"ఇప్పుడా పని మాత్రం చెయ్యకండి. మీకు పుణ్యం ఉంటుంది." అంది రాధ గిరి గ్లాసులో విస్కీని చూస్తూ. ఆమె గ్లాసులో ఫైనాపిల్ జ్యూసుంది.
పక పకా నవ్వాడు గిరి.
"అయితే మొత్తానికి నామీద కోపం పోయినట్లే గదా" అడిగాడు.
"ఆఁ, పోయినట్లే. ఎంతయినా బంధుత్వం కూడా కలిసిందిగా. అన్నట్లు యింకా అక్కయ్యను విసిగిస్తున్నారా మీ ప్రశ్నలతో?" అడిగింది రాధ.
"అబ్బే, లేదు. తనేమైనా అడిగితే జవాబు చెప్పడం నా వల్లకాదు. ఎందుకన్నా మంచిదని ఆ ప్రసక్తి తేవడం మానేశాను."
"ఇప్పటికి ఓటమిని అంగీకరించారన్నమాట. నాకు సంతోషంగా ఉంది" అంది రాధ.
దూరం నుంచి గిరిని పరీక్షిస్తున్న డాక్టర్ రామకృష్ణ పద్మజతో _"నార్మల్ గానే ఉన్నాడుగా" అన్నాడు.
"అవును. మామూలు టైంలో ఏ మాత్రం తేడా కనిపించదు."
"మిస్టర్ గిరిధర్! ఒకసారి యిలా వస్తారా" పిలిచాడు డాక్టర్ రామకృష్ణ.
అతడూ, గిరి మాటల్లో పడ్డారు.
"ప్రోబ్ మాగజైన్ లో వచ్చింది చదివారా? సిమ్లాహౌస్ లో భుట్టో దయ్యం కనిపించిందని" అడిగాడు రామకృష్ణ గిరిని.
"ఆ, చదివాను. కానీ నమ్మబుద్ధి కాలేదు" అన్నాడు గిరి.
"అంత స్పష్టంగా వాళ్ళు చెపుతుంటే నాకయితే నిజమే ననిపిస్తోంది."
"అబ్సర్డ్! మీరు డాక్టరయి ఉండి దయ్యాల్నీ, భూతాల్నీ నమ్ముతున్నారా?" ఆశ్చర్యంగా అడిగాడు గిరి.
"నమ్మకంగా చెప్పలేను గాని సైన్సుకి అందని విషయాలు కొన్ని ఉన్నాయని నమ్ముతాను. సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యేవరకు ఏదయినా మిస్టరీయే గదా! నా అనుభవంలో కొన్ని కేసుల్ని చూశాను కూడా. అంతుపట్టలేదు. ఒకోసారి అనుమానం రాకతప్పదు."
"ఏమో డాక్టర్! నేను మాత్రం అనుభవం లేకుండా నమ్మలేను" అన్నాడు గిరి.
రామకృష్ణ కేవలం తనని పరీక్షించటానికే ఈ సంభాషణ సాగిస్తున్నాడని గిరి గుర్తించలేదు. దెయ్యం ప్రసక్తి రాగానే అతడిలో ఏదో మార్పు వచ్చింది.
"అదేమిటి అలా వున్నారు గిరీ? ఒంట్లో బాగోలేదా?" రామకృష్ణ కంఠం హెచ్చించి అడిగాడు.
అందరూ గిరివైపు తిరిగారు.
గిరి చేతిలో ప్లేట్ క్రిందపడి భళ్ళున బ్రద్దలైంది. రెండు చేతులతో తలని పట్టుకున్నాడు. "వద్దు వద్దు" అని అరిచాడు. మనిషి వణికి పోతున్నాడు. కనుగుడ్లు పెద్దవయ్యాయి భయంకరంగా.
"గిరీ!" అంటూ వచ్చి పట్టుకుంది పద్మజ
"మిస్టర్ గిరీ, ఏమయింది మీకు?" అంటూ దగ్గరగా వచ్చాడు డాక్టర్ రామకృష్ణ. గిరి అతన్ని బలవంతంగా నెట్టేశాడు. ప్రసాద్ వైపు తిరిగాడు. ఇప్పుడు అతడి కంఠం మామూలుగానే వుంది.
"మీ సరుకులు రాబోవడంలేదు ప్రసాద్! నైజీరియాలో 'కూప్' జరగబోతోంది. ప్రభుత్వం మిలటరీ హస్తగతం అవుతుంది. మీరు చాలా నష్టపోతారు" అన్నాడు__పక్కనే వున్న ప్రసాద్ తో.
"ఏమిటి మీరంటున్నది ? సాయంత్రమే నేను ఫోన్ లో మాట్లాడాను. అంతా సవ్యంగా ఉందక్కడ" ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్. ప్రసాద్ నైజీరియాకి బట్టల ఎగుమతి గురించీ, తన వ్యాపారం గురించి ఆ పార్టీలో చెబుతున్నాడు అప్పటివరకూ.
"నేను చెప్పేది నిజం. రేపటికి మీకు వార్త అందుతుంది" అన్నాడు గిరి నిశ్చలంగా.
"గిరీ" అతన్ని కుదుపుతూ అంది పద్మజ. ఆమెకు దుఃఖం ఆగడంలేదు.
"ఉన్నమాటే చెప్పాను పద్మజా! నేను గిరిని కాదు, శేఖరాన్నని మీరయినా వాళ్ళకు చెప్పండి"
రామకృష్ణ వైపు తిరిగింది పద్మజ.
ఊరుకోమన్నట్లు సైగ చేశాడు రామకృష్ణ.
"శేఖరం యివన్నీ మీకెలా తెలుసు?" అడిగాడు అనునయంగా.
"నేను ఆత్మను, నాకన్నీ తెలుస్తుంటాయి."
"మీ ఉద్దేశ్యమేమిటి? ఎందుకిలా తిరుగుతున్నారు?"
"పద్మజకోసం. ఆమెకు దగ్గరగా వుండాలన్న కోర్కె తీర్చుకోవడం కోసం."
అందరూ నిశ్చేష్టులై చూస్తుండిపోయారు.
"డాడీ" తండ్రిని భయంగా పట్టుకుంది రాధ.
"శేఖరం - మంచినీళ్ళు త్రాగండి" అందించాడు చల్లటి అయిస్ వాటర్.
నవ్వుతూ అందుకున్నాడు గిరి. గడగడా తాగేశాడు.
"వెళుతున్నా - మళ్ళీ వస్తా" పెద్దగా నవ్వేడు.
అతని చూపుల్లో మార్పు వచ్చింది. ఒక్కసారి బలహీనుడయినట్లు ఒరిగిపోయాడు. అతన్ని లేపి సోఫాలో కూర్చోపెట్టారు.
చల్లటి నీళ్ళు అతని ముఖం మీద చిలకరించాడు రామకృష్ణ. కాస్సేపటికి మెల్లిగా కళ్ళు తెరిచాడు గిరి.
"అందరూ నా చుట్టూ మూగారు - ఏమయింది?" ఆశ్చర్యంగా అడిగాడు.
"ఏం లేదు. మీకు కాస్త కళ్ళు తిరిగినట్లయిందనుకుంటాను. ఏమీ తెలీయలేదా?" అడిగాడు రామకృష్ణ.
తల దించుకున్నాడు గిరి తడిసిన మొహాన్ని నౌకరు అందించిన టవల్ తో తుడుచుకుంటూ అన్నాడు__