Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 22

    మహిళా సంస్థలన్నీ రాజభూషణాన్ని ఛీ కొట్టాయి.
    "గిరిజనులను అరెస్టు చెయ్యడంకాదు. చేయవలసింది. రాజభూషణాన్ని అరెస్టుచేసి విచారణ జరిపించాలి" అని డిమాండ్ చేసాయి. ముఖ్యమంత్రికి మహజర్లు పంపాయి. మృదుల తనతోపాటు గిరిజనులందర్నీ విడిపించినందుకు మహిళా సంస్థలన్నీ పొగిడాయి. అయితే తను పగదీర్చుకోవలసినవారి లిస్టులో మృదుల పేరు ప్రధానంగా చేర్చుకున్నాడు శేషా చలపతి.
                           *    *    *
    న్యూస్ పేపర్ లో వచ్చిన తన ఫోటోను, దానికింద వచ్చిన న్యూస్ ని సంతృప్తిగా చూసుకుని పేపర్ భాగవతార్ కి అందించింది మృదుల.
    "చూశాను" పొడిగా, కోపంగా అన్నాడు.
    "ఇటీజ్ ఏ గ్రేట్ ఎఛీవ్ మెంట్. లక్కీగా నేను వాళ్ళ మధ్య లేకపోతే పోలీసులు నిష్కారణంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టి వుండేవారు."
    "నీకు సంతోషంగా వుందేమోకాని నాకు మాత్రం ఇదేమీ బాగులేదు. పోలీసు లాకప్ లో- ఒక ఆడది రెండురోజులు ఉందంటే ఎంత అప్రతిష్ట"
    "పిడుక్కి- బియ్యానికి ఒకటే మంత్రం వల్లించకు. భాగవతార్ ఏవేనా నేరాలు చేసి- హత్యలు చేసి- పోలీసు కస్టడీలో ఉంటే అప్రదిష్ట గాని ప్రజాశ్రేయస్సుకోసం జైలుకెళితే అప్రతిష్ట రాదు- ప్రతిష్టే వస్తుంది. గాంధీ- నెహ్రూ, పటేల్- విజయలక్ష్మి పండిట్ - అరుణా అసఫ్ ఆలీ, వీళ్ళంతా ఒకప్పుడు జైళ్ళల్లో వున్నవాళ్ళే. అందువల్ల వాళ్ళకి అప్రతిష్ట వచ్చిందనే వాళ్లే ఎవరేనా వుంటే అంతకన్న మూర్ఖులు ఎవరూ ఉండరు."
    "అవి బ్రిటిష్ పరిపాలనా రోజులు. పోలీస్ ల్లోనూ డిసిప్లిన్ - నిజాయితీ వుండేవి. ఆ రోజుల్లో జైలు కెళ్ళొచ్చామని చెప్పుకోవడానికి ఎవరికీ చిన్నతనంగా వుండేదికాదు. ఈ రోజుల్లో పోలీసు లాకప్ లో వుండి వచ్చిన స్త్రీ బ్రోతల్స్ లో చిక్కుపడి బయటపడ్డ స్త్రీ కంటె అధ్వాన్నంగా లజ్జపడవలసి వస్తోంది" ఎప్పటిలా అల్లరిగా నవ్వింది మృదుల.
    "అబ్బో! నీకు చాలా తెలుసే. తెలుగు నవలలు చదువుతున్నావా? అయితే ఒక చిన్న విషయం మర్చిపోతున్నావు. లాకప్ రూమ్స్ లోనైనా- మాజీ జమీందారీ భవనాలలోనైనా రేప్ చేయబడేది. సాధారణంగా దళిత వర్గానికి చెందిన స్త్రీలే. సమాజంలో కొంత పలుకుబడి- డబ్బు - పరువువున్న ఆడవాళ్ళని- ఏమైనా చేయడానికి వాళ్ళకీ గుండె ధైర్యం చాలదు. అలాంటివాళ్ళు ఏవైనా జరిగితే ఊరుకుంటారా? విషయం రచ్చకెక్కించి మొత్తం పోలీస్ డిపార్టుమెంట్ నే కుదిపేయరా? ఆవగింజంత ఆధారముంటే గుమ్మడికాయంత ఊహించేయగలరు."
    అరగంట దీర్ఘంగా ఆలోచించాడు భాగవతార్. ఎంత ఆలోచించినా చదువుకున్న సంపన్న కుటుంబంలోని స్త్రీని పోలీసులు రేప్ చేసిన సంఘటన లేవీ గుర్తుకురాలేదు.
    "అయినా రాజభూషణం ఎంతో మంచివాడు. అతనిని ఎందుకు కొట్టారు దిక్కుమాలిన వాళ్ళంతా?"
    "వాళ్ళు దిక్కుమాలినవాళ్ళు కారు. ప్రజల డబ్బు - ప్రభుత్వం డబ్బూ దోచుకు తింటూన్న పందికొక్కులు అసలేకారు. కాయకష్టంతో జీవిస్తూన్న భారత పౌరులు. తమ శ్రమని మరొకరు దోచుకుంటూన్నా సహిస్తూన్న సాత్వికులు." భాగవతార్ కి చాలా చికాకుగా వుంది. ఇలాంటి మాటలకి అతడు సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ ధోరణిలో అతనెప్పుడూ ఆలోచించలేదు. ఎంతసేపూ తన పాటకచ్చేరీలూ- డబ్బు- బేంక్ ఎకౌంటులు ఇంతవరకే సాగుతుంది అతని ఊహ.
    "రాజభూషణం మంచివాడు. అతన్ని కొట్టడం అన్యాయం" అన్నాడు. అంతకంటె చెప్పడానికి యేమీ లేదన్నట్లుగా.
    "అతడు మంచివాడని నువ్వెలా చెప్పగలవు?"
    "రెండు నెలలక్రితం కరీంనగర్ లో నాపాట కచ్చేరీ ఏర్పాటు చేయించి భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం జరిపించాడు."
    ఫకాలున నవ్వింది మృదుల.
    "ఎవరేనా మంచివాళ్ళు కావాలీ అంటే నీకు సన్మానం జరిపించాలన్నమాట. నీ నిఘంటువులో మంచితనానికి ఇదా అర్ధం." ఆ వెటకారానికి ముఖం ముడుచుకున్నాడు భాగవతార్.
    "అదికాదు. అతడు చేసిన తప్పేముంది? గిరిజన యువతికి ప్రపోజ్ చేసాడు. ఇష్టమైతే ఒప్పుకోవాలి ఇష్టం లేకపోతే "సారీ" చెప్పేసి వెళ్ళిపోవాలి. అంతేకాని కర్రలతో కొట్టడం దేనికి?"
    "మన కల్చర్ వేరు- వాళ్ళ కల్చర్ వేరు అవతార్. ఉదాహరణకి మీ రాజభూషణం నాకే ప్రపోజ్ చేసాడనుకో...."
    "ఆ...." నోరు తెరిచాడు భాగవతార్, నవ్వింది మృదుల.
    "తప్పేముంది. ఊర్కే ప్రపోజ్ చేసాడు. అంతేకదా! ఇష్టమైతే అతని రూమ్ కి వెళ్ళిపోయి ఏమీ ఎరగనిదాన్లా వచ్చేస్తాను. లేకపోతే "సారీ" చెప్పెఇ, "నాకలాంటి ఉద్దేశంలేదు బ్రదర్. మనం మాములుగా స్నేహంగా వుందాం" అని షేక్ హేండ్ ఇచ్చేసి వచ్చేస్తాను. వాళ్ళల్లో అలాకాదు. పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేకుండా ఏ మగవాడు ఆడదాన్ని ప్రపోజ్ చెయ్యడు, ఇష్టంలేకపోతే బాహాటంగా విడిపోతారు. తెరచాటు భాగవతాలుండవు. ఒకవేళ ఎవరేనా అలా ప్రవర్తిస్తే వాళ్ళ సమాజంలో దానికి చాలా కఠినమైన శిక్ష వుంటుంది."
    "కాని నిష్కారణంగా నువ్వు చిక్కుల్లో ఇరుక్కుంటావు" బెదిరిస్తూన్నట్లు చూపుడువేలు ఆడించాడు.
    "నాకేం భయం. నన్ను కాపాడేందుకు పెద్ద హీరోవి నువ్వున్నావుగా, మృదుల తన్ని ఉడికిస్తోందని అర్ధమైంది భాగవతార్ కి. నిస్సహాయమైన కోపం వికృతరూపంలో బయటపడి టేబిల్ మీద పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుని నేలమీదకి విసిరికొట్టాడు. అది అప్పుడే తలుపులు తెరుచుకుని లోపలికొస్తూన్న మృదుల తల్లితండ్రుల కాళ్ళముందు ముక్కలు ముక్కలుగా పగిలింది. ఇద్దరూ ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు.
    నవ్వు తప్ప తనకు మరొకటి చేతకానట్లు అప్పుడు కూడా నవ్వుతూనే, "మమ్మీ! డాడీ! గాజు పెంకులు తొక్కకుండా జాగ్రత్తగా రండి. మేమిద్దరం యేం తోచక పేపర్ వెయిట్ తో బాల్ ఆడుకుంటున్నాము." చీర కుచ్చెళ్లు ఎత్తి పట్టుకుని భాగవతార్ ని నిరసనగా చూస్తూ మృదుల పక్కన వచ్చి కూర్చుంది చూడామణి. తండ్రి మాత్రం మర్యాదకోసం భాగవతార్ పక్కన కూర్చున్నాడు. తల్లి మృదుల బుగ్గమీద ముద్దుపెట్టుకుని, "కంగ్రాట్స్ మృదూ! ఇంత ధైర్యంగా నిలబడగలవని నేనూహించలేదు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ" అంది. తండ్రి ఆప్యాయంగా, "నువ్వేమీ స్ట్రెయిన్ కాలేదుకదా!" అన్నాడు.
    తల్లిదండ్రులు మృదులని ఇలా ఎంకరేజ్ చెయ్యడం భాగవతార్ కి ఏమీ నచ్చలేదు. చికాగ్గా, "ఏమిటండీ! పెద్దవాళ్ళు మీరయినా బుద్ధి చెప్పకుండా, ఇంకా కంగ్రాట్స్ అంటారేంటి అక్కడ అడవుల్లో కాని-పోలీసు స్టేషన్ లోకాని ఏదేనా ప్రమాదంలో ఇరుక్కుంటే ఏం చెయ్యగలిగేవాళ్ళం" అన్నాడు.
    మృదుల తల్లికి ఒళ్ళు మండింది. "నిజమేనండీ! ఈ రోజుల్లో ఏ ప్రమాదం ఎక్కడ పొంచి వుంటుందో ఎవరూ వూహించలేకపోతున్నారు. ఆ మధ్య అండగా నిలిచి కాపాడవలసిన భర్తే కట్టుకున్న ఇల్లాల్ని లేనిపోని అనుమానాలతో గొంతు నులిమి చంపేసాడట" అంది.
    మొహం తెల్లగా పాలిపోయింది భాగవతార్ కి. గుటక మింగాడు. మృదుల తల్లి అంతటితో ఊరుకోలేదు.
    "అదీగాక మృదులకి నేనేం బుద్ధి చెప్పగలను? తరాలు మారుతూంటే అంతరాలు మారుతున్నాయి. యువతరంలో ఎవరికివాళ్ళే తమ నిర్ణయాలు తాము తీసుకుంటున్నారు. అన్నే వుండి నిన్ను పెళ్ళి చేసుకుంటానన్నప్పుడు బుద్ధి చెప్పగలిగానా? ఇప్పుడు చెప్పడానికి"
    దిమ్మరబోయినట్లయి పిచ్చిచూపులు చూసాడు భాగవతార్.
    "మమ్మీ!  తల్లిని మందలించింది మృదుల.

 Previous Page Next Page