"ఆయనకు ఉన్నదున్నట్లు వివరంగా చెప్పేసి, నిన్ను వివాహము చేసుకోమని అడిగేయరాదూ?"
విజయ జీవంలేని నవ్వు నవ్వింది.
"ఊహు! అవన్నీ అంత తేలికగా జరిగేవి కావు జయా! అమ్మ అంటూనే ఉంది. అబద్ధం చెప్పడమంటే ఊబిలోకి దిగడం లాంటిదని! ఒకసారి ఊబిలో దిగితే ఇంక పైకి రావడము కల్ల అట! అమ్మ చెప్పినట్లే జరిగిందిప్పుడు..."
సరిగ్గా అప్పుడే పార్వతి వచ్చిందక్కడికి.
"ఏమిటి, అమ్మను తల్చుకుంటున్నారు?" అడిగిందామె.
జరిగిందంతా చెప్పింది విజయ!
పార్వతి నిర్ఘాంతపోయింది.
"అయ్యో! చూశావా! ఎంత గొడవయి పోయిందో ఇప్పుడు." అంది కలవరపాటుతో.
జరిగిందేదో జరిగిపోయిందమ్మా! ఇప్పుడు అక్కనేం చేయమంటావో చెప్పు!"
"ఏమో తల్లీ! నేనెప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. అంచేత ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరమే లేకపోయింది. నేనేం చెప్పగలను ఇప్పుడు? నువ్వూ మీ అక్కా ఆలోచించుకోండి." అక్కడి నుంచి వెళ్ళిపోతూ అందామె.
ఇప్పుడు అతనికి జవాబేం రాయాలో తెలీడంలేదు విజయకు.
"నాకు నిద్రొస్తోందక్కా!" తన గదిలోకి వెళ్ళిపోతూ అంది జయ.
విజయ చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయింది.
అంతా అగమ్యగోచరంగా వుందామెకి.
ఏమీ పాలుపోవడం లేదు.
ఎలా ఎంతసేపు గడిచిపోయిందో తెలీదు.
"ఏమిటే! ఇంకా నిద్రపోలేదూ?" అంటూ నిద్ర కళ్ళతో పార్వతి అక్కడికొచ్చి అడిగేసరికి ఉలిక్కిపడి గడియారం వంక చూసిందామె.
పన్నెండు దాటింది టైము.
లేచి గదిలోకి నడిచి మంచంమీద పడుకుని లైటార్పి వేసింది.
ఏవేవో ఆలోచనలు ఎగసిపడుతున్నాయ్.
చాలాసేపటికి ఆమె ఆలోచనలు స్థిమిత స్థాయికి చేరుకున్నాయి.
ఈ పరిస్థితిలో జరగాల్సింది ఒక్కటే.
జయ చంద్రకాంత్ ని వివాహం చేసుకోవడం!
కానీ ఇందుకు జయ ఒప్పుకుంటుందా? ఏమో! ఒప్పుకుంటుందనే తన అనుమానం. ఒప్పుకోకపోవడానికి తనకి కారణాలేమీ కనిపించడం లేదు. చంద్రకాంత్ అందంగానే వుంటాడు. మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. మంచి సంస్కారం గల వ్యక్తి. ఇంతకంటే ఇంకేం కోరుకుంటుంది ఏ ఆడపిల్లయినా? అయితే తను మనస్ఫూర్తిగా చంద్రకాంత్ ని మనసు నుంచి తొలగించగలదా?
ఆమె కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినాయి.
అదంత తేలికైన విషయం కాదు. అయినా తనకు నమ్మకం వుంది. ఏనాటికైనా తను అతని ఆకర్షణ నుంచి బయటపడి తీరుతుంది. అతనిని కేవలం తన స్నేహితునిగా అభిమానిస్తుంది.
ఆ నిర్ణయానికొచ్చాక ఆమె మనసు కుదుటపడింది. హృదయం మీదనుంచి ఎంతో భారం తొలగించినట్లయింది.
అప్పటికి ఓ ప్రక్క తెల్లవారుతూనే వుంది. ఇంక నిద్రపట్టలేదామెకి. ఈ విషయం ఎంత త్వరగా జయకు నచ్చజెప్దామా అన్న ఆత్రుత ప్రారంభమైంది నెమ్మదిగా.
వెంటనే లేచి తను రడీ అయి జయ దగ్గరకు నడిచిందామె.
జయ అప్పుడే ముఖం కడుక్కుని టవల్ తో ముఖం తుడుచుకుంటూ లోపలికొస్తోంది.
"జయా_" ఆప్యాయంగా పిలిచింది విజయ.
"ఏమిటక్కా?"
"నిన్నో విషయం అడుగుదామని వుంది."
"ఏమిటది?"
"నువ్వేమీ హర్ట్ అవవు కదా!"
"భలే దానివక్కా! నాతో ఆ మాత్రం చనువులేదా ఏమిటి నీకు!"
"చంద్రకాంత్ గారి విషయమే రాత్రంతా ఆలోచిస్తూ కూర్చున్నాను. చివరకు ఓ ఆలోచన వచ్చింది. నువ్వు చంద్రకాంత్ గారిని వివాహం చేసుకోకూడదూ?"
జయ తృళ్ళిపడింది.
"ఏం మాటలక్కా అవి! ఆయనను ప్రేమించింది నువ్వు! ఆయన గుండెల్లో నేనున్నంత మాత్రాన నేనెలా చేసుకుంటాననుకున్నావు. అన్నీ తెలిసి నేనెలా ఒప్పుకుంటాను? చేసిన మోసం చాలక మరింత పెంచుకుంటూ పోవడం సబబైన విషయమేనా?"
"ఇందులో తప్పేముంది జయా! ఆయన నీ అందం చూసే కదా వివాహం చేసుకోవాలన్న నిర్ణయానికొచ్చింది. నాలాంటి అనాకారిని వివాహం చేసుకోవాల్సిన అవసరం ఆయనకేముంది?
నేనంటే ఎంత అభిమానమున్నా, నా మీద ఎంత ఇష్టమున్నా ఆ బంధం వివాహం వరకూ ఎలా వస్తుంది?"
"ఏమో అక్కా! నీ మాటలు నాకేం అర్థంకావడం లేదు. నాకు తిక్క రేగిందంటే జరిగిందంతా ఉన్నదున్నట్లు ఆయనకు ఉత్తరం రాసి పడేస్తాను" బెదిరింపుగా అంది జయ.