లో మంచి అనుభవం కనబడుతోంది. ఆమెని పరిచయం చేస్తూ, "వేణూ! తియ్యగా వుందంటే స్వీటు తిన్నదా? అన్న అమాయకత్వం నుంచి నిన్ను బైట పడేయడం కోసం ఈ అమ్మాయిని తీసుకువచ్చాను. ఈమెని ఇంటాక్సికేటింగ్ స్వీన్ అంటారు."

    "నాకేం అర్ధంకావటం లేదు" అన్నాడు వేణు.

    "నువ్వు మిస్ ప్రేమని ప్రేమించబోవటంలేదు_ ఆకర్షించబోతున్నావు. ఒక మత్తుతెర లాంటిది ఆమె మీద విసిరేసి ఆమె అది గ్రహించే లోపులో మన పని పూర్తిచేసుకోవాలి. నీకే ఇదంతా కొత్తయితే నువ్వు తబ్బిబ్బౌతావు. అందుకే ఈ ట్రయినింగ్. ఈ అమ్మాయి ఒకసారి ముద్దు పెట్టుకున్నదంటే ఇంకా యువకుడు 'ఇంకా ఇంకా' అని గీ పెట్టుకుంటూ చావాల్సిందే. వెళ్ళు వేణూ! మన ఆశయం నెరవేరటంకోసం కుడికాలు ముందుకు పెట్టి లోపలికి వెళ్ళు."

    రోషనారా అతడివైపు ఓరగా చూసి లోపలికి వయ్యారంగా వెళ్ళిపోయింది. వేణు కోపంగా ఏదో అనబోయి మనసు మార్చుకుని లోపలికి వెళ్ళి తలుపు దభేలున వేసుకున్నాడు.

    ప్రసాదరావు ఏం జరుగుతుందా అన్న టెన్షన్ తో మూసివున్న తలుపులవైపే చూడసాగాడు. ఇప్పుడు వేణు ఇదంతా నేర్చుకుని పరిపూర్ణ శాస్త్ర ప్రవీణుడవటానికి ఎంతకాలం పడ్తుందో ఏమిటో?

    ఇంతలో తలుపు ధడేలున తెరుచుకుంది. వేణు విసురుగా వెళ్ళిపోయాడు.

    ఏం జరిగిందని అడిగే లోపులో ఆ రోషనారా లోపలి నుండి__ "ఎక్కడ? నా వేణు ఎక్కడ?" అన్న స్టయిల్ లో పరిగెత్తుకొచ్చింది, పదహారేళ్ళ కన్నెపిల్లలా ఆమె మొహం ఎర్రగా వుంది. "ఇంకా....ఇంకా" అంది.

    "ఇంకా ఏమిటి? అప్పుడే అయిపోయిందా?" అని అడిగాడు ప్రసాదరావు.

    "ఇంకా....ఇంకా" అంది వేణు వెళ్ళినవైపే చూస్తూ.

    "ఇంకా ఏమిటమ్మా? అడ్వాన్సు ఇచ్చేశానుగా!"

    "కావాలంటే పది అడ్వాన్సులు వెనక్కి తీసుకొంది. ఎక్కడ ఆ కుర్రవాడు?"

    "ఎందుకు?"

    "ఇంఖా.... ఇంఖా...."

    "ఏమిటమ్మా ఇం....ఖా, ఇం....ఖా?"

    "వేణూ!__ ఏడి వేణు! ఇంకొక్క ముద్దు."

    ప్రసాదరావుకి అర్ధం అయింది. 'అఖండుడిలా వున్నాడే' అని మనసులో అనుకున్నాడు. రోషనారాని వదిలించుకునేసరికి తలప్రాణం తోకకి వచ్చింది. విదిలించుకుని వేణు దగ్గరికి "కంగ్రాట్యులేషన్సోయ్!" అనుకుంటూ వెళ్ళాడు.  

 Previous Page Next Page