Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 21

 

    అది ఒక ప్రైమరీ స్కూల్ బి.ఏ పాసయి కూడా ఆ స్కూల్లో అంత తక్కువ జీతానికి దరఖాస్తు పెట్టిన వ్యక్తీ వారిజ ఒక్కతే. ఆ కారణం చేత ఇంటర్యు కూడా లేకుండానే అపాయింట్ మెంట్ ఆర్డర్ పంపించారు. సంతోషమూ సంభ్రమమూ, భయమూ , ఆ వేగం సందడిస్తోన్న హృదయంతో ఆరేళ్ళ తరువాత మళ్ళీ ఆ గ్రామానికి బయలు దేరింది వారిజ.
    
                                                       -----------


    చెరువులో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ చటుక్కున ఆగిపోయాడు రామచంద్ర. ఒక్కసారిగా అతని సర శరీరం నుండి చైతన్యం నశించి నట్లయింది. ఆ వ్యక్తీ ఎవరు! వారిజ! సందేహం లేదు. వారిజే! చాలా మారిపోయింది. మనిషి బాగా చిక్కిపోయింది. కళ్ళల్లో మునుపటి చైతన్యం లేదు. తెల్లటి చీర కట్టుకుంది. ఒకనాడు తనను భయ పెట్టిన నల్లపూసలు లేని మెడ శంఖంలా మెరుస్తోంది. నున్నగా జగత్తులో దైన్యాన్నంతా తనలోనే ఇముడ్చుకున్నట్లుగా ఉన్న కళ్ళు తననే చూస్తున్నాయి.
    రామచంద్ర కదిలిపోయాడు. కరిగిపోయాడు. కరిగి ఒక ప్రేమ పొంగై వెల్లువలా వారిజ వైపు సాగాడు. సంవత్సరాలుగా మనసులో ఆణిచేసుకున్న మమత లొక్కసారిగా పొంగాయి. నిరంతమూ హృదయంలో మననమవుతూ , యౌవనానికి సార్ధక్యాన్నిచ్చె ఆ అనుభూతి, మనవతపు చరితార్ధతను నిరూపించే ఆ ప్రేమ ఆకారం దాల్చి అతని ముందు నిలిచింది . ఎలుగెత్తి పిలుస్తుంది అతడ్ని. నిశ్శబ్దం లో ఆ పిలుపు అతనిలో ప్రతిధ్వనిస్తోంది. ఇన్నాళ్ళుగా హృదయంలో ఘోష పెడుతోన్న మూగ అర్తిలో ఆ ప్రతిధ్వని కలిసిపోతుంది. రెండు చేతులూ జూపి అడుగులు వేస్తున్నాడు. వారిజ తప్ప ఎవరూ కనపడని తన్మయత్వంలో ప్రేమ తప్ప ఏమీ అక్కర్లేని మైకంలో.
    "క్షమించండి ,మీ కోసం రాలేదు. "పొంగు చల్లారిపోయింది. ఉప్పొంగిన మమత వెనక్కు ఒరిగిపోయి హృదయాన్ని ముక్కలు చేసింది.  సమస్తాన్ని మరిపించిన ప్రేమ, వాస్తవికత ముందు పరాజయంతో , పరాభవంతో కఠిన శిలలా కరుడు గట్టింది. వణికిపోతూ, దీనంగా చూస్తో తనకు తానూ సంజాయిషీ ఇచ్చు కొంటున్నట్లుగా "మీ కోసం రాలేదు" అంటోన్న వారిజను సమీపించగానే చాపిన చేతులు వాలిపోయాయి రామచంద్ర కళ్ళు నిప్పులు కురిశాయి.
    భయంకరమైన ఈ నగ్న సత్యాన్ని భరించలేక నిలువునా వణికింది వారిజ. "కాదు! నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నది నిజమే అయినా......"
    "కాదు నన్ను ప్రేమిస్తున్నది నిజం కాదు. అబద్దం. నీకు నేనంటే ద్వేషం, పగ. నా కర్మాన నేను సుఖంగా వుంటే చూడలేవు . పెళ్లి చేసుకొని ప్రశాంతంగా సంసారం చేసుకొంటున్న నా జీవితంలో నిప్పులు పొయ్యడానికి వచ్చావు. నా మనసులో తిరిగి దేవదానవ సంగ్రామం సంభవింప చేసి హాలాహలంతో నా మనసుని నింపి వేయాలని వచ్చావు. ప్రేమ! నీకేం తెలుసు ప్రేమ గురించి? తేర మీద రోజుకోకళ్ళని, జీవితంలో రోజుకి పదిమందిని ప్రేమించగలిగిన పున్యత్మురాలివి! ప్రేమించిన దానివే అయితే , పెళ్ళి చేసుకుని ఇప్పుడిప్పుడే గాయం మాన్పుకోంటున్న నా హృదయం లో చిచ్చు పెట్టడానికి మళ్ళీ తయారవుతావా?"
    "మీరు పెళ్లి చేసుకున్నారా?"
    'అంత ఆశ్చర్యపోతున్నావేం? నిన్ను ధ్యానం చేస్తూ జీవితాంతం అలా ఉండిపోతాననుకున్నావా ? అలా వుండాలని కోరుకున్నావా?"
    "కాదు! కాదు!...."
    "ఏది కాదు వారిజా! వెళ్ళు వెంటనే ఇక్కడి నుంచి. ఇక ముందు కనబడకు. నాకు నటించడం చేత కాదు. యింతకంటే మృదువుగా చెప్పలేను. మూర్ఖుడినై , నువేవరవో ఆలోచించకుండా నిన్ను ప్రేమించాను. ఆ ప్రేమ పాఠశాల నుండి నన్ను విముక్తుడ్ని చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు కనబడకు.
    నువ్వు కనిపిస్తే నాకు ఆత్మహత్య చేసుకోవాలన్నంత క్షోభ కలుగుతుంది. కళ్ళు విప్పార్చుకుని రెండు క్షణాలు రామచంద్ర ముఖంలోకి సూటిగా చూసింది వారిజ, తలవాల్చుకొని శరీరాన్ని ఈడ్చుకుంటూ కదిలింది.
    అక్కడే కింద కూలబడిపోయాడు రామచంద్ర. "వెళ్ళిపోకు, వెళ్ళిపోకు వారిజ! ఒక్కసారి నా గుండెల్లోకి రా నీకోసం, నీ స్పర్శ కోసం ఆణువణువూనా తపించి పోతోన్న ఈ శరీరాన్ని కాస్త శాంతి కూర్చు." ఆక్రోశించింది అతని మనసు.
    వారిజ వెళ్ళిపోతూ అతని వంక చుసిన చూపు! ఎన్నెన్ని అర్ధాలు దాక్కున్నాయి ఆ దీనమైన చూపులో?" అన్నీ అబద్దాలు . నిజంగా నా ఉనికి మీకంత అసహ్యంగా ఉందా?" అని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నట్లుగా ఉందా చూపు.
    "నా మాటలకు అభిమానపడి నిజంగా నువింకా నాకు కనబడకపోతేనే నేపోవాలి వారిజా" తనలో తను అడుగుతూ శరీరాన్ని ఈడ్చ్నుకుంటూ అడుగులు వేశాడు రామచంద్ర. సొమ్మసిల్లి వాలుకుర్చీలో పడుకున్న భర్తను గమనించనైనా గమనించకుండా డిటెక్టివ్ నవలలు చదవటంలో మునిగి తేలుతూ వుంటుంది. రామచంద్రకే సమయంలో ఏది కావాలో చూచుకోదు.
    లత ఈ ప్రవర్తన రామచంద్రకు కొంత అసహనాన్ని కలిగించినా, అదంతా ఎదగని తన మనే నమ్మాడు. నిజం కూడా అంతే! సినిమాల్లోనూ, కధల్లోనూ నేర్చుకున్నది తప్ప లతకు ప్రేమంటే ఏమిటో తెలీదు. నిత్యావసరాలు, చీరలు - నగలు డాబులు - వీటిని మించిన సున్నితమైన భావనల స్పందన లత హృదయం ఎరుగదు. ఆ కారణంగానే లత ప్రేమను మంచినీ సాధించాలనే రామచంద్ర ప్రయత్నాలన్నీ లతకు అతనంటే గౌరవ భావం బదులు మరింత లోకువనే కలిగించాయి.
    రామచంద్ర వచ్చేసరికి లత చదువు కుంటూ ఉంటుంది. మృదువుగా "లతా!" అంటాడు. తలెత్తకుండానే "ఊ" అంటుంది. రామచంద్ర నవుకుని తనే టీ పెట్టుకు తాగుతాడు . లత లోలోపల నొచ్చుకోక పోతుందా అని రామచంద్ర ఆశ కాని లత భావన వేరు, "ఎవడి కోసం పెట్టుకుంటాడూ?" శారీరకంగా అలసిపోయి, మానసికంగా మధన పడుతోన్న రామచంద్ర చికాగ్గా "లతా! టీ పెట్టు" అన్నాడు.
    లత మంచం మీద లేవకుండానే పడుకుని డిటెక్టివ్ నవల చదువుతూనే" అబ్బా! మంచి సస్పెన్స్ లో వున్నాను" మీరు పెట్టుకు తాగుదురూ !" అంది.
    రామచంద్రకు చికాకెక్కవయింది. లేచి లత చేతిలో నవల లాక్కుని గిరాటేసి "లే టీ పెట్టు" అన్నాడు కటువుగా. లత కోపంగా లేచింది.
    "ఏమిటా మోటుతనం? చదువుకొంటుంటే పుస్తకం లాగేస్తారేం?"
    "ఏం చెయ్యను లాగేయక? తల పగిలిపోతోంది టీ పెట్టు."
    "ఒక్క పదినిమిషాలాగండి. ఒక్క చాప్టరు అయిపోయాక పెడతాను" మళ్ళీ పుస్తకం తెచ్చుకుంది లత. రామచంద్రం కోపం అవధులు దాటింది.
    "తల పగిలిపోతోందని చేపుతోంటే ఏమిటా మొండితనం? తరువాత చదువుకుందువుగానిలే లే!"
    'అంతగా అర్జంటయితే పెట్టుకోకూడదేం?" పెంకిగా అంది పుస్తకంలో పేజీలు  తిరిగేస్తూ. ఎంత అణచుకున్నా రామచంద్రలో చిరాకు అంత కంతకు ఎక్కువకాసాగింది.
    "అసలే అలిసిపోయి వస్తే ఏమిటీ పెంకి సమాధానాలు లతా?" అన్నాడు కోపంగా. అతని కోపం లతను భయపెట్టలేదు.
    'అబ్బో! ఏం పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేసి వచ్చారని అలిసిపోయారు?" అంది వెటకారంగా మూతి తిప్పుతూ.
    దిమ్మెరపోయాడు రామచంద్ర. అతనికి యెంత కాదనుకున్నా వారిజ గుర్తుకొచ్చింది. ఆనాడు జ్వరంతో ఉండగా వారిజ పళ్ళ రసం తీసుకొచ్చింది.

 Previous Page Next Page