"వెళ్ళకుండా నిగ్రహించుకోగలిగే శక్తి లేదు. నువ్వూ ఇదే సలహా చెప్పావు. షామహల్ మా ఇంటికి దూరం. వస్తాను రావ్" అంటూ వెళ్ళిపోయాడు మూర్తి.
రావు నోట్లో సిగరెట్ పూర్తయింది. క్రిందపడేసి బూట్ కాలితో కసిగా రాశాడు. కాలగమనం తెలియటం లేదు రావుకు. కాళ్ళక్రింద సిగరెట్ పీకల గుట్ట పెరుకున్నాక, కేస్ లో సిగరెట్లు ఖాళీ అయ్యాక వాచ్ చూసుకున్నాడు. అయిదయింది. లేచి కారు తీసుకుని గమ్యం లేకుండా బయలుదేరాడు.
శోభకు రెండో పెళ్ళి ఇష్టంలేదు. పిల్లలంటే మమకారం లేదు. అయినా తనతో పెళ్ళికొప్పుకుంది.
మూర్తి తనకంటే చిన్నవాడు.
తనకంటే బాగుంటాడు.
ఇద్దరూ ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు.
ఆమె సర్వస్వతంత్రురాలని వాళ్ళన్నయ్య చెప్పాడు.
శోభ వెంటనే తనను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోలేదు.
ఇప్పటికయినా, ఎప్పుడు చేసుకుంటుందో తెలియదు.
అయినా,
తనకు చనువిస్తోంది. తన ఇంటికి వస్తోంది. కుటుంబానికంతకూ శోభే ఆధారం. ఆర్థికంగా కొంత వెనుకబడి ఉన్న కుటుంబం. తను శోభను చేసుకుంటాననగానే వాళ్ళన్నయ్య ముఖం వెలవెలబోయింది.
శోభ కసలు పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉందా? లేక అందర్నీ ఇలా మభ్యపెడుతూ అందరితో ఆడుకోవాలనుకొంటూందా?
నిజంగా తనలో ఆమె కాకర్షణ ఉందా? లేక తన హోదా ఆమె నాకర్షించిందా?
గతాన్ని వదిలేద్దామానుకున్నా, ఇంకా మూర్తితో అనుబంధం పెంచుకోవటాన్ని ఎలా అన్వయించుకోవాలి? ఇదే నిజమైతే ఆమెను గృహిణిగా ఎలా స్వీకరించగలడు? అసలిది నిజమా?
మనసు నిలకడ లేకుండా ఆలోచనలతో చికాకు పడిపోతూంటే అప్రయత్నంగానే రావు చేతులు కారును షామహల్ దగ్గిరకు నడిపాయి.
హాలుకెదురుగా ఒక పక్కగా టీ స్టాల్ వెనుక కారాపి స్టీరింగుపై తల ఆన్చి గేటులోంచి లోపలకు చూస్తూ కూర్చున్నాడు.
కొంచెంసేపట్లో గేటుదగ్గర రిక్షా ఆగింది. అందులోంచి మంచులాంటి తెల్లని బట్టలతో నాజూకుగా ఉన్న యువతి దిగింది. శోభ! సందేహం లేదు. ఆమెకు తెల్లని బట్టలంటే ఇష్టం. తలలో విరజాజులున్నాయి. చెవులకు జూకాలూగుతున్నాయి. చేతులకు తెల్లని గాజులు, కాళ్ళకు తెల్లని చెప్పులు. ఈ అలంకరణ శోభకు బాగుంటుంది. మూర్తి ఎదురొచ్చాడు. శోభ ఏదో అడుగుతుంది. అతనేదో చెప్తున్నాడు. శోభ నవ్వింది.
మూర్తి నవ్వాడు. మూర్తి లోపలకు నడుస్తున్నాడు. శోభ కూడా అతని వెనుకనే లోపలకు నడుస్తూంది. వెళ్ళిపోయారు.
చాలాసేపు అలా స్టీరింగ్ మీదుంచిన తల తియ్యకుండానే కూర్చుండిపోయాడు రావు. తరువాత కారు వెనక్కు తిప్పాడు.
14
"ఉమా! నీకా భీమవరం సంబంధమే ఖాయం చేశాను."
అన్నం తింటున్న ఉమతో అన్నాడు ప్రభాకరం.
తింటున్న అన్నం ముద్ద గభాలున వదిలేసింది ఉమ.
"అదెలా సాధ్యం అన్నయ్యా!"
"మూడువేల కట్నం సంగతేనా? మన ఇల్లు అమ్మేస్తాను. అయిదువేలయినా వస్తుంది. మూడువేల కట్నం. రెండువేలు పెళ్ళి ఖర్చులు. అంతకంటే మార్గం లేదు."
తమకున్న యావదాస్తీ అయిన ఇల్లు అమ్మేస్తాననటం విని ఉమ నిర్ఘాంతపోయింది.
"ఇంక మీరందరూ ఎక్కడుంటారు?"
"ఏదో ఒక అద్దింట్లో ఉంటాం. నామాట కాదనకు ఉమా. చూస్తూ చూస్తూ నిన్ను కూడా శోభలాగా తయారుకానియ్యను. అది నా గుండెలమీద కుంపటై కూర్చుంది. నువ్వయినా నామాట విను ఉమా."
ప్రభాకరం దీనమయిన ముఖం చూసి ఉమ మాట్లాడలేక తల వంచుకొంది.
ఈ సంగతి విన్న శోభ విసురుగా ప్రభాకర్ ను సమీపించింది.
"ఉన్న ఒక్క ఇల్లూ అమ్మేస్తావా అన్నయ్యా?"
"అమ్మెయ్యక తప్పదు."
"తప్పనిదేవిఁటి? బి.యస్.సి. పాసయిన ఉమను బి.యస్.సి. పాసయిన యువకుడికిచ్చి చెయ్యటానికి మూడువేలు కావాలా? మూడువేలు చెల్లించుకోటానికి ఉమకు ఏం తక్కువైందని? రూపం లేదా? గుణం లేదా? ఎందుకీ తొందర? అదీ ఏదైనా ఉద్యోగం చేసుకుంటుంది. తగినవాడు దొరికినప్పుడు చేసుకుంటుంది."
ప్రభాకర్ ముఖం కఠినంగా మారిపోయింది.
"నువ్వు ఉద్యోగం చేసి నన్ను చిత్రవధ చేస్తున్నది చాల్లే శోభా. ఉమ కూడా చెయ్యక్కర్లేదు. దాన్నో ఇంటిదాన్ని కానియ్యి. ఎంతవస్తే అంతా ఖర్చవుతుంది. రాకపోతే ఉన్నంతలో సర్దుకుంటాం. ఇల్లమ్మిన డబ్బులో నీవాటా నీకిస్తానులే."
చివరిమాటకు శోభ హృదయం గిలగిల కొట్టుకుపోయింది. గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది.
"ఏవిఁటీ దారుణం ఉమా? నీ ఒక్కదాని కోసం ఇల్లమ్మెయ్యడాని కొప్పుకుంటున్నావా? నీ పెళ్ళితో తీరిపోయే సమస్యా ఇది? ఇంకా ఇద్దరు చెల్లెళ్ళున్నారు. వాళ్ళ గతికి పెళ్ళిమాట దేవుడెరుగు. నిలవనీడ లేకుండా పోదా?"
ఆందోళనంతా ఉమ దగ్గిర వ్యక్తపరిచింది శోభ.
ఉమ ఎప్పటిలాగానే శాంతంగా ఉంది.
"పరిస్థితులకు ఎదురుతిరగటం నా లక్ష్యం కాదక్కయ్యా! పరిస్థితుల కనుకూలంగా నన్ను నేను మలచుకోవటమే నా ధ్యేయం."
శోభకి వళ్ళు మండింది.
"అవును. ఇల్లూ వాకిలీ అమ్మేసి తగినవాడికిచ్చి పెళ్ళి చేస్తుంటే పరిస్థితుల కనుకూలంగా మారకేం చేస్తావు? ఒక్కళ్ళకైనా జ్ఞానం లేదు. గట్టిగా మాట్లాడితే ఈర్ష్య అంటారు."