Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 21


    "ప్రొసీడ్" జడ్జి పర్మిషన్ ఇచ్చారు.
    ఆ రాత్రి రాజు, వెంకట్ అరెస్ట్ అయ్యాక, మర్నాడు ఆదివారం అవడంతో సోమవారం మెజిస్ట్రేట్ ముందు కేసు హియరింగ్ కి వచ్చింది. దానికి ముందు శనివారం రాత్రి -
    "లాయరుగారు, మా కుర్రవెధవలు తెలివితక్కువ వెధవలు. మా పరువు బజారున పడేసే దరిద్రపు పని చేశారు. పోలీస్ లాకప్ లో ఉన్నారు. మీరే వాళ్లని కాపాడాలి. నిజంగా ఏ తప్పూ చేయలేదు. తొందరపడి తప్పు చేయబోయి దొరికిపోయారు. మీరే కాపాడాలి. వాళ్లకి శిక్ష పడకుండా మీరే కాపాడాలి. మీరు కోరిన ఫీజు ఇచ్చుకుంటాం" ఇద్దరు తండ్రులు లాయరు విశ్వనాథం ముందు చేతులు జోడించారు. విశ్వనాథం కేసులని తలకిందులు చేసే చాకచక్యంతో పాటు మనిషి మొహం చూసి వారి అంతస్తులని అంచనా వేసేసి ఫీజులు అడిగే తెలివి,సామర్థ్యం వుందని ఆయన్ని తెలిసిన అందరూ అంటారు.
    "నిజం దాచకుండా ప్రతి అక్షరం చెబితే, కేసు తీసుకునేదీ లేనిదీ చెపుతా" అన్నాడు దర్పంగా. అంతా విన్నాక "ఇదేం పెద్ద భయపడాల్సిన కేసు కాదు. నేరం జరగలేదు. జరిగే ప్రయత్నం మాత్రమే జరిగింది. రాజు, వెంకట్ లతో మాట్లాడతా, సోమవారం కోర్టుకు రండి. ముందు బెయిల్ కి ప్రయత్నిస్తా. బెయిల్ దొరుకుతుంది. నిశ్చింతగా ఉండండి." అభయం ఇచ్చి పంపాడు.
    సోమవారం బెయిల్ దొరికి తరువాత ఇరవై రోజులకి కేసు హియరింగ్ కి వచ్చింది.
    "యువర్ ఆనర్, నా క్లయింట్స్ రాజు, వెంకట్ లను విచారించేందుకు పర్మిషన్ కోర్టువారు ఇస్తే, ఈ కేసులో నిజానిజాలు బయటికి వస్తాయి."
    "ఎస్, యూ కెన్ ప్రొసీడ్" జడ్జిగారు అన్నారు. రాజు, వెంకట్ బోనులోకి రాగానే "రాజు, వెంకట్ ఆ రాత్రి మీ ఇద్దరూ శృతి అనే అమ్మాయిని ఆ చీకటి సందులో బలాత్కారం చేయబోయారన్నది మీమీద అభియోగం. ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల వేళ ఆ సందులో మీరెందుకు వున్నారు? అన్నీ వివరంగా చెప్పండి."
    "మేం ఇద్దరం అక్కడ కార్లు రిపేరు చేసే మోటార్ గ్యారేజీలో పనిచేస్తాం. షాపు కట్టేశాకా ఇద్దరం అక్కడ కూల్ డ్రింక్ షాపు దగ్గర కూల్ డ్రింక్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం. అప్పుడు ఈ అమ్మాయి..."
    "అప్పుడేం జరిగింది?"
    "ఈ అమ్మాయి ఎటియంలో డబ్బు తీసుకుని, షాపులో సామాను కొనుక్కొని వస్తూ మమ్మల్నిద్దరినీ చూసి ఆగింది. అదోలా చూసి, నవ్వుతూ 'ఏం చేస్తున్నారు? మా ఇల్లు ఈ సందులోనే వుంది వస్తారా ఇంటికి?' అంది కన్నుగీటి. 'డబ్బులున్నాయా?' అంటూ నవ్వుతూ అడిగింది.
    "అబద్ధం... అబద్ధం... అబద్ధం చెప్తున్నారు యువర్ ఆనర్" శృతి లేచి అరిచింది వివర్ణమయిన మొహంతో.
    "ఆర్డర్... ఆర్డర్... చూడమ్మా! నీవేం చెప్పినా ఇక్కడనించి చెప్పాలి. అలా అరవకూడదు. ముందు కూర్చో, నీకవకాశం, సాక్ష్యం అడిగినప్పుడు మాట్లాడాలి. ముందు కూర్చో" అంది జడ్జి.శృతి నిస్సహాయంగా లాయరు వంక చూసింది. ఆయన సంజ్ఞ చేసి కూర్చో అన్నట్టు చెప్పాడు.
    "ఊ... తరువాత ఏం జరిగింది?" లాయరు ప్రశ్న.
    "ముందా అమ్మాయి ఏమంటుందో మాకర్థం కాలేదు. ఆశ్చర్యంగా చూశాం. 'ఏంటి అర్థం కాలేదా? ఇంటికెళదాం, రండి రండి' అంది వయ్యారాలు పోతూ.
    'ఎందుకు మీ ఇంటికి ఎందుకు రావడం?' వెర్రివెధవల్లా అడిగాం.
    'ఏయ్, నాటకాలొద్దు, నేనెందుకు పిలుస్తున్నానో తెలీనట్టు నటించకండి. పాపం పాలు తాగే పసిపాపలు' చేత్తో బుగ్గ పిండింది" రాజు అన్నాడు.
    "అబ్జక్షన్ యువరానర్, డిఫెన్స్ లాయరు కథ కల్పించి, నటింపచేస్తున్నారు. ఆ అమ్మాయి పిలిస్తే, తనే పోలీసు కంప్లైంట్ ఇచ్చి ఎందుకు అరెస్ట్ చేయిస్తుంది?" ప్రాసిక్యూటర్ అడ్డు తగిలాడు.
    "అబ్జక్షన్ ఓవర్ రూల్డ్... ముందు డిఫెన్స్ వాదన పూర్తి కానీండి. క్రాస్ ఎగ్జామిన్ లో మీ ప్రశ్నలు అడగవచ్చు" జడ్జి వారించింది.
    "అప్పుడేం చేశారు ఇద్దరూ?" లాయరు మళ్లీ ప్రశ్నలు మొదలుపెట్టాడు.
    "అప్పటికి మాకు ఈ అమ్మాయి అలాంటి రకమా అని అర్థమై ఆశ్చర్యపోయాం. రూమ్ లాంటివి కొత్త సార్! ఒకసారి వెళ్లి చూద్దామా అనిపించినా భయం వేసి ఆగిపోయాం. 'ఏంటి, రారా మీరు. భలే బేరం తగిలింది' విసుక్కుని ఆ అమ్మాయి వెళ్లడానికి సందులోకి తిరిగింది.
    'పాడరా, పిలుస్తూంది. ఊరికే సరదాగా వెళ్లి చూద్దాం' అన్నాడు రాజు. ఇద్దరం మోటారు సైకిలెక్కి అమ్మాయి వెనక పోనిచ్చాం. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి నవ్వి 'గుడ్ వస్తున్నారన్నమాట! ఏయ్ జరుగు' అంటూ రాజుని కాస్త ముందుకు తోసి మోటారు సైకిలెక్కింది. ఇంటికి వెళ్లాక లోపలికి వెళ్లాం అందరం. 'ఇదిగో నా రేటు మనిషికి ఐదొందలు తెలుసా, డబ్బులున్నాయా?' అంది.
    ఇద్దరం మొహాలు చూసుకున్నాం. 'లేవు. నెలాఖరు, ఓ రెండొందలుంటుంది ఇద్దరికీ కలిసి' అన్నాం. దాంతో మొహం మాడిపోయింది. 'ఏయ్, లేవండి. బలే బేరం, పొండి అవతలికి' అని కసిరింది. తరువాత మా చేతుల్లో పర్స్ లు లాక్కొని ఉన్న డబ్బంతా తీసేసుకుంది. మేం గట్టిగా ఆమె చేతిలోంచి పర్సు లాక్కోబోయాం అరుస్తూ. 'ఏయ్ నోరు మూసుకొని అవతలకి పొండి' అంది. మేం ఊరుకోలేదు. ఆమె చేతిలో డబ్బు లాక్కోబోయాం కోపంగా. ఇద్దరం పెనుగులాడాం. దాంతో ఆ అమ్మాయికి కోపం వచ్చి మమ్మల్ని ఒక్క తోపు తోసి బయటకు పరిగెత్తి తలుపు గడియ పెట్టి గట్టిగా అరచి అందరినీ పిలిచింది. అందరూ వచ్చి ఆ అమ్మాయి మాటలు నమ్మి పోలీసులను పిలిచారు" రాజు, వెంకట్ కథనం ముగించారు.

 Previous Page Next Page