"నేను అమెరికానుంచి వచ్చాను. అక్కడి జీవితం నాపై చాలా ప్రభావాన్ని చూపించింది. అసలు ఫ్రీ లవ్ సొసైటీ స్థాపించింది అందుకే..." అన్నాడు విలాస్.
"నమ్ముతాను" అన్నాడు ఉత్పల్.
"ఇక్కడికి వచ్చేసరికి నాకింకా వివాహం కాలేదు. నాకు కుల వ్యవస్థపట్ల, అంతస్తులపట్ల నమ్మకం లేదు. సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తాను. విదేశాలలో వివాహానికి అనుభవం ప్రాధాన్యం. అందుకే నేను అనుభవమున్న కాల్ గర్ల్ ని భార్యగా ఎన్నుకున్నాను..."
"మీకు వివాహం జరుగలేదని ఆమె అంటున్నది-"
"ఆమె నిజమే చెప్పింది. విదేశాల్లో యువతీ యువకులు కొంతకాలం కలిసి జీవిస్తేగానీ వివాహం చేసుకోరు... ఒకరికొకరు నచ్చి. ఒకరినొకరు బాగా అవగాహన చేసుకోగలిగితే తప్ప వారి శారీరక సబంధం వివాహానికి దారి తీయదు. అందుకే నేను రేవతితో ఆరునెల్ల కంట్రాక్టు కుదుర్చుకున్నాను. ఇప్పటికీ నాలుగు నెలలు పూర్తయ్యాయి. ఇంకా రెండు నెలలుంది" అన్నాడు విలాస్.
"కానీ ఇప్పుడు మీరు వివాహితులు. మీకు భార్య వున్నది. ఇంకా మీరు రేవతిని తీసుకురావడం సొసైటీ హర్షించదు" అన్నాడు ఉత్పల్.
"విలాస్ అతడి చేతులు పట్టుకున్నాడు. ఇంకా రెండు నెలల వరకూ నా భార్య కాపురానికి రాదు వారిది సాంప్రదాయమయిన కుటుంబం..."
"మీరు సంప్రదాయానికి వ్యతిరేకిని అని చెప్పారు."
విలాస్ ఏ మాత్రమూ తడబడకుండా "తల్లిదండ్రుల ఆవేదనను భరించలేక అన్నింటికీ తలవంచాను" అన్నాడు.
"అయితే ఆమె కాపురానికి వచ్చేవరకూ సొసైటీకి రాకండి" అన్నాడు ఉత్పల్.
"ప్లీజ్ మిస్టర్ ఉత్పల్!" అన్నాడు విలాస్ "ఈ ఊళ్ళో వుండి నేను సొసైటీని సందర్సిన్చాకుండా ఉండగలనా?"
"కానీ సభ్యులిందుకు అభ్యంతర పెడతారు."
"మీరు తలుచుకుంటే అన్నీ సాధ్యపడతాయి."
"అయితే ఒక్క షరతు. మీరెలా మానేజ్ చేస్తారో నాకు తెలియదు. మీరు మీ భార్యను సొసైటీకి తీసుకుని వచ్చేక మొదటి అవకాశం నాకే రావాలి."
విలాస్ కు కోపం రాలేదు. ఫ్రీ లవ్ సొసైటీ సభ్యులకు సిగ్గు ఎగ్గు వుండవు వారు ఒకరి ఎదుట ఒకరు ఒకరి భార్యని గురించి ఒకరు యధేచ్చగా మాట్లాడుకొనవచ్చును.
"ఇంతేకదా" అన్నాడు విలాస్.
రేవతి రెండు నెలలు అక్కడున్నది. ఆమెకున్యాయం జరగగలదని ఉత్పల్ ఆమెను నమ్మించాడు. కంట్రాక్టు ముగిసే సమయానికి ఆమెను సరఫరా చేసిన హోటల్ యజమాని వచ్చి ఆమెను బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు. రేవతి లబోదిబో మన్నది. కానీ తప్పలేదు.
అప్పుడు విలాస్ తన అసలుభార్యను తీసుకుని ఊళ్ళో కాపురం పెట్టాడు. ఈ భార్య సంప్రదాయ కుటుంబంనుండి వచ్చింది. ఈమె సౌందర్యవతి. చూడగానే చూపరులను ఆకర్షిస్తుంది.
డాక్టర్ విలాస్ చేసిన మోసం సొసైటీలో గుప్పు మన్నది. అయితే ఉత్పల్ అతడిని సమర్ధించాడు.
"ఒక అసహాయురాలిని ఉద్దరిద్దామని కాంట్రాక్టుకు తీసుకుని వచ్చాడు. ఆమె అతడికి నచ్చలేదు. నిజం చెప్పాలంటే రేవతి నాకూ నచ్చలేదు. అందువల్ల అతడి ఈ నిర్ణయాన్ని పూర్తిగా నేనూ సమర్ధిస్తున్నాను. డాక్టర్ విలాస్ అనుభవం నుంచి మనం నేర్చుకోతగ్గది ఏమంటే వివాహానికి సాంప్రదాయం, వంశగౌరవం, గతచరిత్ర అన్నవి చూసుకోవాలని అతడదే చేశాడిప్పుడు..." అన్నాడు ఉత్పల్.
ఫ్రీ లవ్ సొసైటీ సాంప్రాదాయాల్ని వ్యతిరేకించడానికీ, ఆధునికత ప్రతిబింబించడానికీ నెలకొల్పబడింది. అందులోని సభ్యులు సంప్రదాయ వివాహాలను సమర్ధిస్తూ ఉపన్యసిస్తే కరతాళధ్వనులు మిన్నుముడుతున్నాయి.
మనిషి తన బలహీనతలను సమర్ధించుకొనడం కోసమే ఆధునికతను ఆస్రయిస్తాడా అన్న అనుమానం అప్పుడప్పుడు కలుగుతూంటుంది.
భార్యతో కాపురం పెట్టినా డాక్టర్ విలాస్ సొసైటీకి ఒంటరిగా వెళ్ళి వస్తూండే వాడు.
ఉత్పల్ ఇందుకు అభ్యంతరం చెప్పాడు.
"నా భార్యకు ఆరోగ్యం సరిగాలేదు" అన్నాడు విలాస్.
"నేను నమ్మను" అన్నాడు ఉత్పల్.
మర్నాడు విలాస్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాడు. కొంతకాలంపాటు ఆమె పురుషుడికి దూరంగా వుండాలని రాసి వున్నదందులో.
"ఆమెను తీసుకురానంతకాలం మీరూ రాకండి" అన్నాడు ఉత్పల్.
"అనారోగ్యం ఆమెకు. నాకు కాదు. ఇలాంటప్పుడు వుపయోగపడకపోతే ఫ్రీ లవ్ సొసైటీ ఇంకెందుకు?" అన్నాడు విలాస్.
విలాస్ భార్య అనారోగ్యం ఎప్పటికీ తగ్గడంలేదు.
ఒకరోజున ఉత్పల్ విలాస్ తో అన్నాడు. "డాక్టర్ సాబ్! మీరు నన్ను మోసం చేస్తున్నారు. నా సహకారం లేకపోతే సొసైటీలో మీ పరువుపోతుంది."
"నేను మిమ్మల్ని మోసం చేయడమా?" అన్నాడు డాక్టర్ విలాస్ ఆశ్చర్యంగా. "ఈ ప్రపంచంలో న అభార్య నైనా మోసగిస్తాను. కానీ మిమ్మల్ని మోసగించలేదు. మీరు నా ప్రాణమిత్రులు"